విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు
కొంతమంది పల్లెటూరి పోరగాళ్ళకు.. చాలాచాలా డ్రీమ్స్ ఉంటాయి. ఊళ్ళో చదువు పూర్తయ్యాక.. వెంటనే పట్నం వెళ్ళిపోవాలి. ఆనక డాక్టరో, యాక్టర్, సాఫ్ట్ వేరు ఇంజనీరో అవ్వాలి.. ఇలా రకరకాల రంగుల కలలు కనడం కామన్. ఈ కుర్రాడు కూడా అందరిలాగానే.. తను కూడా టెన్త్, ఇంటర్ అయ్యాక పట్నం వెళ్ళాలనుకున్నాడు. ఇంజనీరో, డాక్టరో, యాక్టర్ అవ్వడానికి మాత్రం కాదుబీ చిత్రకారుడు కావాలని.. తనలోని చిత్రకళలకు మరింత మెరుగులుదిద్దుకోవాలని. అలా బొమ్మల్లోనే బతకాలని. ఇంట్లో వాళ్ళు నొసళ్ళు చిట్లించినా.. భుజాన సంచేసుకుని ఆ సంచిలో రెండు మూడు పెన్సిళ్ళు, నాలుగు తెల్లకాగితాలేసుకుని.. హైదరాబాద్ రైలెక్కేశాడు. కట్చేస్తే అనేక సినిమా కష్టాల నడుమ.. కృషీవలుడయ్యాడు. మెచ్చుకోదగ్గ చిత్రకారుడయ్యాడు. అందరూ గీసిన దారిలోవెళ్తే ఏంబావుంటందని అనుకున్నాడో ఏమోగానీ.. బ్రష్లు, పెన్సిళ్ళు వదిలేసి.. తనకొనదేలిన ముక్కునే కుంచెగా మలచుకుని.. ఎడా పెడా బొమ్మలు గీసిపారేశాడు. ముక్కుతో బొమ్మలా? అంటారా? అందుకే ఆ..యువచిత్రకారుడు సత్యవోలు రాంబాబు బొమ్మల వైచిత్రి గురించి తెలుసుకుందాం! ఏందయ్యా నువ్వు.. ముక్కుతో బొమ్మలేస్తావా? అని.. కాస్తంత అనుమానంగా చూసినోళ్లను తన బొమ్మలతో ముక్కున వేలేసుకుని.. ఆ బొమ్మల్నే తదేకంగా చూసేలా చేస్తాడు రాంబాబు. అలా ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయినవాళ్లలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, మెగాస్టార్ చిరంజీవిలాంటి పెద్దోళ్ళు చాలామందే ఉన్నారు. ఇంతకీ ముక్కుతో బొమ్మలేంటయ్యా బాబూ.. హవ్.. ఇటీస్ పాసిబుల్? అని ఇంగ్లీషులో అడిగిన వాళ్ళూ లేకపోలేదు. ఎక్కడో శ్రీలంక, కొరియా నుంచి ఇతగాడి నాసికాచిత్రాలపై డాక్యుమెంటరీ చేయడానికి విదేశీ ప్రసారసాధనాలు పరుగెత్తుకుని ఇండియాకొచ్చిన సందర్భాలూ ఉన్నారు.
మాది గోదారి జిల్లా!
పుట్టిపెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గర వేగివాడ. అక్కడే పది, పన్నెండు తరగతులు చదువుకున్నాడు. మిగతా స్నేహితులు, బీఈడీ కోర్సులు పూర్తిచేసి బడిపంతుళ్ళు అవ్వాలనుకుంటే.. ఈ.. రాంబాబు మాత్రం.. బొమ్మలేసే ఆర్టిస్టు కావాలనుకున్నాడు. “ఒరేరు రాంబాబు.. నవ్వు భలేగా బొమ్మలేస్తున్నావోరు.. అని భుజాన చెయ్యేసి.. భీకరంగా పొగిడేసినవాళ్ళే.. బొమ్మలేమైనా కూడుపెడతాయా? అని నిరుత్సాహపరిచిన వైనాలూ ఉన్నాయి. చిత్రకళపై పెద్దగా అవగాహనలేని కుటుంబ సభ్యులు కూడా ఈబొమ్మల సంగతి నీకెందుకురా.. శుభ్రంగా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే చదువు.. చదువుకోకూడదా? అని కాస్తంత మనేదగా.. అన్నాగానీ, ఎందుకో అవన్నీ రాంబాబు బుర్రకెక్కలేదు. మనసంతా బొమ్మలపై ధ్యాసే. ఆ ధ్యాసే.. ఊళ్ళో కాలు నిలవకుండా చేసింది. ఊరొదిలేసి దాంతో హైదరాబాద్ లో పడ్డాడు రాంబాబు.
రంగుపడుద్ది!
బొమ్మలేస్తూ బతకాలనుకోవడం అంత ఈజీ కాదు. బొమ్మలేయడం అనేది పెద్ద క్వాలిఫికేషనూ కాదు.. అనే విషయం.. చాలా తొందరగానే అర్ధమైంది రాంబాబుకి. ఎందుకంటే.. హైదరాబాద్ లో రాంబాబులాంటి ఆర్టిస్టులుబాబులు చాలా మందే.. ఉన్నారని.. వాళ్ళు కూడా బొమ్మలంటే తెగపిచ్చితో ఊరొదిలేసి వచ్చినవాళ్ళని.. మెల్లగా అర్ధమైంది. కానీ, బొమ్మల పిచ్చోడు కదా.. మనసు పక్కకు మళ్ళకుండా ఏది ఏమైనాసరే బొమ్మలేయడమే జీవితంగా చేసుకోవాలనుకున్నాడు. బ్యాచిలర్గా ఉన్నచోటనే ఇరుగుపొరుగు పిల్లలకు బొమ్మలు నేర్పించడం మొదలెట్టాడు. అలా.. కాస్తంత ఆర్థిక ఆసరా తోడయ్యింది. అలా అలా.. సర్కిల్ పెరిగింది. ఫ్రీలాన్స్గా బొమ్మలేసే పనులూ వస్తున్నాయి. పర్వాలేదు. బొమ్మల్ని నమ్ముకుంటే.. ఏం కాదులే.. అనే ధైర్యం వచ్చింది. ఇంట్లోవాళ్ళకూ కొడుకు బాగానే ఉన్నాడు అనే ధైర్యమూ వచ్చింది. అలా రోజులు గడిచేకొద్దీ.. హైదరాబాద్ ఆర్టిస్ట్ లోకంలో తానొక గుర్తింపుగల ఆర్టిస్ట్ గా మారాడు. తనకు తెలిసిన విద్యకు మరింత పదునుపెట్టుకున్నాడు. వెంకటేశ్వరా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి బిఎఫ్ఏ డిగ్రీ కూడా పూర్తయ్యింది. ఆర్టిస్ట్గా రమ్మని స్కూల్, కాలేజ్, అడ్వర్టైజ్మెంట్, ముద్రణ కంపెనీలు పిలిచినా వెళ్ళలేదు. సొంతంగానే డ్రాయింగ్ స్కూల్ పెట్టుకున్నాడు. ఇదంతా. చాలా శరవేగంగా మనం చెప్పుకున్నాం గానీ.. మధ్యకాలంలో పీతకష్టాలు పీతవన్నట్టు.. రాంబాబు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నమ్మిన బొమ్మకోసం కష్టాలూ పడ్డాడు. ఆకలి పస్తుల్నీ చిరునవ్వుతోనే దాటేశాడు. అలా ఆర్టిస్ట్ గా ఒక్కొక్కమెట్టూ ఎక్కుతూ హైదరాబాద్ లాంటి మహానగరాన ఆర్టిస్ట్ కమ్ ఆర్ట్ టీచర్గా స్టిరపడ్డం మాటలు కాదు. నిజమే చేతల్లోనే ఊర్లోవాళ్ళకూ.. తోటివాళ్ళకు నమ్మకం కలిగించేలా ఎదిగాడు.
ఇదీ.. ముక్కు కథ
ముందు అనుకున్నట్టు.. మన వేస్తున్న బొమ్మలు.. అంతకుముందు ఎవరో వేసినట్టుగా ఉంటే.. అందులో స్పెషలేముంది? ఆర్టిస్ట్గా ఎవ్వరూ చేయని ప్రక్రియలో బొమ్మలు వేయాలి. అనే ఆలోచన వచ్చింది రాంబాబుకి. అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే నాసికా చిత్రం. ముక్కును రంగుల్లో ముంచి.. ఆ ముక్కునే కుంచెగా చేసుకుని బొమ్మలు వేయాలి. ఆలోచనైతే బ్రహ్మాండం. కానీ అది సాధ్యపడుతుందా? ప్రయత్నించాడు. రాత్రింబవళ్ళు సాధన చేశాడు. కంటి సమస్యలూ వచ్చాయి. మెడ విరిగిపోయేంత నొప్పులూ వచ్చాయి. ఇంట్లోవాళ్ళు, స్నేహితులు వద్దురా బాబూ ప్రమాదమన్నారు. కానీ లెక్కచేయలేదు. ముక్కుతో నెమ్మది నెమ్మదిగా బొమ్మలు దిద్దాడు. రంగులు అద్దాడు. ఫలితంగా ప్రపంచంలో ఎవ్వరూ చేయని ప్రక్రియకు తానే నాంది అయ్యాడు. సంప్రదాయ చిత్రాలు వేస్తూనే.. నాసికా చిత్రాలు గీయడంలో నేర్పరి అయ్యాడు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ‘ఔరా.. రాంబాబూ!” అంటూ భుజం తట్టిన సందర్భం, మెగాహీరో చిరంజీవి ‘యూ ఆర్ వండర్ ఫుల్ ఆర్టిస్టు’ అంటూ చప్పట్లు కొట్టిన లాంటి సందర్భాలు రాంబాబు చిత్రజీవితంలో చాలానే ఉన్నాయి. ఈ నాసికాచిత్రప్రక్రియలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు రాంబాబు. వేదికపై నర్తకి శాస్త్రీయ నృత్యం చేస్తుంటే.. అదే వేదికపైనే ముక్కుతో ప్రత్యక్షంగా నాట్యచిత్రాలు గీసి.. ఔరా అనిపించే చిత్రలేఖనసాహసాలూ చాలానే చేశాడు రాంబాబు. తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన నాసికాచిత్రాలు ఎక ఎత్తైతే.. సంప్రదాయ చిత్రాలు గీయడంలో రాంబాబుది ప్రత్యేకశైలి. ఆయిల్, ఆక్రిలిక్, పెన్సిల్ వాటర్ కలర్.. ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఆరితేరినవాడే. చిత్రకళాశిక్షణ ఆర్టిస్ట్ గా సక్సెస్ అవ్వడం అంటే.. బొమ్మల్లో పరిణితి చెందడం, సొంతకాళ్ళపై నిలబడ్డమే కాదు.. పదుగురికి తాను నేర్చుకున్న కళ ఏదో ఒకరూపంలో ఉపయోగపడాలి. కుటుంబానికి ఆసరాగా నిలవాలి. రాంబాబు అదే పనిచేస్తున్నాడు.. సొంతంగా ‘ది సద్గురు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ పేరుతో పిల్లలకు, చిత్రకళలో విద్యార్థులకు, ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నాడు. కుటుంబానికి అన్ని రకాలుగా తానో అండగా నిలిచాడు. సుదీర్ఘమైన చిత్రకళాప్రస్థానంలో ప్రోత్సాహక గుర్తింపులు, సత్కారాలు చాలానే ఉన్నాయి. లయన్ క్లబ్ ప్రతినిధిగా సామాజిక సేవలోనూ ముందుంటాడు రాంబాబు. మొత్తానికి తాను కలలు గన్న రంగుల ప్రపంచాన్ని స్వయంకృషితో తనకు తానే సృష్టించుకుని.. విజేత అయ్యాడు. ఇదీ, రాంబాబు రంగుల ప్రపంచం.
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పేరుతో గత రెండేళ్ళుగా వివిద రంగాల్లో ప్రతిభావంతులైన అనేక మందికి రికార్డ్స్ అందజేస్తున్నారు. లయన్స్ క్లుబ్ లో కూడా వివిద పదవుల్లో పనిచేస్తున్నారు. ప్రాధాన్యత పెరుగుతోంది చిత్రకళ అనేది ఒక అభిరుచిగానే చూడకూడదు. సరియైన ప్రణాళికతో సాధన, అధ్యయనం, విద్యాపరమై అర్హతలు సాధిస్తే.. కచ్ఛితంగా చిత్రలేఖనంలో చక్కటి కెరీర్ ఉంది. ఇప్పుడు అన్నిరంగాల్లోనూ చిత్రలేఖనకళ ఆవశ్యకత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. చదువుతోపాటు చిత్రకళ విద్యను ఆసరా చేసుకుంటూ ఫ్రీలాన్సర్గానూ రాణించవచ్చు. ”
– కళాసాగర్
Nice article