రెప్లికా ఆర్టిస్టు గా సుపరిచితులయిన దార్ల నాగేశ్వర రావు గారు హైదరాబాద్ నివాసి. తన కున్న కళాత్రుష్ణ తో వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలసి, వారి జీవిత ప్రతిభా విశేషాలు ఈ స్వయం-సందర్శనంలో 64కళలు.కాం పాఠకులకు తెలియజేస్తారు.
పర్కిపండ్ల జ్ఞానేశ్వర రావు (70) గారి పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా కళారంగం, ఛాయాచిత్రరంగంలోని వారికి. వీరు వీరి ప్రతిభతోపాటు, ప్రసిద్ధి చెందిన సీనియర్ వ్యక్తి. సాయి నగర్, చైతన్యపురి, దిల్ సుక్ నగర్, హైదరాబాద్ నివాసం.
అందరూ రావు గారు అని, లేక వి2 రావు గారు అని పిలుచుకోవడం పరిపాటి. రావు గారు ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తి కావడం వల్లనేమో అత్యంత ప్రముఖులైనారు. ఆ చేతిలో కుంచె నాట్యం ఆడుతుంది. కాన్వాస్ పై నయనమనోహరంగా రూపాలు దిద్దుకుంటాయి. రావు గారి మనసులోను, ఊహల్లో కదలాడే బొమ్మలు, చిత్రాలు ముగ్దమనోహరంగా కదలికలు కలిగినట్లుగా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఒకటి కాదు….రెండు కాదు….రావు గారి సుదీర్ఘ కళారంగం ప్రయాణంలో ఎన్నో చిత్రాలు. ఎన్నో భావాలు. మరెన్నో సంఘటనలు. ఎన్నో అనుభూతులు ఇవన్నీ వెరసి రంగుల ఫ్రేముల్లో అందంగా, సజీవంగా, ఘనంగా రూపు దిద్దుకున్నాయి.
రావు గారికి చిన్నతనం నుండే చిత్రకళ పై మక్కువ. పాఠశాలలో పలకలపై బొమ్మలు వేస్తుండేవారు. తండ్రి లాగే 1962 లో ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించారు. చిత్రకళలో 1977 లో బొంబాయికి చెందిన ప్రముఖ చిత్రకారులు ఎస్.ఆర్.బడాకేరే గారి వద్ద శిష్యరికం చేరారు. అలా మొదలయింది రావు గారి కళా ప్రస్థానం. అప్పటినుండి వెనుతిరిగి చూడకుండా అద్వితీయమైన, అపూర్వమైన పేయింటింగ్ లు ఆయన కుంచె నుండి ఆవిష్కరించాయి.
రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా ఎందరో మహానుభావుల చిత్రాలకు ప్రాణం పోసారు. అంతేకాదు తన ఊహాపథంలో మెరిసిన ముగ్ధమనోహరమైన రూపలావణ్యాలకు సంబంధించిన పేయింటింగ్సు…..ఎన్నో ఆయన కుంచె నుండి ఆవిర్భవించినాయి. చాలా వరకు ఆయన ఇంటిలోనే ఫొటో ఫ్రేములో గోడలమీద దర్శనమిస్తూ, వావ్ అనేలా కనువిందు చేస్తాయి.
ప్రముఖుల నుండి లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు, సన్మానాలు అందుకున్నారు. కేంద్ర లలిత కళా అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు రావు గారు. 1996 లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 49 మంది చిత్రకారులను సన్మానించగా అందులో అపరబ్రహ్మ జ్ఞానేశ్వర రావు గారు ఒకరు కావడం విశేషం. ప్రతి సంవత్సరం, నెలకోసారి ఏదో ఒక అవార్డును అందుకుంటారు. ఇకపోతే పలు రికార్డ్స్ లలో చేటు చేసుకోవడం జరుగుతుంది.
ప్రత్యేకతగా ఓ విషయాన్ని పేర్కొనాలి. ఒక్కో రంగంలో సుప్రసిద్ధులైన “తొలి మహిళామణుల” చిత్రాలను 108 వరకు పేయింటింగ్ రూపంలో చిత్రించారు. మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు, నర్తకులు, నటులు, గాయకులు, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు, స్వాతంత్ర్య సమర యోధులు, నవల రచయిత్రులు, ఫెమినిస్టులు, వీరవనితలు ఇలా ఎందరో మహిళలను పేయింటింగ్స్ రూపంలో చిత్రించారు. ఉదాహరణగా:
శ్రీమతి ఇందిరా గాంధీ, శ్రీమతి ప్రతిభా పాటిల్, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీమతి విజయ లక్ష్మి పండిట్, శ్రీమతి.సరోజిని దేవి, శ్రీమతి అమృతప్రీతం, శ్రీమతి కస్తూరి భాయ్, మదర్ తెరీస్సా, డా. దుర్గాబాయ్ దేశ్ ముఖ్, శ్రీమతి ఎమ్మెస్స్ సుబ్బలక్ష్మి, శ్రీమతి డి.కే.పట్టమల్, శ్రీమతి షనాజ్ హుస్సేన్, శ్రీమతి అరుంధతి రాయ్, శ్రీమతి ఐశ్వర్య రాయ్, శ్రీమతి కరణ్ బేడి, శ్రీమతి దేవికా రాణి, శ్రీమతి నర్గీస్, శ్రీమతి వైజయంతి మాల ……ఇలా 108 మహిళామణులను “డాటర్స్ ఆఫ్ ఇండియా” పేరుతో, వినూత్న కాన్సెప్ట్ తో చిత్రించడమనేది అతి పెద్ద ప్రక్రియ.
వీటన్నిటిని పుస్తక రూపంలో తీసుకురావాలని ఆయన చిరకాల వాంఛ. 20 ఏళ్లకు పైగా చిత్రించి, భద్రం చేసిన వాటిని ఒక పుస్తక రూపంలో ప్రింటింగ్ చేసి, తెలుగు రాష్ట్రాలలో గల ప్రతి లైబ్రరీలకు పంపిస్తే చరిత్రలో అపురూపంగా మిగులుతుందని, రాబోయే తరాలవారికి ఆదర్శంగా, నిన్నటి తరం మొదటి మహిళామూర్తులను తెలుసుకోగలుగుతారని రావు గారి ఆశయం. కాని ప్రింటింగ్ చేయడమనేది ఆర్థికంగా చాలా కష్టమైన ప్రక్రియ కనుక స్పాన్సర్ కోసం ఎదురు చూస్తున్నారు.
జ్ఞానేశ్వర రావు గారి చిత్రాలను 1962 నుంచి, ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నగరంలోని మారియట్ హోటలోను, మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోను, రవీంద్రభారతిలోను పలు ప్రదర్శనలుఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎంతో గుర్తింపు వచ్చినా చిరునవ్వుతో, విన్రమంగా స్వీకరిస్తారు.
చివరిగా “తన కళను పదిమందికి పంచాలన్న ఉద్దేశ్యంతో, అభిలాష, పట్టుదల కలిగి అన్ని వయసుల వారిని తీర్చిదిద్దే ప్రయత్నంలో అనునిత్యం కష్టపడుతున్నారు”.