ఎలాంటి విజయాలు సాధించాలన్నా అతిముఖ్యం, నిర్దుష్టమైన లక్ష్యం.
మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి పయనించాలి? మనం ఏ గమ్యం చేరుకోవాలి? అనే ప్రశ్నలకు జవాబులను ముందు గానే సిద్దం చేసుకుంటే మన విజయసాధన చాలా సులభం అవుతుందని నిరూపించిన నటి విజయశాంతి. ‘నటన’ అంటే కేవలం గ్లామర్, డ్యూయెట్స్, ఫారిన్ లొకేషన్స్ లో పరుగులు తీయటం మాత్రమే కాదు… అంతకు మించిన అవగాహన, ఆచరణ వున్నప్పుడు విజయలక్ష్మి మన తలుపులు తట్టి, అభినందిస్తుందన్న సూత్రానికి విజయశాంతి నేటికే కాదు, భావితరాలకూ చక్కని ఆదర్శం, నిర్వచనం.
పదమూడు సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరకు చేరువవుతున్నారు విజయశాంతి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆరంభం అయిన సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఆమె పునఃప్రవేశం. ఈ సుదీర్ఘమైన పదమూడు సంవత్సరాలలో ఎన్నో ఆశలు, మరెన్నో మజిలీలు చేసినా, ఆమె గత వైభవం, అప్పుడు నటించిన చిత్రాల జోరు, హోరు రవంతయినా తగ్గని నటి విజయశాంతి. ఒక సంవత్సరం ఖాళీగా వుంటేనే ప్రేక్షకులు మరిచిపోయే ఈ రోజుల్లో- విజయశాంతి అలనాటి చిత్రాలు, పాత్రలు చెక్కుచెదరక అలాగే నిలిచివున్నాయి. తరచుగా టెలవిజన్ ఛానల్స్ లో ప్రసారం అవుతుంటే అభిమానులు పదే పదే చూస్తూనే వున్నారు. అభినందిస్తూనే వున్నారు. కనుకనే ఇన్నేళ్ల విరామాన్ని మరిచిపోయి, తెలుగు సినిమా రంగం ఆమెకు స్వాగతం పలుకు తోంది. అనిల్ రావిపూడి తాజా చిత్రంలో మహేష్ బాబు హీరో. ఇప్పటి వార్తల ప్రకారం రష్మిక నాయిక. ఇటీవలే హైదరాబాద్లో ఈ “సరిలేరు నీకెవ్వరు’ ఆరంభమైంది. విజయశాంతిని మళ్లీ సినిమా రంగానికి ఆహ్వానించిన దర్శకులు అనిల్ భావుకతను తప్పక అభినందించాలి. విజయం తథ్యం అనే సంకేతాలు తెలుస్తున్నాయి.
అందం, అభినయం తరగని, చెరగని విజయశాంతి 1980 సంవత్సరంలో ‘కిలాడి కృష్ణుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, తొలిసారిగా సినీ రంగ ప్రశేశం చేశారు. కాలచక్రం వేగంగా పరుగులు తీసినా, విజయశాంతి స్థానం, గౌరవం అలాగే వుండిపోయాయి. కనుకనే అనిల్ రావిపూడి ఆమెను తన తాజా చిత్రంలో ఎంపిక చేస్తారు. తెలుగు సినిమా చరిత్రలో మరో అధ్యాయం ఆరంభించారు. విజయ శాంతి నట జీవితం 1980 నుండీ ఒక నిర్వి రామమైన పయనం. ప్రతి సంవత్సరం పది చిత్రాలు తక్కువ కాకుండా నటించారు. అందరు హీరోలతో నటించారు. తన వృత్తినే దైవంగా ఆరాధించటం ఒక కారణం; రెండవది ఏ రోజూ వివాదాంశం కాకుండా చిత్రసీ మతో బంధం, అనుబంధం పెంచుకున్న విజయశాంతి నట జీవితంలో తెలుగు తెరను వెలిగించిన ఆణిముత్యాలు ఎన్నో వున్నాయి. | ‘కర్తవ్యం’ పేరు చెప్పగానే వెంటనే విజయశాంతి గుర్తుకు వస్తారు. ఈ చిత్రంలో ఆమెది విలక్షణ పాత్ర. చాలా క్లిష్టం కూడా. అందమైన లొకేషన్లలో హీరోతో డ్యాన్సులు చేయవలసిన స్థాయి నుండి చాలా ఎదిగి, కొత్త కథకు స్వాగతం పలికి, తన శక్తికి మించి ఫైట్స్ చేయటం, విజయం సాధించటంతో ‘కర్తవ్యం’ సినిమా ప్రేక్షకుల కళ్లెదుట నిలిచిపోయింది. సమాజంలో ఎవరయినా అమ్మాయి కాలేజీ అమ్మాయి కావచ్చు, వంటింట్లో ఇల్లాలు కావొచ్చు. కాస్త వేగంగా పలికినా, అదరగొట్టి నా వెంటనే ‘కర్తవ్యం’ సినిమా విజయ శాంతిలా వుంది.. బాబోయ్ అంటూ నేటికీ గుర్తు చేసుకోవటం, ఆమె ప్రతిభకు, అంకిత భావానికి నిదర్శనం.
అలాగే ప్రతిఘటన’ చిత్రం. ఈ చిత్రంలో సమకాలీన రాజకీయ నీడలకు ప్రాధాన్యం చాలా వుంది. టి.కృష్ణ దర్శకత్వం వహించిన ప్రతిఘటన’ చిత్రంలో సరిగ్గా ఇంటర్వెల్ ముందు ఆమె పాడిన మహిళా ఉత్తేజకర మైన పాటకు ఆ రోజుల్లోనే ప్రేక్షకులు నిలబడి హర్షధ్వానాలు చేసారు. ఇది వేటూరి వారి రచన అన్న సంగతి ఎన్నటికీ మరిచిపో కూడదు. మనిషి జన్మ స్థానం గురించి గౌర వప్రదంగా తెలిపిన పాట ఇది. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన “ఒసేయ్ రాములమ్మ’ ఆ రోజుల్లో … సరిగ్గా ఆ సమయంలో దాసరిగారికి అవసరమైన ‘పునర్జన్మ ఇచ్చింది. ఈ చిత్రంలో ‘రాములమ్మ’ అనే తిరుగుబాటు నాయిక విజయ శాంతి ఎంత అద్భుతంగా పోషించారో ఈ చిత్ర దర్శకుడు, రచయిత దాసరి నారాయణరావు తన తరహాలో మూలకథకు లోటు రానీయని పాత్రను పోషించారు. విజయశాంతి ఆలిండియా సూపర్ స్టార్ అయ్యారు. అన్యాయం జరిగిన అబల కక్షతో రగిలిపోతే ఫలితం ఎలా ఉంటుందో తెలియ చెప్పిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ. ఇప్పటికీ టెలివిజన్ ఛానల్స్ ద్వారా ఒక క్రేజ్ ను నిలుపుకుంది. ఇలాంటి పాత్రలతో మెగాస్టార్ చిరంజీవి గారితో ఎన్నో గ్లామర్ పాత్రలను పోషించిన విజయశాంతి ప్రతి పాతక్రు ఒక హోదా, మర్యాద కల్పించారు. ఎక్కడా సరిహద్దులు దాటలేదు, లక్ష్మణరేఖ లను అతిక్రమించలేదు. ఆమె ఇన్నేళ్లల్లో నటించిన ఏ చిత్రమూ మరువలేం, ఏ పాత్రనూ కాదనలేం. పాత్ర పోషణలో మధ్య మధ్యలో సొగసు, లావణ్యం, మనసు చిలికించే శృంగారం.. ఈ లక్షణాలను కూడా వెండితెర మీద ఆమె ప్రదర్శించటం అందరికీ తెలిసిందే. అలాగే మంచి నర్తకి విజయశాంతి.
ఈ పదమూడు సంవత్సరాల కాలంలో ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఆమె రాకకోసం ఉవ్విళ్లూరుతున్న సమయంలో మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో వస్తున్నారు. దర్శకులు అనిల్ రావిపూడి తన ప్రతిభను ఘంటాపథంగా యిప్పటికే నిరూపించుకున్నారు కనుక రాబోయే ఈ కొత్త చిత్రం ఆయన్ను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే శుభ సూచనలు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి.
-వాసిరాజు