బెన్ హర్ – ప్రపంచ సినీ చరిత్రలో అపూర్వం

మనతరం ఎంతో అదృష్టం చేసుకుంది. ఎందుకంటే బెన్ హర్, క్లియోపాత్రా, టెన్ కమాండ్మెంట్స్, గన్ ఆఫ్ నవరోన్, మెకన్నాస్ గోల్డ్, తొలితరం జేమ్స్ బాండ్ సినిమాలు నిర్మించిన కాలంలో మనం విద్యార్థి దశలోనో, ఉద్యోగ నియామక తొలిరోజుల్లోనో ఉండడం! ఎంతో గొప్పవైన ఈ సినిమాలను తొలి రన్ లో చూడగలిగే అదృష్టం దొరకబుచ్చుకున్న తరం మనది. అయితే కాలం మారుతోంది…. ప్రాధాన్యతలూ మారుతున్నాయి. అలాగే మనం కూడా పరిణితి చెందిన ఈ వయసులో ఇవే సినిమాలను వెండితెర మీద(వీలయితే) గాని, మీడియా చానళ్లలో గాని చూసినప్పుడు, పూర్వపు తొలి అనుభవం గుర్తురాకమానదు…మనసు ఉల్లాసం పొందక వూరుకోదు. అందుకే ఈ నా చిన్నిప్రయత్నం. ఈ ప్రయత్నం కొందరికి నచ్చినా, నా ప్రయోగం సఫలమైనట్లే భావిస్తాను.).గమనిక: ఇది మతపరమైన వ్యాసం కాదని మనవి

నవంబరు 18, 1959న మెట్రో గోల్డ్ విన్ మేయర్ (MGM) సంస్థ పవిత్ర బైబిలు ఆధారంగా విలియం వైలర్ దర్శకత్వం లో నిర్మించిన ‘బెన్ హర్’ చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. రికార్డు స్థాయిలో ఏకంగా పదకొండు ఆస్కార్ బహుమతులను సొంతం చేసుకుంది. ఆరోజుల్లోనే ఈ చిత్ర నిర్మాణానికి పదహారు మిలియన్ డాలర్లు వెచ్చించిన భారీ చిత్రం ‘బెన్ హర్’. మూడున్నర గంటలపాటు నడిచిన ఈ చిత్రం హాలీవుడ్ చరిత్రలో ఎక్కువ నిడివిగల సినిమాలలో ఒకటిగా నిలిచింది. అత్యంత భారీ సెట్టింగులతో నిర్మాణం జరుపుకున్న హాలీవుడ్ చిత్రం కూడా ఇదే! హాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతవరకు వాటికన్ దేశ క్రైస్తవమత పెద్దలు పవిత్ర బైబిల్ ఆధారిత చిత్రం ‘బెన్ హర్’ (1959) చిత్రాన్ని మాత్రమే అసలైన బిబ్లికల్ చిత్రంగా గుర్తించి, ఆ సినిమా నిర్మాణానికి మద్దతు పలికారు. 1880లో అమెరికన్ ఆర్మీ జనరల్ లీ వ్యాలెస్ రచించిన ‘బెన్ హర్…ఎ టేల్ ఆఫ్ క్రైస్ట్’ అనే నవల ఈ సినిమాకు ఆధారం. చార్ల్ టన్ హెస్టన్ జూడా బెన్ హర్ గా, హయా హరారీత్ ఎస్థర్ గా, సామ్ జెఫ్ఫీ సైమోనిడేస్ గా, జాక్ హాకిన్స్ క్వింటస్ అర్రియస్ గా, స్టీఫెన్ బాయిడ్ మెస్సల గా, మార్తా స్కాట్ మిరియమ్ గా, జార్జ్ రెల్ఫ్ టిబెరియస్ సీజర్ గా, క్యాథే ఓడోన్నెల్ తిర్జా గా, జోస్ గ్రేసీ జీసస్ తల్లిగా నటించగా, జీసస్ క్రైస్ట్ గా నటించిన అమెరికన్ నటుడు క్లాడే హీటర్ పేరును సాంకేతిక కారణాలవలన సినిమా క్రెడిట్స్ లో వేయలేదు. రాబర్ట్ సుర్టీస్ ఛాయాగ్రాహకుడుగా, మిక్లోస్ రోసా సంగీత దర్శకుడుగా ‘బెన్ హర్’ చిత్రానికి పనిచేశారు. ఈ అద్భుత బిబ్లికన్ సినిమా విశేషాలను మీకు గుర్తుచేస్తాను.

బెన్ హర్ నిర్మాణం:

1925లో ‘బెన్ హర్’ పేరుతో మూకీ సినిమా వచ్చింది. అదే చిత్రాన్ని MGM సంస్థ 1952లో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించింది. తొమ్మిది మాసాలు గడిచాక MGM వారు ‘బెన్ హర్’ చిత్రాన్ని సినిమా స్కోప్ లో తీస్తామని ప్రకటించారు. విడాల్, బెహర్మన్, మాక్స్వెల్, క్రిస్టఫర్ ఫ్రై, ఆండర్సన్ వంటి మేధావులైన రచయితలచేత దాదాపు 12 రకాల స్క్రిప్తులు తయారు చేయించారు. అయితే ఆ స్క్రిప్టుల్లో ఉపయోగించిన భాష ఆధునికంగా వుండడంతో దర్శకుడు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. చివరికి కార్ల్ టన్బెర్గ్ ప్రాచీన భాషలో వ్రాసిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే లను కరారు చేశారు. ఎందుకో నిర్మాత జింబాలిస్ట్ కు విడాల్ స్క్రిప్ట్ రాసిన విధానం నచ్చింది. కానీ దర్శకుడు వైలర్ మాత్రం కార్ల్ టన్బెర్గ్ రాసిన స్క్రిప్టుకే ప్రాధాన్యం కల్పించారు. ఈ చిత్రానికి మొదట సిడ్నీ ఫ్రాంక్లిన్ ను దర్శకుడుగా నియమించారు. అయితే అతడు వ్యాధిగ్రస్తుడు కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అతణ్ణి తప్పించారు. అప్పుడు విలియం వైలర్ ను దర్శకుడుగా తీసుకున్నారు. ‘బెన్ హర్’ మూకీ చిత్రానికి పనిచేసిన 30 మంది సహాయ దర్శకులలో వైలర్ కూడా ఒకరు కావడం అతడికి కలిసొచ్చిన అంశం. ముఖ్యంగా అశ్వరథ పోటీ(ఛారియట్ రేస్) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందని, అందుకు పది మిలియన్ డాలర్ల వరకైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని నిర్మాతగా వ్యవహరిస్తున్న జింబాలిస్ట్ వైలర్ కు తెలుపడంతో వైలర్ కు ఈ ప్రాజెక్ట్ మీద మక్కువ పెరిగింది. పైగా అతనికి మూడున్నర లక్ష డాలర్ల వేతనంతోబాటు వసూళ్లలో ఎనిమిది శాతం బోనస్ ఇస్తామని MGM చెప్పడంతో మరింత శ్రద్ధతో వైలర్ సినిమా నిర్మాణానికి సిద్ధపడ్డాడు. ఒక సినిమాకు అంతటి జీతం అందుకున్న దర్శకుడు ఆరోజుల్లో మరెవరూ లేరు. కాస్ట్యూమ్స్ దర్శకురాలు ఎలిజబెత్ హాఫెండెన్ ఈ సినిమాకోసం వందమంది దర్జీలను నియమించి ఆతరం సంప్రదాయ దుస్తులకు రూపకల్పన చేశారు. భారీ సున్నపు స్తంభాలతో కూడిన విశాలమైన ప్రాంగణాలు, విగ్రహాలు ఈ సినిమాకి అవసరం కాగా రెండువందలమంది శిల్పులు వాటిని తీర్చిదిద్దారు. 1957లో ఇటలీ దేశంలోని సినెసిట్టా పరిసర ప్రాంతాలలో లొకేషన్లను కరారు చేసి, దాదాపు ఆరు సంవత్సరాల నిరంతర శ్రమకోర్చి సెట్టింగులను తీర్చిదిద్దిన తరవాత 1958 మే మాసంలో చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. రోజుకు 14 గంటలు షూటింగ్ జరుపుతూ వచ్చారు. ఇందుకోసం 200 ఒంటెలు, 2500 గుర్రాలను, లెక్క లేనన్ని గాడిదలు, గొర్రెలు ఇతర జంతువులను ఉపయోగించారు. మైనర్ నటుల ఎంపిక కోసం MGM వారు రోమ్ నగరంలో ఏకంగా ఒక కార్యాలయాన్ని తెరచి ఐదు వేలమందిని ఇంటర్వ్యూ చేశారు. అలా చిన్న చిన్న పాత్రలలో కొద్ది సంభాషణలు పలుకగలిగే పాత్రలకోసం 365 మందిని ఎంపిక చేశారు. మిగతావారితోబాటు మొత్తం పదివేల మంది ఎక్స్ ట్రా నటులను ఎంపికచేసి చిత్రంలో నటింపజేశారు. దర్శకుని ప్రతిభ ఎక్కడంటే… రోమన్ పాత్రలకోసం బ్రిటీష్ నటుల్ని, యూదుల పాత్రలకోసం అమెరికన్ నటుల్ని ఎంపికచేయడంలో! రోమన్లు, యూదుల మధ్య వ్యత్యాసం చూపేందుకే దర్శకుడు వైలర్ ఈ ప్రయోగం చేయడం విశేషం. ఇక హీరో జూడా బెన్ హర్ పాత్ర ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేశారు. ఆస్కార్ బహుమతి గ్రహీత, అమెరికన్ నటుడు బర్ట్ లాంకాస్టర్ ని సంప్రదించారు. సినిమా కథ క్రైస్తవ మతాన్ని అవమానించేలా వుందని అతడు నిరాకరించాడు. తరవాత పాల్ న్యూమన్, మార్లన్ బ్రాండో, రాక్ హడ్సన్, జెఫ్రీ హార్న్, లెస్లీ నీల్సన్ లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే దేహదారుఢ్యం, భారీ శరీరం కలిగిన కార్లటన్ హెస్టన్ వైపు బెన్ హర్ పాత్ర మొగ్గుచూపింది. అతనికి రెండున్నర లక్షల డాలర్లు నెలసరి వేతనంగా నిర్ణయించి 30 వారాలకు కాంట్రాక్టు రాయించారు. ఎస్టర్ పాత్రకోసం 30 మంది నటీమణులను పరీక్షించి చివరికి ఇస్రాయెల్ కు చెందిన హయా హరారీత్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాకోసం సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ సుర్టీస్ ప్రత్యేకించి MGM 65 అనే ఆధునిక కెమెరాలను ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించేందుకు ఉపయోగించారు. ఈ కెమెరాలను ప్రముఖ మిచెల్ కంపెనీ ఈ సినిమాకోసమే ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చింది. లక్ష డాలర్లు వెచ్చించి ఆరు 70 mm కెమెరా లెన్సులను ఓడలో రోమ్ నగరానికి తెప్పించారు. సముద్ర పోరాటానికి, రోమ్ నగరంలో ప్రవేశానికి ప్రత్యేకించి మీనియేచర్ సెట్టింగులకు MGM స్టూడియోలోనే రూపకల్పనచేశారు. వాటి చిత్రీకరణ కోసం స్టూడియోలోనే పెద్ద సరస్సును నిర్మించారు. పరీక్షగా చూసినా మనకు తేడా కనిపించనంతగా వీటిని ఉపయోగించడం సినిమాటోగ్రాఫర్ ప్రతిభగా చెప్పుకోవాలి. ఇక జెరూసలెం పట్టణాన్ని కొత్తగా నిర్మించారు. మొత్తం మూడు లక్షల నలభై వేల మీటర్ల ముడి ఫిలిమ్ ను షూట్ చేశారు. మొదట నాలుగున్నర గంటల వ్యవధిలోకి ఈ ఫిల్మ్ ను ఎడిట్ చేశారు. తరవాత ఆ ఎడిటెడ్ ఫిల్మ్ నిడివి వ్యవధిని ఫైనల్ గా 213 నిమిషాలకు కుదించారు. ముఖ్యంగా జీసస్ ను శిలువ వేసేందుకు తీసుకువెళ్లే సన్నివేశ చిత్రీకరణలో సంభాషణలు వుండవు సరికదా ఆ సన్నివేశాన్ని ఎలా ఎడిట్ చేయాలో తలపట్టుకోవలసి వచ్చింది. ఎందుకంటే ఎక్కడా ఆ సన్నివేశాన్ని కోత వేయడానికి వీలు కాలేదు…. అంతటి ముఖ్య సన్నివేశం కనుక. ఈ చిత్రం కోసం మొత్తం 148 ఎకరాల విస్తీర్ణంలో 300 సెట్టింగులు నిర్మించారు. లక్ష దుస్తులను రూపొందించారు. వెయ్యికి పైగా రక్షణ దుస్తులను కుట్టించారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఎలిజబెత్ హాఫెండెన్ థాయిలాండ్ నుంచి ప్రత్యేక సిల్క్ బట్టను తెప్పించి ముఖ్యమైన పాత్రలకోసం దుస్తులు రూపొందించారు. ఈ చిత్రం కోసం ఉపయోగించిన ఆయుధాలను జర్మనీలో తయారు చేయించారు. ఊలు దుస్తులకోసం ఇంగ్లాండ్ నుంచి గుడ్డను తెప్పించారు. తోలు దుస్తులను ప్రత్యేకంగా చేతికుట్టుతో కుట్టారు. బూట్లు, పాదరక్షలను లండన్లో తయారు చేయించారు. లేస్ తో కూడిన వస్త్రాలకోసం ఫ్రాన్స్ నుంచి ముడి లేస్ ను తెప్పించారు. విగ్గులకోసం 200 కిలోల వెంట్రుకలను రోమ్ నగరంలోని మహిళలనుంచి సమీకరించి తయారు చేశారు. పర్వత నగరం ‘ఆర్సీనాజో రోమానో’ నిర్మాణాన్ని రోమ్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో వున్న నజారేట్ వద్ద నిర్మించారు. ఆంజియో వద్దగల సముద్ర తీరాన్ని సన్నివేశ చిత్రీకరణకోసం వినియోగించారు. ఎడారిదృశ్యాలను ఆరిజోనా రాష్ట్రంలో చిత్రీకరించారు.

క్లైమాక్స్ లో అశ్వరథ పోటీ చిత్రీకరణ:

ఈ చిత్రంలో ముఖ్యంగా గుర్తించాల్సిన సన్నివేశం తొమ్మిది నిమిషాల పాటు నడిచే అశ్వరథ పోటీల చిత్రీకరణ. ఈ సన్నివేశ రచనకు సంవత్సర కాలం పట్టింది. టెక్నాలజీ పుంజుకోని ఆరోజుల్లో యెంతో శ్రమకోర్చి వైడ్ స్ప్రెడ్ మిచెల్ రిఫ్లెక్స్ కెమెరాలతో చిత్రీకరించిన ఈ సన్నివేశం ‘న భూతో న భవిష్యతి’ అని ఘంటాపథంగా చెప్పవచ్చు. జెరూసలేం నగరంలోని చారిత్రాత్మక సర్కస్ కట్టడ నమూనాను ప్రామాణికంగా తీసుకొని ఈ అశ్వరథ క్రీడామైదాన నిర్మాణం జరిగింది. రోమ్ నగరానికి చేరువలో వుండే సినిసిట్టా స్టూడియో ఆవరణలోని 18 ఎకరాల విశాలమైన మైదానంలో పర్వత సాణువులతో ఈ సన్నివేశ సెట్ ను నిర్మించారు. వెయ్యిమంది నిపుణులైన శ్రామికులు సంవత్సర కాలంపాటు కష్టపడి ఈ సెట్టింగును నిర్మించారు. ఈ సన్నివేశం కోసం పద్దెనిమిది ప్రత్యేక రథాలను ప్రముఖ డనేసి బ్రదర్స్ సంస్థ సిద్ధం చేయగా వాటిలో ఎనిమిది రధాలను రిహార్సల్స్ కోసం వినియోగించారు. ఒక్కొక్క రథం బరువు సుమారు నాలుగు వందల కిలోలు. ఈ మైదానం నడిబొడ్డున రెండు భారీ విగ్రహాలను సుమారు నాలుగు అంతస్తుల యెత్తులో నిర్మించి వాటికి బంగారు పూత పూశారు. ఈ విగ్రహాలను గుర్రపు రధాలు పరుగులు తీసే రంగస్థలికి మధ్యలో ఒక ద్వీపంలా వుండేలా నిర్మించారు. రధాలు ఈ విగ్రహాల చుట్టూ పరుగెత్తాల్సివుంటుంది. ఇక ప్రేక్షకులు వీక్షించే మెట్లను ఐదు అంతస్తుల యెత్తు వుండేలా నిర్మించారు. ఈ మెట్ల వైశాల్యం చాలా