మృదంగానికి గుర్తింపు తెచ్చిన – యెల్లా

యెల్లా వెంకటేశ్వరరావు సప్త సముద్రాలు ఏకమైన ఘోషను మీరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ… మనసుతాకే ఆ మధుర తుఫారాలను ఆస్వాదించారా?
మృదంగ వాయిజ్యం అంటే ప్రక్క వాయిజ్యంగా పడిఉన్న రోజుల్లో… ఓ విద్వాంసుడు నేనున్నానంటూ వచ్చి చెలరేగాడు… వేలికొసలతో వేవేలనాదాలు సృష్టించి ప్రేక్షకులను ఆనంద తాండవమాడించాడు. మృదంగంపై ప్రయోగాలే ప్రాణప్రదంగా, సంగీత సునామీలు సృష్టించిన ఆలయరాజు, మనసంగీత వైభవాన్ని విశ్వమంతా చాటిన విద్వణీమణి పద్మశ్రీ యెల్లా వెంకటేశ్వరరావుగారు.
తమ జీవిత విశేషాలను ’64కళలుకి వివరించారు. యెల్లా వెంకటేశ్వరరావుకి సంగీతం మూడు తరాల వారసత్వం. మృదంగం వారి వంశానికే పట్టుగొమ్మ. వారి తాతగారు యెల్లా వెంకట లింగం, చినతాత వీరాస్వామి మార్గంగికులు. ఇద్దరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్లారు. నాయనమ్మ మల్లమ్మ గాయకురాలు. లేచినప్పటి నుంచి మేలుకొలుపుతో మొదలు పెట్టి, ఊర్మిళ నిద్రని ఆలపించి, స్వామికి పవళింపు దాకా పాటలు పాడేవారు. పసితనంలోనే నాయనమ్మకి యెల్లా మృదంగంతో సహకరించేవారు. ఇక తల్లి మహాలక్ష్మి గాయకురాలు. తండ్రి రామ్మూర్తిగారు ద్వారం వెంకటస్వామి నాయుడుగారి దగ్గర వయొలిన్ నేర్చుకున్నారు. తంజావూరు వెల్లి పాపా వెంకట్రామయ్యర్ దగ్గర ఆ సంగీతానికి పదును పెట్టుకున్నారు. అయితే ఆయన సంగీతం వ్యక్తిగతం. మనోగతం. ఎన్నడూ కచ్చేరీలు చేసేవారు కాదు. పిలిచి ఆలిండియా రేడియోలో ఉద్యోగం ఇస్తానన్నా వద్దన్నారు. పెదనాన్న యెల్లా సోమన్నగారు స్వయానా పాల్హాట్ మణికి ప్రథమశిష్యులు. ఆయన రేడియోలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. ఆయనకి వందమందికి పైగా శిష్యులు. ఆయనకి పిల్లలు లేరు. అందుకని తమ్ముడి కొడుకైన యెల్లా వెంకటేశ్వరరావును పెంచుకున్నారు. భగవంతుని లీల! ఆ తరవాత ఆయనకి అయిదుగురు సంతానం కలిగారు వెంకటేశ్వరరావుకి పెదనాన్నంటే భయం. ఆయన ఇంట్లో లేనప్పుడు మృదంగం వాయించేవాడు.
విజయవాడ రేడియోలో పిల్లల కార్యక్రమాన్ని ఏడిద కామేశ్వరరావుగారు నిర్వహించేవారు. అందులో మృదంగం, ఘటం కాకుండా ‘వాద్యబృందం” నిర్వహించేవాడు వెంకటేశ్వరరావు. ఓసారి అప్పటి కేంధ్రసమాచార శాఖమంత్రి డాక్టర్ బి.వి. కేల్కర్ విజయవాడ వచ్చారు. పిల్లలతో యెల్లా వాద్యబృందాన్ని నిర్వహించారు. పదేళ్ల యెల్లాని మంత్రి ఆనందంతో దగ్గరకు తీసుకుని నూరు రూపాయల బహుమతినిచ్చారు.
అప్పట్లో విజయవాడ రేడియో కేంద్రం ప్రముఖ విద్వాంసుల నిలయం. దండమూడి రామమోహనరావు, సింహాద్రి శాస్త్రి క్రొవ్విడి హనుమంతరావు గార్లు ఉండేవారు. ఆ రోజుల్లోనే అంటే పదీ పదకొండేళ్ల వయసులోనే క్రోవి సత్యనారాయణ శర్మ, బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, వోలేటి వెంకటేశ్వర్లు కచ్చేరీలకు యెల్లా మృదంగ సహకారం చేశారు. 1961లో ఆలిండియా రేడియో జాతీయ స్థాయిలో సంగీత పోటీలను నిర్వహించింది. 16 ఏళ్ల యెల్లా మృదంగ వాద్యంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అంతే, 1962లో ఆలిండియా రేడియోలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత రాజమండ్రి, బందరు, విశాఖ వంటి పట్టణాలలో కచ్చేరీలు చేస్తూ, బంగారు పతాకలు, సత్కారాలు పొందుతూ జైత్రయాత్రచేశారు. యెల్లా వెంకటేశ్వరరావు వివాహం మేనత్త కూతురైన త్రిమూర్తులమ్మతో జరిగింది. ఆనాటి కచ్చేరాలకు ఆయన పారితోషికం అర్ధనూటపదహార్లు, దెబ్బయి అయిదు, నూట పదహార్లు ఇలా ఉండేది. ఆ విధంగా ప్రారంభమైన యెల్లా జీవితంలో న్యూయార్క్ చికాగోలతో జరిపిన సోలో కచ్చేరీల్లో 5 లక్షల పారితోషికం తీసుకున్నారు.
1969లో ఒక విచిత్రం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగే రోజుల్లో అక్కడి ఇంజనీర్లు, ఆఫీసర్లు, సిబ్బంది మంచాల జగన్నాథరావుగారి వీణ కచ్చేరీని ఏర్పాటు చేశారు. యెల్లా వెంకటేశ్వరరావు మృదంగ సహకారం. యెల్ల ముందుగా నాగార్జునసాగర్ కి చేరుకున్నారు. మంచాల జగన్నాధరావుగారు హైద్రరాబాద్ నుంచి రావాలి. కచ్చేరీ టైము దగ్గర పడుతున్నా మన జాడలేదు. కారణాన్ని కనుక్కునే అవకాశంలేదు. నిర్వాహకులకు ఏం చేయాలో తోచక యెల్లా దగ్గరకి పరిగెత్తారు. “మీరేమైనా ఆపద్దర్మంగా కాపాడగలరా” అనడిగారు. ఒక్కక్షణం ఆలోచించి “సరే సోలో వాయిస్తాను” అన్నారు యెల్లా ఏం వాయించాలి? మొదట ఆది తాళంలో వాద్యాన్ని ప్రారంభించారు. గంట గడిచిపోయింది. ప్రేక్షకులకి ఈ తరహా కచ్చరీ కొత్తే. మెల్లగా మృదంగం మీద విన్యాసాలు ప్రారంభించారు యెల్లా. ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. వర్షపు చినుకు పడే శబ్దం, పిడుగులు, సముద్ర ఘోష, రైలు నడక, అలా తెలియకుండానే మూడున్నర గంటల కచ్చేరీ సాగిపోయింది. మర్నాడు పేపర్లన్నీ యెల్లా కచ్చేరీని ఆకాశానికెత్తేశాయి. యెల్లా జీవితంలో మరో కొత్త గొప్ప ప్రక్రియకి యాదృచి&ఛకంగా తెరలేచింది.
తర్వాత జీవితంలో ఎన్ని ఫ్యూజన్ కచ్చేరీలు! సితార్, వేణువు, వయొలిన్, తబలా, కీబోర్డ్లతో రకరకాల ప్రయోగాలు చేశారు. ఒకసారి కర్ణాటకలో 100 వాద్యాలతో తనే స్వయంగా రూపకల్పన చేసిన వాద్య బృందాన్ని నిర్వహించారు. కేవలం వినికిడి ద్వారానే జాజ్, ఆఫ్రికన్ డ్రమ్స్, చైనా సంగీతాన్ని సాధన చేశారు. 25 ఏళ్ల వయసులోనే రవిశంకర్ సితార్ కచ్చేరీకి కిషన్ మహరాజ్ తబలా వాయించగా, యెల్లా మృదంగం వాయించారు. మహారాష్ట్రకి కోన ప్రభాకరరావు గవర్నరుగా ఉన్న రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ అల్లారఖా, పద్మశ్రీ విక్కు వినాయక్ రామ్ ఘటం, యెల్లా మృదంగం కలిసి జాతీయ సమైక్యతా కార్యక్రమంగా కచ్చేరీ చేశారు. దేశానికే గర్వకారణమైన విజయాన్ని 1979లో యెల్లా సాధించారు. ఇండోనేషియాలో 79 దేశాలు అంతర్జాతీయ రేడియో సంగీత పోటీలలో పాల్గొన్నాయి. యెల్లా వెంకటేశ్వరరావు పరమశివుని అవతార తత్వం మీద ఒక సంగీత రూపకాన్ని తనే సృష్టించి, దర్శకత్వం వహించి, ప్రయోక్తగా తయారు చేశారు. ఆ రూపకానికి ఆయన భారతదేశానికి ఉత్తమ బహుమతిని అందుకున్నారు.
జీవితంలో మరిచిపోలేని సంఘటనలన్ని చెప్పమంటే ఈమని శంకరశాస్త్రిగారితో యూరప్ దేశాల పర్యటన, ప్రముఖ వేణువు విద్వాంసులు టి.ఆర్. మహాలింగం గారితో యూరప్ పర్యటన గుర్తుచేసుకున్నారు. ఒకసారి చెంబై వైద్యనాథ అయ్యర్ కచ్చేరీకి యెల్లా మృదంగం వాయించారు. శంకరాభరణంలో ఎందుకు పెద్దల వలె’ అద్భుతంగా గానం చేశారు చెంబై. యెల్లా తినయా వృత్తం వాయించారు. తన్మయులైన చెంబై ఒక మాలని యెల్లా మెడలో వేసి ఆశీర్వదించారు. “పాల్హాట్ మణియ అయ్యర్ చిన్నప్పుడు ఇలా వాయించేవాడు”అని సభికులకు చెప్పారు చెంబై. ఎంత గొప్ప కితాబు! “అప్పటి నుంచీ నా జాతకం మారిపోయింది” అంటారు యెల్లా ఆనాటి చెంబై ఆశీర్వాదాన్ని గుర్తుచేసుకుంటూ.
యెల్లా జీవితంలో మరొక మలుపు ఉంది. అది 1983. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తెలుగు భాష, సాహిత్య, లలితకళల కోసం అకాడమీలకు బదులుగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నార్ల వెంకటేశ్వరరావు, సి.నారాయణ రెడ్డి రిపోర్టు ఇచ్చారు. ఈ కృషికి ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిస్తే బాగుంటుందని సిఫారసు చేశారు. ఆ విధంగా తూమాటి దొణప్ప స్పెషలాఫీసరుగా తెలుగు కళాపీఠం ఏర్పడి క్రమంగా తెలుగు విశ్వ విద్యాలయంగా మారింది. అప్పుడు హైదరాబాద్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న శ్రీరంగం గోపాలరత్నంను గాత్ర సంగీత విభాగానికి ప్రొఫెసర్గా ఆహ్వానించారు. యెల్లాను వాద్య సంగీతం ప్రొఫెసర్గా ఆహ్వానించారు. అప్పుడే యెల్లా అన్ని సంగీత శాఖలకీ సిలబస్ తయారుచేశారు. నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు, అన్నవరపు రామస్వామి, ద్వారం దుర్గాప్రసాదరావు, దండమూడి రామమమోహనరావు, కమలాకర రావు… ఇలా 60 మందిని సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. సంగీతం డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సులు ఏర్పాటు చేసి సంగీత పాఠశాలల విద్యార్థులకు సాధికారిక డిగ్రీలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు.
శ్రీ రంగం గోపాలరత్నం తరువాత విశ్వవిద్యాలయానికి యెల్లా డీన్ అయ్యారు. అన్ని వాద్యాలకు బి.ఏ, ఎం.ఏ కోర్సులు ప్రారంభించారు. కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యాలకు ఎం.ఏ కోర్సులు ప్రవేశపెట్టారు. కేవలం ప్రతిభ ప్రాతిపదికనే చలామణి అయ్యే పాండిత్యానికి గుర్తింపు, కొలబద్దలు ఏర్పడ్డాయి. యెల్లా డీన్గా పన్నెండేళ్లు పనిచేశారు.
ఈ దశలోనే అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చే మరో గొప్ప విజయాన్ని యెల్లా సాధించారు. రాష్ట్రసాంస్కృతిక శాఖ తరపున జరిగిన మృదంగ మహా యజ్ఞంలో హైదరాబాద్ శంకర మఠంలో 1981 ఆగస్టు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించి 36 గంటల సేపు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. 2008 మే10న యెల్లా వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది.
యెల్లా అభిమాన గాయకులు టి. ఆర్. మహాలింగం, ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్ తీరిక వేళల్లో యెల్లా సంగీతంలో కొత్త పుంతలు వెతికే పరిశ్రమ చేస్తుంటారు. ఇంతవరకూ 1500 మంది శిష్యుల్ని తీర్చిదిద్దారు. యెల్లా వెంకటేశ్వరరావు జీవితంలో మరపురాని సంఘటన… కాశీలో కార్తీకపౌర్ణమి రోజున కాశీ విశ్వనాథుని సమక్షంలో ప్రదోష కాలంలో కచ్చేరీ చెయ్యడం. యెల్లా వెంకటేశ్వరరావు వారసత్వం వారి మనుమలకు దక్కింది. అమ్మాయి కొడుకు అభిషేక్, అబ్బాయి కొడుకు సోమశేఖర్ మృదంగం వాయిస్తారు. తాతగారి దగ్గర నేర్చుకుంటున్నారు. అమెరికాలో ఉన్న ఆరునెలల మనుమడు తాతతో మాట్లాడుతూ ‘లయ’తో వేళ్లు కదపడం ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు.
ఆరుగురు రాష్ట్రపతులు, నలుగురు ప్రధానులు, ఎనిమిది మంది ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఘన సన్మానాలు పొంది, ప్రాక్పశ్చిమ దేశాలలో విజయ ఢంకా మోగించి, తనదైన బాణీని కేవలం ఆనందానికి మాత్రమే కాక ఆరోగ్యానికి కూడా అన్వయింపజేసిన ప్రజ్ఞాశాలి యెల్లా వెంకటేశ్వరరావు. అయిదో తరానికి సంగీతాన్ని పారంపర్య విద్యగా అందిస్తున్నానని ఆయన చెప్తున్నప్పుడు ఆయన గొంతులో ఆత్మతృప్తి, కాస్తంత గర్వమూ తొణికిసలాడాయి. అవి ఆయన నిరంతర అన్వేషిగా ఒక జీవిత కాలం శ్రమించి సాధించుకున్నవి.
– యస్. రామకృష్ణారావు

2 thoughts on “మృదంగానికి గుర్తింపు తెచ్చిన – యెల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap