వీరేశలింగం బాట భావితరాలకు వెలుగుబాటే

మే 26 న విజయవాడ లో వంద సంస్థల సారధ్యం లో కందుకూరి 100 వ వర్థంతి జరుగనున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం

రాజమండ్రి అంతా ఉడికిపోతోంది..
ఎక్కడికక్కడే జనం గుంపులుగా చేరి ఏదో తీవ్రంగా చర్చించుకొంటున్నారు. గోదావరీ స్నానఘట్టాలలో పురోహితులందరూ, ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లుగా భయపడిపోతున్నారు. ఇన్నీసుపేటలో, దానవాయిపేటలో, కందకం రోడ్డులో… ఇలా ఒక్కటేమిటి… ఎక్కడెక్కడ నలుగురు నిలబడడానికి అవకాశం ఉందో, అక్కడ జనమందరూ చేరి ఏదేదో మట్లాడుకొంటున్నారు. ఉమా మార్కండేయస్వామి గుడిలో నాపరాళ్ళమీద బాసింపట్లు వేసుకొని కొందరు, ముంగాళ్ళ మీద కూర్చొని ఇంకొందరు పిచ్చిపిచ్చిగా వాదించుకొంటున్నారు. వేణుగోపాలస్వామి గుడి మెట్లు మీద మరికొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆడవాళ్ళు వంటపనులు మానివేసి, ఒకచోట చేరి ఏమిటీ విడ్డూరం అంటూ నోళ్ళు నొక్కుకొంటున్నారు.

జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎకాఎకిని కాకినాడ నుండి గుఱ్ఱపుబండిలో రాజమండ్రి వచ్చి, శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు. జాయింట్ మేజస్టేట్ వచ్చి అక్కడి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ వచ్చేడు. సాయంకాలం అవుతున్న కొద్దీ, ఊరంతా ఏదో కలత చెందినట్లు కన్పిస్తోంది. రాజమండ్రి పౌరులు మాత్రమే కాదు, కాకినాడ, పిఠాపురం, విశాఖపట్నం వరకూ ఉన్న ప్రాంతాల నుండి కూడా కొందరు పెద్దలొచ్చి ఆనాటి సంఘటనను చూడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. అందరికళ్ళూ అటువైపే, అందరి దృష్టి ఆ ఇంటివైపే. సూర్యుడు గోదారిలో అస్తమించాడు. మెల్లిగా చీకటిపడుతోంది. గోదారిగట్టు మీద ఎన్నో కాగడాలు వెలిగించారు. దానితో చీకట్లో ఉన్న గోదారిగట్టు అంతా పట్టపగల్లా అయ్యింది. జనంలో ఆసక్తి తారాస్థాయికి చేరుతోంది. మరికాసేపటిలో జరగబోయే కార్యక్రమాల్ని చెడగొట్టాలని కొందరు దుడ్డుకర్రలు చేతబట్టి మారుమూలల్లో నిలబడ్డారు. అయితే అటువంటివాళ్ళను ఎదుర్కోవడానికి, ఎందరో కళాశాల విద్యార్థులు సిద్దంగా నిలిచారు. శాంతి భద్రతల్ని కాపాడే అతి ముఖ్యమైన పనిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తన చేతుల్లోకి తీసుకొని, తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడం వల్ల, కార్యక్రమాన్ని కాపాడడానికొచ్చిన కళాశాల విద్యార్థుల వల్ల అల్లరిమూకలు భయంతో అడుగు కదపలేదు. అనుకొన్న సమయం సమీపించింది. మంగళవాయిద్యాలు ఒక్కపెట్టున మ్రోగాయి. వధూవరులు తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకొన్నారు. వైవాహిక మంత్రాలతో అగ్నిసాక్షిగా వరుడు, వధువు మెడలో తాళి కట్టాడు. అది ఒక చారిత్రక సంఘటన. తరతరాలుగా వైధవ్యపు శృంఖలాలలో మగ్గిపోతున్న స్త్రీల బ్రతుకుల్లో, వెలుగు నింపడానికి ఉద్యమించిన గొప్ప సంఘటన అది. స్త్రీ జాతి చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర ఘడియ అది. అదే వితంతు స్త్రీ పునర్వివాహ ఘట్టం. అది జరిగింది. 1881 వ సంవత్సరం డిశంబర్ నెల 11వ తేదీ. ఆ మహాకార్యాన్ని చేసి జాతిచరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి అంకురార్పణ చేసిన మహనీయుడే వీరేశలింగం. తెలుగు వారి పుణ్యఫలం కందుకూరి వీరేశలింగం. దురాచారాలు రాజ్యమేలుతున్న ఒకనాటి సమాజంలో, దుర్మార్గులు, అవినీతిపరులు, లంచగొండులు విచ్చలవిడిగా విజృంభించి, నీతి న్యాయాలను, సత్యధర్మాలను అణగదొక్కిన ఒకానొక కాలంలో వీరేశలింగం జన్మించాడు. అధర్మాన్ని, అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించి, సమాజశ్రేయస్సు కోసం జీవితాంతం పోరాటం చేసాడు. తన మార్గంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ముందుకే నడిచాడు తప్ప వెనకడుగు వేయలేదు. సంఘంలోని దురాచారాలను నిర్మూలించడమే తన ఏకైక కర్తవ్యంగా భావించి, అనవతరం సంస్కరణబాటలో సాగాడు. వీరేశలింగం జన్మించి, జీవించి, సంఘసంస్కరణ కోసం శ్రమించి ఉండకపోతే మన సమాజం ఎన్నో విధాలుగా వెనుకబడి ఉండేది. 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో వీరేశలింగం జన్మించాడు. కందుకూరి వారు వీరశైవులు. విభూతి ధారణం, రుద్రాక్షలు, పార్దివలింగపూజ వీరశైవుల నిత్యకృత్యం. వీరేశలింగం తాతగారి పేరు వీరేశలింగమే. ఆ పేరే ఆయనకి పెట్టారు. వీరేశలింగం తండ్రి సుబ్బరాయుడు. తల్లి పున్నమ్మ.

చిన్ననాడు పులిపాక అమ్మరాజు దగ్గర వీరేశలింగం అక్షరాభ్యాసం జరిగింది. గూని సోమరాజు బడిలో, వీరేశలింగం బాలరామాయణం, అమరకోశం చదువుకొన్నాడు. పాఠశాలలో వీరేశలింగానిది ఎప్పుడూ ప్రథమస్థానమే. 1861వ సంవత్సరంలో వీరేశలింగానికి పదమూడు ఏళ్ళ వయసులో, బాపమ్మతో వివాహం అయ్యింది. పెళ్ళిలో ఆమె పేరును రాజ్యలక్ష్మి అని మార్చింది ఆయన తల్లి. రాజ్యలక్ష్మి నిజంగా రాజ్యలక్ష్మి, ఆమె అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో గానీ, అది వీరేశలింగం ఇంట సకల శుభాలకూ, సమాజ శుభాలకూ నాంది పలికింది. 1910లో మరణించేంత వరకూ ఆమె వీరేశలింగానికి అన్ని విధాలా తోడునీడగా నిలిచింది.
కోరంగి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా వీరేశలింగం తన ఉద్యోగ జీవితం ఆరంభించాడు. 1874లో ధవళేశ్వరంలోని ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా అవకాశం వచ్చింది. ధవళేశ్వరం నుండే ఆయన సామాజిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1875లోనే ఆయనకు బసవరాజు గవర్రాజుతో స్నేహం అయ్యింది. అది ప్రగాఢమైన అనుబంధంగా మారింది. కాలక్రమంలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో వీరేశలింగం తెలుగు ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. వీరేశలింగం జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలు ఎన్నో.. ఎన్నెన్నో… 1890లో రాజమండ్రిలో పౌరుల కోసం పురమందిరాన్ని నిర్మించాడు. 1898లో మద్రాసులో జరిగిన అఖిల భారత సాంఘిక మహాసభకు వీరేశలింగం అధ్యక్షత వహించాడు. దాదాపుగా మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితానికి 1904లో ముగింపు పలికి సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని, గ్రంథరచనని ఉధృతం చేసాడు. 1906లో వీరేశలింగం అనుష్టాన బ్రహ్మసమాజీకుడై కులాన్ని, జంధ్యాన్ని వదిలిపెట్టాడు. అదే సంవత్సరంలో హితకారిణీ సమాజాన్ని స్థాపించి, తన యావదాస్తినీ దానికి అర్పించాడు. చివరి క్షణం వరకూ సమాజసేవకే తన జీవితాన్ని సమర్పించుకొన్న వీరేశలింగం, 1919 మే 27వ తేదీన ఉదయం 4 గం.ల 20 నిమిషాలకు, మద్రాస్లోని కొమరాజు లక్ష్మణరావు గారింట తుదిశ్వాస విడిచారు.

ఆయన జీవితం ఓ మహాకావ్యం. ఆయన కృషి ఓ మహాగ్రంథం. అందులో ఎన్నో మహత్తరమైన అధ్యాయాలున్నాయి. ఎన్నో చారిత్రక సంఘటనలున్నాయి. వీరేశలింగం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది వితంతు పునర్వివాహం. అది వీరేశలింగం సాధించిన ఓ అద్భుతం. స్త్రీలు చదువుకొంటేనే వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుందని, ఇల్లాలి చదువే ఇంటికి దీపం అని, వీరేశలింగం తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా నొక్కి చెప్పాడు. అలా చెప్పడమే కాదు. ఆయనే స్వయంగా తన భార్యకు చదువు చెప్పి, విద్యావంతురాల్ని చేసాడు. 1874వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను ప్రారంభించి స్త్రీ విద్యారంగంలో ఎందరికో మార్గదర్శకుడయ్యాడు వీరేశలింగం. ఈ రోజు ఇన్ని వేలమంది, లక్షలమంది స్త్రీలు ఇంత విద్యాధికులై, ఎన్నో గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారంటే, అందుకు మూలకారణం, తొలి అడుగు కందుకూరి వీరేశలింగమే.

ఇలా వీరేశలింగం గురించి చెప్పాల్సివస్తే, … అదో మహాగ్రంథమవుతుంది. ఆయన సాగించిన ఉద్యమాలు, నిర్మించిన మందిరాలు, సంకల్పించిన ఉత్కృష్టమైన కార్యాలు, కార్యక్రమాలు, ఆశించిన సమాజశ్రేయస్సు, దర్శించిన స్త్రీజనాభ్యుదయం, అంకితమైన మహోన్నత విలువలు… ఇలా ఒక్కటేమిటి… వీరేశలింగం నడిచిన బాట అంతా భావితరాలకు వెలుగుబాటే. తాను జీవించి ఉన్న కాలం కన్నా, ఓ నూరేళ్ళ ముందుకు చూసిన క్రాంతదర్శి వీరేశలింగం.
కందుకూరి వీరేశలింగం ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి,

వాడ్రేవు సుందర రావు
నంది అవార్డ్ గ్రహీత

2 thoughts on “వీరేశలింగం బాట భావితరాలకు వెలుగుబాటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap