తెలుగు జాతి ప్రాచీన సంగీత కళారూపం బుర్రకథ. ఈ జానపద ప్రక్రియను జనాకర్షణగా మలిచిన అరుణకిరణం నాజర్, మత ప్రబోధాలకు, ఉదర పోషణకు మాత్రమే పరిమితమైన బుర్రకథను తాడిత పీడిత బాధిత జనం బుర్రకు పదును పెట్టే ఆయుధంగా మలిచిన కళాశక్తి ఆయన. ఒక తుఫాను రేపాడు… ఒక తరాన్ని ఊపాడు…. అభ్యుదయ, విప్లవ భావాలు ప్రవహింపచేశాడు. ఆ భావధార తెలుగు జాతి ఉన్నంతవరకూ ఉరకలెత్తుతూనే ఉంటుంది. అలాంటి బుర్రకథా పితామహునిపై అంగడాల వెంకటరమణ మూర్తిగారు పరిశోధన చేసి ప్రచురించిన గ్రంథమే ఈ “బుర్రకథా పితామహ, పద్మశ్రీ షేక్ నాజర్”. కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్న అంగడాల వెంకటరమణమూర్తిగారి ప్రవృత్తి పౌరాణిక-సాంఘిక నాటక రచన-దర్శకత్వం. అందుకేనేమో వీరు నాజర్ బుర్రకథలకు ఆకర్షితులైనారు. స్వయంగా వారిని పలుమార్లు కలిసి పలు విషయాలు సేకరించి అనేక పత్రికలలో ఎన్నో వ్యాసాలు రాసారు ఆ రోజుల్లో, ఆచార్య ఎస్.గంగప్ప గారి ప్రోత్సాహంతో ‘పద్మశ్రీ షేక్ నాజర్’ జీవితము రచనలు-ప్రదర్శనలు-పాట్లు అంశాలపై పరిశోధనచేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సుమారు 20 యేళ్ళ క్రితం పిహెచ్.డి. అందుకున్నారు. ఆ పరిశోధన పుస్తక రూపంలో రావడానికి రెండు దశాబ్దాలు సమయం పట్టింది.
‘బుర్రకథా పితామహ నాజర్’ అనే ఈ పుస్తకంలో ఆరు ప్రకరణలున్నాయి. మొదటి ప్రకరణంలో నాజర్ జీవిత విశేషాలు, 2వ ప్రకరణంలో బుర్రకథ పుట్టు పూర్వోత్తరాలు, 3వ ప్రకరణలో నాజర్ స్వయంగా రాసిన, అభినయించిన ప్రసిద్ద బుర్రకథల (బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు, పల్నాటి యుద్ధం మొదలగునవి) విశేషాలు, 4వ ప్రకరణంలో నాజర్ బుర్రకథల్లోని వర్ణనలు, సామెతలు, అలంకారాలు, 5వ ప్రకరణంలో ఆయా బుర్రకథల్లోని పాటలు-వంతలు, 6వ ప్రకరణంలో ఆయా కథల్లోని పాత్రల శీల స్వభావాలను సముచితంగా రమణమూర్తి వివరించారు. ఈ పుస్తకంలో పుట్టిల్లు, అగ్గిరాముడు సినిమాలలో బుర్రకథ చెబుతున్న నాజర్ ఫొటోలతో పాటు, ఘంటశాలగారితో నాజర్, ఇంకా మరికొన్ని ఫొటోలు ప్రచురించడం చాలా బావుంది. ఇటువంటి సాంస్కృతిక యోధుని, ప్రజాకళాకారుని జీవితం, కళా వైదుష్యం గురించి పరిశీలించి, పరిశోధించి, ఒక పత్రం సమర్పించడమంటే కత్తిమీదసామే. రమణ మూర్తిగారు ఆ పనిని విజయవంతంగా పూర్తిచేసి డాక్టరేట్ పుచ్చుకోవడమే కాదు, నాజర్ను చిరంజీవిని చేసారు. చక్కటి గ్రంథాన్ని ప్రచురించిన రమణమూర్తిగారి అభినందనీయులు. – కళాసాగర్
ప్రతులకు : అంగడాల వెంకటరమణ మూర్తి సెల్: 9849532260