విప్లవ వీర తిలకం తిలక్

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం కు “ధృవతారలు” పేరిట రెగ్యులర్ ఫీచర్ రాయడానికి ముందుకొచ్చారు బి.ఎం.పి. సింగ్ గారు. ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారితో ప్రారంభించుకుందాం.

ధృవతారలు – 1
భారత స్వాతంత్ర్య సమర విప్లవ వీర తిలకం
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారత జాతీయోద్యమ పిత. భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూల కారకుడు చరిత్ర కారుడు బాలగంగాధర్ తిలక్. కాంగ్రెస్ అతివాద త్రయంలో ద్వితీయుడు. దేశభక్తిలో అద్వితీయుడు. ఆధునిక తొలితరం భారతీయ యువకులలో బాల గంగాధర్ తిలక్ ఒకరు. గాంధీ వాదసూత్రాలతో అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం సాధించలేమని వారితో విభేదించి “స్వాతంత్ర్యం నా జన్మహక్కు”, దాన్ని నేను పొంది తీరుతాను అని గర్జించాడీతిలక్. భారతీయ బాల బాలికలకు భారతీయ సంస్కృతి, భారతీయ ఔన్నత్యం తెలియపరచే విద్యను బోధించడానికి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు. బాల్య వివాహాలను నిరసించాడు. వితంతు వివాహాలను స్వాగతించాడు. సమాజాన్ని సరైన రీతిలో నడిపించగలిగి తిరుగులేని పాత్రికేయుడిగా తిలక్ తన స్థానం నిలుపుకున్నాడు. భారతదేశంలో తొలిసారిగా బహిరంగంగా గణపతి, శివాజీ ఉత్సవాలను జన సమీకరణ రంగాలుగా మార్చుకున్నాడు. వీటి మాధ్యమంతో ప్రజలను చైతన్య పరిచాడు. హెూంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ భారతదేశంలో గ్రామ గ్రామానా తిరిగి ప్రజలలో రాజకీయ చైతన్యం కల్పించి, స్వాతంత్ర్య జ్యోతిని రగిలించిన లోకమాన్యుడు బాలగంగాధర తిలక్ నేటికీ మన ధృవతార.

(బాలగంగాధర్ తిలక్ జన్మదినం జూలై 23, 1856)

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap