సాహిత్యం నిరంతరం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందాలంటే దాతలు స్పందించాల్సిన అవసరం వుందని ఆంగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ చైర్మన్ డా.లయన్ ఎ.విజయ కుమార్ అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో మల్లెతీగ పురస్కార ప్రదానోత్సవం మరియు మల్లెతీగ కథల పోటీ బహుమతి ప్రదానోత్సవ సభ 18-7-2019 గురువారం సాయంత్రం విజయవాడ హోటల్ ఐలాపురంలో జరిగింది. ఈ సభకు డా.విజయ్ కుమార్ కథల పోటీ బహుమతి ప్రదాతగా, అతిధిగా హాజరై సామాజికసేవ ద్వారా, దానం చేయడం ద్వారా ఆత్మసంతృప్తి లభిస్తుందన్నారు. గురజాడ, కందుకూరి వంటి మహాకవులు రాసిన గ్రంథాలను నేటితరం కవులు, రచయితలు చదవాలన్నారు. మల్లెతీగ పురస్కార ప్రదాత వజ్జల కృష్ణమూర్తిశర్మ ప్రతినిధిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాధం రవికుమార్ మాట్లాడుతూ- పురస్కారాలు రచయితల్లో ఆనందంతోపాటు పోటీ తత్వాన్ని, ప్రతిభాశక్తిని పెంచుతాయన్నారు. సభకు అధ్యక్షత వహించిన నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ మాట్లాడుతూ- మల్లెతీగ పురస్కారాన్ని అందుకున్న వాళ్ళలో నేను కూడా వున్నానన్నారు. తనకు మల్లెతీగ పురస్కారం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారాన్ని ఇచ్చిందన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, తెలుగులో పారదర్శకంగా సాహిత్య పురస్కారాలిస్తున్న సంస్థల్లో మల్లెతీగ ప్రధమ వరుసలో వుంటుందన్నారు. మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ మాట్లాడుతూ- గత ఆరు సంవత్సరాలుగా మల్లెతీగ పురస్కారాన్ని గొప్ప కవిత్వం రాస్తున్న వారికి అందజేస్తున్నామని, ఈ పురస్కారానికి ఆర్థిక సహకార మందిస్తున్న జవాన్ల గేయ రచయిత వజ్జల కృష్ణమూర్తిశర్మ గారికి, అలాగే ఈ సంవత్సరం నుండే కథలపోటీలకు ఆర్థిక సహకారమందిస్తున్న ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ చైర్మన్ డా.లయన్ ఎ.విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ- జర్నలిజంలో మాదిరిగానే సాహిత్యంలోనూ ఎన్నో మార్పులొచ్చాయన్నారు. జర్నలిజంలో ఫోర్త్ ఎస్టేట్ ఇప్పుడు లేదని ఉన్నదంతా రియల్ ఎస్టేటేనని ఆయన అన్నారు.
ఈ వేదికపై ప్రతిభామూర్తి డా. ఈడ్పుగంటి పద్మజారాణికి మల్లెతీగ జీవన సాఫల్య పురస్కారాన్ని, ఈడ్పుగంటి హరిహరనందన్ కి మల్టీ టాలెంటెడ్ కిడ్ అవార్డును నిర్వాహకులు అందజేశారు.
5000 రూపాయల నగదుతో మల్లెతీగ ప్రధాన పురస్కారాన్ని బెంగుళూరుకు చెందిన ఎం.ఎం.మురళికి అందజేశారు. 1000 రూపాయల నగదుతో ఆత్మీయ పురస్కారాన్ని ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, మోకా రత్నరాజులకు, ప్రత్యేక పురస్కారాన్ని కోసూరి రవికుమార్, కోడే యామినీదేవి, బండి రుక్మిణీ ప్రసన్నలకు అందజేశారు. కథల పోటీలో బహుమతి పొందిన కె.గీత, కె.కె.రఘునందన్, కంచర్ల రాజాబాబు, పి.యాదగిరి, కె.రాజేశ్వరి, పి.చంద్రశేఖర అజాద్, డా.ఎం.సుగుణారావులను రు. 5000/-ల చొప్పున నగదుతో సత్కరించారు. జి.నరసింహమూర్తి, కె.కె.భాగ్యశ్రీ, ఎల్.శాంతి, సిహెచ్.శివరాంప్రసాద్, ప్రతాప రవిశంకర్, కె.ఆదినారాయణ, అల్లూరి గౌరీలక్ష్మిలను రు.1000/-ల నగదుతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సుజాత ఫౌండేషన్ చైర్మన్ డా.లక్ష్మీ ప్రసన్న, కళాసాగర్, సాహితీవేత్తలు శ్రీరామకవచం సాగర్, చిన్ని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.