సమ్మోహనపరచిన ‘సప్తమాత్రిక ‘

స్త్రీశక్తి అనంతం, అపారం. ప్రకృతి అంతా ఆమె స్వరూపమే. మహిళ తోడులేనిదే త్రిమూర్తులైనా అచేతనులుగా ఉండిపోవాల్సిందే. అంటూ స్త్రీశక్తి ఔన్నత్యాన్ని చాటుతూ సాగిన సప్త మాంత్రిక నృత్యరూపకం ప్రేక్ష కులను సమ్మోహనపరిచింది. రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో దుబాయి కు చెందిన అనంతర నృత్యనికేతన్ బృందం ‘సప్తమాత్రిక ‘ కుచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. త్రిపురాసురులను సంహరించే క్రమంలో ఆదిపరాశక్తి ధరించిన బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి, వారాహి, చాముండి అనే ఏడు రూపాల (సప్త మాతృకల) ఆవిర్భావ గాథను వివరిస్తూ రూపకం సాగింది. చక్కటి సమన్వయంతో నర్తకీమణులు ఆంగిక, వాచికాభినయాన్ని తగుపా ళ్లలో ప్రదర్శిస్తూ రూపకాన్ని ఆసాంతం రక్తికట్టించారు. కేరళకు చెందిన గురు గోపి భావనలకు విమ్మీ బి. ఈశ్వర్ నృత్యరూపకల్పన చేశారు. మాధవన్ కిజా కూట్, మిధున్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు. విమ్మీ ప్రధాన నర్తకి పాత్ర పోషించగా శ్వేతాగాంధీ, స్నిగ, హర, మీనాక్షి, ధీరజ్, అమృతా తుంగ, రుషితా అల్లా తదితర 26 మంది బృందం ఇతర పాత్రల్లో నర్తించారు.

అంతకుముందు జరిగిన ప్రదర్శనల్లో నర్తకీమణులు వినాయక కౌత్వం, జతి స్వరం, తిల్లానా, శివాష్టకం, పలుకే బంగారమా యెనా, భావయామి గోపాల బాలం తదితర అంశాలు ప్రదర్శించారు. శాసనసభ్యుడు మల్లాది విష్ణువర్ధన్ అతిథిగా పాల్గొని విమ్మీ బి. ఈశ్వర్ ను సత్కరించి, విదేశాల్లో ఉంటూ మనదైన కూచిపూడి నృత్యసంప్రదాయాన్ని అక్కడి తెలుగువారికి చేరువ చేస్తున్న విమ్మీ బి. ఈశ్వర్ ను అభినందించారు. విమ్మీ బి. ఈశ్వర్ మాట్లాడుతూ తను డా. వెంపటి చిన సట్యం, శ్రీమతి శోభానాయుడు, చిన్తా ఆదినారాయణ శర్మ గార్ల దగ్గర నాట్యం నేర్చుకొన్నానని, ప్రస్తుతం దుబాయి లో అనంతర నృత్యనికేతన్ డాన్స్ స్కూల్ నడుపుతున్ననని చెప్పారు. విమ్మీ బి. ఈశ్వర్ నాట్యగురువు చిన్తా ఆదినారాయణ శర్మ, ప్రముఖ నాట్యాచార్యులు భాగవతుల వెంకట్రామశర్మ, వేదాంతం పాండురంగశాస్త్రి, వేదాంతం పార్థసారధిలను సత్కరించారు. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి ఎ. లక్ష్మీ కుమారి కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. నర్తకీమణుల ఆహార్యం, దుస్తులు, లైటింగ్ నృత్య కార్యక్రమానికి శోభనిచ్చాయి.

అనంతర నృత్యనికేతన్ గురించి పూర్తి సమాచారం కోసం లింక్ చూడండి….

http://anantaraae.com/about

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap