వెల్చేరు నారాయణరావు కు 2019 “సంస్కృతి పురస్కారం “

కీ.శే. మండలి వెంకట కృష్ణారావు పేరిట ప్రతి సంవత్సరం ప్రకటించే “సంస్కృతి పురస్కారాన్ని” పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి గాను ఆచార్య వెల్చేరు నారాయణరావు కు ప్రధానం చేయనుంది. పురస్కార ప్రదానోత్సవం ఆగస్ట్ 5, 2019 న,హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరుగుతుంది.
“సంస్కృతి పురస్కారం ” నేపద్యం…
తెలుగుజాతికి సదా స్మరణీయుడైన మహోన్నత నాయకుడు మండలి వెంకట కృష్ణారావుగారు. వారు అతి చిన్న వయసులోనే రాజకీయరంగంలో ప్రవేశించి పార్లమెంటు సభ్యులయ్యారు. కీ.శే. పి.వి. నరసింహారావుగారి మంత్రివర్గంలోనూ, కీ.శే. జలగం వెంగళరావుగారి మంత్రివర్గంలోనూ, కీ.శే. కోట్ల విజయభాస్కరరెడ్డి గారి మంత్రివర్గంలోనూ రాష్ట్ర మంత్రిగా తెలుగువారికి విశిష్ట సేవలందించారు. వీరు ప్రముఖ గాంధేయవాది. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారు. రాజకీయాలను సంఘ సేవగా మలుచుకొని విజయం సాధించారు. 1975 ఏప్రిల్లో హైదరాబాదులో వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహకుడుగా వ్యవహరించి తెలుగువారి ఐక్యతను ప్రపంచానికి చాటారు. మహాసభల తీర్మానం మేరకు రాస్ట్రేతర ప్రాంతాల్లో, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారి విద్యాసాంస్కృతిక అవసరాలు తీర్చడానికి, ఆయా ప్రాంతాల్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, పరివ్యాప్తికి అంతర్జాతీయ తెలుగు సంస్థను స్థాపించి, వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రపంచంలోని తెలుగువారందరితో సంప్రదింపులు జరిపి, వారి బాగోగులు తెలుసుకొని వారందరినీ ఒకే వేదికపై నిలిపి, తెలుగుజాతి – వికాసానికి, తెలుగు భాషాసంస్కృతుల అభివృద్ధికి తన జీవితాన్ని ధారపోశారు. ఆనాడు తెలుగునాట అన్ని రంగాలలో ప్రాచుర్యం పొందిన కళాకారులను, కవులను, జాతీయ నాయకులను భావితరాల వారికి అందించాలనే సత్సంకల్పంతో ‘తరతరాల తెలుగుజాతి’ ప్రదర్శనను ఏర్పాటు చేసి, స్పూర్తినిచ్చారు. వారి స్మృత్యర్థం అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి మండలి వెంకట కృష్ణారావు గారి పేరు పెట్టడం జరిగింది. అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని రాషేతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తికి విశేష కృషి సల్పిన వ్యక్తులకు / సంస్థలకు మండలి వెంకట కృష్ణారావు పేరిట ప్రతి సంవత్సరం సంస్కృతి పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తోంది. ఈ పురస్కారానికి వారి తనయులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్దప్రసాద్ గారి ఆర్థిక సౌజన్యం అందిస్తున్నారు.

ఆచార్య వెల్చేరు నారాయణరావు గురించి …
తెలుగు భాషా సాహిత్యాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఎనలేని కృషి చేసిన ఆచార్య వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ (యు.ఎస్. ఎ)లో కృష్ణదేవరాయ చైర్ ప్రొఫెసర్గా పాతికేళ్లకు పైగా పనిచేశారు. ప్రస్తుతం ఏమోరి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
పాల్కరికి సోమనాధుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని అత్యుత్తమ గ్రంథాలను అనువదించి పాశ్చాత్యులకు తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేశారు. తెలుగు భాష గొప్పదనాన్ని తెలియపరిచారు.
ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాలలో బి.ఏ., ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఎం.ఏ. పూర్తి చేసిన అనంతరం వెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో డిప్లోమో అందుకున్నాడు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పిహెచ్.డి. పట్టా అందుకున్నాడు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్గా అనంతరం 1987లో ఆచార్యునిగా పదోన్నతి పొందారు.
వెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంలో తెలుగు విమర్శరంగంలో తనదైన స్థానాన్ని పొందారు. ఆయన తొలి విమర్శగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం”లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించారు.
నారాయణరావు చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు, గౌరవాలు ఆయనను వరించాయి. ఆయనను జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ (1987). మెడిసిన్ విశ్వవిద్యాలయంలో ఇనిస్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ హ్యుమానిటీస్ (1999), విన్స్ ధాస్ట్ కళాశాల, బెర్లిన్ (2000-01) ఫెలోగా, మేడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ హ్యుమానిటీస్ (2005)లో సీనియర్ ఫెలోగా నియమించి గౌరవించాయి. 2004లో డేవిడ్ షుల్మన్తో సంయుక్తంగా అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్ నుంచి “ఎ.కె. రామానుజన్ అనువాద బహుమతి” అందుకున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 2004-05 సంవత్సరానికి గాను రాధాకృష్ణన్ స్మారకోపన్యాసానికి గాను ఎంపిక చేసి గౌరవించింది. 2005లో ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ఆహ్వానంపై 3 సార్లు ఉపన్యసించారు. పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో, అనేక విశిష్ట వేదికల మీద ఆహ్వానాల మేరకు ఉపన్యసించారు. అంతర్జాతీయ స్థాయిలో పలు సదస్సుల్లో ప్రసంగించారు. వారు తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన విశేష సేవకు గుర్తింపుగా మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం అందజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap