కస్తూరి రంగన్ నివేదిక
కస్తూరీరంగన్ కమిటీ నివేదిక విద్యావ్యాపారాన్ని తీవ్ర స్వరంతో నిరసించినా విద్యావ్యాపార నిషేధానికిగాని, కనీసం నియంత్రణకు గాని సరియైన ప్రాతిపదికలను ప్రతిపాదించలేక పోయింది. అయితే విద్యావ్యాపారం కొత్తదేమీ కాదు. ఈ నివేదికలో సరిక్రొత్త దాడి విద్యారంగంలో అధికార కేంద్రీకరణ. అధికార కేంద్రీకరణ కొరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది కాని, విద్యారంగ ఉద్యమాల ఒత్తిడి వలన కొంత, కాంగ్రెస్లో ఉన్న స్వంత మార్కు ప్రజాస్వామ్యం వలన కొంత ఆ ప్రయత్నం వీగిపోయింది. ప్రస్తుతం ఎన్.డి.ఎ పేరుతో నడుస్తున్న బి.జె.పి ప్రభుత్వం ఈ నివేదిక ద్వారా ప్రయత్నిస్తున్న అధికార కేంద్రీకరణ సాదాసీదా కేంద్రీకరణ కాదు. అధికార కేంద్రీకరణకు కారణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ది వ్యాపారపరమైన అవసరం. కాగా, బి.జె.పిది రాజకీయ, సాంస్కృతికపరమైన అవసరం కూడా. ఈ నివేదిక మరొక ప్రధాన లక్షణం సాంస్కృతిక ఆధిపత్యవాదం. ఇది ఫాసిజానికి అవసరమైన ఒక ప్రధానమైన షరతు అని వేరుగా చెప్పనవసరం లేదు.
విద్యా లక్ష్యాన్ని నిర్వచించేటప్పుడు ఈ నివేదిక ‘విద్యార్ధిలో భారత రాజ్యాంగ విలువులను ప్రోది చేయడం’ ఒక ప్రధాన లక్ష్యంగా చెప్తుంది. అయితే నివేదికలో ఎక్కడా లౌకికవాదం అనిగాని, సోషలిజం అనిగాని పదాలు కనిపించవు. అధికార పార్టీ బి.జె.పి ఈ పదాలను రాజ్యాంగం నుండి తొలగించాలని ప్రచారం చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. అలాగే, సుమారు వంద సంవత్సరాలు సాగిన భారత సంస్కరణోద్యమం మరియు స్వాతంత్ర్యోద్యమం, ఆ కాలంలో విద్యారంగంలో ముందుకొచ్చిన ఆకాంక్షలు ఈ నివేదికలో ఎక్కడా కనిపించవు. సంఘపరివార్ శక్తులు స్వాతంత్ర్యోద్యమాన్ని వ్యతిరేకించిన విషయం, సంఘపరివార్ సంఘ సంస్కరణకు కూడా వ్యతరేకం అన్న విషయం తెలిసినవే. వారు మనువాద రక్షకులు. సంస్కరణోద్యమం ప్రధానంగా మనువాదానికి వ్యతిరేకంగానే జరిగింది. ఈ నివేదిక విద్యారంగంలో వెనుకబడిన ప్రతి సామాజిక వర్గానికి, పేరు పేరునా విద్య అందాలని వ్రాసింది. కాని ‘సామాజిక న్యాయం’ అన్న మాటకు ఈ నివేదికలో ఎక్కడా స్థలం దొరకలేదు. అంటే ఈ నివేదిక యస్.సి; యస్.టి; బి.సి; మైనారిటీలు మొదలగువారికి విద్యను ఒక హక్కుగా గుర్తిస్తుందా లేక మంచి పాలకులు దయార్ద హృదయంతో చేయవలసిన ఒక సత్కర్మగా భావిస్తుందా అన్నది ప్రధానమైన విషయం. అదే విధంగా ఈ నివేదిక అన్ని మతాల ప్రజలు కలసి ఐక్యంగా, సంతోషంగా జీవించాలని కాంక్షిస్తున్నది. బాగానే ఉంది. కాని ఈ దేశంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజలు ఐక్యంగా నిలబడడానికి, అందుకవసరమైన అవగాహనను ఇచ్చినది ‘వైవిధ్యంలో ఏకత’ అన్న భావనయే. వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారానే ఐక్యత సాధ్యమని ఈ దేశ ప్రజలు నమ్మి ఆచరిస్తున్నారు. కాని భారత దేశ సంస్కృతి గురించిన ఇంత ప్రధానమైన భాష్యానికి నివేదికలో చోటు దొరకలేదు. ‘వైవిధ్యంలో ఏకత’ అన్న భావాన్ని సంఘ్ పరివార్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సంఘ్ పరివార్ వ్యతిరేకించిన అనేక భావాలు ఈ నివేదికలో చోటు చేసుకోలేక పోయాయి.
ఫాసిస్టు శక్తులు భారత దేశంలో ఇంత వడిగా ఎలా పెరుగుతున్నాయంటే భారత దేశంలో ప్రతి గ్రామంలో రాముడి గుడి ఉండడం కారణం కాకపోవచ్చు. ప్రతి మనిషిలో, ప్రతి ఇంటిలో ఆధిపత్యవాదం ఉండడమే ప్రధాన కారణం అనిపిస్తుంది. ఫాసిస్టులు చేయవలసింది అంతా మనలో ఉన్న అధిపత్యవాదాలను వెలికితీయడం సంఘటిత పరచుకోవడం మాత్రమే. విద్యారంగం అందుకు బలమైన పునాదిని వేయగలుగుతుందని వారు సరిగానే అంచనా వేశుకున్నారు, ఈ నివేదికలో అందుకు ప్రాతిపదికలు రూపొందించుకున్నారు. చాలా చోట్ల ఈ నివేదిక భారత దేశంలో ఉన్న భాష మరియు సాంస్కృతిక వైవిధ్యం గురించి పేర్కొంది. వాటిని ప్రోదిచేయవలసిన ఆవశ్యకత గురించి కూడా మాట్లాడింది. కాని అందుకు భిన్నంగా, నివేదిక భారతీయ సంస్కృతి’ అని ప్రస్తావించిన ప్రతిసారీ అది ఏకరూప సంస్కృతి గురించి మాట్లాడుతుందన్న విషయం తెలుస్తుంది. నివేదికలో ఆయా సందర్భంలో బహుళ సంస్కృతుల భావన ఎంత వెదకినా కనిపించదు. ఇక భారత వాస్తవ పరిస్థితులను మనం పరిశీలిస్తే, భారత దేశం చాలా విశాలమైంది. వందలాది భాషలు మరియు వందలాది సంస్కృతులు గల దేశం. ఇంత భాషా సాంస్కృతిక వైవిధ్యం మరొక దేశంలో ఉందో లేదో కూడా చెప్పలేం. అయితే విషయం ఇంత మాత్రమే కాదు. గడిచిన నాలుగైదు వేల సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్న వివిధ సంస్కృతులు ఎంతో మార్పుచెందాయి. భారత దేశంలో అనేక సంస్కృతులు ఉండడం మాత్రమే కాదు, ప్రతి సంస్కృతి వందల వేల సంవత్సరాల క్రమంలో ఎంతగానో మారింది. అంతేకాదు, ప్రతి ప్రాంతంలో మరియు ప్రతి కాలంలో పాలకుల సంస్కృతి వేరు, ప్రజల సంస్కృతి వేరు. గణ లేదా తెగల సమాజం విచ్చిన్నమైన తరువాత పాలకుల మరియు ప్రజల సంస్కృతులు ఎప్పుడూ ఒక్కటిగా లేవు. దీర్ఘకాలంగా పాలకుల మరియు ప్రజల సంస్కృతుల మధ్య వైవిధ్యమే కాదు వైరుధ్యం కూడా ఉంది.
నివేదిక, మర్యాద కొరకు కావచ్చు పాలీ, అరబీ వంటి భాషలను ప్రస్తావించినా సంస్కృత భాషను ప్రత్యేకంగా ఆకాశానికి ఎత్తింది. అంతేకాదు, సంస్కృత సాహిత్యంలో ఎంతో జ్ఞానం దాగి ఉందని చెప్పుకొచ్చింది. సంస్కృతం ఇతర భారతీయ భాషల అభివృద్ధికి ఎంతో సహకరించిందని, ఇప్పటికీ ఇతర భాషల అభివృద్దికి అది ఎంతగానో సహకరించగలదని నివేదిక పేర్కొంది. వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. తులసీ దాసు రామాయణాన్ని సాధారణ హిందీలో వ్రాసినందుకు పండిత సమాజం తులసీ దాసును వెలివేసింది. అరబిక్ నుంచి ఖురాన్ ను ఉర్దూలోనికి అనువదించిన రచయితకు అదే గతి పట్టింది. చివరికి నన్నయ కూడా భారతాన్ని రచించినప్పుడు పూర్తిగా తెలుగును ఉపయోగించడానికి భయపడిన విషయం తెలిసిందే. సంస్కృతాన్ని ఆకాశానికి ఎత్తి తరువాత బాలలకు సెకండరీ విద్యలో సంస్కృతాన్ని ఒక ఎంపిక అధ్యయన విషయంగా (ఎలక్టివ్ సబ్జెక్టు ఆఫ్ స్టడీగా) పెట్టాలని నివేదిక సిఫారసు చేసింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీ ప్రాంతం వారు హిందీయేతర భారతీయ ఆధునిక భాష ఒకటి నేర్చుకోవాలని ఒక దగ్గర చెప్పి మరొక దగ్గర హిందీ ప్రాంతం వారు హిందీ మరియు ఆంగ్లంతో పాటు మూడవ భాషగా సంస్కృతం నేర్చుకోవచ్చని శలవిచ్చింది. ప్రతిపాదిత త్రిభాషా విధానమే ఒక అశాస్త్రీయమైన విధానం. అదలా ఉండగా, త్రిభాషా విధానం వలన వివిధ భాషలు మాట్లాడే భారత ప్రజల మధ్య ఒక సద్భావం ఏర్పడుతుందన్న వాదన అంగీకరించినా, హిందీ వారు తెలుగు, తమిళం లేదా ఒరియా వంటి ప్రజలు మాట్లాడే భాషలు నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది గాని సంస్కృతం నేర్చుకోవడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది. ఏదో ఒక పేరున సంస్కృతాన్ని రుద్దడం ఈ నివేదిక లక్ష్యంగా కనిపిస్తుంది. అక్కడితో అయిపోలేదు, సంస్కృతంలో ఉన్న రచనలను గణితం, సామాజిక మరియ ప్రకృతి శాస్త్రాలద్వారా పాఠశాల విద్యలో వివిధ రూపాలలో బాలలకు అందించాలని నివేదిక పేర్కొంది. సంస్కృతాన్ని, అలాగే సంస్కృతం ద్వారా కుల, వర్ణ మరియు పితృస్వామిక సంస్కృతిని విమర్శచేయలేని బాలల మేధస్సులలోకి ఎక్కించడమే నివేదిక లక్ష్యంగా కనిపిస్తుంది. ఉత్పత్తి కృషిలో నిమగ్నమై ఉండిన, అనేక లౌకిక కళలను సృష్టించి పోషించిన శూద్రులను, మొత్తం స్త్రీలను విద్యకు దూరం చేయడం ద్వారా, అలాగే అగ్రకుల పురుషులు కూడా ఈ కుల మరియు పితృస్వామిక వ్యవస్థకు ఫక్తు కాపాలాదారులగా దిగజారిపోవడం వలన భారత దేశంలో శాస్త్ర జ్ఞాన అభివృద్ధి ఒక దశలో ఆగిపోయింది. సంస్కృతం, పాళీ అలాగే ఇతర పురాతన భాషలలో వివిధ రంగాలలో ఉన్న జ్ఞాన సంపదను, అది స్థాయిలో ఉన్నా, పరిశోధించడం చాలా అవసరం. అటువంటి పరిశోధనల ద్వారా భారత సమాజ నాగరికత అభివృద్ధి క్రమాన్ని అది ఎదుర్కొన్న ఆటు పోటులను మనం గ్రహించవచ్చు. చరిత్రను పునర్నిర్మించుకోవచ్చు. కుల తత్వాన్ని మరియు పితృ స్వామ్య కుసంస్కృతిని వదలి పెట్టకుండా ఈ దేశం ఎంతమాత్రం ముందుకు వెళ్ళజాలదు. కులంపై ఆధారపడి ఒక నీతిని గాని ఒక జాతినిగాని నిర్మించలేమని బాబా సాహెబ్ అంబేడ్కర్ హెచ్చరించి ఉన్నాడు. అయితే నివేదిక ఈ జాఢ్యాలనుండి బయట పడవలసిన అవసరం గురించి ఎంత మాత్రమూ వ్రాయకపోవడం అశ్చర్యకరం. ఇక్కడే మరొక్క విషయాన్ని ప్రస్తావించాలి. ఈ నివేదికలో భారత దేశ గురుకుల వ్యవస్థ గురించి చాలా గొప్పగా వ్రాసారు. గురుకులాలు విద్యావ్యాపారం చేయని మాట వాస్తవమే. కాని నాటి జనాభాలో 90 శాతంగా ఉన్న శూద్రులకు, అతి శూద్రులకు మరియు మొత్తం స్త్రీలకు ఆ గురుకులాలలో ప్రవేశం లేదన్న విషయం ఈ నివేదిక నమోదు చేయలేదు. గురుకులాలపై విమర్శకు తావులేని ప్రసంశ చాలా ప్రమాదకరమైనది. మరొక విషయం, 2016లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దస్తావేజు వలే ఈ నివేదిక పొడువునా పురాతన సంస్కృతి గురించి ప్రశంస ఉంటుంది. కాని మధ్యయుగాలలో నాగరికత సాధించిన విజయాలు గురించి ప్రధానంగా ఏమీ కనిపించదు.
జాతీయ విద్య, శిక్షణ మరియు పరిశోధనా సంస్థ (NCERT) ఒక జాతీయ పాఠ్య ప్రణాళికను (NCF) తయారు చేయడం, దానిని ఒక నమూనాగా తీసుకుని (ఒక ఆదేశంగా కాదు) ఆయా రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర విద్య, శిక్షణ మరియు పరిశోధనా సంస్థలు (SCERT) ఆయా రాష్ట్రాల కొరకు పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం ఇంతవరకు జరుగుతున్న విషయం. అలాగే కేంద్రీయ పాఠశాలలు NCERT తయారు చేసిన పాఠ్య పుస్తకాలను ఉపయోగించేవి. మరియు రాష్ట్రాలలో ఆయా SCERT లు తయారు చేసిన పాఠ్య పుస్తకాలు ఉపయోగించేవారు. రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు NCERT పాఠ్య పుస్తకాలు ఉ పయోగించేవి. ఇంకా ICSE పాఠ్య పుస్తకాలు వేరుగా ఉండేవి. కస్తూరి రంగన్ నివేదిక పాఠ్యప్రణాళికలో మరియు పాఠ్య పుస్తకాల రచనలో తీవ్రమైన కేంద్రీకరణ ప్రతిపాదించింది. దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు యన్.సి.ఇ.ఆర్.టి పాఠ్యపుస్తకాలను తయారు చేయాలని, వాటికి ఆయా రాష్ట్రాలలో స్థానికంగా కొంత భాగాన్ని చేర్చవచ్చని నివేదిక సిఫారసు చేసింది. ఈ సిఫారసులు ఎంత కఠినంగా తయారుచేసారంటే పాఠ్య పుస్తకాలలో వస్తువే కాదు, ఉదాహరణలు కూడా మార్చడానికి లేదని చెప్పారు. ఆపైన, అన్ని దశలలలో సాంప్రదాయ భావాలకు అధిక స్థానం కల్పించాలని నివేదిక పేర్కొంది. సంప్రదాయాలలో అత్యధికమైనవి అభివృద్ధినిరోధకమైన సాంప్రదాయాలే. వాటికి అధిక ప్రాధాన్యత కల్పించడం అంటే ఏమిటి? దేశ వ్యాప్తంగా బాలల మేధస్సులు ఒకే కేంద్రం నుంచి నియంత్రించడమే ఇది. ఇది ఆలోచనలను ఒకానొక నిర్దేశిత మార్గాన్ని పట్టించడం, రెజిమెంటేషన్ ఆఫ్ థాట్. ఈ సిఫారసులు అమలు చేస్తే భాషా సాంస్కృతిక వైవిధ్యాలకు తావు ఎక్కడ ఉంటుంది? అంతేకాదు, రాష్ట్రాల ఫెడరల్ హక్కులు కూడా పూర్తిగా అణచివేయబడతాయి. మరొక విషయం, ఈ నివేదిక ప్రకారం ఉపాధ్యాయుల నియామకాలలో వ్రాత పరీక్షలతో పాటు తరగతి గది డెమాన్(స్టేషన్ కి కూడా మార్కులివ్వాలని, ఉపాధ్యాయుల పదోన్నతులలో సీనియారిటీకి ప్రాధాన్యతలేకుండా పనితీరును బట్టి పదోన్నతులు ఉండాలని ప్రతిపాదించింది. అధికారంలో బి.జె.పి ఉంటే సంఘ్ పరివార్ అభిమానుల డెమోలే బాగుంటాయి, అలాగే వారి పనితీరే బాగుంటుందని వేరుగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వస్తుగతమైనది మాత్రమే. కాగా, బి.జె.పి పాలనలో అవినీతి భావజాలపరమైనది కూడా. అంటే మత వాదాన్ని, మనువాదాన్ని నమ్మినవారే నియామకాలు పొందడం పదోన్నతులు పొందడం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నివేదిక చాలా ఆశ్చర్యకరంగా విద్యావకాశాల విస్తరణకు కృషిచేయాలని స్వచ్చంద సంస్థలకు మరియు మత సంస్థలకు విజ్ఞప్తి చేసింది. స్వచ్చంద సంస్థలకు ఈ నివేదిక ఇచ్చిన రాయితీలను స్వచ్ఛంద సంస్థల ముసుగులో విద్యావ్యాపారులే ఉపయోగించుకుంటారని సులభంగానే గ్రహించవచ్చు. ఇక మత సంస్థలు విద్యావకాశాలను విస్తరించాలనడం అచారిత్రకం. వంద సంవత్సరాల క్రితమే మహా కవి గురజాడ ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలచి వెలుగును’ అని చెప్పాడు. మతానికి మరియు జ్ఞానానికి ఉన్న వైరుధ్యాన్ని ఇంతకంటే ఇంకెవరూ బాగా చెప్పలేరేమో. మత రాజ్యం మరియు మత విద్య మన భవిష్యత్తుగా కనిపిస్తున్నది, ఈ నిదేకలో ప్రతిపాదించిన అధికార కేంద్రీకరణను, కాషాయీకరణను నిలువరించకపోతేఈ దేశ ఉనికికే ప్రమాదం.
-రమేష్ పట్నాయక్,
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటి