మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విజయనగరంలో ప్రసిద్ధి చెందిన సంగీత మరియు నృత్య కళాశాల. 1944 లో రజతోత్సవం, 1969లో స్వర్ణోత్సవం, 1994లో ప్లాటినం జూబ్లీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ కళాశాల ప్రస్తుతం 2019, ఫిబ్రవరి 3,4,5 తేదీలలో శతవంసంత వేడుకలకు సిద్ధమౌతోంది. ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు కుమారుడు గంగ బాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919 ఫిబ్రవరి 5న విజయరామ గజపతిరాజు విజయరామ గాన పాఠశాల ను ఏర్పాటు చేశారు. ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరంలో శిక్షణ పొంది దేశదేశాల్లో తమ కీర్తిని, విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పుకున్నారు. ఒకనాడు మహా రాజులు తమ ఆస్థానంలో సంగీత కళాకారులను పోషించారు. ఆ మహారాజులే గానకళపట్ల అభిమానంతో ఒక కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను టౌన్ హాలు అని పిలిచేవారని అంటారు కొందరు. దక్షిణాదిన కర్ణాటక శాస్ర్తీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ పాఠశాలలో వీణ,గాత్రం, వయోలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు.
1953లో ఈ గాన పాఠశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇది ప్రస్తుతం ఎ.పి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలతో విస్తరిస్తోంది. నేడు ఇక్కడ భరతనాట్యంలో కూడా అనేక మంది శిక్షణ పొందుతున్నారు.
గొప్ప కళా వైభవం
సాలూరు వారి సంగీత సంప్రదాయం… ద్వారం వారి వయోలిన్ వైభవం… ఘంటసాల వారి గానామృతం… ఈ కళాశాల కీర్తిప్రతిష్టలకు అసమాన ప్రతిభా పతాకాలు. శాస్త్రీయ సంగీతంలో సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారం మంగతాయారు, వయోలిన్ విద్వాంసులు కెవి రెడ్డి, ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, సినీరంగంలో అగ్రశ్రేణి గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, గానకోకిల పి.సుశీల, సంగీతం సత్యం, ఒడిశాకు చెందిన సంగీత దర్శకులు డాక్టర్ అశ్వద్ధామ మొదలుకుని నేటితరం బిఎ నారాయణ, బి.పవన్, బి.సంతోష్, ద్వారం సత్యనారాయణ వంటివారెందరో ఇక్కడే సరిగమలు నేర్చుకున్నారు. వీరంతా చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీతోపాటు దేశవిదేశాల్లో సంగీత ప్రపంచంలో స్థిరపడ్డారు. కళాశాల ప్రారంభం నుంచి వయోలిన్ విభాగం అధ్యాపకులుగా ద్వారం వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితం అప్పలరాజు, ఆంధ్రజాలరి డివై సంపత్‌కుమార్, వసుంధర థామస్, వైజయంతితోపాటు నేటితరం మయూరి నృత్యాలయ, నర్తనశాల, అభినయప్రియ నర్తనశాల నిర్వాహకులు శ్రీదేవికృష్ణ, రాధికారాణి, సాయి ప్రియ తదితర నర్తకీ నర్తకులు కూడా ఇక్కడ విద్యనభ్యసించినవారే!
ప్రతీ అంశానికి ఒక్కొక్క తరగతి గది ఉంది. తరగతి గదుల్లోనేగాక బయట ప్రాంగణంలో విశాలమైన వృక్షాల నీడన విద్యార్థులు చేసే సాధన వినటానికి ఎందరో ఆసక్తి చూపుతారు. ఈ కళాశాలలో చేరాలనే ఆసక్తి చూపే వారిసంఖ్య ఎక్కువుగా వుంటోంది. వారికి వీలైన సమయంలో ఉదయం గాని, సాయంత్రం గాని నేర్చుకునే అవకాశం కల్పించారు.
ఇక్కడి సంగీత, నృత్య విద్యార్థులకు ఎన్నో ఏళ్ళుగా సింహాచలం శ్రీవరాహ నృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్రంలో ఉచిత భోజన సౌకర్యం నేటికీ కొనసాగుతోంది. దూర ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ ప్రతీ ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి.
సుమారు మూడు వేల మంది అతిథులు, పూర్వ విద్యార్థులు, కళాభిమానులు, అతిథులకు ఆహ్వానాలు అందాయి. ఉత్సవాల్లో మేండలిన్, గాత్ర కచేరి, భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవను న్నాయి. మూడు రోజులపాటు కళాశాల పూర్వ విద్యార్థులతో కీర్తనలు, వయోలిన్, గాత్ర కచేరీలు, సంగీత సమ్మేళనాలతో కళాశాల ప్రాంగణం వీణుల విందు కానుంది. ప్రముఖులకు సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలతో కళకళ లాడనుంది.
ఉత్సవాల్లో భాగంగా 3వ తేదీన ప్రముఖ మేండలిన్ విద్వాంసులు యుపి రాజు బృందం, 4న ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు గాత్ర కచేరి, 5న సినీ డ్యాన్సర్ మంజుభార్గవి బృందం భరత నాట్యంతో అలరించనున్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పూర్వ విద్యార్థులు, ఈ కళాశాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్నవారు ఇప్పటికే కళాశాలకు చేరుకున్నారు. కచేరీలు, సాంస్కృతిక ప్రదర్శనలకు అనుగుణంగా వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వచ్చిపోయే విద్యార్థులు, ఏర్పాట్లలో తలమునకలైన అధికార యంత్రాంగం, పూర్వ విద్యార్థుల రాకతో కళాశాల ప్రాంగణం కళకళ లాడుతోంది. రకరకాల పూల మొక్కలతో పచ్చదనం తొణికిశ లాడుతోంది. కళాశాల ద్వారాలను చెన్నై నుంచి తెచ్చిన ప్రత్యేక పూలతో అలంకరించారు. కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సంగీత విద్వాంసులు, ప్రముఖ నర్తకీ, నర్తకుల చిత్రాలతో ముఖద్వారాన్ని, కళాశాల ప్రహరీలను తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ ఫెక్లీలు, హోర్డింగ్‌లతో ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యంగా పట్టణానికి నలుదిక్కులా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2కోట్లు మంజూరు చేసింది. రూ.1.38 కోట్లతో కళాశాల భవనాన్ని ఆధునీకరించారు. రూ.50 లక్షలతో ఇటీవల చేపట్టిన ఓపెన్ ఆడిటోరియం సంగీత, సాహిత్య ప్రియులను రా..! రమ్మంటున్నట్టు ముస్తాబైంది. కళాశాల తరగతి గదులకు రంగులు అద్దారు. మరోవైపు విద్యుత్ అలంకరణతో దగదగలాడుతోంది. ప్రహరి చుట్టూ ప్రముఖ కళాకారుల చిత్రాలను గీశారు. ప్రాంగణంలోవున్న కళాశాల తొలి అధ్యాపకులు హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, సరస్వతీదేవి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాల నేపథ్యంలో కళాశాల వ్యవస్థాపకులు నాల్గవ విజయరామగజపతి, ఇదే కళాశాలకు మలి అధ్యాపకులుగా పని చేసిన వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి, సినీరంగంలో అగ్రశేణి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుల విగ్రహాలను నూతనంగా ప్రతిష్టించారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులు ద్వారం మంగతాయారు, ఘంటసాల సావిత్రమ్మ, గాన కోకిల పి.సుశీల తదితరులను ఆహ్వానించారు. కళాశాల పూర్వవిద్యార్థులు, దేశవిదేశాల్లో స్థిరపడిన సంగీత విద్వాంసులు తదితర కళా పండితులకు కూడా ఆహ్వానాలు అందాయి.
కలెక్టర్ చొరవతో ఘనంగా ఏర్పాట్లు
కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ చొరవతో మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల శతాబ్ధి ఉత్సవ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కొద్ది రోజులుగా కళాశాలకు అధికారుల తాకిడి పెరిగింది. సిపిఒ కె.విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సునీల్‌రాజ్‌కుమార్ ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన ఓపెన్ ఆడిటోరియం, సభికుల గ్యాలరీ కళా ప్రదర్శనలకు సిద్ధమైంది. డిఆర్‌డిఎ పీడీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 20 శాఖల అధికారులను, కళాశాల పూర్వ విద్యార్థులను, కళాశాల నిర్వాహకులు, పలువురు ప్రముఖలను ఉత్సవాల ఏర్పాట్లలో కలెక్టర్ భాగస్వామ్యం చేశారు.
గౌరవ అతిథిగా మండలి బుద్ధ ప్రసాద్
సంగీత, నృత్య శతాబ్ధి ఉత్సవాలకు గౌరవ అతిథిగా శాసనమండలి సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ హాజరు కానున్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి సుజరుకృష్ణ రంగారావు హాజరవుతారు. తొలిరోజు కళాశాల ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత అధ్యక్షతన జరగనున్న ప్రారంభ సభలో వీరితోపాటు కలెక్టర్ జిల్లాలోని ఎంపీ పి.అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు జిల్లా కలెక్టర్, భాషా సాంస్కృతి సమితి సిఇఒ తదితరులు ప్రసంగించనున్నారు.