“ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అలాగే ప్రతి సినిమా వెనకాల ఫస్ట్ ఇన్ స్పిరేషన్ ఇవ్వడానికి ఓ మనిషి ఎప్పుడైనా ఉంటాడు. అది స్టోరీ కాదు.. స్టోరీ ఐడియా కాదు.. స్క్రీన్ ప్లే కూడా కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనకాల నాకు ఆ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నా” అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. అగస్త్య మంజు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరా బాద్లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు.
రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ..
“లక్ష్మీస్ ఎన్టీఆర్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కథపై నాకు అంత అవగాహన లేదు. ‘వైశ్రాయ్ హోటల్’ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా, అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి హైదరాబాద్లో ఏం జరుగుతోంది అన్నది వాస్తవంగా నాకు తెలియదు. కానీ, బయోపిక్ లు స్టార్ట్ అయ్యాక నేను కొంతమందిని కలిశాను. వాస్తవాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి కాబట్టి వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు పరిశోధించా. బయోపిక్ తీయడానికి ముఖ్యంగా కావాల్సింది నీజాయతీ. ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక వారి బంధం నాలుగైదేళ్లు ఉంటే దాన్ని 2:30 గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడం సినిమాటిక్గా సాధ్యం కాదు. అందుకే ఆ సోల్ అనేది మిస్ అవకుండా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. అప్పటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించాం. అందుకే ఈ సినిమా నా కెరీర్లో చాలా చాలా ప్రత్యేకం” అన్నారు.
లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ..
“ఆర్జీవీగారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. 23 సంవత్సరాలుగా ఒక స్త్రీ నిరంతర వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకుని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ, కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో.. ఇక అలిసిపోయి ఇంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదు అనుకున్న సమయంలో.. ఆర్జీవీగారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైంది. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలీదు. ఇంతకుముందు ఆర్జీవీగారి ‘క్షణం క్షణం’ సినిమా చూశాను. ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. తమదైన మార్గంలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లే ఇలాంటివాళ్లు సమాజాన్నే శాసించగలరు అనిపిస్తుంది. ఈ రోజు ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా.. ఏ పాత్ర అయితే పనికిరాదు అని వాళ్లు అన్నారో.. ఏ పేజీలైతే చింపేయాలని కుటుంబం అంతా భావించిందో.. ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్ గారికి లేదు అని చెప్పి ఒక ముద్రవ చేయడానికి వాళ్ల మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో… ఆ పేజీలను తీసుకుని, ఆ చరిత్రను తీసుకుని నేను న్యాయం చేస్తానని ముందుకు వచ్చిన ఆర్జీవీగారికి థ్యాంక్స్. ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఫారిన్ నుంచి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఈ సమాజంలో ఏ ఒక్కరూ చేయలేని న్యాయం ఆయన చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు.. మహిళలందరికీ న్యాయం జరిగినట్లే అని వారు మాట్లాడుతుంటే .. గ్రేట్ ఆర్జీవీగారు. థ్యాంక్ఫుల్ టు యు” అన్నారు.
‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ మాట్లాడుతూ..
“లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూడగానే నేను మాట్లాడాను. అతను వైసీపీ మనిషి అందుకే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటు న్నారు. అలా మాట్లాడే వెధవలకు నేను ఒకటే చెబుతున్నాను. తప్పు జరిగింది కాబట్టే దర్శకుడు ఈ సినిమా తీశారు. దానికి వైఎస్సార్ సీపీ పార్టీకి సంబంధం ఏంటి? ఏదడిగినా ‘నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెల్లాను.. ఇక్కడికి వెళ్లాను’ అంటారు. 36 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్ ను ఓడించిన ఘనత ఎన్టీఆర్ గారిది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మడం తప్పని నైజం, సంస్కృతికి చిహ్నం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డిగారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..
“భారతదేశంలో సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, కమాండ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి రామ్గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని బయటికి రానివ్వరు, ఫలానా పార్టీవాళ్లు ఆపేస్తారు.. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని చాలామంది అంటున్నారు. ఇలాంటి వెధవ వేషాలు ఎందుకు. నువ్వు నిజాయతీగా ఉండొచ్చు కదా? నిజాయతీగా ఉండని, నీతిమంతమైన రాజకీయాలు చేయనివాడికి ఇలాంటి సమస్య లొస్తాయి. వాజ్ పాయి, అద్వానీ, పుచ్చలపల్లి సుందరయ్య… ఇలా చాలామంది నిజాయతీ పరులకు సమస్యలు రాలేదు కదా? బాధలు, కన్నీళ్లు అన్నవి అవినీతి పనులు చేసినవాడికి, వెధవ వేషాలు వేసినవాడికి, వెన్నుపోటు పొడిచినవాడికి వస్తాయి.. నవ్వు ఆ పనులు ఆ రోజు చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా? ఏ రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా? నవ్వు వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా తన పై తానే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేసినప్పుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలి పెడతాడు?
ఈ సినిమా జరిగిన కథ. సెన్సార్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా బయటికొస్తే ప్రజలు రియలైజ్ అవుతారు” అన్నారు. “లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతే విజయవంతం చేయాలి” అన్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. ఈ వేడుకలో “ఆర్టీవీ గన్షాట్ ఫిల్మ్’ లోగోని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు.
Very interesting movie