మనోనేత్ర దృశ్యాలు -విజయ్ కుమార్ చిత్రాలు

ఇరవయ్యవ శతాబ్దపు ప్రధమార్ధంలో బొంబాయి కి చెందిన ఆరుగురు చిత్రకారుకారులు (ఎఫ్,న్.సౌజా, ఎస్ హెచ్.రజా, ఎం. ఎఫ్. హుస్సేన్ ఎస్కే..బాక్రే,, హెచ్.ఏ.గడే మరియు కెహెచ్. ఆరా) ప్రోగ్రసివ్ ఆర్టిస్ట్స్ అనే గ్రూప్ గా ఏర్పడి భారతీయ చిత్రకళకు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు రావడం జరిగింది. వీరిలో “ఎస్కే బాక్రే” అన్న ఒకే ఒక్కడు శిల్పి కాగా  మిగిలిన అయిదుగురు చిత్రకారులే. అందులో కెహెచ్.ఆరా అనే ఒక  చిత్రకారుడు మన హైదరాబాదు కు చెందిన తెలుగు వాడయితే మిగిలిన అయిదుగురు ఉత్తరాది వారే. మొత్తం గ్రూపు నందలి ఆరుగురు అంతర్జాతీయంగా గొప్ప ఖ్యాతి గడించినవారే. అదే విదంగా 1990-2004 ఆ ప్రాంతంలో ఆంద్ర ప్రదేశ్ నందలి గుంటూరు ప్రాంతమునకు చెందిన ఐదుగురు చిత్రకారులు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి జాతీయ స్థాయిలో గుంటూరు కళా పాండవులు అన్న పేరుతో ఒక గొప్పగణనీయమైన  పేరు గడించడం జరిగింది.

దాసరి నాగవర్ధన రావు, జి.నరసింహారావు, రాజ్ కపూర్, ఎస్. విజయ్ కుమార్ మరియు ఒస్మాన్ ఖాన్ అనే ఈ అయిదుగురు భిన్న భావాలతో విభిన్న ఆలోచనలతో సృజనాత్మకతతో కూడిన స్వతంత్ర ఆలోచన మరియు ఆచరణలతో వీరు  నాడు జాతీయ స్థాయిలో దేశంలోని డెల్లి, బొంబాయి, కలకత్తా, చెన్నై, కొచ్చిన్, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలన్నింటా  ప్రదర్సనలు చేసి ఏ.ఎస్.రామన్, సంజీవ్ దేవ్ లాంటి గొప్ప గొప్ప కళా విమర్శకుల యొక్క ప్రశంసలకు  నోచుకోవడం జరిగింది. వీరిలో ఒకరు సాంప్రదాయ రీతి ఇంకొకరు ఆధునిక రీతి, వేరొకరు  నైరూప్యరీతిలో ఇంకొకరు వేరొక రీతిలో ఎంచుకున్న అంశం లోనే కాక వాటిని చిత్రించే తీరులోనూ కూడా భిన్న వైరుధ్య శైలులలో చిత్రాలు సృజియిస్తూ గొప్ప ఖ్యాతి గడించిన అయిదుగురిలో ప్రాకృతిక స్వరూపాలను ప్రధాన అంశంగా ఎంచుకుని కాన్వాస్ పై తన అద్భుతమైన ఆవిష్కరణతో నేటికీ ప్రేక్షకులను మైమరపిస్తున్న గొప్ప చిత్రకారుడు సామంచి విజయ్ కుమార్.

శ్రీమతి సామంచి కామేశ్వరి, అన్నపూర్ణేశ్వర శాస్త్రి అనే దంపతుల యొక్క 11మంది సంతానంలో 7వ వ్యక్తిగా  1949 జనవరి 6న గుంటూరులో జన్మించిన విజయ్ కుమార్ వృత్తి రీత్యా చిత్రకారుడు కాదు,ఎక్కడా ఆయన చిత్రకళను నేర్చుకోలేదు కుడా. కేవలం స్వయం కృషితో సాధన ద్వార అబ్బిన కళ ఆయనది . వృత్తి రీత్యా ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా మాత్రమే ఆయన చిత్రకారుడు ,కాని వృత్తిని మించిన పేరుప్రఖ్యాతులు ప్రవృత్తి ఆయనకు సాదించి పెట్టింది. కారణం ఆయన కృషి, తపన, సాధన కలిసి తాను ఎంచుకున్న చిత్రణా రీతిలో ఆయనకు  సాధికారతను చేకూర్చింది. 1969 లో డిగ్రీ చదువు పూర్తయ్యిన తదుపరి  1971వరకు కాళీగా ఉండడంతో ఈ కాళీ సమయంలో చిత్రకళను నేర్చుకోవాలనే ఆలోచనలో బాగంగా  సి.ఎస్.యెన్ పట్నాయక్ లాంటి వారి వద్దకు వెళ్ళిన ప్రయత్నం పలించక స్వయంగానే చిత్రకళ సాధన చేయడం ప్రారంబించారు. మొదట్లో వాటర్ కలర్స్ తో రూప చిత్రాలు రేఖా చిత్రాలు వేసినప్పటికీ కాలక్రమంలో రంగులమేళవింపుతో కూడిన ఆధునిక  ఆబ్ స్ట్రాక్ట్ పామ్స్ పట్ల ఆకర్షితుడై ఆ దిశగా ప్రయత్నం చేసారు. ఆ కాలంలో గుంటూరు నందలి బాపిరాజు కళా పీటం సభ్యులు ఎక్కువగా బెంగాల్ వాష్ టెక్నిక్ లోనే ఎక్కువగా చిత్ర రచన చేస్తూ అవే గొప్పవనే భావన తో వుండేవారు. అయితే 1978లో వీరు డిల్లి లోని లలితకళా అకాడమిని దర్శించడం జరిగింది. అక్కడ బిన్న విభిన్న సైలులలో,వివిధ మాధ్యమాలలో  వున్న  వర్ణ చిత్రాలు అంతవరకు ఒక మూస పద్దతిలో సాగుతున్న ఈ సభ్యుల్లో  వైవిధ్యం రావడానికి  కారణమయ్యిందని చెప్తారు శ్రీ విజయ్ కుమార్ గారు. అక్కడ చిత్ర కళా సంపద  వీరిలో చిత్రకళ అంటే ఏమిటో తెలిసేలా చేసిందని చెప్తారు. నాటి నుండి ఎవరు ఎన్ని చిత్రాలు సృష్టించినా అది తనదే అయిన ఒక ప్రత్యేకత కలిగి ఉండాలనే భావనతో కృషి చేస్తూ ముందుకు సాగిన వారే ఈ గుంటూరు కళాపాండవులుగా  ప్రసిద్ధి కెక్కారు, వీరిలో అంతవరకు  ఆబ్ స్ట్రాక్ట్ పామ్స్ పట్ల ఆకర్షితుడై వున్న విజయ్ కుమార్ ఆ ఫాంస్ కి సహజత్వంతో కూడిన ప్రకృతిని జోడించి చిత్రకళలో తనదైన మార్కుని సృష్టించుకున్నారు

కొండలు,గుట్టలు, పర్వతవాలు ప్రాంతాలు, ప్రవహించే జలపాతాలు, లోయలు, ఎర్రటి ఎడారి ప్రాంతాలు, నిర్మల నీల దృశ్యాలు, చల్లటి  హిమశిఖరాలు, వంటి సహజమైన ప్రకృతి ప్రదేశాలు విజయకుమార్ గారి కుంచె విదిలలింపు రంగుల పోహలింపులతో అత్యంత సహజంగా కాన్వాస్ పై ఆవిష్క్రుతమై చూపరులను విస్మయ పరుస్తాయి. నిజ ప్రకృతి ప్రదేశాలకు చెందిన ఛాయా చిత్రాలా అన్న బ్రాంతిని కలిగిస్తాయి. ఆ చిత్రాలను చూసిన ఎవరికైనా వాస్థవ ప్రకృతి వొడిలో వుండే వాటిని చిత్రించి వుంటారు అనేభావం కలుగుతుంది. కాని విచిత్రం ఆయన చిత్రాల్లో ఎక్కువబాగం స్టుడియోలో వుండి తన మనసు పుటల్లో ఊహించుకొని ఆవిష్కరించినవే. వర్ణ సమ్మేళనం, కుంచె విదిలింపులపై అతనికి గల సాధికారత ఇంతటి సహజసిద్ధమైన వ్యక్తీకరణతో కూడిన చిత్రణకు బాసటగా నిలిచాయని చెప్పవచ్చు.

