బుర్రా అస్తమయం నాటకరంగానికి తీరని లోటు…

తెలుగు నాటకరంగం గర్వించదగ్గ మహా నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ది. 6 ఏప్రిల్ 2019 ఆదివారం నాడు నాటక రంగాన్ని, కళాకారులను వదిలి వెళ్ళిపోయారు.

స్థానం నరసింహారావు గారి తర్వాత అంతే స్థాయిలో స్త్రీ పాత్రల్లో నటించిన గొప్ప నటులు. వారు సక్కుబాయిగా, చింతామణిగా, చంద్రమతిగా మరే పాత్రయినా సరే నటిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారు గొప్ప నటులే కాదు, పండితులు కూడా. ఎన్నో విషయాల్లో సందేహం కలిగినపుడు పరిష్కరించేవా రు.వారు సాంప్రదాయ కళాకారులు అయినా, ఆధునిక నాటక విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. వారు నాటకరంగ సర్వస్వం. రంగస్థల విజ్ఞానం. వారి అస్తమయం నాటక రంగాన్ని అంధకారంలోకి నెట్టింది. వారి ఆత్మకు శాంతి కలగాలని  ప్రార్ధిస్తున్నాం.

జననం:  కృష్ణా జిల్లా, అవనిగడ్డ దగ్గర పోతుగడ్డ లో 1936, ఫిబ్రవరి 9 న జన్మించాడు.

శాస్త్రి మేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసు. ఉత్తమ గాయకుడు. మేనమామ పర్యచేక్షణలో పద్యాలు, పాఠాలు శ్రావ్యముగా పాడుట నేర్చుకున్నాడు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడుట, చిత్రకళలోని మెలకువలు నేర్చుకున్నాడు. శాస్త్రి నటనా విశిష్ఠత గుర్తించిన బి.వి. నరసింహారావు నాట్యశాస్త్రములోని నూతన ప్రయోగ రీతులన్నీ నేర్పాడు. శాస్త్రి అన్న తగినంత ప్రోత్సాహమిచ్చి నాటకరంగాన నిలిపి ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చి దిద్దాడు. అకుంఠిత కార్యదీక్షతో ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్రధారణలో “ఔరా” అనిపించుకున్నాడు. స్వంతంగా సత్యసాయిబాబా నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందాడు. శాస్త్రి పాత తరం నటుల సంప్రదాయాలైన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపిస్తాయి.

శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. కవి సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు సృజనాత్మక రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ శిల్పం తో రాణింపు కలగచేస్తాడు. భావయుక్తమైన సంభాషణ విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు నటించేవాడు. చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితో నిండిపోయేది. శాస్త్రి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాధ సత్యనారాయణ “నాట్యాచార్య” బిరుదునిచ్చాడు. ఆంధ్ర ప్రజానీకం “అభినయ సరస్వతి” అని, కొండవీటి వెంకటకవి “నాట్యమయూరి” అని బిరుదులిచ్చారు. అనేక చోట్ల ఘన సన్మానాలు, బంగారు కంకణాలనూ అందుకున్నాడు.

1937లో చలనచిత్ర రంగం లో ప్రవేశించి పోతన, స్వర్గసీమ, వేమన, పెద్ద మనుషులు, త్యాగయ్య, నా యిల్లు, రామదాసు చిత్రాల్లో నటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap