“మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న “మయూఖా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ లో మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుంది” అన్నారు సుప్రసిద్ధ దర్శకులు పూరి జగన్నాథ్. 25-04-2019, ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో “మయూఖా టాకీస్’ యాక్టింగ్ స్కూల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పూరి జగన్నాథ్. ప్రముఖ నటుడు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ ఉత్తేజ్ ప్రారంభించిన “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” ప్రారంభోత్సవానికి పూరి జగన్నాథ్, ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రముఖ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత రామకృష్ణ వీరపనేని, ప్రముఖ రచయిత నడిమింటి నరసింహారావు తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. “ఉత్తేజ్ గత 32 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు. నన్ను రాంగోపాల్ వర్మ గారికి పరిచయం చేసి నేను దర్శకుడు కావటానికి కారకుడైన ఉత్తేజ్ ఈరోజు యాక్టింగ్ స్కూల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నటుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాక్టింగ్ కోచ్ గా ఉత్తేజ్ కు ఉన్న అనుభవం అపారం. మా అబ్బాయి ఆకాష్ కు కూడా ఉత్తేజ్ దగ్గరే ట్రైనింగ్ ఇప్పించాను. ఉత్తేజ్ ప్రారంభించిన ఈ యాక్టింగ్ స్కూల్ కు నా అండదండలు పూర్తిగా ఉంటాయని హామీ ఇస్తున్నాను” అన్నారు.
ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ “నా చిరకాల మిత్రుడైన ఉత్తేజ్ లో మంచి నటుడే కాదు.. మంచి దర్శకుడు, రచయిత కూడా ఉన్నారు. మంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో తను ఇచ్చే శిక్షణ ఫాలో అయితే మీరంతా నటనలో తప్పకుండా గొప్పగా రాణిస్తారు. మంచి స్టాండర్డ్స్ తో, క్రమశిక్షణతో ప్రారంభమైన ఈ “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” అతి త్వరలోనే ఒక అగ్రశ్రేణి ఫిలిం ఇనిస్టిట్యూట్ గా ఎదుగుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
నటన పట్ల ఆసక్తి తో వచ్చే స్టూడెంట్స్ అవసరాన్ని క్యాష్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ప్రమాణాలతో, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో యాక్టింగ్ స్కూల్ ను ప్రారంభిస్తున్న ఉత్తేజ్ కు ఫిలిం ఇండస్ట్రీ నుండి పూర్తి సాయి మద్దతు లభిస్తుంది అనటంలో సందేహం లేదు. కార్యక్రమం చివరిలో ఇటీవల దివంగతులైన ప్రముఖ నటులు, నట శిక్షకులు “దీక్షితులు” ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. చివరిగా తమ “మయూఖా టాకీస్ యాక్టింగ్ స్కూల్ ” ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి అభినందనలు తెలిపిన అందరికీ ఉత్తేజ్ కృతజ్ఞతలు చెప్పారు.