విజయ్ కుమార్ గారి ఒరిజినల్ చిత్రాలు తొలిసారిగా నేను రాజమహేంద్రవరంలో చూడడం జరిగింది. 2018 జూలై నెల 21,22 తేదీలలో రెండురోజులపాటు వైభవంగా అక్కడ జరిగిన భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ వారి తొలి వార్షికోత్సవవేడుకలలో విజయకుమార్ గారు కాన్వాస్ పై ప్రకృతిని ప్రతిష్టించే  విదానాన్ని ఖమ్మం నుండి వెళ్ళిన నేను నామిత్రుడు  బీర శ్రీనివాస్ ఇద్దరం తొలిసారిగా చూడడం జరిగింది. ఆ కార్యక్రమంలో విజయకుమార్ గారితో పాటు పూణే నుండి వొచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు అరుణ్ కుమార్ సోనేనే, విశాఖ పట్నం కేంద్రీయ విద్యాలయం నుండి వొచ్చిన మరో చిత్రకారుడు శశిభుషణ్ గారు మరియు రాజమండ్రి కి చెందిన చిత్రకారిణి పట్నాల రాదారాణి ల చిత్రప్రధర్శనతో పాటు మొదటి రోజు విజయ్ కుమార్ గారి ల్యాండ్ స్కాప్ లైవ్ డెమో కార్యక్రమంకుడా పెట్టడం జరిగింది. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు రెండో రోజు కూడా యీ కార్యక్రమాన్నిమరలా పెట్టడంతో రెండవ రోజు వెళ్ళిన మాకు ప్రకృతిని కాన్వాస్ పై ఆయన సృష్టించే విధానాన్ని తొలిసారిగా ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగింది.

పేలట్ పై కావాల్సిన రంగులను కొంచెం కొంచెం గ పెట్టుకున్న తర్వాత ప్లాట్ బ్రష్ లను,పేలట్ నైప్ లను రంగులకు  అద్ది కావాల్సిన ఎఫెక్ట్  వొచ్చేందుకు కాన్వాస్ పై  సర్రున రాస్తూ  ఆయన కుంచె చేసే విన్యాసాలు నిజంగానే చూస్తున్న మా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిదాయకంగా నిలిచింది. కాన్వాస్ పై తాననుకున్న ఎఫెక్ట్ తీసుకు వొచ్చేందుకు ఆ పరిసరాలలోఅందుబాటులో వున్న ఆకులు మొక్కల కాడలు తో పాటు కాన్వాస్ నుండి వేరు చేసిన ప్లాస్టిక్ కవర్ తో సైతం రకరకాల ట్టెక్చర్స్ ను సృష్టిస్తూ కొద్ది సమయంలోనే ఒక వాస్తవమనిపించే  ప్రకృతి దృశ్యాన్ని అందరి ముందు ఆయన సృష్టించిన రీతి అందరికి గొప్ప ఆనందాశ్చర్యాలను కలిగించాయి.

సాధారణంగా ప్రకృతి చిత్రణ చేసేటప్పుడు నిజ ప్రకృతి ఒడిలోకి వెళ్లి తాను చూస్తున్న ప్రకృతిని యదాతద చిత్రణ చేయడం ఒక ఎత్తయితే  మనసు పుటల్లో ఊహించి ప్రకృతి చిత్రణ చేయడం మరోఎత్తు. ఇందులో మొదటి విదానం కంటే రెండవ విధానం క్లిష్టతరమైనది. స్వేచ్చాయుతమైనది. మొదటి రీతిలో బాహ్యంగా వున్న ప్రకృతిని చూస్తూ చిత్రిస్తే, రెండవదానిలో చిత్రకారుడు తన మనసు పుటల్లో ఊహిస్తూ స్వయంగా ఆయన ఊహ మేరకు చిత్రించవలసి వుంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా చిత్రించడం కంటే ఊహను వాస్తవంగా చిత్రించడం కష్టం, దానితో ప్రేక్షకులను మెప్పించడం అన్నది ఇంకా కష్టం. క్లిష్టతరమైన ఈ రెండవ విధానంలోనే వీరు గొప్ప సిద్ధ హస్తులు. వీరు సృష్టించిన ప్రకృతి దృశ్యాలలో ఎక్కువ బాగం ఆ విదంగా సృష్టించినవే.

కళను సృష్టించడం వేరు ఆ కళను ప్రజల ముందుకు తీసుకెళ్ళడం వేరు. విజయ్ కుమార్ రెండింటా విజయం సాదించారని చెప్పడానికి వ్యక్తిగతంగాను సామూహికంగాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు చేసిన ప్రదర్శనలే ఉదాహరణగా చెప్పవచ్చు.గెలుపొందిన బహుమతులే ఋజువుగా చెప్పవచ్చు.1981 లోనే ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమి నుండి అందుకున్నఅవార్డ్ తో పాటు. డిల్లి, మద్రాస్ లలిత కళా అకాడమిలనుండి మరియు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి గోల్డ్ మెడల్ మరియు రాష్ట్రం లోని కోనసీమ చిత్రకళా పరిషద్ నుండి చిత్రకళ వైజయంతి పురస్కారం తో పాటు ఇంకా ఇతర ప్రముఖ కళా సంస్థల నుండి ఎనో అవార్డ్స్ అందుకున్నారు.

కళా పాండవులు పేరుతో దేశం నందలి అన్ని ప్రముఖ పట్టణాలైన డిల్లి, బొంబాయి, కలకత్తా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, గుంటూరు, కేరళ కొచ్చిన్ , అహమదా బాద్ లాంటి పట్టణాలలో చేసిన గ్రూప్ షోలు మాత్రమే గాక వ్యక్తిగతంగా కూడా పై నగరాలతో పాటు సిమ్లా, ఉజ్జయిని, జైపూర్, ఇండోర్, ఆగ్రా, సారనాథ్ లాంటి  దేశం నందలి అన్ని ప్రధాన నగరాలలోని గేలరీలలో ప్రదర్శనలు చేసారు అంతే గాక 2004, 2010, 2015 సంవత్సరాలలో మూడు సార్లు వ్యక్తి గతంగా బొంబాయి నందలి ప్రఖ్యాత జహంగీర్ ఆర్ట్ గేలరీ లో తన చిత్రాలను ప్రదర్శించి ఎందరో గొప్ప కళా విమర్శకుల ప్రశంసలు పొందడం జరిగింది. అంతే గాకా అమెరికాలో కాలిపోర్నియాలో కూడా ఆరుసార్లు తన వ్యక్తిగత ప్రదర్శనలు చేయడం జరిగింది. దేశ విదేశాలలో వీరి చిత్రాలు ఎందరో వ్యక్తుల సంస్థల సేకరణలో వున్నాయి.

ప్రకృతి చిత్రణలో గొప్ప సాధికారతను తనదైన ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న విజయ్ కుమార్ గారు  అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

– వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

3 thoughts on “మనోనేత్ర దృశ్యాలు -విజయ్ కుమార్ చిత్రాలు

  1. Congratulations sir big fan of you from guntur mallikarjuna chari your painting is excellent sir

    1. శ్రీ యుతులు సోమంచి విజయకుమార్ గారి చిత్రకళా తీరు తెన్నులను గురించి చక్కని వ్యాఖ్యానంతో శ్రీ వెంటపల్లి గారి రచన చాలా సహజంగా
      సమంజసంగా ఉంది. విజయ్ కుమార్ గారికి, వెంటపల్లి గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap