సప్త స్వర’గళ’ మాలిక – యం.యం. శ్రీలేఖ

చక్కని సంగీతం అందించడం లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంగీతావణి.. ఆమని ఎం.ఎం.శ్రీలేఖ. సంగీత స్వరాలను పుట్టుకతోనే పునికిపుచ్చుకొన్న ఆమె ఆ స్వరాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. గాయకురాలిగా ఎనిమిదో ఏటనే నేపథ్యగానం పై తొలి సంతకం చేసి ఆ మార్గంలోనడుస్తూనే సంగీత సాధన చేస్తూ తన12వ ఏటే వెండితెరపై సంగీత దర్శకురాలిగా స్వరంగేట్రం చేశారు. దాదాపు 80కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఎం.ఎం.శ్రీలేఖ సుస్వర మాధురి ప్రస్థానాన్ని ’64కళలు’ తో పంచుకున్నారు.
* నా క్వాలిఫికేషన్ ఎల్కేజీ-
మాది ఉమ్మడి కుటుంబం మా అమ్మ పేరు భారతి, నాన్న పేరు బోస్. నేను ఎల్కేజీ వరకు చదువుకున్నాను. అది కూడా discontinue నే. నేను చదువు గురించి పట్టించుకోలేదు. ఇంట్లో కూడా నాకు ఎవరు అడ్డు చెప్పలేదు. తోనే నాకు సంగీతం అలవాటయింది. కారణం ఎక్కువమంది మా కుటుంబంలో సంగీతం సాహిత్యం తెలిసిన వాళ్లే కావడం. నేను సంగీతం కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. మా పెద్దనాన్న అంటే కీరవాణి అన్నయ్య వాళ్ల నాన్నగారు. ఆయన పేరు శివ దత్త. మా నాయనమ్మకు ఆరుగురు అన్నదమ్ముల్లో ఆయన పెద్దవారు. మా నాన్న ఐదవ వారు, ఎస్ ఎస్ రాజమౌళి వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ ఆయన ఆరో వ్యక్తి. ఆరుగురు అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు. పెద్దలు పిల్లలు అందరూ కలిసి 30 మంది ఉండేవాళ్ళం పెద్ద ఉమ్మడి కుటుంబం. చాలా కాలం అలా ఉన్నాము. మా పెద్దనాన్న శివ దత్త వారానికి ఒక్కసారి అంటే ఆదివారం ఒక గంట సంగీతం చెప్పేవారు. అది కూడా నాకు సంగీతంపై ఉన్న మమకారాన్ని చూసి మాత్రమే. అంతే తప్ప నేను మరి ఎవరి దగ్గర నేర్చుకోలేదు.
* నాగాడ్ ఫాదర్లు దాసరి, డిరామానాయుడులు…
– నాకు సినిమా రంగంలో ఆకాశాలిచ్చి గాడ్ ఫాదర్స్ గా నిలిచింది దర్శకరత్న దాసరి నారాయణరావు, నిర్మాత డి రామానాయుడులు. మొదటి పాట అవకాశమిచ్చినది దాసరి అయితే బ్రేక్ ఇచ్చింది మాత్రం రామానాయుడు. ఇప్పటి లాగా వర్తమాన గాయనీగాయకులకు టీవీ షోల్లో వచ్చే పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్ లాంటి వేదికలు అప్పట్లో లేవు. డి.రామానాయుడు అవకాశమిచ్చిన తాజ్ మహల్ చిత్రం నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కణ్ణించి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అన్నయ్య కీరవాణి నుంచి నేను ఎటువంటి సహాయం ఆశించడం లేదు ఆయన చేయను లేదు. దాదాపు 80కిపైగా సినిమాల కు సంగీత దర్శకత్వం అందించాను.
ఆ తర్వాత రామానాయుడుతో నేను 13 చిత్రాలు చేశాను. అన్ని మ్యూజికల్ హిట్ గా నిలవడం అదృష్టం కలిసొచ్చింది.
* కాకి-కోకిల గా ఎప్పుడు మారింది..
నా చిన్ననాటి సమయంలో నేపథ్యగాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికు శిక్షణ తీసుకునేందుకు వెళ్లాను. అయితే నా గొంతు విన్న ఆయన నన్ను ఉద్దేశించి మాట్లాడుతూ” ఈకాకి గొంతుకు నేను నేర్పించను” అన్నారు. ఆ చేదు మాటలకు బాధ పడకుండా సవాల్గా తీసుకొని కఠిన సాధన చేశాను. ఇళయరాజా సంగీత అంటే నాకు ప్రాణం. ఆ పాట వినడం అలాగే ట్యూన్ కట్టడం అలా ఒక్కో పాట నేర్చుకున్నాను. అలా అలా సంగీతంపై పట్టు సాధించాను. ఏదైనా ఒక్కసారి వింటే ఇట్టే గ్రహించగల మెమరీ భగవంతుడు నాకు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి తో సినిమాకు కలిసి పాడే అవకాశం వచ్చింది.( ఆయనకిద్దరు సినిమాలో-అందాలు అందాలు మధు మాసపు మన్మధ రాగాలు) అంటూ సాగే పాట పాడాను. ఈ పాట విన్న ఎస్పీ బాలు, ఈ కాకి కోకిల ఎప్పుడయింది. అంటూ భుజం తట్టారు.
* మంచి ప్రశంసలు అందాయి
దాదాపుగా చిన్న చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చాను. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, మీనా మీనా జలకాల మీనా, మీసాలు గుచ్చకుండా ఓరి నాయనో ముద్దాడుతావా నువ్వు.., అలరు చంచలమైన ఆత్మనందుండ.., తెలుగు పదానికిది జన్మదినం.. లాంటి పాటలు నే నే పాడానా ? అని చాలామందికి అనుమానం వస్తుంది కానీ, అవి నిజంగా నేను పాడిన పాటలు వాటికి ఎంతో పేరు వచ్చింది. అలాగే నేను సంగీత దర్శకత్వం వహించిన అదిరిందయ్యా చంద్రం, ఆ ఆ ఇ ఈ, ప్రేమించు దుశ్శాసన, పల్లకిలో పెళ్లికూతురు, లాంటి చాలా సినిమాలు మ్యూజిక్ హిట్గా నిలిచాయి.” కంటేనే అమ్మ అని అంటే ఎలా” పాట మంచి హిట్ అయింది. ఈ పాట రాసిన ‘సినారే’ కి నంది అవార్డు వచ్చింది. అలాగే నేను పాడిన తొలి పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఆయన తోపాటు నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’  అవార్డు తీసుకోవడం అదృష్టంగా భావిస్తాను. నేను చిన్న వయసులో ట్యూన్ కట్టిన ఓ పాటను అన్నయ్య కీరవాణి ఎస్పి పరశురాం చిత్రంలో వాడారు.
* ఆల్బమ్స్ చేశాను.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, 10 పాటలు నేను ట్యూన్ కట్టినవే. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సాయిబాబా ఒంటి దేవుళ్ల భక్తి గీతాల ఆల్బమ్స్ చాలా చేశాను. ప్రస్తుతం హైదరాబాదులోని మరకత లక్ష్మీ గణపతి ఆలయంలో ఆ స్వామి వారి కోసం ప్రత్యేక ఆల్బమ్ రూపొందిస్తున్నాను.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు అమరావతి నిర్మాణం,- థీమ్ సాంగ్, ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు సంబంధించిన తీన్ సాంగ్స్ నేనే రూపొందించాను. త్వరలో ఎలక్షన్ కోసం ఓ ప్రత్యేక సాంగ్ కూడా రూపొందిస్తున్నాను.
* విజయవాడ అంటే అమ్మవారేగుర్తొస్తారు.
విజయవాడ అంటే అమ్మవారే గుర్తొస్తారు. గతంలో కంటే ఇప్పుడు విజయవాడ చాలా అందంగా ఉంది. ఇంకా అమరావతి రాజధానిగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. దానికోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. సాంస్కృతిక పరంగా అయితే చెప్పలేనంత అభివృద్ధి జరిగిందని చెప్పాలి. ఎప్పుడు ఎక్కడా లేనంత విధంగా ఆంధ్రదేశంలో కళాకారులు పచ్చగా వర్ధిల్లుతున్నారు. జాతీయ ప్రముఖులు, సాహిత్య, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖుల వర్థంతులు జయంతులు, వీటితోపాటు ప్రధానమైన రోజులు, పుష్కరాలు లాంటి ఎన్నో కార్యక్రమాలలో సాంస్కృతిక వైభవం వికసించింది.
* ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు తెలుగులో రెండు సినిమాలు చేయబోతున్నాను. అందులో నిర్మల్ అనే ఊరు బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నారు.

-శ్రీనివాసరెడ్డి, సెల్ : 6300676687

3 thoughts on “సప్త స్వర’గళ’ మాలిక – యం.యం. శ్రీలేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap