కళల కాణాచి రాజమహేంద్రవరము నందు చిత్రకళాభివృద్ధి కోసం 1993 వ సంవత్సరంలో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది మరియు కళాభిలాషి అయిన శ్రీ మద్దూరి శివానంద కుమార్ అధ్యక్షులుగా ప్రముఖ చిత్రకారుడు టేకి మృత్యుంజయరావు కార్యదర్శి గా ఏర్పడిన సంస్థ రాజమండ్రి చిత్రకళా నికేతన్. రాజమహేంద్రి లో చిత్రకళకు జీవం పోసి ఆంధ్ర చిత్రకళకే ఆద్యుడిగా పేరు పొందిన అమర చిత్రకారుడు దామెర్ల రామారావు తదితరులను తీర్చి దిద్దిన అలనాటి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆస్వాల్డ్ జెన్నింగ్స్ కూల్డ్రే సర్వకళలలో నిష్ట్నాతుడు. అతని ప్రోత్సాహంతో చిత్రకళ లో బాగా కృషిచేసి అచిర కాలంలోనే ఆంద్రచిత్రకళకు ఆధ్యుడైన దామెర్ల రామారావు,ఆపైన ఆ కళావారసత్వాన్నిఇక్కడ దిగ్విజయంగా కొనసాగడానికి తమ జీవికలను అర్పించిన మరో గొప్ప చిత్రకళాచార్యులు వరదావెంకటరత్నం మాదేటి రాజాజీ, ప్రకృతి చిత్రకారుడు వి.వి. భగీరదిలతో పాటు ఈ కళకు సంభందించిన ఎందరోకళాకారుల కృషిని వారి సేవలను స్మరిస్తూ చిత్రకళా కార్యక్రమాలను తనదైన రీతిలో దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాజమండ్రి చిత్రకళా నికేతన్ గత ఏడాది కి ఇరవై అయిదు వసంతాలు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా నాడు ప్రారంభించిన రజతోత్సవ సంభరాల ముగింపు వేడుకలు స్థానిక త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి భవనమునందు ఈ జనవరి 26 మరియు 27 తేదీలలో ఎంతో వైభవంగా జరిగినాయి .
26-01-2019న సంస్థ అధ్యక్షులు శ్రీ మద్దూరి శివానంద కుమార్ అధ్యక్షతన స్థానిక D.SP శ్రీ యు. నాగరాజు ముఖ్య అతిదిగా పాల్గొనగా శ్రీ పతివాడ సూర్యనారాయణ గారి జ్యోతి ప్రజ్వలనతో మొదటిరోజు కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు గువ్వల కెనడి చిత్రించిన దామెర్ల రామారావు చిత్రాల ప్రదర్శనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగావొచ్చిన 64 మంది వివిధ చిత్రకారుల యొక్క చిత్ర ప్రదర్శనను కూడా ముఖ్య అతిధి ప్రారంబించారు. అనంతరం ప్రముఖ కవి, చిత్రకారుడు, కళా విమర్శకుడు,రచయిత అయిన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా దామెర్ల రామారావు గారిజీవితంపై పై రచించిన “దామెర్ల కళా –వారసత్వం అనే “గ్రందాన్ని సభికుల మధ్య ఆవిష్కరించగా శ్రీ మద్దూరి శివానంద కుమార్ గారు స్వీకరించడం జరిగింది.
మరో ప్రముఖ చిత్రకారులు రచయితలు అయిన శ్రీ ఆత్మకూరు రామకృష్ణ మరియు శ్రీమతి లక్ష్మి(పద్మ) గార్లు గ్రంధ సమీక్ష చేయగా, దామెర్ల కళా – వారసత్వం గ్రంధరచయిత మాకినీడి గారిని సర్ ఆస్వాల్డ్ జెన్నింగ్స్ కూల్ద్రే అవార్డ్ తో సత్కరించారు. ఈ మొదటి రోజు కార్యక్రమంలో ప్రముఖ కళా రచయిత శ్రీ సుంకర చలపతి రావు గారు, తల్లవజ్జుల పతంజలిశాస్త్రి, చిత్రకారులు రాయన గిరిధర్ గౌడ్, పట్నాల శ్రీధర్ , కవి గూటం స్వామి , నడిపల్లి శ్రీధర్,తదితరులతో పాటు స్థానిక చిత్రకారులు డాక్టర్ యెన్ ఎస్ శర్మ, పి ఎస్ ఆచారి , యల్లా సుబ్బారావు, బాపి రాజు, నూకరాజు, తాడోజు హరికృష్ణ, కిరణ్, రాజు, రాధారాణి, పద్మజ, గువ్వల పద్మ మరియు వివిధ ప్రాంతాలనుండి వొచ్చిన చిత్రకారుల సమక్షాన మాదేటి రవి ప్రకాష్ గారి నిర్వాహణలో తొలి నాటి కార్యక్రమం ముగిసింది.
రెండవరోజు ఉదయం పది గంటలకు రాజమహేంద్రి లో వంకాయల వారి వీధి ఎదురుగా గల గోదారి గట్టున ప్రముఖ శిల్పి దివంగత శ్రీ పి. వి. రామారావు గారు రూపొందించిన నిలువెత్తు దామేర్ల రామారావు గారి విగ్రహాన్ని సంస్థ అధ్యక్షులు శ్రీ మద్దూరి శివానంద కుమార్ గారు ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిదిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ చిత్రకళాచార్యులు శ్రీ వి. రమేష్ గారు విశిష్ట అతిధులుగా, దామెర్ల ఆర్ట్ గాలరీ ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు, రిటైర్డ్ సి.టి.ఓ పతివాడ సూర్యనారాయణ, కోనసీమ చిత్రకళా పరిషత్ కార్యదర్సి శ్రీ కోరసాల సీతారామ స్వామి గార్లు ఆత్మీయ అతిదులుగా డాక్టర్ యెన్ ఎస్ శర్మ, పి ఎస్ ఆచారి , యల్లా సుబ్బారావు, కవి రచయిత పి ఎస్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ప్రఖ్యాత చిత్ర కారుడు శ్రీ రాయన గిరిధర్ గౌడ్ తన అద్భుతమైన చిత్రాల స్లయిడ్ షోతో సభలో పాలోన్న వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన చిత్రకారులు చిత్రకళాభిలాషులను అబ్బురమనిపించేలా చేసారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయ చిత్రకళాచార్యులు శ్రీ వి రమేష్ గారిని దామెర్ల రామారావు అవార్డు తోను, తన చిత్రాల స్లయిడ్ షో ద్వారా అందరిచే ఔరా అనిపించుకున్న రాయన గిరిధర్ గౌడ్ గారిని మాదేటి రాజాజీ అవార్డులతో ఘనంగా గజమాలతో సత్కరించడం జరిగింది. అనంతరం ఈ సభలో వక్తలు రాజమహేంద్రవరము నందలి నన్నయ విశ్వవిద్యాలయము నందు దామెర్ల రామారావు పేరుతో లలితకళల విభాగాన్ని ప్రారంబిచేందుకు తీర్మానం చేయగా అందుకు తన పూర్తి సహకారం అందిస్తానని ఆంధ్ర విశ్వవిద్యాలయ చిత్రకళాచార్యులు శ్రీ వి రమేష్ గారు పేర్కొనడం జరిగింది. ఆద్యంతం ఎంతో రసవంతంగా సాగిన ఈ సభలో గత తొమ్మిదేళ్ళుగా 64 కళలు. కం పత్రిక ద్వారా నిరంతరంగా చిత్రకారులపై వ్యాసాలను రాస్తున్న కళావిమర్సకుడు, రచయిత మరియు చిత్రకారుడు అయిన వెంటపల్లి సత్యనారాయణ, కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ కోరసాల సీతారామ స్వామి, వాష్ టెక్నిక్ లో అద్భుతాలు సృష్టిస్తున్న శ్రీ మంచెం సుబ్రమన్యేశ్వర రావు లతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి విచ్చేసి చిత్ర ప్రదర్శనలో పాల్గొన్న 65 మంది చిత్రకారులను మెమెంటో దుస్సాలువాలతో సన్మానించడం జరిగింది. చివరిగా ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రకళాపోటీలలో పాల్గొన్న బాల చిత్రకారులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ ఈయడంతో రాజమండ్రి చిత్రకళా నికేతన్ రజతోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిసాయి.
-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)
కళ కోసం కళను బ్రతికించడం కోసం 64 కళలు .కామ్ నిర్వాహాకులైన మీరు అహర్నిశలు చేస్తున్న కృషి అద్భుతం అమోఘం .ప్రభుత్వం ఇటువంటి కళ సంస్కృతీ లను ప్రచురించి ప్రోత్సహించే 64 కళలు .కామ్ కు తప్పని సరిగా అవార్డు ఏర్పాటు చెయ్యాలని కోరుకొంటూ ,ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలకు ప్రభుత్వ మ్ ప్రోత్సాహక నిధి లేదా రాయితీలను ఏర్పాటు చెయ్యాలని మనః స్ఫూర్తిగా కోరుకొంటూ ఈ కార్య క్రమ నిర్వాహుకులకు నా ప్రత్యేక కృతజ్నతలు తెలియజేసుకొంటున్నాను
Thanq Ramarao P.V. garu
నాటి కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు. మరోమారు గుర్తు తెచ్చుకునేలా చేసారు. మీకు ధన్యవాదములు
Thanq Ramakrishna garu
కళాసంస్థల కృషిని పదుగురికీ పరిచయం చేస్తూ .. కళాకారులను ఉత్సాహపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా మనతెలుగువారి గౌరవం ఇనుమడించేలా పత్రిక నడుపుతున్న శ్రీ కళాసాగర్ గారికి మా కళాలోకం కృతజ్ఞులై ఉంటుంది. వెంటపల్లి సత్యనారాయణ గారి కళాకారుల పరిచయ రచనలు వారికి చిత్రకళ పై గల ఆసక్తికి , అభిరుచికీ, సేవకు తార్కాణంగా నిలుస్తాయి. వీరిరువురికీ అభినందనలు.
శ్రీ పి.వి.రామారావు గారి అభిప్రాయం ఎంతో ఆచరణీయమైనది. ప్రభుత్వం ప్రోత్సాహం జాతి సంస్కృతిని మరింత ముందుకు నడిపిస్తుంది.
రాజమండ్రి చిత్రకళా నికేతన్ రజతోత్సవ వేడుకల సంబరాన్ని చక్కగా పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
Thanq Laxmi garu