సినిమా పాట అంటేనే.. మనల్ని వెంటాడే ఓ కమ్మని మాధుర్యం. అందులో తల్లి ఒడిలో లాలన, ఆలనతో పాటు ప్ర్రేమానురాగాలూ, మానసిక సంఘర్షణలూ ఉంటాయి. మనసును ఉత్తేజపరిచే అనిర్వచనీయమైన అనుభవాలూ ఉంటాయి. అందుకే సినిమా పాట మనలో చాలామందికి నిత్యనూతనంగా మారుమోగే ఓ జీవన సవ్వడి. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలూ అందుకు మినహాయింపు ఏమీకాదు. కానీ, ఇంకా అతని పాటలో ఏదో ఉంది. ఏదో ఏంటి? అన్నదే ఇక్కడ ప్రశ్న. అవును అతడి పాట చాలా సందర్భాల్లో శ్రోతల్ని అనేక రకాలుగా ఆలోచనలో పడేసే పెద్ద ప్రశ్న అవుతుంది. ప్రశ్నగా పల్లవించి.. ఆనక నిగ్గదీసి అడిగే ప్రబోధంలా, నినాదంలానూ మారుమోగుతుంది. అలా గుండెలపై ఏవో స్పందనల్ని సృష్టిస్తూ.. సుతిమెత్తగా దరువేస్తూనే.. ఒక కథలా మనతో అల్లుకుపోతుంది. అదే ‘సిరివెన్నెల’ పాటల ప్రత్యేకత. ఆ ప్రత్యేక పాటల గమనంలో అంతుపట్టని పార్శ్వాలు చాలానే ఉన్నాయి. ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ పాటల్లోని వైవిధ్యాన్ని గుండెల నిండా నింపుకుందాం.. రండి!
కొన్ని మాటల్ని మళ్ళీ మళ్ళీ పలకాలి. పదేపదే మాట్లాడుకోవాలి. సినిమా పాట కూడా అలాంటిదే. అలా నిత్యం శ్రవణానందభరిత వాహికై.. వాగుల్లో, వంకల్లో, చేనుల్లో, సెలయేరుల్లో, పాండిత్యపు పరిమళాలుగల వినువీధుల్లో ఇలా.. అన్నింటా జీవనదీ ప్రవాహంలా సాగిపోయే పాటలు రాశారు కనుకనే సిరివెన్నెల కీర్తి శిఖరాన తాజాగా ‘పద్మశ్రీ’ చేరింది.
ఓ పట్టాన.. అంతుపట్టడు
మన భాషలో చెప్పాలంటే.. సిరివెన్నెల గేయ రచయితగా.. చిక్కడు.. దొరకడు. ఫలానా జానర్లో మాత్రమే పాటలు రాయగల జాబితాలోనూ ఉండడు. ఈయన్ని పాటగాడిగా ఒక్కచోట కూర్చోబెట్టడం అంటే.. అది సాహసమే. తనతో పనిచేయించుకునే సినిమా దర్శకులకూ అది సాధ్యంకాలేదు. సినిమా పాట కోసం ఇసుమంత పాండిత్యాన్ని, జీవితసారాన్ని ‘రాసి’ ఇవ్వండి చాలు అని అడిగితే.. కొండంత మేలిమి బంగారాన్ని, సింగారాన్ని, అద్భుత సాహిత్యపు సుగంధాల్ని అద్ది.. అలవోకగా పాటలు రాసిస్తారు సిరివెన్నెల. ఇలా తన ముప్పయేళ్ళకు పైబడిన సినిమా పాటల ప్రయాణంలో మేలిమిగన్న అణిముత్యాలు ఇవి అని శ్రోతలు వెదకాలని, శోధించాలని, నిర్ణయించాలని అనుకోవడమూ ఒక సాహసమే. కానీ, కొన్ని ‘సిరివెన్నెల’ పంచిన పల్లవుల్ని మనసు నిండా నింపుకోవడానికి ఇదే సమయం. అందుకే సీతారామశాస్త్రి పాటల పూదోటలో.. కొన్ని పూబాలల్ని పలకరించే ప్రయత్నం చేద్దాం.
అర్థం తెలియకున్నా..
నిజానికి ‘సిరివెన్నెల’ సినిమాలో రాసిన వాటిల్లో కొన్ని పాటల్లో సాహిత్యం చాలావరకూ.. సామాన్య ప్రేక్షకులకి అర్థంకావు. కానీ, అర్థం తెలియకున్నా.. కవి చెప్పాలనుకున్న భావం మాత్రం శ్రోతల గుండెలదాకా చేరిపోయింది. ఎంతగా అంటే.. ‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైనా.. జాగృత విహాంగ తతులే వినీల గగనపు వేదికపైన’ అంటూ.. పశువులకాపరి సైతం పొలంగట్లపై పిల్లనగ్రోవి ఊదుకుంటూ అవలీలగా పాడుకునేంతగా. వినగా వినగా వేప.. తీయగా నుండు అన్నట్టుగా.. సీతారామశాస్త్రి రాసిన కొన్ని సంస్కృత పదపుష్టిగల పాటలూ జనాల నాలుకలపై పటికబెల్లం ముక్కలా కరిగిపోయాయి.
ఎంత పాండిత్యం ఉంటే ఏముంది? పామర భరితం కానప్పుడు.. అనుకోవడానికీ ఏమాత్రం తావులేకుండా.. అతిసామాన్య పదాలతో.. ప్రేక్షకుల్లో పల్లవించడమూ సిరివెన్నెలకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో! ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకువచ్చే ఈ మాయనీ” అంటూ లోకం పోకడను.. వాడుక భాషలోనే చెప్పిన సిరివెన్నెల ఇదే సినిమాలో ”లలిత ప్రియ కమలం విరిసినదీ..” అంటూ ఫంక్తు రసాత్మక పదాలతోనూ తన బహుముఖీన సినిమా గీతాల పార్శ్వమేంటో చెప్పకనే చెప్పారు. ఇలా తవ్వే కొద్దీ.. ‘సిరివెన్నెల’ పాటల బావిలో.. ఉప్పొంగే తియ్యని ఊటలెన్నో.
సంకీర్తనా..? సినిమా పాటనా?
‘ఒకప్పుడు.. త్యాగయ్య, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు ఉండేవారంట..! అని చెప్పుకోవడం ఎందుకు..? ఈయనా ఆ కోవలోకే వస్తారోరు..!’ అని మనం ఆయన గురించి అనుకున్నట్టుగా.. ఆ స్థాయి ప్రమాణాలతో సీతారామశాస్త్రి రాసిన పాటలు అనేకం. ‘శృతిలయలు’ సినిమాలో రాసిన ‘తెలవారదేమో స్వామీ..’ అనే పాట అలాంటిదే. ఈ పాట విన్నవారంతా.. ఇప్పటికీ వింటున్న చాలామంది.. గతకాలపు ఏ వాగ్గేయకారుడో రాసిందేమో.. అని అనుకుంటారు. కానీ, సీతారామశాస్త్రి ప్యాంటు, చొక్కా వేసుకున్న ఓ గొప్ప వాగ్గేయకారుడే..! అని చెప్పడానికి ఇలాంటి సినిమా పాటలే ఓ ఉదాహరణ. దీనికి భిన్నంగా ”చిలకా.. ఏ తోడులేక.. ఎటేపమ్మ ఒంటరి నడకా..” అంటూనే ”కన్యాకుమారీ.. కనబడదా దారి.. కయ్యాలమారి.. పడతావే జారి” అంటూ చమత్కరిస్తాడు. ”బలపంపట్టి భామ బళ్లో .. అ..ఆ ఇ ఈ నేర్చుకుంటా..” అని అల్లరీ చేస్తాడు. దటీజ్ ‘సిరివెన్నెల’!
మరీ.. ఇంత హుషారా!
సినిమా పాటకు హుషారు ఉండాలి. అందుకు తగ్గట్టుగానే సినిమాకు, సినిమాలోని సన్నివేశానికీ ఎంత హుషారు కావాలో.. అంతటి హుషారును సమపాళ్లలో రంగరించి, పాటలు రాయడం సిరివెన్నెల్లోని మరో ప్రత్యేకత. ‘విరించినై విరచించితిని ఈ కవనం..విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ పాండిత్యపు సొబగులతో గాంభీర్యంగా ఎన్నో పాటల్ని రాసినాయనే.. ‘బోటనీ క్లాసు ఉంది.. మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా” అంటూ కాలేజ్ కుర్రకారును ఒక ఊపు ఊపేయడం ఎలా మర్చిపోగలం? బ్యాచిలర్ జీవితాన్ని వదులుకోవద్దు అని సుద్దులు చెప్పే ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలరు” పాట నుంచీ.. ”చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతానంది మనీ మనీ..” అంటూ ‘కరెన్సీ’లో గల లోగుట్టును సరదాగా చెప్పే పాటైనా.. సీతారామశాస్త్రి మార్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. విని తరించాల్సిందే.
సమాజాన్ని దర్శించిన కవి
సినిమా కవికి ఇంత ఆవేశమేంటబ్బా..?! అనుకునేలా ఉంటాయి ‘సిరివెన్నెల’ రాసిన కొన్ని పాటలు. ఆవేశం రగిలించడమే కాదు, ఆ ఆవేశం వెనుకదాగిన బాధాతప్త హృదయమూ సూటిగా వచ్చి, మన గుండెల్నీ తాకుతుంది. తొలిరోజుల్లో ‘గాయం’ సినిమా కోసం ”నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్ఛవాన్ని” అంటూ ఎంతో కోపంగా సమాజాన్ని ప్రశ్నించినా.. ‘మహాత్మ’ సినిమా కోసం ”కొంతమంది సొంతపేరు కాదురా.. గాంధీ.. ఊరికొక్క వీధిపేరు కాదురా గాంధీ” అని గాంధీతత్వాన్ని గుర్తుచేసినా.. ”పట్టుదల” చిత్రం కోసం ”ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి” అంటూ నిరుత్సాహాన్ని వీడమనే సందేశమిచ్చే ఆ పల్లవుల్లో కవిలోని సెగ, రగిలింపు స్పష్టంగా కనపడుతుంది. ఇలా సినిమా అవసరానికి తగ్గట్టు పాటలు రాయాల్సి వచ్చినా.. సమాజాన్ని దర్శించడం ఎప్పుడూ మానలేని, మానుకోని కవి ‘సిరివెన్నెల’.
‘ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి. ఈ పాట పురిట్లోనే సంధికొట్టి ఛస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి పారెయ్యాలి. అని ఎవరూ అనుకోరు. ఆ పాట వీధినపడ్డ తర్వాత తెలుస్తుంది దాని బతుకేమిటో! కవి రాతతో పాటూ పాటకి దాని సొంత తలరాతా ఉంటుంది’ అంటూ తను రాసే సినిమా పాటల గురించి చాలా సాదాసీదాగా చెప్పినాగానీ అందులోని మర్మాన్ని వెదకడం పెద్ద కష్టమేమీకాదు. చిన్నపాటైనా, పెద్దపాటైనా ఆ పాటలు రాయడంలో ఉన్న కష్టమేంటో తెలిసిన గేయకవి సిరివెన్నెల. అలా మధనపడి క్షణాల్లో రాసిన పాటలూ ఉన్నాయి. ఎంతకూ తెగపడని ‘శివపూజకు చిగురించెను సిరిసిరిమువ్వా” అనే సమయానికి లొంగని పాటలూ ఉన్నాయి.
సినిమా పాట.. కత్తిమీద సామే
‘సిరివెన్నెల’ మాటల్లో చెప్పాలంటే.. సినిమా పాట రాయడం అంటే కత్తి మీద సాములాంటిదే. సమాజంలో లేని కాల్పనిక సన్నివేశాలకు పాటలు రాయాల్సి వచ్చినప్పుడు.. పాత్రల్లోకెళ్ళి పరకాయ ప్రవేశమైనా చేయాలి. లేదంటే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా.. స్వాగతించేలా అయినా పాట రాయాలంటారాయన. ‘సాధారణంగా మనం నిత్యం తీసే సినిమాల్లోనూ, చూసే సినిమాల్లోనూ ఉండే పాటలు, సంగీతబద్ధంగా ఉండే మామూలు మాటలే తప్ప, గొప్ప కవిత్వాలు కాదు. కానక్కర్లేదు కూడా. కాకూడదు కూడా. పార్కులో గంతులేస్తూ, డ్యూయట్ పాడుకునే హీరో హీరోయిన్లు కవులు కాదు. కనుక వాళ్ళ నోటెంట కవిత్వం రాకూడదు’ అంటూ సినిమాగేయ రచయితలకుండే చిన్నపాటి కష్టాన్నీ, బాధ్యతనీ నవ్వుతూ చెప్పకనే చెప్తారు సీతారామశాస్త్రి.
సినిమాను మాస్, క్లాస్ అనే రెండు రకాలుగా విభజిస్తాం. అందులో పనిచేసే వాళ్ళనూ అలాగే విభజించుకుంటాం. అంటే మాస్ చేసేవాళ్ళు క్లాస్ చేయరని, క్లాస్ చేసేవాళ్ళు మాస్ చేయలేరని అర్థం. ఇక్కడ రచయితల ముద్రా అలాంటిదే. కానీ ‘సిరివెన్నెల’ పండిత పామరుల్ని ఒకేలా అలరించడంలో నేర్పరి.. వెండితెరకే శోభను చేకూర్చిన అక్షరశిల్పి. అందుకే ఈ తరంలో ఎందరో గేయ రచయితలు.. ఆయనకు ఏకలవ్య శిష్యులయ్యారు. ‘సిరివెన్నెల’ మాత్రం ఇప్పటికీ ”తెల్లారింది లెగండోయ్.. కొక్కొరొక్కో..!” అంటూ కొత్తపలుకు కోసం ఇంకా ఇంకా అన్వేషిస్తూనే ఉంటారు. అందుకే సీతారామశాస్త్రి కోసం ‘పద్మం’ హత్తుకుని ‘సిరివెన్నెల’ కాంతులీనుతూ.. ఆయన మెడలో హారమైంది.
– గంగాధర్ వీర్ల
Deserved person. Congrats Sirivennela garu
Congrats sir