విశాలమైనది. ఈ మైదానం ప్రపంచ వింతల్లో ఒకటైన ‘కొలోజియమ్’ ను గుర్తుకు తెచ్చేలా వుంటుంది. వందల సార్లు గుర్రాలు ఈ రధాలను లాగేందుకు వీలుగా ఇసుక నేలను చదును చేశారు. నలభై వేల టన్నుల ఇసుక మన్నుని మధ్యధరా సముద్ర ప్రాంతాలనుండి తరలించారు. ఒక్కొక్క లాప్ పూర్తయినట్లు తెలిపేందుకు తొమ్మిది డాల్ఫిన్ బొమ్మలను సంకేతంగా అమర్చారు. రధాల పోటీ ప్రారంభానికి ముందు గుర్రాలను వుంచే గదులను ప్రత్యేకంగా నిర్మించారు. రిహార్సల్స్ కోసం ఈ సెట్ కు సమాంతరంగా మరొక చారియట్ ట్రాక్ ను నిర్మించి అందులో పాల్గొనే కళాకారులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ రేసులో పాల్గొనేందుకు డెబ్బై గుర్రాలను యుగోస్లేవియా నుంచి, ఎనిమిది గుర్రాలను సీసిలీ నగరంనుంచి పడవలలో రోమ్ కు తెప్పించి హాలీవుడ్ జంతు శిక్షకుడు గ్లెన్ రాండాల్ పర్యవేక్షణలో శిక్షణతోబాటు దేహదారుఢ్యం కోసం వాటికి పోషకాహారం ఇప్పించారు. బెన్ హర్ నడిపే గుర్రాలు స్వచ్చమైన స్పానిష్ జాతి తెల్ల రంగు గుర్రాలు కాగా మిగతావి స్లొవేనియన్ జాతివి. వెటర్నరీ వైద్యులతోబాటు ఇరవై మంది అశ్వరక్షకులు వీటి బాగోగులను చూసుకున్నారు. గుర్రాల కాళ్ళకు నాడాలు బిగించేందుకు ఇటలీనుంచి నిపుణులను రప్పించారు. అశ్వరథ పోటీ చిత్రీకరణలో ముప్పై ఆరు గుర్రాలు, తొమ్మిది రధాలు, యేడు వేలమంది ఎక్స్ ట్రా నటీనటులు పాల్గొనడం విశేషం. షూటింగులో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఇరవై పడకల ఆసుపత్రిని, వాటికి సరిపడా డాక్టర్లు, నర్సులను నియమించారు. చార్లెస్ హెస్టన్ (జూడా బెన్ హర్), స్టీఫెన్ బాయడ్ (మెస్సలా) లకు శిక్షణ ప్రతి రోజూ ఐదు గంటలకు పైగా సాగేది. హెస్టన్ స్వయంగా అశ్వికుడు కావడం అతనికి లాభించిన అంశం. ఈ సన్నివేశ చిత్రీకరణలో బెన్ హర్ నడిపించే రథం అంతకుముందు ఆ మార్గంలో పడిపోయిన సైనికుని మీదకు ఎక్కి తలక్రిందులౌతుండగా, బెన్ హర్ చాకచక్యంగా రధాన్ని, గుర్రాలను నియంత్రించుతూ పోటీని కొనసాగించుతాడు. ఆ క్రమంలో రధం క్రింద పడిన సైనికుడు బలమైన గాయాలతోను, మరొక సైనికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సన్నివేశానంతరం స్టీఫెన్ బాయడ్ కు కూడా చిన్న గాయాలయ్యాయి. ‘ఈ సినిమా నిర్మాణ సమయంలో ఇటలీ ఆర్ధిక పరిస్థితి మెరుగుగా లేదు. నిరుద్యోగం ప్రబలింది. ముఖ్యంగా చారియట్ రేస్ కు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు కావలసివుండగా మూడు వేలకు పైగా షూటింగ్ స్థలానికి చేరుకున్నారు. వారిలో సగం మందిని మాత్రమే తీసుకోవడంతో మిగిలినవారు నిర్మాణ సిబ్బందిమీద రాళ్ళవర్షం కురిపించి గాయపరచారు. చక్రాలక్రిందపడి మరణించే సైనికుల వేషాలకోసం డమ్మీ సైనికప్రతిమలను తయారుచేసి వినియోగించారు. ఛారియట్ రేస్ ను చిత్రీకరించేందుకు అవసరమైన 70 mm లెన్సులకు 50 అడుగులలోపు కవర్ చేయగల సామర్ధ్యం మాత్రమే వుండడంతో ఆ కెమెరాను ప్రత్యేకించి నిర్మించిన ఒక ఇటాలియన్ చిన్నకారుకు అమర్చి షూట్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే, రధాశ్వాసాల పరుగును ఆ కారు అందుకోలేకపోయింది. దాంతో అమెరికా నుంచి అత్యధిక వేగం అందుకోగల కారును తెప్పించారు. తమాషా యేమిటంటే అమెరికన్ కారు కూడా ఆ ఆశ్వాల పరుగును అందుకోలేకపోయింది. దాంతో ముడి ఫిలిమ్ విపరీతంగా ఖర్చయింది. ఫుటేజ్ షాట్ కు ఫుటేజ్ వాడకానికి ఉన్న నిష్పత్తి 263:1 గా నమోదైంది. అయినా అందుకు నిర్మాతలు బాధపడలేదు. ఈ ఛారియట్ రేసింగ్ చిత్రీకరణకు ఆండ్రూ మార్టన్, యకిమా కనట్ దర్శకత్వం వహించారు. ఈ సన్నివేశ చిత్రీకరణకు మూడు నెలలు పట్టగా ఒక మిలియన్ డాలర్లు ఇందుకోసం ఖర్చు చేశారు. 15 నిమిషాలపాటు నడిచే ఈ సన్నివేశ చిత్రీకరణకు 263:1నిష్పత్తిలో ముడిఫిల్మ్ ను వెచ్చించారు.

ఆస్కార్ బహుమతులు:
బెన్ హర్ చిత్రానికి 11 ఆస్కార్ బహుమతులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (హెస్టన్), ఉత్తమ సహాయనటుడు (గ్రిఫిత్), ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ దుస్తుల అలంకరణ, ఉత్తమ శబ్దగ్రహణం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సంగీతం విభాగాలలో ఈ బహుమతులు లభించాయి. ఇవి కాకుండా ఈ చిత్రాన్ని ఎన్ని బహుమతులు వరించాయో చెప్పలేం. ఈ చిత్రానికి ఆరోజుల్లోనే 21 కోట్ల డాలర్ల నికర లాభం సమకూరింది.

పదనిసలు:
ఈ చిత్రనిర్మాణంలో కొన్ని తప్పులు దొర్లకపోలేదు. అందుకు కారణం సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడం! ఉదాహరణకు… జూడా భవన ప్రాంగణంలో మెస్సల కు జూడాకు వాదోపవాదాలు జరిగే సన్నివేశంలో కారు హారన్ లు, రోడ్డు రొదలు వినపడుతాయి. అశ్వరథ పోటీల ప్రారంభానికి ముందు షేక్ ఇల్డెరిమ్ బెన్ హర్ బెల్ట్ కు డేవిడ్ బొమ్మ వుండే నక్షత్ర సంకేతాన్ని అమర్చుతాడు. చరిత్రలో ఈ ఘట్టం జరిగిన యూదుల కాలం నాటికి డేవిడ్ సంకేతం మనుగడలో లేదు. రోమన్లు చేతికి అక్కడక్కడా వాచీలు ధరించడం కనపడుతుంది. ముఖ్యంగా జీసస్ ను శిలువ తో నడిపిస్తున్నప్పుడు కెమెరా నీడ కనపడుతుంది. రథం నుంచి బెన్ హర్ తోసివేయబడినప్పుడు అతని మోచేతి పైన రక్తపు మరకలు కనిపిస్తాయి. బెన్ హర్ రథాన్ని అదుపుచేసి అందులోకి మరలా చేరుకున్నప్పుడు అవి కనిపించవు. బెన్ హర్ నడిపించే రథాశ్వాసాలు అనేక సార్లు రంగులు మారుతూ కనిపిస్తాయి. ఇలాంటి పదనిసలు కొన్ని ఈ సినిమాలో కనిపిస్తాయి. మతసంబంధమైన అంశంతో కూడిన చిత్రమని ఈ సినిమాను చైనా ప్రభుత్వం నిషేధించింది.

ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap