వ.పా. గారి బొమ్మలు ప్రభావితంచేసాయి- ఏ.వి.ఎమ్.

ఆరోజుల్లో చందమామ కొనేవాడిని ఓసారి హనుమంతుని బొమ్మ పర్వతం తీసుకెళ్తున్నది టైటిల్గా వచ్చింది. ఆ బొమ్మకి ఆకిర్షింపబడ్డ నేనూ కాంచనరామ్ చూసి వేశాం, పటంకూడా కట్టించాం, బాగానే వచ్చింది. అలా వేసూ వేస్తూ ఎస్. ఎస్. ఎల్.ఇ. అయింతర్వాత కాలేజీలో చేరాం, అక్కడ విశ్వనాధబాబు అనే మంచివాడు మిత్రుడు అయ్యాడు. తర్వాత శెలవుల్లో లైన్ గ్రాయింగ్ శ్రీనివాసరావుగారి వద్ద నేర్చుకుని మద్రాసులో లైన్ డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పాసయ్యా, అప్పుడు ఎక్కువగా ‘వ.పా’ గారి బొమ్మలు క్యాలెండర్ బొమ్మలు వాటర్ కలర్స్లో వేశేవాడిని. అప్పుడు నా వాటర్ కలర్స్ బొమ్మ “నారీ నారీ నడుమ మురారి” అనే బొమ్మ అంధ్రప్రభ వీక్లి లో కలర్స్ లో ప్రింటువేశారు. అప్పుడు బాపుగారి బొమ్మలు సీరియల్ కథలకి వచ్చేవి. అవి అభిమానించి వీక్లీలు కొని బాపుగారి బొమ్మలు దాచేవాడిని. అప్పుడు జయశ్రీ, జ్యోతి మాసపత్రికలు కూడా వుండేవి, వాటర్ కలర్స్తో వేసే బొమ్మలకు నాకు పేరు రాదని కార్టూనింగ్లోకి అడుగువేశా, అప్పట్లో “గీతాసుబ్బారావుగారు ఆంధ్రప్రభ డైలీలో రాజకీయ కార్టూనింగ్లో పెద్దపేరు వుండేది. అలా అలా కార్టూన్లు వేస్తూ బాపు గారి కార్టూన్లు బాగా స్టడీ చేసేవాడిని, బాపుగారికి అలా ఐడియాలు ఎలా వస్తాయో నాకు తెలిసేది కాదు, నేను ఎంతో ఆలోచిస్తేగాని ఒక్క ఐడియా వచ్చేది కాదు. అలా వేస్తూనే ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి, జ్యోతిసినిమా పత్రికలకూ కార్టూన్లు వేసి పర్సనల్గా వెళ్లి ఇచ్చేవాడిని. ఒక సారి సినిమా ఎడిషన్ ఎడిటర్ గారు కొన్ని వ్యాసాలు ఇచ్చి వాటికి కార్టూన్లు వేసి ఇమ్మన్నారు. అప్పుడు తెలిసింది కిటుకు, మనం రోజూ డైలీ, వార, మాసపత్రికలు అన్నీ చదవాలి, చుట్టూ పరిస్థితులను గమనించాలి. నవ్వుతూ కబుర్లు చెప్పుకోవాలి, మనస్సు ఆనందంగా వుండాలి.

1975 ప్రాంతాల్లో శేఖర్, వేణు, రమేష్, రాజు, ఎమ్.వి.ఆర్. నేను అంతా కలిసి “వికాసం” అని విజయవాడ కార్టూనిస్టుల సంఘం నడిపాము. తర్వాత వాళ్లంతా ఉ ద్యోగాలలో వూళ్లూ మారారు, నేను మళ్లీ ఒంటరిని అయ్యాను, వ్యాపారంలో ఖాళీలేక కొన్నాళ్లు కార్టూన్లు వెయ్యలేదు, మొదట్లో “గుప్త’ పేరుతో కార్టూన్లు వేశాను, తర్వాత ఏ.వి.ఎమ్. పేరుతో మొదలు పెట్టాను, ఇప్పటి దాకా 2018 దాకా ఆపలేదు, హైద్రాబాద్ లో వున్న ‘శంకు’ గారు కూడా కార్టూనిస్టులందర్నీ ఒక తాటిమీదకు తీసుకు వచ్చే ప్రయత్నంచేశారు. ఆంధ్రజ్యోతి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు, ఆంధ్రభూమి సికరాజుగారి నుండి నేటి నది ప్రభాకర్ గారు, చిత్రయజ్ఞ ప్రసాద్ గారు, హాస్యానందం రామూగారి వరకూ అందరూ కార్టూనిస్టులను, నన్నూ బాగా ప్రోత్సహించారు. తర్వాత మిత్రుడు ‘కళాసాగర్’ కూడా కార్టూనిస్టుల అడ్రసులతో సంకలనాలు తెచ్చి అందరికీ గుర్తింపుతెచ్చాడు. ఒకరకంగా నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది కళాసాగరే. నేనూ, వియోగి, రమేష్గార్లు కలిసి కొన్ని హాస్య సంకలనాలు తెచ్చాం. హాస్యకథ 2012 కూడా త్వరలో అద్భుతంగా తెస్తున్నాం. నా మటుకు నాకు నేను వ్యాపారస్తుడిని, నేను బొమ్మలు, కథలు రాయడం దేవుడిచ్చిన వరం. కాని బొమ్మలు, కథలను ఆరాధించాలే గాని అందులో ఇన్ వాల్వ్ అవకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు, తలిశెట్టి రామారావ్ గారు (కార్టూనిస్ట్) వున్నప్పటి పరిస్థితులు ఇప్పటికీ వున్నాయి. ఎదుటి రచయితనుగాని, ఆర్టిస్టునుగాని అణచివేసేధోరణి రాళ్లు వేసే ధోరణి. అది పోలేదు. ఆ మధ్య డాక్టర్ మధుసూధనరావుగారు (హైద్రాబాద్) ఒక హాస్య కథల సంకలనం తెచ్చారు, ఆ సంకలనంలో AVM కార్టూన్లు వేస్తానంటాడు అవి వెయ్యవద్దూ అని ఆయనకు ఫోన్ చేసి ఓ వైజాగ్ రచయిత చెప్పాట్ట, ఆయన ఆ మాట అందరితో చెబుతున్నారు. “యద్భావం..తద్భవతి” వాళ్ళపాపం వాళ్ళది. బాపుగారి తర్వాత జయదేవ్ గారు, బాలిగారు, సరసి, బ్నీంగార్లు, సత్యమూర్తి గారు వీళ్లంతా మనం మనం అంతా “కార్టూన్ కులం” అనే తత్వం, అందరికీ సహాయం చేసే మనస్తత్వం కూడాను. ఇప్పుడు Facebook, WhatsApp వచ్చింది, వెబ్ పత్రికలు 64కళలు, గోతెలుగు.కామ్, అచ్చంగా తెలుగు, నాకు తెలియనివి చాలా వున్నాయి.

8 thoughts on “వ.పా. గారి బొమ్మలు ప్రభావితంచేసాయి- ఏ.వి.ఎమ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap