తెలుగు జాతి సగర్వంగా తమవాడు బాలమురళి అని చాటిచెప్పేంత ఘనత తీసుకువచ్చిన విఖ్యాత గాత్ర విద్వాంసుడు ‘పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం (10-08-19) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఏడాది కర్ణాటక హిందూస్థానీ సంగీతాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ విదేశాలలో ప్రశంసలందుకొని, స్వర మాధుర్యానికి చిరునామాగా నిలిచిన గాత్ర విదుషీమణి బాంబే జయశ్రీకి బాలమురళీకృష్ణ జాతీయ పురస్కారం ప్రదానం చేసి, 10 లక్షల రూపాయల బహుమతిని అందజేశారు.. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాల మురళీకృష్ణ చేసిన సంగీత సేవను కొనియాడారు. ఫ్రెంచ్ సంగీతాన్ని కేవలం ఒక్కసారి విని వెంటనే పాడటం ఆయన ప్రజ్ఞకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి కళాకారుని ప్రభుత్వపరంగా ప్రోత్సహిస్తామన్నారు. తెలుగు వారి కీర్తి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు మన ముఖ్యమంత్రి జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాగంలోని నాదాన్ని అనుభూతి పొంది పాడటం బాలమురళి ప్రత్యేకత అన్నారు. నాద చికిత్సలోనూ విశేష కృషి చేశారని, తనకు సంగీతం తెలియదని, సంగీతానికి తాను తెలుసునన్న నిరాడంబరుడు మురళీకృష్ణ అని అన్నారు. కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురామ్, రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని, కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, వాయులీన విద్వాంసులు అన్నవరపు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. నాట్యాచార్య కాజా వెంకట సుబ్ర హ్మణ్యం(గుంటూరు), పద్మశ్రీ హేమంత్ కుమార్ శిష్య బృందం(విజయవాడ) ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. చివరగా బాంబే జయశ్రీ చేసిన కచేరీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. బాంబే జయశ్రీ సంగీత కచేరీ గానం చేయగా, వాయులీనంపై చరుపతి రఘురామన్, మృదంగం పై వి.వి.రమణ మూర్తి, కంజీరపై బి.ఎస్.పురుషోత్తం వాద్య సహకారం అందించారు. రఘునాయక నీ పాదయుగ రాజీవములనే విడలజాల” – హంస ధ్వని రాగంలో, అహిరి రాగంలో అఖిలాండేశ్వరి అంశాలను ఆమె మధురంగా గానం చేశారు.
Great singer, great honour.