సంగీత, నృత్య కళాసవ్యసాచి – శ్రీమతిసంధ్యామూర్తి

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేటి యువత పదకోశం నుంచి క్రమేపి మాయమవుతున్న కాలం. పాశ్చాత్య నృత్య సంగీత హెూరులో శాస్త్రీయతకు విలువ తగ్గుతున్న సమయంలో కళల ఖిల్లా అనంతజిల్లా. అనంతపురం నగరంలో శాస్త్రీయ, సంగీతాలకు పెద్ద పీటవేస్తూ ఆవిర్భవించిన నిలయం శ్రీనృత్య కళానిలయం’. శ్రీమతి జి. సంధ్యామూర్తి గారు తన తల్లిగారు కీ.శే. సరస్వతమ్మ, తండ్రిగారు కీ.శే. పి.యస్.శర్మగార్ల ఆశీర్వచనంతో మూడేళ్ళ వయస్సులోనే నృత్యం నేర్చుకోవడం, ఆరేళ్ళ వయస్సు నుండి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు.

కీ.శే. వరదరాజ అయ్యంగార్ వద్ద భరతనాట్యం, కూచిపూడి వేదాంత పార్వతీ శంకర్ గారి వద్ద నాట్యంలో మెళకువలు, అణామలై చెట్టియాల్ వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. శ్రీమతి జి. సంధ్యామూర్తి తాను అభ్యసించిన మన సంప్రదాయ నృత్య సంగీతాలను 7 సం.లు కేరళలోని ఆలువాలోనూ, 3 సం.లు గుజరాత్ లోని నటియాడ్లలో విద్యార్థులకు శిక్షణ యిచ్చారు. తన తండ్రిగారు కీ.శే. పి.యస్. శర్మ అనంతపురం లలిత కళాపరిషత్ కార్యదర్శిగా 10 సం.లు సేవలందించారు. ఆయన స్థాపించిన “శ్రీనృత్య కళానిలయం’లో వందలాది మందికి మన కళల పట్ల శిక్షణ యిచ్చి చైతన్య వంతులను చేస్తున్నారు. 2011 సం. అక్టోబర్ నందు శ్రీనృత్యకళానిలయం 30 సం.లు పూర్తిచేసుకొంది. 3 దశాబ్దాల క్రితం కాలిమువ్వల సవ్వడి నృత్య కళాభారతిని అలరించాలన్న ఆశయం-కేవలం 5మంది విద్యార్థునులతో ప్రారంభించిన శిక్షణ. విద్యార్థినీ విద్యార్థుల నాట్య సుగంధం శ్రీ చందనం మించిన పరిమళంతో రాష్ట్ర, రాఫ్టేతర, దేశ, విదేశాలలో అనంతపురంలోని శ్రీనృత్యకళానిలయం పరిఢవిల్లుతోంది. 1981 సం. నుంచి స్టేజ్ పెరఫార్మెన్స్ను తన శిష్యులచే యివ్వడం జరిగింది.

1985లో చిలకూరి పేట కళానిలయం వారిచే “నాట్యమయూరి’ అవార్డు అందుకొన్నారు. 1989లో అనంతపురం తపోవనంలోని శివాలయ ప్రాంగణంలో 24 గంటలపాటు ఆ నటరాజుకు నృత్య నీరాజనం సమర్పించారు. 1991లో హంపి డాన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. 1992లో పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా సన్నిధిలో నృత్యప్రదర్శన. 1993లో సింగపూర్ లో మొదటి నృత్య ప్రదర్శన. 1995లో కీ.శే. నందమూరి తారకరామారావుగారి జ్ఞాపకార్ధం కళానీరాజన పురస్కారం అందుకొన్నారు. 2000 సం. లో అనంత ఆణిముత్యంగా మెరిసారు. శ్రీ గణపతి సచ్చిదానందస్వామి సన్నిధిలో ఆయన రచించిన దశావతారలకు నృత్య కల్పన చేసి ఆయన అభినందనలు అందుకున్నారు. తిరుమల బ్రహె్మూత్సవాలలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వేల ప్రదర్శనలిచ్చి అనంతఖ్యాతిని చాటారు. రమణమహర్షి భక్తురాలుగా వుంటూ తాడిపత్రిలోని అనాధశరణాలయంలో ఉచిత శిక్షణ యిస్తున్నారు. “సంరక్షిత” సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అక్టోబర్ 16, 2011న కీ.శే. పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అవార్డు అందుకొన్నారు. తన భర్త కీ.శే. జి. కృష్ణమూర్తిగారి సహకారంతో 30 సం. ల పైగా అనంతపురం నందు మన సంప్రదాయ కళలను కాపాడుతూ వేలాది మంది చిన్నారులను చైతన్య పరుస్తున్నారు శ్రీమతి జి. సంధ్యామూర్తి సరిగమల నిలయం – శ్రీ నృత్య కళానిలయం
సరిగమలతో సరాగాలాడుతూ సుస్వర మధుర సంగీత ఝరిలో ఓలలాడుతూ శాస్త్రీయ సంగీత సామ్రాజ్ఞిగా, నాట్య మయూరిగా, అనంత ఆణిముత్యంగా అందరి మదిలో సంరక్షితగా కళాపోసనకై అహర్నిశలు సర్వం తానై శ్రమిస్తున్న అనంత అమృత మూర్తి జి. సంధ్యామూర్తి.
-లంక ప్రసాద్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap