సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
ఐదేళ్లకొకసారి జరిగే ప్రతి ఎన్నికా దేశ భవిష్యత్తును నిర్దేశం చేసేదే. అయితే, విభజనానంతరం రెండో సారి జరుగుతున్న ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు మాత్రం కీలకమైనవి. దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు నవ్యాంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు రకరకాలు విన్యాసాలు చేస్తాయి. పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలకు పాల్పడతాయి. ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తాయి. రకరకాల ప్రలోభాలకు తెగబడతాయి. ఇవన్నీ ఇవాళ ఎన్నికల్లో సర్వసాధారణమయ్యాయి. అధికారం కోసం వివిధ పార్టీల మధ్య పోరాటం సహజమే. అయితే, నిందారోపణలకు కళ్లెం లేని పరిస్థితిని ఇవాళ చూస్తున్నాం. బట్ట కాల్చి, తుడుచుకోమనే తత్వం ప్రబలింది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వెనకాడని తెంపరితనం కట్టెదురు కనిపిస్తోంది. పార్టీల మధ్య పోటీ మంచిదే కానీ అది కొన్ని కనీస నియమాలకు లోబడి ఉండాలి. ఎన్నికల కమిషన్ ఇటువంటి అతి పోకడల మీద చాలా కట్టడి పెట్టింది. ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను రూపొందించి, వాటిని గట్టిగా అమలుచేస్తోంది. వార్తామాధ్యమాలను దుర్వినియోగం చేయడం, టెలివిజన్ చానళ్లలో, పత్రికల్లో డబ్బు ఇచ్చి ప్రచారం చేసుకోవడం లాంటి వాటిపై కన్నెర్ర చేస్తోంది. ఇప్పుడు వీటికి సోషల్ మీడియా కూడా తోడైంది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి ఆన్ లైన్ వేదికల ద్వారా తప్పుడు వార్తలు, చెప్పుడు మాటలను ప్రచారం చేయడం మరింత సులువైంది. ఇలాంటివి సాగకుండా కొన్ని నియమనిబంధనలను రూపొందించేందుకు ఇంటర్ నెట్ వేదికల నిర్వాహకులతో ఇటీవలే భారత ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. దొంగ ప్రచారాలని, అబద్దపు వార్తలని, ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడాన్ని అదుపులో పెట్టేందుకు స్వీయ నియంత్రణ పాటిస్తామని వీరంతా ముందుకు రావడం ఒక మంచి పరిణామం. అయితే, అన్నిటికంటే మనం ఆశించవలసింది ప్రజల్లో చైతన్యం. ఎవరెంత తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినా, వాస్తవాలను గ్రహించి, వ్యక్తుల, పార్టీల గుణగుణాలను కూలంకషంగా అంచనావేసుకొని ఓటుని సద్వినియోగం చేసుకుంటేనే ఆంధ్ర ప్రదేశ్ ముందుకు సాగగలిగేది. కులాలని, మతాలని, బంధుప్రీతిని పక్కనబెట్టి, బేరసారాలని దగ్గరికి రానీయకుండా ఉండగలిగితేనే నవ్యాంధ్రకు మంచిరోజులు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో, వివక్షతో కాకుండా వివేకంతో ఓటు వేయాల్సిన సమయం ఇది. ఆంధ్రప్రదేశ్ ను అందరూ అనాథలా వదిలేసిన నేపధ్యంలో సమయోచితంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన సందర్భమిది. పొరబడ్డామా, తరతరాలకు గ్రహణమే.
Good article…