రంగ‌స్థ‌ల ఎన్టీఆర్‌ – విజయకుమార్‌

ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్బంగా…

కాలం కలిసిరావాలంటారు. కలిసిరావడం అంటే.. అనుకోని అదృష్టమేదైనా వరించడమా? అదీకాదు. కాలంతోపాటు పరుగులు తీయడం. అది నిరంతరాయంగా జరిగితేనే.. ఎవరికైనా కాలం కలిసొస్తుంది. ఇక్కడ పరుగులు తీయడం.. అంటే శ్రమించడం. కాలంతో పనిలేకుండా ప్రత్యేకతను నిలబెట్టుకోవడం.. అలా తెలుగు నాటకరంగంలో నలభైఏళ్ళకు పైగా రంగస్థల నటుడిగా మెరుగైన నడక సాగిస్తుండటం వల్లనేమో.. అనుకోని వరంలా తనకో అరుదైన అవకాశం లభించింది. ప్రపంచ విఖ్యాతిగన్న నటుడి రూపాన్ని తనలో నింపుకుని, వెండితెరపై మెరిసే సదావకాశమూ వచ్చింది. ఇప్పుడతడు ఊరూరా మారుమోగుతున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. కానీ అంతకుముందే.. అతను.. తెలుగునాట రంగస్థల ఎన్టీఆర్‌గా మారుమోగిన వాడే. పోలికల్లోనే కాదు, వెండితెరపై ఎన్టీఆర్‌ పోషించిన పౌరాణిక పాత్రలన్నీ దాదాపుగా నాటకరంగంలో పోషించి.. అంతే ధీటుగా మెప్పించడం మరో విశేషం. అలా.. ఎన్టీఆర్‌ రూపం, స్వరూపం, పాత్రల స్వభావం, ప్రభావాన్ని తన నటనలో నింపుకుని, సీనియర్‌ నాటక కళాకారుడిగా తెలుగు రంగస్థలంపై ప్రత్యేకతను చాటుకునే కొయ్యలగూడెం విజయకుమార్‌ నట, ‘జీవన’యానం ఇది.

పౌరాణిక నాటకరంగంలో ఒక్కో నటుడిది ఒక్కోశైలి. ఫలానా నటుడు.. అని పేరు చెప్పగానే.. ఫలానా పాత్రధారి.. అనే ఓ ముద్ర ఉంటుంది. కానీ నటుడు విజయకుమార్‌ని బహుముఖీన పాత్రధారి అనొచ్చు. పుట్టి,పెరిగింది, డిగ్రీ వరకూ చదువుకున్నది ఏలూరులో. తండ్రి వ్యాపారం రీత్యా కొంతకాలం కొయ్యలగూడెంలో ఉండటం వల్ల ఇంటిపేరు ‘పస్తుల’ అయినా ‘కొయ్యలగూడెం’ విజయకుమార్‌గానే నాటకరంగంలో పేరు.

ధీటుగా.. మేటిగా
విజయకుమార్‌ తొలినాళ్ళలో సాంఘిక నాటకాల్లో అనేక పాత్రలు చేశారు. అవార్డులూ రివార్డులూ చాలానే దక్కాయి. అయితే పౌరాణిక నాటకాల్లోకి అడుగుపెట్టాక మరింత వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. పద్యనాటక రంగస్థలిపై ఈయన ధరించని పాత్ర లేదు. రాముడు, కృష్ణుడు వంటి సుకుమారమైన పాత్రలు వేస్తూనే మరోపక్క ప్రతినాయక పాత్రలైన ధుర్యోధనుడు, జలంథరుడు వంటి రౌద్రపాత్రల్లోనూ అంతే ఒదిగిపోయారు. లాలనగా సాగే శ్రీకృష్ణుడులాంటి పాత్రల్ని పండిస్తూనే.. దానికి భిన్నంగా ఆరునొక్క రాగంలో భావోద్వేగంగా పద్యం పాడే హనుమంతుడి వేషంలోనూ మెప్పించారు. పౌరాణిక నాటకం అంటేనే పద్యనాటకం. అలాంటి పద్యనాటకాల్లో గతకాలపు నటుల ఒరవడిని పక్కనపెట్టి, తనదైన సంగీత ప్రతిభతో లలితమైన, పరిమితమైన గానంతో తనకంటూ ప్రత్యేకముద్ర ఏర్పరచుకున్నారు విజయకుమార్‌. అలా సుదీర్ఘకాలంగా అటు సాంఘికం, ఇటు పౌరాణిక, జానపద నాటకాలెన్నో ఆడి, వేలాది ప్రదర్శనల అనుభవంతో మేటి నటుడిగా రంగస్థల ప్రయాణాన్ని సాగిస్తున్న విజయకుమార్‌ ఇటీవల ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో ప్రధాన భూమిక పోషించి, అటు వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఒకరకంగా ‘ఎవరీయన.. అచ్చం పెద్దాయన ఎన్టీఆర్‌లా ఉన్నారే..’ అని అందరూ ఆసక్తి కనబరిచేలా వార్తల్లోకెక్కారు. అయితే, రాత్రికి రాత్రే.. ఈయన ఇలా వార్తల్లోకెక్కలేదు. అందుకు నటుడిగా నలభై ఏళ్ళుగా ఆయన చేసిన కృషి, సాధనే అందుకు కారణమయ్యింది.

తొలి పలుకులు ఇలా! 
ఒకప్పుడు తెలుగునాట పౌరాణిక నాటక ప్రభావం చాలా ఎక్కువ. పండగలు, ఉత్సవాలు, జాతరలు, వేడుకులు, తిరునాళ్ళు ఇలా ఏ సందర్భంలోనైనా నాటకప్రదర్శనలు విరివిగా జరిగేవి. ఆ ప్రభావం యువతపైనా ఉండేది. అలా చిన్నప్పటి నుంచీ నాటకాలు చూస్తూ పెరగడంవల్లనేమో.. కుటుంబపరంగా కళారంగంతో పెద్దగా వారసత్వపు అనుబంధం లేకపోయినా విజయకుమార్‌కి ఎందుకనో నాటకం అంటే ఇష్టం ఏర్పడింది. దీనికితోడు పాటలంటే ఇష్టం. స్కూల్లో ఘంటసాల, బాలుగారి పాటల్ని మక్కీకి మక్కీ దింపేయగల పాటగాడిగా మంచిపేరు. దీంతో ఏడవతరగతి చదివే వయసులోనే సాంఘిక నాటకాల్లో తెర వెనుక సాగే పాటలు పాడ్డానికి విజరుకుమార్‌ని నాటక సమాజాలవాళ్ళు వెంట తీసుకెళ్ళేవారు. అలా చిన్నవయసులోనే నాటకాల్లోనూ, చిన్నచితకా ఆర్కెస్ట్రాల్లోనూ గాయకుడిగా కళారంగ ప్రయాణాన్ని ప్రారంభించారు.

పద్నాలుగు రోజుల్లో.. నాటకం 
అప్పట్లో ‘సత్యహరిశ్చంద్ర’ పాత్రకు నటులు డీవి సుబ్బారావు పెద్దపేరు. డీవి పాడిన వారణాశి, కాటి సన్నివేశం పద్యాలు ఇప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతమే. ఊళ్ళో ఆయన ప్రదర్శించిన నాటకాన్ని చూసి, సత్యహరిశ్చంద్ర పాత్రపై మక్కువ పెంచుకున్న విజయకుమార్‌ పట్టుదలతో సంపద లక్ష్మణరావు వంటి ఉద్ధండ కళాకారుల్ని తీర్చిదిద్దిన సంగీత గురువు శిలార్‌ శిక్షణలో కేవలం పద్నాలుగు రోజుల్లో సత్యహరిశ్చంద్ర పాత్ర, పద్యాలు నేర్చుకుని, పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడం విశేషం. ‘నిజం చెప్పాలంటే.. ప్రణాళికలు వేసుకుని నాటకాల్లోకి రాలేదు. అభిరుచి, ఆసక్తి కొద్దీ.. సమయం చిక్కినప్పుడు.. కేవలం సాంఘిక నాటకాలు మాత్రమే ఆడుతుండేవాడ్ని. చదువుకున్నాను. ఉద్యోగావకాశాలు వచ్చినా పోలేదు. ఎందుకో కళలపైనే ఆసక్తి ఉండేది. అలా.. నాటకం ఒక వ్యాపకమైంది. పరిషత్‌ నాటకాల్లో ఉత్తమ నటుడిగానూ అవార్డులొచ్చాయి. అప్పట్లో సాంఘిక నాటకాలకంటే పౌరాణిక నాటకాలే ఎక్కువ ఆడేవారు. నాకు ఎప్పుడైతే నాటకాలపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతూ వచ్చిందో.. పౌరాణిక నాటకాలపైనా మనసు మళ్ళింది’ అంటూ తన నాటక ప్రవేశపు రోజుల్ని గుర్తుచేసుకునే విజయకుమార్‌.. ‘సత్యహరిశ్చంద్ర’ పాత్ర తెచ్చిన గుర్తింపుతో.. ఆ వరుసలో ప్రసిద్ధమైన పౌరాణిక పాత్రలు గల నాటకాలెన్నో ఆడారు. శ్రీరాముడు, కృష్ణుడు, శంకరుడు, భీముడు, దుర్యోధనుడు, మైరావణుడు, భీష్ముడు, జలంథóరుడు, దుష్యంతుడు ఇలా అచ్చంగా వెండితెరపై ఎన్టీఆర్‌ పోషించిన పాత్రలన్నీ పోషించారు. అంతేకాదు, ఈ పాత్రలన్నింటికీ భిన్నమైన ఆంజనేయుని పాత్రనూ రక్తి కట్టించారు. ఇలా రంగస్థలంపై నటుడిగా విజయకుమార్‌ పోషించిన పాత్రల వైవిధ్యం, అనుభవం రెండూ కలగలిపి, ఇప్పటిదాకా మూడుసార్లు ‘నంది’ బహుమతులు అందుకున్నారు.

సినిమా అవకాశం
బయోపిక్‌ సినిమాలంటేనే.. సంచలనాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ‘ఎన్టీఆర్‌’లాంటి నటులు, రాజకీయ నాయకుల జీవితాలను తెరపై చూపించాలనుకునే ప్రయత్నమూ ఓ సాహసమే. అంతేకాదు, ఆ పాత్రల తరఫున వకాల్తా పుచ్చుకుని నటించడమూ అలాంటిదే. నటుడు విజయకుమార్‌ కూడా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విషయంలో అలాంటి సాహసమే చేశారని చెప్పొచ్చు. దాదాపు రెండువందల మంది నటుల్ని వెదికితే అందులో విజయకుమార్‌ని ఎన్టీఆర్‌ పాత్ర వరించింది.

ఒకపక్క ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్‌ కుమారుడు, స్టార్‌నటుడు బాలకృష్ణ తీస్తున్న ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలకు సమాంతరంగా, దర్శకుడు రాంగోపాలవర్మ మరోకోణంలో ఎన్టీఆర్‌పైన తీస్తున్న సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం అంటే.. ఢ అంటే ఢలాీంటిదే. ‘నటుడు వేరు.. రాజకీయాలు వేరు. ఓ గొప్ప నటుడి పాత్రలో నటించే అవకాశం ఎందరికి వస్తుంది? వచ్చినప్పుడు.. ఆ పాత్రకు శక్తిమేరకు, అనుభవం మేరకు రక్తికట్టించే ప్రయత్నం చేయాలి. రంగస్థల నటుడిగా నేను అదే ఆలోచించాను తప్ప మరేవీ నాబుర్రలోకి రాలేదు.’ అంటారు ఎన్టీఆర్‌ని ఎంతో అభిమానించే విజయకుమార్‌.

ఎన్టీఆర్‌ నటనకాదు.. దర్పం
బయోపిక్‌లాంటి సినిమాల్లో నటించే సందర్భాల్లో నటులు.. పాత్ర తాలూకా స్వభావాన్ని వంటపట్టించుకోవడానికి.. అసలు వ్యక్తుల గురించి పరిశోధించడం, పరిశీలన చేయడం, వాళ్ళనూ వీళ్ళనూ అడిగి తెలుసుకోవడం, వీలైతే వారి పాత వీడియోలను చూడ్డం వంటివి చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్‌ పాత్రను పండించడానికి విజయకుమార్‌ అలాంటివేవీ చేయలేదు. మేకప్‌ వేసుకున్నాక.. ఒకే రోలింగ్‌.. రెడీ.. యాక్షన్‌ అనగానే.. తన మనసులో చిత్రించుకున్న ఎన్టీఆర్‌ని ఆవహించుకుంటూ పాత్రకు అనుగుణంగా నటించారు అంతే! అదే ఆయన ఎన్టీఆర్‌లా కనిపించడానికి, ప్రేక్షకులకు నచ్చడానికి కారణమైంది. ‘ఇదేలా సాధ్యం సార్‌?’ అని విజయకుమార్‌ని ఎవరైనా అడిగితే..’ఇలా అడిగినప్పుడు నాకు నవ్వొస్తుంది. ఎన్టీఆర్‌ పాత్ర చేస్తున్నాం కనుక ఆయన సినిమాలన్నీ మళ్ళీ తిప్పి తిప్పి చూడాలా.. చెప్పండి? ఒకవేళ చూస్తే ఏమొస్తుంది?.. అలా చూసినప్పుడు మనకు సినిమాల్లో హీరో పాత్రధారైన రామారావుగారినే చూడగలం, ఆపాత్రలోని హావభావాలను మాత్రమే అనుకరించగలం. కానీ ఇక్కడ చేయాల్సిన పాత్ర నిజజీవితంలోని ఎన్టీఆర్‌ని. అందుకే నేను.. ఎన్టీఆర్‌ పాత్ర నటించడం కోసం ఒక్క సినిమా కూడా చూడలేదు. చూడాలని అనుకోనూ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ అంటే నటుడు మాత్రమే కాదు.. అంతకుమించి ఓ దర్పం. ఆయనలో గల, ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా గల ఆ దర్పాన్ని, ఆ ఠీవిని కనీసం కొంతైనా.. ప్రకటించగలిగితే చాలు. నటుడిగా సక్సెస్‌ అయినట్టే అని అనుకున్నా. నాకున్న అనుభవంతో అదే ప్రయత్నం చేశా’ అని విజయకుమార్‌ చెప్పడంలోనే అతనిలోగల రంగస్థల నటనానుభవ ప్రత్యేకతను గమనించొచ్చు.

నటన.. అంటే.. నాలుగు రకాల విద్యలు సమాహారమవ్వాలి. రూపంతోపాటు, గానం, వాచికం సమపాళ్లలో ఉండాలి. అలా పరిపూర్ణమైన ప్రతిభా వికాసంతో నటుడిగా వైవిధ్యపాత్ర పోషణలో మేటి అనిపించుకుంటున్న విజయకుమార్‌ మరిన్ని విజయాలను అందుకోవాలని మనమూ కోరుకుందాం!!

– గంగాధర్‌ వీర్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap