ధృస్టి సారించి చూస్తే సృష్టిలో ప్రతీదీ కొన్ని రేఖలు మరియు రంగులసమూహంగానే కనిపిస్తుంది. అయితే రేఖకి రేఖకి మధ్య వ్యత్యాసం రంగుల మధ్యవ్యత్యాసం వస్తువు నందలి వైరుధ్యానికి కూడా కారణమౌతుంది. అందుకు చిత్రకళ కూడా మినహాయింపు కాదు.
రాజమహేంద్రవరం నందలి రాజాజీ స్కూల్ నుండి వచ్చిన వందలాది శిష్యులలో శ్రీ ఎల్లా సుబ్బారావు గారు ఒకరు. దివంగతుడైన ఒక గొప్ప ఒక చిత్ర కారుడి పేరు మీదుగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వంచే స్తాపించబడ్డ ఏకైక కళాశాల దామెర్ల రామారావు స్మారక చిత్ర కళాశాల. అట్టి కళాశాలకు మొదటి ప్రిన్సిపల్ గా చేసిన ఆచార్య వరదా వెంకటరత్నం మరణానంతరం ఆయన శిష్యుడు మాదేటి రాజాజీ తనకు వోచ్చిన ఎన్నోగొప్ప అవకాశాలను సైతం వదులుకుని గురువు మాటకోసం చివరిశ్వాస వరకు ఆ కళాశాల ఆచార్యుడిగా పని చేసి వందలాది శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. వారిలో ఒక ప్రత్యేక మైన చిత్రకారుడు శ్రీ యల్లా సుబ్బారావు గారని చెప్పవచ్చు… కారణం ఆయన ఎంచుకున్న శైలిలోవుంది. ఎంచుకున్న విషయంలో వుంది, మరియు వ్యక్తం చేసే విదానంలో వుంది.
వేయి మంది నడిచేటి నడి రోడ్డు కంటే కష్టంతో కూడుకున్నదైనప్పటికి ఇష్టంతో పయనించే నీదైన సొంత దారి నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. నవ్యత్వాన్ని సంతరిచుకున్న ఆ నడక నలుగురిలో నిన్ను ప్రత్యేకుడిని చేస్తుంది.
సుబ్బారావు గారిది అలాంటి ప్రత్యేకమైన దారి. కారణం దేశంలో ప్రతి స్కూలుకీ ఒక శైలి ఉన్నట్లే రామారావు స్మారక చిత్రకళాశాలకు కూడా వుంది ఒక శైలి. అది ప్రాక్ పశ్చిమ శైలుల మేళవింపుతో స్వయంగా దామెర్ల రామారావు సృష్టించిన గొప్ప శైలి. ఆ శైలినే రాజమండ్రి చిత్రకళాశాలలో గురువులు శిష్యులకు భోదించడం జరిగింది. వరదాగారి వరకు నూటికి నూరుశాతం ఈ విధానం కచ్చితంగా పాటించగా ఆ తర్వాత వొచ్చిన రాజాజీ గారు ఆ కళాశాల శైలితో పాటు చిత్రకళారంగంలో నాడు నడుస్తున్న బిన్న విభిన్న శైలులతోను, ఆధునిక చిత్రకళా రీతుల్లోను కుడా ఎన్నో ప్రయోగాలతో చిత్రాలు రచించన వ్యక్తి. ఆచార్య రాజాజీ గారి నుండి వందలాది శిష్యులు చిత్రకళా పాటాలు నేర్చుకున్నప్పటికినీ గురువు యొక్క మరో ఆధునిక పార్శ్వాన్ని పట్టుకున్న ఘనత మాత్రం శ్రీ ఎల్లా సుబ్బరావు గారికే దక్కుతుంది.
రాజాజీ గారికి అతి సన్నిహితంగా వుండి వారి శైలిని బాగా ఆకళింపు జేసుకున్న సుబ్బారావు గారు కూడా మొదట్లో కళాశాల యొక్క సాంప్రదాయ శైలిలోనే చిత్రాలు రచించినా కాలక్రమంలో అందుకు పూర్తి భిన్నమైన శైలి తో నేడు ముందుకు సాగుతున్నారు.
దామెర్ల చిత్రకళాశాల శైలికి రేఖ ప్రధానం. సుబ్బారావు గారు కూడా రేఖాధారంగా సాగే ఆ స్కూల్ నుండే రావడం వలన వీరు మొదట్లో చిత్రించిన కార్తీక పౌర్ణమి ,సింబల్ అఫ్ లైఫ్ తదితర ఎన్నో చిత్రాలలో కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది, కాని ఆ తరువాత కాలంలో ఆ సాంప్రదాయాన్ని అధిగమించి రేఖాధారమైన ఆ శైలి నుండి వర్నాధర శైలికి మారి తనదైన ప్రత్యేఖ శైలిని సృష్టించుకున్న సృజనకారుడుగా ఆయన మారారు. వీరి చిత్రాల్లో రంగులు ప్రధానం,రూపం ప్రధానం.,భావం ప్రధానం.వేగం ప్రధానం, అలాగని రేఖలు అప్రధానం అనలేము గాని రంగులలో సంలీనమైన రేఖ తన ఉనికిని కోల్పోయి పూర్తిగా వర్ణాదారంగానే వీరి చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఇటీవల ఆయన వేస్తున్న అర్ధనారీస్వర్ , ఆర్ఫన్స్, చలి, శిక్షణ, స్వేచ్చకోసం, ఎట్ వర్క్, దుర్గ, దాహం, దిగేమ్ తదితర చిత్రాలు ఆయనలోని వర్ణ విన్యాసానికే కాదు నవ్యరచనా రీతికి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి.
సాధారణంగా అర్ధనారీస్వరుడు రూపాన్ని ఏ చిత్రకారుడు చిత్రించినా ఒకే రూపంలో సగ బాగం శివరూపంగా మిగిలిన సగ బాగం శక్తీ రూపంగా చిత్రించడం ఇంతవరకు మనం చూసాము. కాని ఆయన ఇటీవల వేసిన అర్ధనారీస్వరుడు చిత్రం చాల ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనిలో శివరూపం మరియు శక్తి రూపం రెండింటిని నఖ శిఖ పర్యంతం పూర్తిగా ఇరుమూర్తుల యొక్క నాలుగు చేతులు ఇరువురియొక్క రెండేసి కాళ్ళు అలాగే వారి వారి వాహనాలైన పులి నందులతో సహా ఏక చిత్రంగా కనిపించేలా నవ్యరీతిలో ప్రయోగాత్మకంగా చిత్రించిన అర్ధనారీస్వరుని చిత్రం నిజంగా అద్భుతంగా వుంటుంది. అలాగే ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులకు విద్య నేర్పుతున్నదృశ్యాన్ని సాధారణంగా సాంప్రదాయ శైలిలోనే మనమంతా ఊహించు కుంటాము. ఒక పౌరాణిక గట్టానికి చెందిన ఆ దృశ్యాన్ని నిజానికి ఎవరైనా అలాగే చిత్రిస్తారు కుడా, కాని “శిక్షణ“ అనే పేరుతో సుబ్బారావు గారు చిత్రించిన అదే ఘట్టానికి చెందిన ఆయన చిత్రంలో అసలు మనము ఊహించని నవ్యత్వం కనిపిస్తుంది.
అలాగే “చలి” అన్న చిత్రంలో శీతల వర్ణాలయిన ఊదా మరియు నలుపు రంగుల్లో వేసిన ముసుగు వేసుకున్న ఇరువురి ముసలి బామల చిత్రాలకు నేపధ్యంలో కాన్వాస్ అంతా శీతల వర్ణాలకు పూర్తి వైరుధ్యమయిన ఉష్ట్నవర్ణాలతో సృష్టించిన దగదగా మెరిసిపోయే ఎరుపు పసుపుల వర్ణ జ్వాలలు ఆ చిత్రంలో చలికి వణుకుతున్న ముసలి బామలకే గాక మనకు కూడా వేడి పుట్టించేలా చేస్తాయి. అలాగే ఇంకా, దాహం,ఉద్యమం ,చలి, శ్రామికులు, అనాదలు, క్రీడా తదితర ఎన్నో విషయాలపై వేసిన ఏ చిత్రమైన ఏ విషయమైనప్పటికి చిత్రరచనా రీతిలో తనదైన నవ్యరీతిని సుబ్బారావు గారి చిత్రాల్లో మనము చూస్తాము. ఇంకా అజరామరమైన బేలూరు హళిబేడు శిల్పాలలో కొన్నింటికి వీరు పెన్సిల్తో తో చిత్రించిన అనుక్రుతులు ఎంతో గొప్పగా వుంటాయి.
చక్కని రూప చిత్రాలు కూడా వీరు చిత్రించగలరు. తాను పని చేసే పాటశాలనందలి ఎందరో విద్యార్ధులు ఉపాద్యాయుల రూపచిత్రాలు వారింట్లో మనకు దర్సనమిస్తాయి. విషయ సంభందమై వీరు వేసెడి చిత్రాలలో కూడా రుపాలుంటాయి కానీ ఆ రూపం స్తితిశీలకంగా కాకుండా గతిశీలకంగావుంటుంది. వీరి చిత్రాలలోని మూర్తులరూపాలు నిస్తేజ బరితంగా కాకుండా వుత్తేజబరితంగా వుంటాయి. చలన హీనంగా కాకుండా చలన శీలంగా మనకు కనిపిస్తాయి. రంగులతో ఆయన రూపాల్లో సృష్టించిన చైతన్యయుక్తమైన ఆవేగం వీక్షకుడి మదిలో ఒక విదమైన ఉత్తేజాన్ని కలిగిస్థాయి.
కులవృత్తి తప్ప మరేఇతర రసగందాలు లేని కుటుంభంలో శ్రీమతి సత్యవతి,సత్యనారాయణ అనే దంపతులకు 1948 జూన్ 15 న రాజమండ్రిలో ఒక సాధారణ కుటుంభంలో జన్మించిన సుబ్బారావు గారికి చిన్నతనం నుండే చిత్రకళపై ఆసక్తి ఏర్పడింది . తాను హైస్కూల్ చదువులో వుండగా అక్కడ మతి స్థిమితం లేని ఒక వ్యక్తి రోడ్డు పై పదే పదే బొగ్గుతో వేస్తూ వుండే బొమ్మలు తనలో చిత్రకళపై ఆసక్తిని రేపినట్టుగా చెప్తారు. పదవతరగతి లో ఉండగానే దామెర్ల స్కూల్ లో చేరడం అక్కడ రాజాజీ గారి శిష్యరికంలో 1964నుండి 1969వరకు చిత్రకళను అభ్యసించి డిప్లమో తీసుకున్నారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము యొక్క టెక్నికల్ బోర్డు వారు నిర్వహించే. డ్రాయింగ్ లోయర్ హయ్యర్ పరీక్షలలో ప్రధమ శ్రేణిలో వుత్తీర్నులయ్యారు. ఆపై తమిళనాడు రాష్ట్ర టెక్నికల్ బోర్డు వారు నిర్వహించే ఫ్రీహాండ్ అండ్ అవుట్ లైన్ డ్రాయింగ్ పరీక్షలలో కూడా వుతీర్నులయ్యారు.. ఆ తదుపరి 1974లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ వారి మోతుగూడెం పవర్ ప్రాజెక్ట్ స్కూల్ లో ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం రావడం వీరి చిత్రకళా విన్యాసానికి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేని దట్టమైన అటవీ ప్రాంతంలో వున్న మోతుగూడెం నకు ఉద్యోగ రీత్యా మకాం మార్చడంతో చిత్రకళకు కావాల్సిన సామాగ్రి తదితర సదుపాయాలు అందుబాటులో లేక 1974 నుండి 2006 వరకు చిత్రకళా పరంగా వృత్తి పరంగా పిల్లలకు చెప్పే పాటలు తప్ప తనవైన చిత్రాలు సృష్టించు కునే అవకాశాన్ని వీరు కోల్పోయారని చెప్పవచ్చు. అందుకే వీరి చిత్ర కళా యాత్రలో విజయాలన్నీ ఉద్యోగానికి ముందు మరియు ఉద్యోగ విరమానంతరమే కనిపిస్తాయి.
1966 లో జరిగిన చిత్రకళా పోటీలలో సిల్వర్ కప్ అందుకుంటే 1967 లో హైలీ కమండెడ్ సర్టిఫికేట్ పొందారు 1968 లో దామెర్ల రామారావు గాలరీ వార్షిక పోటీలలో ప్రధమ బహుమతి ని 1973లో అంకాల ఆర్ట్స్ అకాడమి పోటీలలో బెస్ట్ ఎగ్జిబిట్ అవార్డ్ అందుకోగా మరలా అదే సంవత్సరం అఖిలభారత చిత్రకళా పోటీలలో బెస్ట్ స్టడీ అవార్డును సొంతం చేసుకున్నారు 1974 లో మచిలీపట్టణం వారు నిర్వహించిన పోటీలలో బెస్ట్ ఎగ్జిబిట్ అవార్డ్ అందుకున్నారు.ఆపై ఉద్యోగ జీవితంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా చిత్రకళా పరమైన విజయాలు మనకు కనపడవు. తిరిగి 2006 లో పదవీ విరమణ అనంతరం కళాపరమైన ఉన్నతిని ఆయనలో మనం చూస్తాము.
పదవీ విరమణ అనంతరం తిరిగి రాజమండ్రి లో స్థిరపడి తన ఉన్నతికి కారణమైన గురువు రాజాజీ పేరు మీదుగా ఆర్ట్ స్కూల్ స్థాపించి పిల్లలకు చిత్రకళ విద్యను నేర్పించడమే గాక చారిత్రక ప్రాంతాలైన బేలూరు హళిబీడు తదితర శిల్ప కళా క్షేత్రాలు దర్శించి అక్కటి శిల్పాలకు వీరు చక్కటి రూపకల్పన చేసారు. అంతే గాక పలు అంశాలపై నేడు విరివిగా చిత్రరచన చేస్తూ చిత్రకళ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ అనేక బహుమతులు సొంతం చేసుకోవడం ముదావహం. రాజోలు చిత్రకళా పరిషత్, రాజమండ్రి చిత్రకళా నికేతన్, భగీరధి ఆర్ట్ ఫౌండేషన్, అజంతాకళారామం తెనాలి ఇత్యాది సంస్థలనుండి ఎన్నో పురస్కారలనందుకోవడమే గాక కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం వారి జాతీయ పోటీలలో పలుసార్లు నగదు బహుమతులతో పాటు చిత్రకళా వైజయంతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
అంతే గాకా ఇటీవలనే తన చిత్రాలన్ని భద్రంగా భావి తరాలకు అందే విదంగా తన ఇంటి పైబాగంనందే సొంతంగా తన ఆర్ట్ గాలరిని నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ఆయిల్ , ఎక్రలిక్, వాటర్ కలర్ తదితర మాధ్యమాలతో వారు చిత్రించిన దాదాపు 200 చిత్రాలు ఆ గాలరీలో కొలువై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలనే నా మిత్రులు ప్రముఖ చిత్రకళారచయిత మాకినీడి సూర్యభాస్కర్ గారితో కలిసి ఆ గాలరిని సందర్శించడం ఒక మంచి అనుభూతి. అయితే….
చిత్రాలను సృజియించడం వేరు వాటిని సరైన రీతిలో సరైన చోట్ల ప్రదర్శించడం వేరు.మనం సృష్టించిన వాటిని పదిమంది చూసినప్పుడే వాటికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. లేకుంటే అవి తగిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవు. శ్రీ సుబ్బా రావు గారు ఎన్నో చిత్రాలను సృష్టించారు కాని ఆస్థాయిలో బయట ప్రదర్శనలు చేయలేదు అందుకే తాను సృష్టించిన చిత్రాలతో రాష్ట్రంలోను రాష్ట్రానికి ఆవల ప్రముఖ చిత్రకళా కేంద్రాలలో తన చిత్రాలతో ప్రదర్శనలు చేయవలసిన ఆవశ్యకత వుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలనీ తద్వారా విలక్షణమైన వారి కళ విశ్వవ్యాప్తం కావాలని ఆశిద్దాం
— వెంటపల్లి సత్యనారాయణ (9491378313)
Nice wirks nice narration