విద్యా రంగంలో కార్పోరేట్ జలగలు

తారతమ్యాలు లేకుండా అందరికీ విద్యను నేర్చుకునే విద్య హక్కు మన రాజ్యాంగంలో పొందుపర్చబడింది. ఈ నిబంధన ను అనుసరించే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. వీటిలో మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులకు చేకూర్చడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. గురుకులాలు,స్టడీ సర్కిల్, నవోదయ విద్యాలయాలు,మధ్యాహ్న భోజన పథకం ఇలా ఎన్నో విధాలుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టిన ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆశించిన మేర పెరగడం లేదు. మరోపక్క ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేటీకరణ తో అద్దాల మేడలో దర్శనమిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలు కోరికలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పేరిట వ్యాపారానికి తెర లేపాయి. తమకు అందని విద్య తమ పిల్లలకు అందిస్తే బాగుంటుందని కోరికతో తలకు మించిన భారమైనా అప్పోసప్పో చేసి కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. వేలాది రూపాయలు పిల్లల చదువులకు వెచ్చించి రావడం మధ్యతరగతి,దిగువ మధ్యతరగతి, పేదలకు తలకు మించిన భారం అయింది. ఏటి కేడు పాఠశాలల ఫీజులు అందనంత ఎత్తులో పెరుగుతూ పోతున్నాయి. పెరుగుతున్న ఈ ఫీజుల కు తగ్గట్టుగా తల్లిదండ్రుల ఆదాయ మార్గాలు పెరగడం లేదు. దీంతో వారి ముందు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి.
1. అప్పులు చేసి పిల్లలను చదివించడం
2. ఫీజులు కట్టలేక చదువులను మాన్పించడం.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అందరికి అందాల్సిన విద్య అనే రాజ్యాంగ సూత్రాల ఆశయం నీరుగారిపోతోంది. ఇక్కడ విద్య అనేది రెండు భాగాలుగా విడిపోయింది అని చెప్పవచ్చు. ఒకటి ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యావ్యవస్థ. రెండు కార్పొరేటీకరణ చేయబడిన ప్రైవేటు విద్యా వ్యవస్థ. ప్రభుత్వ విద్యా వ్యవస్థ లోపాలు, సానుకూల అంశాలు అనేది పెద్ద అంశం. ఈ అంశాన్ని పక్కన పెడదాం. ఇక కార్పొరేటీకరణ గావించబడిన ప్రైవేట్ విద్యా వ్యాపారం గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో అందించే విద్య గురించి, దాని నాణ్యత గురించి కూడా ఇక్కడ చర్చను పక్కన పెడదాం. ఇక మిగిలింది ప్రైవేటు పాఠశాలల వ్యాపార ధోరణి పై చర్చ తప్పనిసరి.
ఆ.. అల చదువులకు లక్షల్లో ఫీజులు… రవాణా, పుస్తకాలు, బ్యాగులు, యాక్టివిటీ ఫీజులు, యూనిఫాంలు ఇలా ఒకటేమిటి సంవత్సరం పొడవునా తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. హైదరాబాద్ మహానగరం తో పాటు జిల్లా కేంద్రాలు ఆఖరికి మునిసిపల్ పట్టణ కేంద్రాల్లో కూడా ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రతి ఏడు ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటికే చేయి దాటింది.రానున్న రోజుల్లో మరింత తీవ్ర పరిణామంగా మారే ప్రమాదం లేకపోలేదు. నాణ్యమైన విద్యను తమ పిల్లలకు అందించాలనే తపనతో ప్రైవేటు బాట పట్టిన తల్లిదండ్రులకు ఈ పరిస్థితి పెనుభారంగా మారింది. ఈ భారాన్ని మోయలేని వారు పిల్లలను చదివించే లేక అవస్థలు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే బాగా డబ్బులు వెచ్చించి ఉన్నత చదువులు చదివించే ఆర్థికస్తోమత గల పిల్లలు ఒకవైపు, ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు చదువును కొనలేని పిల్లలు మరోవైపు. ఇలా సమాజంలో అంతరం పెరుగుతూ పోతోంది. ఈ అంతరాల పెరుగుదల తీవ్రరూపం దాల్చితే అది వివిధ రూపాల్లో సమాజానికి హాని చేసే కారకాలుగా బయటపడుతుందని గత చరిత్ర లు చెబుతున్నాయి. మరి ఇంత ప్రమాదపుటంచున భావి భారత పౌరులు,సమాజం ఉన్న ప్రభుత్వాలు ఎందుకు? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు విద్యా వ్యాపారానికి ముక్కుతాడు ఎందుకు వేయలేకపోతున్నాయి అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. అ.. ఆ చదువులకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా చేయడాన్ని చట్టం ఒప్పుకుంటుందా అంటే ముమ్మాటికీ… విద్యను వ్యాపారం చేయరాదనే చట్టం చెబుతోంది. 5 శాతం మాత్రమే లాభాలు తీసుకోవాలని నిబంధనల్లో ఉంది. 50 శాతం ఉపాధ్యాయులకు వేతనాల రూపంలో ఖర్చు చేయాలని, 15 శాతం పాఠశాల భవనఅద్దె, కరెంట్ బిల్లులు, ఇతర సౌకర్యాల కల్పనకు వినియోగించాలని, 15 శాతం ఉపాధ్యాయుల పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయాలని నిబంధనల్లో ఉంది. అంటే 90 శాతం నిధులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అంటే వ్యాపార ధోరణి అనే అంశానికి ప్రాధాన్యత లేకుండా కేవలం విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశమే ఈ జీవో నెంబర్ వన్ లో కనిపిస్తుంది. అదేవిధంగా కొత్తగా ఓ ప్రైవేటు పాఠశాల నెలకొల్పాలంటే ఫైర్,ట్రాఫిక్,బిల్డింగ్ నాణ్యత మైదానం, వంటి వాటి విషయంలో సంబంధిత శాఖల అనుమతులకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆట స్థలం నుంచి పాఠశాల భవన నిర్మాణంలో చిన్నారుల రక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. కానీ ఈ నిబంధనల అమలు లో, పర్యవేక్షణ లోపంతో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అడుగడుగునా నిబంధనలకు పాతరేసి విద్యాచట్టం జీవో 94 కి తూట్లు పొడుస్తున్నాయి. ఐదు శాతం లాభాలు తీసుకోవాలన్న నిబంధన స్థానంలో 95% లాభాలు తీసుకుంటామనే దశలో కార్పొరేట్ పాఠశాలలు పాతుకుపోయాయి. ఇష్టారాజ్యంగా ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపకాలపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ ఏటా ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల్లో 10 శాతం మేర పెంచుకునే వెసులుబాటు ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఫీజులను ఏటా ఇష్టారాజ్యంగా పెంచరాదని ఫీజు రెగ్యులేటరీ అధారిటీ సూచనల మేరకే పెంచుకుంటూ పోవాలని, ప్రతి ఏడు పాఠశాలల ఆడిట్ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని తిరుపతిరావు కమిటీ సూచించింది. ఈ కమిటీ సూచనల అమలులో ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ ప్రభుత్వం అనేక మార్లు చేసిన ప్రచారం కూడా అమలులోకి రాలేదు.
ఒక్కటి మాత్రం నిజం ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలల నెలకొల్పన, నిర్వహణపై కొత్తగా చేయాల్సిందేమీ లేకున్నా జీవో నెంబర్ వన్ ని కఠినంగా అమలుచేస్తే నేటి దుస్థితి ఉండేది కాదు. మైదానం లేని పాఠశాలలు అనేకం. బహుళ అంతస్తుల భవనాల్లో విద్యార్థులకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసి రక్షణ పాటించే పాఠశాలలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యను వ్యాపారంగా చేసిన పాఠశాలలు అనేకం ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పాఠశాలల్లో డొనేషన్లు వసూలు చేయరాదని నిబంధనను యాజమాన్యాలు పాటించడం లేదు. ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో రాయడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యను వ్యాపారంగా చేసుకున్నాయి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు. దీనికి కారణం పర్యవేక్షణ లోపం, నిబంధనలు అమలులో అలసత్వం వంటి చర్యల మూలంగా ప్రైవేటు పాఠశాలల ఫీజు దోపిడీ యదేచ్చగా సాగుతుందని చెప్పవచ్చు. అసలు ఫైర్ సేఫ్టీ లేని, భవన నిర్మాణంలో నాణ్యత లేని పాఠశాలలు, రక్షణ లేని పాఠశాలలు, ట్రాఫిక్, పోలీసులు అనుమతి లేని పాఠశాలల స్థాపనకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎలా ఇస్తున్నారనే ప్రశ్నకు సమాధానం వెతికే పని తక్షణం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అప్పుడే పేదలకు నాణ్యమైన విద్య అందే ఎత్తులో ఉంటుంది. విద్యాసంవత్సరం మొదలైంది. ఈ రోజు నుంచైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే లక్షలాది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే మార్గం తొందర్లో కనిపిస్తుంది.
– మానసాని కృష్ణా రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap