వికీపీడియా గురించి మీకు తెలుసా?

తెలుగు వికీపీడియాపై అందరికీ అవగాహన అవసరం: తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ.

తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలు దాటిన సందర్భంగా 2024, డిసెంబరు 26న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమంలో “వికీపీడియా గురించి మీకు తెలుసా?” అనే ఉచిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని, ఆవిష్కరించి వికీపీడియా సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా,

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఎన్ సైక్లోపీడియాకు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందేనని, ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా పుస్తకాల్లో ఉన్న విధంగా 2001లో ఆన్లైన్ లో ప్రారంభించబడిన ఈ వికీపీడియాకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. అలాగే తెలుగు వికీపీడియా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ లక్ష వ్యాసాలను దాటి, భారతీయ భాషల వికీపీడియాల్లో ఎక్కువ వ్యాసాలను కలిగివున్న జాబితాలోకి చేరడం గర్వించదగ్గ విషయం అన్నారు.

వికీపీడియన్ వి.జై. సుశీల ఈ కార్యక్రమం లక్ష్యం వివరించి వికీపీడియా, ఇతర ప్రాజెక్టులైన వికీసోర్స్, విక్షనరీ, వికీవ్యాఖ్య, వికీబుక్స్ గురించిన ముఖ్య విశేషాలు క్లుప్తంగా పరిచయం చేసారు. ఇంకొంత ఈ విశేషాలు విశదీకరించి అందరికి అవగాహన ప్రాధమిక సమాచారం అందించడం కోసం ఒక చిరుపుస్తకం రూపొందించాము అన్నారు. ఈ చిరుపుస్తకం కావలసిన వారు స్టాల్ కివచ్చి తీసుకోవచ్చునని సూచించారు. వీలైనవారు నమోదు చేసికొని వివిధ రూపాలుగా పురోగతి సాధిస్తున్న ఈ విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు.

వికీపీడియన్ కశ్యప్ వికీపీడియా లక్ష వ్యాసాల గురించి మాట్లాడారు. తెలుగు వికీపీడియా ను వెన్న నాగార్జున డిసెంబర్ 2003 లో ప్రారంభించారు. 6నెలలు తరువాత మొదటి వ్యాసం – గుంటూరు గురించి ఆగస్టు 2004 లో నమోదయింది. 21 సంవత్సరాల తరువాత 26 సెప్టెంబర్ 26 న లక్ష వ్యాసం నమోదయింది. ఈ రెండు దశాబ్దాలలో వ్యాసాల సంఖ్యని పెంచడమే కాకుండా నాణ్యత గురించి కూడా పాటుపడిన సుమారు 4500 వికీమీడియన్లు స్వచ్ఛంద అక్షర సేవని కొనియాడారు.

అనంతరం బుక్ ఫెయిర్ లోని తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహణలో పాల్గొన్న వికీమీడియన్లను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు కవి యాకూబ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు, వికీమీడియన్లు కృపాల్ కశ్యప్, వి.జె. సుశీల, గుంటుపల్లి రామేశం, ప్రణయ్ రాజ్ వంగరి, మీనా గాయత్రి, నాగరాణి బేతి, భవ్య, ఎడ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap