విజయవాడలో “జాతీయ బహుభాషా నాటకోత్సవాలు”

(జూలై 4 నుంచి 7 వరకు విజయవాడ సిద్ధార్హ కళాపీటం లో జరిగిన జాతీయ బహుభాషా నాటకోత్సవాల సమీక్ష)

తెలుగు నాటకానికి జీవనాడి ఆంధ్ర నాటక కళాపరిషత్తు. మన రాష్ట్రంలో జరిగే అనేక నాటక పరిషత్తులకి మార్గదర్శి. 1929లో తెనాలిలో ప్రారంభింబడిన ఈ పరిషత్తు, 1944లో నాటక పోటీలను ప్రారంభించి ఎనలేని కీర్తిని గడించింది. తరువాత ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో నాటక పోటీలను నిర్వహించి కాలక్రమేణా కనుమరుగై, తిరిగి ఇటీవలి కాలంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శ్రీ అన్నమనేని ప్రసాదరావు నిస్వార్థ కృషి వల్ల మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఈ నూతన ఉత్తేజంతో ఆంధ్రనాటక కళాపరిషత్ నిర్వహణలో రాష్ట్రంలోని ముఖ్యకేంద్రాలలో ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు.

అటువంటిదే విజయవాడలో జూలై మొదటి వారంలో నాలుగురోజులు ఆంధ్రనాటక కళాపరిషత్తు 90 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో “జాతీయ బహుభాషా నాటకోత్సవాలు” నిర్వహించారు. నాటకం ఏ భాషలోనైనా , సమాజంలోని అనేక రుగ్మతలను పరిష్కారం చూపే సాధనం. అలాగే కళలకు ఎల్లలు లేవు. ఒక్కొక్క భాషలో నాటక ప్రదర్శన ఒక్కో రకంగా వుంటుంది. రచయిత, దర్శకుడు, నటుడు, ప్రేక్షకుడు నాటకానికి నాలుగు స్థంభాలు. సజీవంగా ప్రేక్షకుల సమక్షంలో ఆవిష్కరించే ప్రక్రియ నాటకం. ఏ భాషలో నాటకం వేసినా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఇక ఈ నాటకోత్సవాలలో తెలుగు, హిందీ, మరాఠి, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో నాటకాలను ప్రదర్శించారు. అన్ని నాటకాలలోను యువతీ, యువకులు పాలు పంచుకోవడం విశేషం. మొదటిగా సమాహార గ్రూప్, హైదారాబాద్ వారు “కోర్ట్ మార్షల్” అనే హిందీ నాటికను ప్రదర్శించారు. దీన్ని స్వదేశ్ దీపక్ రచించగా, రత్న శేఖర్ దర్శకత్వం చేసారు. దీనిలోని కథా సారాంశం ఏమిటంటే

“రామచందర్ అనే సైనికుడు తన పైఅధికారులలో ఒకరిని హత్యచేసి, మరొకరిని గాయ పరిచినట్లు నేరారోపణ చేయబడ్తుంది. అతని నేరాలను సైనిక కోర్టు విచారిస్తుంది. ఆ కోర్టు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సమాజంలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అవమానాల పై సైనిక వ్యవస్థను సైతం వదలలేదని అర్ధమవుతుంది. ఈ అవమానాలు, అవహేళనలూ నిబద్ధత కలిగిన రాంచందర్ లాంటి సైనికుడ్ని సైతం నేరస్థుడిగా మార్చిన వైనం మనకు కనిపిస్తుంది”.

జూలై 5వ తారీఖున స్థానిక సిద్దార్ధ మహిళా కళాశాల విద్యార్థినులు “ఊరు భంగం” నాటికను ప్రదర్శించారు. భాష మహాకవి సంస్కృతంలో వ్రాసిన ఈ నాటకాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెనుగీకరించారు. నాటికలో పాల్గొన్న విద్యార్థినులు తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు. పాండవులకు, కౌరవులకు జరిగిన యుద్ధంలో భీముడు తన బద్ద విరోధి అయిన దుర్యోధనుడి తొడలు విరగొడ్డాడు. శ్రీ కృష్ణుడు సంతోషించి పాండవులను ఆశీర్వదిస్తాడు, యువదర్శకుడు ఆర్. దాసు ఈ నాటకాని చక్కగా తీర్చిదిద్దాడు.

ది. 6-7-2019న ఆకాష్ మహేత్రి రాసిన “అలెక్సా”మరాఠి నాటికని రంగధార ది ధియేటర్ స్టీమ్ వారు ప్రదర్శించారు. వామన్ ఖోడేకర్ అనే వృద్ద పారిశ్రామిక వేత్త కోడలు, బాధ్యత మరిచి కిట్టి పార్టీలతో కాలక్షేపం చేస్తూ వుంటుంది. కాని పనిమనిషి కుటుంబ బాధ్యతలను చేపడ్తుంది. అందరూ ఇంటిపనులు స్వయంగా చేసుకోలేక “అలెక్సా” అనే యంత్రం సాయంతో పనులు చేసుకుంటూ వుంటారు. తమ స్వయం శక్తితో కాకుండా యంత్రం మీద ఆధారపడ్డారు. ఇల్లంతా అస్తవ్యస్తంగా మారుతుంది. అప్పుడు ఆ ఇంటి పెద్ద అలెక్సా’ని మాయంచేసి అందరికి బుద్ది చెప్తాడు. ఈ నాటిక సరదాగా వుండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఆ తరువాత “బిర్జిస్ఖాదర్ కాకుంబా” అనే ఉర్దూ నాటక ప్రదర్శన జరిగింది. ఈ నాటిక రచన, దర్శకత్వం నసీన్ ఇషాక్యు. “బిర్జీస్ఖాదర్ తన భర్త అంత్యక్రియలు ముగియగానే పెండ్లికాని తన ఐదుగురు కుమార్తెలపై పూర్తి ఆధిపత్యం తీసుకొని వారి ఆశలను, కోరికలను కట్టుబాటు చేస్తుంది. పెద్ద కూతురు ఫహిమిదా పెండ్లి అక్తర్ యూసఫ్ అనే అతనితో జరపడానికి నిర్ణయిస్తుంది. అయితే అనూహ్యంగా మిగతా కుమార్తెలు కూడా అతనిపై మనసు పడతారు. ఆదిలా అక్తర్ మీద ఉన్న తన ప్రేమను బయట పెడుతుంది. అక్తర్ విషయంలో సోదరీమణులు ఘర్షణ పడతారు. ఆదిలా అక్తర్ వల్ల గర్భవతి అవుతుంది. అ విషయం తెలుసుకున్న బిర్జీస్ అక్తర్ను చంపడానికి తుపాకితో బయలుదేరుతుంది. మరో పరువు హత్యజరుతుంది. ఈ నాటకోత్సవాలలో ఆఖరి నాటక ” ది లాస్ట్ హ్యూమన్” అనే ఇంగ్లీష్ నాటిక. నిషింబిత, హైదరాబాద్ వారు ప్రదర్శించిన ఈ నాటిక రచన, దర్శకత్వం హెచ్. రామమోహన్, పర్యావరణ పరిరక్షణ, రాజకీయ నాయకుల ఆధిపత్యం, అట్టడుగు వర్గాలని అణిచివేయడం మొదలయిన అంశాలతో కూడిన ఈ ప్రయోగాత్మక నాటికకు ప్రేరణ ధర్మవీర్ భారతి రాసిన హిందీ నాటిక.

ఈ నాలుగు రోజులు జరిగిన బహుభాషా నాటకోత్సవాలు సాంకేతికంగా అధునాతన పద్దతులలో ప్రదర్శింపబడి నాటక ప్రియులకు కనువిందు కలిగించాయి. ఈ నాటకోత్సవాల వల్ల తెలుగు నాటకానికి కొత్త ఊపు, కొత్త వెలుగునిచ్చాయి. ఇటువంటి ఉత్సవాలు వల్ల నాటక కళాకారులకు కొత్త ఉత్సాహం కల్గుతుంది అనడంలోను, ప్రేక్షకులకు నాటకాల పట్ల ఆశక్తి పెరుగుతుందనడంలోనూ సందేహం లేదు. అందుకే ఆంధ్ర నాటక కళాపరిషత్ వర్ధిల్లాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap