రసమయ రంగుల  దృష్టి – గౌస్ బేగ్ కళా సృష్టి

 సృష్టిలో ఎన్నో రంగులు, ఎన్నో రూపాలు , రంగుల్లో ఎన్నో బేధాలు. రూపాలలోను ఎన్నో బేదాలు, ఎరుపు పసుపు నీలాలే కాదు వాటి నుండి ఎన్నో వందల, వేల వర్ణాలు.అలాగే స్క్వేర్, స్సర్కిల్ , రెక్టంగల్ లు మాత్రమే కాదు. వాటి నుండి కూడా ఎన్నో బిన్న విబిన్న రూపాలు, సృష్టిలో కేవలం రూపాలే కాదు. నైరూపాలు కుడా వుంటాయి. రూపం లేనిది నైరూపం. మరి వర్ణం లేని దానిని నిర్వర్ణం లేదా అవర్నం అందామా ? ఏదైతేనేమి రంగుకి వుంటుంది ఒక ఆకర్షణ. రూపానికీ వుంటుంది మరో ఆకర్షణ, అయితే  వీక్షించే ద్రుష్టి , యోచించే మనసుపైనే అది ఆదారపడి వుంటుంది.

 కేవలం రూపాలతో సౌందర్యాన్ని సృష్టించే వాళ్ళు కొందరైతే  కేవలం అరూలతో సౌందర్యాన్ని సృష్టించే వాళ్ళు  ఇంకొందరు. కేవలం శుద్ద వర్ణాలతో సౌందర్యాన్ని సృష్టించే వాళ్ళు  కొందరైతే , కేవలం అవర్ణాలతో సౌందర్యాన్ని సృష్టించే వాళ్ళు  మరి కొందరు. రంగు రూపాల మిశ్రమ కలయికతో సౌందర్యాన్ని సృష్టించే వాళ్ళు ఇంకొందరు. రూప సహితమైన సౌందర్యాన్నే గుర్తిస్తుంది సాదరణంగా మనిషి మస్తిష్కం. కారణం అది జ్ఞానబందమైన చర్య. కళఅనేది  జ్ఞానరహితమైనది కాదు గాని దానికి అతీతమైన రసబంధమైనదిగా చెప్పవచ్చు.  రసాస్వాదన అనునది మనసుకు సంభందించినది. కళ కూడా మానస సంభందమైనదే. కారణం దానికి తర్కం కార్యాకారణాలతో పని లేదు. ఒక అందమైన భావన చాలు మనసుకు ఆనందం కలిగించడానికి. మనుషుల మనసులను ఒక ఆనందలోకాలకు తీసుకెల్లడమే కదా కళ యొక్క లక్ష్యం.

 ప్రకృతిలోని ఏ రూపాలను ఆశ్రయించకుండా పూర్తిగా శుద్ధ వర్ణాలతో వందలాది  చిత్రాలను సృజియిస్తూ ప్రేక్షకులను ఒక రసమయ జగత్తులోకి నడిపిస్తూ నేడు చిత్రకళ ప్రపంచం లో ఒక విశేష గుర్తింపును పొందుతున్న ఆ విలక్షణ వర్ణరంజితమైన  నైరూప్య  చిత్రకారుడే గౌస్ బేగ్ గారు.నేడు ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కి మారు పేరుగా నిలుస్తున్న గౌస్ బేగ్  మొదట అందరిలాగానే రూప సంబంద చిత్రాలు, ప్రకృతి చిత్రాలు ఇంకా ఎన్నో సామాజిక చైతన్య చిత్రాలను చిత్రించిన వారే. అంతే కాదు వాటితో వ్యక్తిగతంగాను సామూహికంగాను కూడా  ఎన్నో ప్రదర్శనలు చేసారు, అంతే గాకా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆ చిత్రాలకు పలు బహుమతులు పురస్కారాలను అందుకున్న వారే. ఉదాహరణకు 2000కి  పూర్వం నాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక మరియు సామాజిక  సమస్యలైన బాల్య వివాహాలు, మద్యపాననిషేధం, వరకట్నసమస్య,రోజు రోజుకీ అడుగంటుతున్న మానవతా విలువలు లాంటి సమస్యలపై ఒక్కో అంశంపైనా పదుల సంఖ్యలో ఆయన వేసిన చిత్రాలలో “టియర్స్ అఫ్ డౌరి”  “ద లాస్ట్ హ్యుమానిటీ, బలి హారం, లాస్ట్ అఫ్ మేన్ కైండ్ లాంటి చిత్రాలు చూసినప్పుడు ఇప్పటి గౌస్ గారేనా ఈ చిత్రాలను సృష్టించింది అని ఆశ్చర్యపడడం మనవంతౌతుంది. ఈ ఆర్టికల్ రాయడంలో బాగంగా నేను వాటిని చూసినప్పుడు నాకు అదే భావన కలిగింది. నేడు ఆయన చిత్రిస్తున్న చిత్రాల రీతికి నాడు ఆయన వేసిన ఈ సామాజిక చిత్రాల రీతికి ఏ మాత్రం పొంతన లేని స్థితిని గూర్చి నేను ప్రశ్నించినప్పుడు శ్రీ గౌస్ గారు చెప్పిన సమాధానం వాస్తవమనిపించింది.

 సామాజిక సమస్యలపై వేసిన చిత్రాలు నాకు వివిధ పోటీలలో మంచి పేరును తీసుకువొచ్చిన మాటా వాస్తవం పలు చిత్రాకళా సంస్థల సన్మానాలను అవి అందుకునేలా చేసాయి. కాని ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే మనం వేసిన చిత్రాలు సమాజంలోకి పోవాలి . బాగా అమ్ముడు పోవాలి. అప్పుడే ఆ చిత్రాలకు నిజమైన సార్ధకత చేకూరుతుంది . కేవలం ఎదో ఒక పరిమిత ప్రాంత సమస్యలపై వేసిన చిత్రాలు అవి ఎంత బాగున్నప్పటికీ వాటిని ఇతరులు సొంతం చేసుకొనేందుకు ఇష్టపడరు. ఒకరు మన చిత్రాన్ని కొనుగోలు చేయాలి అంటే ముందు ఆ చిత్రం అతనికి నచ్చాలి. పరిమితమైన అంశంపై వేసిన చిత్రాలను  పరితమైన వ్యక్తులే ఇష్టపడతారు. కాని సార్వజనీనంగా వుండే అంశాలపై వేసిన చిత్రాలను సర్వ జనులూ  ఇష్టపడతారు. అందుకే మనం వేసే ప్రతి చిత్రం సార్వజనీనమై  అందరిని ఆకర్షించేవిదంగా వుండాలి. అందరికి ఉపయోగపడే విదంగా వుండాలి . అందుకు విరివిగా వాటిని చిత్రించి అంతే విరివిగా   చేరవలసిన ప్రదేశాలకు వాటిని చేర్చాలి, అందుకు ముందు కొన్నివ్యయప్రయాసలకు లోనయ్యి కొంత మనం కోల్పోయినా పర్వాలేదు. సమాజంలో వాటి పరిచయానికి ముందు ఆ మాత్రం త్యాగం చేసినా క్రమక్రమంగా దానికి రెట్టింపు ప్రతిపలం మన చిత్రాలు మనకు అందిస్తాయి అని నమ్మి ఆ సూత్రాన్ని తాను పాటించడం వల్లనే దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై,డిల్లి కలకత్తా, గోవా  తదితర ప్రాంతాలలో తన చిత్రాలు నేడు  విరివిగా అమ్ముడుపోవడానికి కారణం అని చెబుతారు శ్రీ గౌస్ బేగ్. నేడు పేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ తదితర సాంఘీక మాధ్యమాలలో ఆయన పెడుతున్న వారి చిత్రాల పోస్టులు చూసిన వారెవరికైనా ఆయన విజయరహస్యం అర్ధమౌతుంది.

నేడు వందలాదిగా తనవైన  నైరూప్య శైలి చిత్రాలు సృష్టిస్తూ వాటిని మార్కెట్ లో కూడా బాగా సేల్ చేస్తున్నప్పటికీ చాలా సాదాసీదాగా కనిపించే బేగ్ గారు సైజున్నిసా, అబ్బాస్ బేగ్ అనే దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనందలి  కృష్ణ జిల్లా విజయవాడకు సమీపంలో గల గుణదలలో జూన్ 15న 1957వ సంవత్సరంలో జన్మించారు . కళా వారసత్వం ఏమీ లేకున్నా తనలో బాల్యంనుండి సహజంగా ఏర్పడిన చిత్రకళా ఆసక్తితో తనకు తానుగా బొమ్మలను బాగా ప్రాక్టీసు చేసారు. విజయవాడ లో పాటశాల విద్య ముగిసిన తర్వాత 1975 లో మద్రాస్ ప్రభుత్వం నిర్వహించే డ్రాయింగ్ పరీక్షలలో వుత్తీర్నుడై 1985 లో కృష్ణా జిల్లా కొండపల్లి  జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాటశాలలో చిత్ర కళా ఉపాధ్యాయుడిగా పని చేసి 2016లో పదవీ విరమణ చేసారు.        

కళా స్పృహ ఎక్కువగా వుండే  పాశ్చాత్యుల  ప్రభావం మనదేశంలో దక్షిణాది కంటే ఉత్తరాది  రాష్ట్రాలలో ఎక్కువగా వుంటుంది. ఇంటీరియర్ డికరేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే వీరు గృహ శోభను పెంచే చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకు ఏ ప్రత్యేక విషయానికి పరిమితం కాకుండా వుండే  వర్ణరంజితమైన నైరూప్య చిత్రాలు బాగా ఉపయోగ పడతాయి. ఈ మర్మం తెలుసుకున్న వీరు ఈ దిశగా తన శైలిని మార్చుకుని గత పదిహేనేల్లుగా ఈ శైలి చిత్రాలపై  పై బాగా కృషి చేస్తున్నప్పటికీ గత ఏడేల్లుగానే తన చిత్రాలకు కాస్త గిరాకీ ఏర్పడి నట్లుగా చెప్తారు.  గౌస్ బేగ్ గారు తాను సృష్టించిన చిత్రాలు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలలో సేల్ చేస్తూ వుంటారు. ముఖ్యంగా బొంబాయి నందలి వివిధ హౌస్ గెలరీలకు అనగా గుప్తాస్ కాంటేంపరరీ హౌస్ గేలరి ,ప్రియోరంజన్ కాంటేంపరరీ హౌస్ గేలరి, సింఘారీ ఇంటీరియర్ ఆర్ట్ హౌస్ గేలరి, రజనీ అర్కి టేక్చార్ ఇన్ఫర్మేషన్ హౌస్ గేలరి, ది గ్రేస్ గ్రూప్ఆఫ్ హౌస్ ఆర్ట్ గేలరి, జి.డి. అర్కిటేక్చర్ ఇన్ఫర్మేషన్ హౌస్ గేలరి లాంటి సంస్థలకు తన చిత్రాలను ఎక్కువగా  పంపిస్తూ వుంటారు . విదేశీయులు ఎక్కువగా సందర్శించే బొంబాయి, గోవా, కలకత్తా నగరాలలోని వారు వుండే హోటల్స్ లో   ఆయా గేలరీస్ వాళ్ళు ఈ చిత్రాలను ప్రదర్శించడం ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారని తన విజయ రహస్యాలను చెప్తారు.

కౌశల్యంతో కూడిన ఏ పనైనా కళగా గుర్తింపబడుతుంది.ఇతరులను అలరిస్తుంది.అందుకు దృశ్య సంభందమైన రూపాలతో పనిలేదు. నిపుణత సాదించిన సంగీతకారుడు పదాలజోలికి పోకుండా కేవలం శుద్ధ స్వరాలతోనే   ప్రేక్షకులను ఎలా మంత్రముగ్దులను చేయగలడో అదే విదంగా చేయి తిరిగిన చిత్రకారుడు కుడా రూపాలజోలికి పోకుండా నైరుపాలతో కూడా ప్రేక్షకులను అలరించగలడు. అందుకు ఎంతో సాధన చేయాలి. శ్రీ గౌస్ బేగ్ ఎన్నో ఏళ్ళుగా నైరుప్యకళపై సాధన చేస్తున్నారు. అందుచేతనే వారి చిత్రాల్లో ఎక్రలిక్ వర్ణాలు కాన్వాస్ పై అత్యంత సహజమైన జలపాతాల్లా ప్రవహిస్తాయి. ఆనందంతో కేరింతలు కొడతాయి, నృత్యం చేస్తాయి. మధ్యమధ్యలో అక్కడక్కడా అడ్డుపడిన గోడలకు అవి తగులుకుని  ఉవ్వెత్తున ఎగిశి పడే కెరటాలుగా మారతాయి.మెలితిరిగిన వర్ణాలు నురగలు తరగలుగా మారి ఒక అందమైన దృశ్య మాధురిని ప్రేక్షకుడి మదిలో సృస్టిస్తాయి. వాటిన్నిటినీ పైనుండి వీక్షిస్తున్న చందమామలా ఒక రంగుల సర్కిల్ ఎప్పుడు చిత్ర పైబాగంలో వుంచడం ఆయన చిత్రాలలోని ఒక ప్రత్యేకత. మరి ఇంతలామురిపిస్తున్న చిత్రాలు ప్రేక్షకులను ఎలా మైమరపించకుండా వుంటాయి?

సాధారణంగా రాత్రిళ్ళు మాత్రమే చిత్రాల సృజనకు సమయం కేటాయించే వీరు ఎప్పుడు ఒక చిత్రం ముందు పెట్టుకుని దానిపైనే రోజులతరబడికూర్చోవడం కాకుండా ఒకే  సమయంలో అయిదారు కాన్వాసులు ముందు వరుసగా పెట్టుకుని వరుసగా రంగులు వేసుకుంటూ ఏకకాలంలోనే వాటన్నింటినీ పూర్తి  చేస్తానని చెప్తారు.అందు వలననే వీరి చిత్రాలు ఇప్పటికే వెయ్యి సంఖ్యను దాటడానికి కారణం కావొచ్చు.

 చిత్రకారుడిగా 1983 నుండే విరివిగా వివిధ కళా ప్రదర్శనలలో పాల్గొని ఎన్నో బహుమతులందుకున్న వీరు వ్యక్తిగతంగా విజయవాడ నందలి గాంధీహిల్, జవహర్ బాలభవన్, కాకాని, గుడివాడ, జి. కొండూరు, పెనుగంచిప్రోలు , కొండపల్లి, బొంబాయిలలో  చేసిన 12 ప్రదర్శనలతోపాటు సామూహికంగా ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు లతో పాటు ఉత్తరాదిన  బొంబాయి తదితర పట్టణాలలో కూడా తన చిత్రాలను  ప్రదర్శించడం జరిగింది. 2015 నవంబర్ 3 నుండి 6 వరకు  బొంబాయి  నందలి గ్లోబల్ ట్రేడ్ సెంటర్ నందు జరిగిన తన చిత్రాల ప్రదర్శనను ఒకనాటి ప్రముఖ బాలీ వుడ్ నటి జీనత్ అమన్ ప్రారంబించి తాను స్వయంగా ఒక చిత్రాన్ని కొనుగోలు చేయడమే గాక మరికొన్ని ఆర్డర్స్ ఆమెద్వారా తనకు రావడం ఒక గొప్ప అనుభూతిగా చెప్తారు.

 ముందుగా చెప్పినట్టే వీరి చిత్రాలు ఎక్కువగా ఉత్తరాదిన బొంబాయి నగరం లోని  కొందరు వ్యక్తులతో పాటు  ప్రముఖ  హోటల్స్ మరియు కొన్ని  సంస్థల సేకరణ లోనే గాక కొందరి విదేశీయుల సేకరణలో కూడా వుండడం విశేషం. గోవా నందలి జునూన్ రెస్టారెంట్ వాళ్ళు కూడా వీరి చిత్రాన్ని కొనుగోలు చేయడం కూడా మరొక విశేషం.

 కళయే సర్వస్యంగా, నమ్మిన పనిని దైవంగాభావిస్తూ నిరంతర కృషి,సాధన,పట్టుదలలతో ముందుకు సాగినప్పుడు తప్పక  తాననుకున్న రంగంలో విజయం సాదించే అవకాసముంటుంది అని చెప్పడానికి చక్కని ఉదాహరణ గౌస్ బేగ్ గారు . కేవలం తానే కాకుండా తన తోటి చిత్రకారులు కుడా ఆర్ధికంగా  ఎదగాలనే ఉద్దేశ్యంతో ఆకళా వ్యాపార విషయలాన్నింటిని పేస్ బుక్ ద్వారా తన తోటి చిత్రకారులకు ఎప్పుడూ తెలియజేస్తూ వుండడం వారి మంచితనాన్ని సూచిస్తుంది. అయితే కేవలం వ్యాపార పరంగానే కాక కళా పరంగా కూడా  మంచి గుర్తింపు పొందాలంటే ఇంకా పేరు పొందిన జహంగీర్ ఆర్ట్ గెలరీ లాంటి ప్రముఖ సంస్థలలో వీరు ప్రదర్శనలు చేయాల్సిన అవసరం వుంది. ఆ దిశగా కూడా ప్రయత్నించి గ్రాఫిక్ మరియు నైరూప్య చిత్రకళలో లబ్ధ ప్రతిష్టులైన   ఒక కృష్ణారెడ్డి. ఒక ఎస్.వి. రామారావుల్లా  గణనీయమైన పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

  –వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

                                                                                               

6 thoughts on “ రసమయ రంగుల  దృష్టి – గౌస్ బేగ్ కళా సృష్టి

  1. Ventapalli గార్కి, కళాసాగర్ గార్కి ధన్యవాదాలు. వెంటపల్లి గారు మీరు నాచిత్రాలు గురించి, నా గురించి ఇంత రీసెర్చ్ చేసి రాస్తారని ఊహించలేదు. దాదాపు సంవత్సరం నుండి నాగురించి, లో నాచిత్రాల గురించి కనపడినప్పుడల్లా ఏదో ఒకటి నాగురించి అడిగి తెలుసుకొంటునేవుండేవాళ్ళు‌ . ఇంత ఇంట్రెస్ట్ గా, క్లుప్తంగా, రీసెర్చ్ చేస్తారని.ఇంత గొప్ప క్రిటిక్ అని, అని ఊహించలేదు. 64కళలు కు 100 పర్సెంట్ న్యాయం చేసే వారిని ఇప్పుడే తెలుసుకొన్నాను. మీకు , కళాసాగర్ కు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే . ఆర్ట్ లో ఏ సబ్జెక్ట్ అయినా వర్ణించి వ్రాయటం చాలా మంది వ్రాస్తారు సహజంకూడా. Abstract ని వర్ణించి వ్రాయటం అనెది చాలా చాలా కష్టం ఎందుకంటే ఆవర్డ్స్ అందరికి అంత ఈజీగా రావటం కష్టం. దానిని మీరు ఈసిగా సాధించటం అనేది చాలా అరుదు ఆర్ట్ క్రిటిక్ కి దక్కుతుంది ‌అది మీకు దక్కటం నాకు చాలా చాలా సంతోషంగా వుంది.మీరు వ్రాసిన Script నా మనస్సు ని కదిలించింది. మీకు ఎల్లప్పుడూ రుణపడి వుంటాను. ఇంకొక్కసారి మీకు, కళాసాగర్ గార్కి ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇలా చిత్రకారులందరిని పరిచయం చేస్తున్నందుకు ప్రతి చిత్రకారుని ❤ గుండెల్లో మీరిరువురు దాగివున్నారంటంలో ఏమాత్రం సందేహంలేదు….Gouse baig.. abstract artist, vja.

    1. ధన్యవాదములు గౌస్ బేగ్ గారు

  2. Very nice article sir.U explained truths of Abstract art. Congratulations House Baig sir n Ventapalli Satyanarayana Garu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap