ఈ ఏడాదయినా ఏ.పి.లో ఉగాది పురస్కారాలున్నాయా? లేదా?
జనవరి 27న ఏపీ సేవ పోర్టల్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న వాలంటీర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆయన కోరారు. అంతేకాదు, ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను వచ్చే ఉగాదికి సత్కరించి ప్రోత్సాహకాల్ని అందించాలని సూచించారు. ఉత్తమ సేవకు ఉగాది పురస్కారాలివ్వాలన్న ఆకాంక్ష రెండు నెలల ముందుగానే ముఖ్యమంత్రి నోటి నుండి రావడం మంచి కబురే. ఉగాది అంటే ఒక గొప్ప సాంప్రదాయ వేడుకల సందడి అని సియం చెప్పకనే చెప్పారు.
గత ప్రభుత్వంలో ఉగాది పండుగ కవులు, రచయితలు, కళాకారులు, సత్కారాలు, సన్మానాలు, ప్రోత్సాహకాలు కలగలిసిన గొప్ప వేడుకలా జరిగేది. ఉగాదికి నెలరోజుల ముందునుండే ఉగాది పురస్కారాల దరఖాస్తుల్ని జమ చేయడం కోసం వచ్చిపోయే కళాకారులతో సాంస్కృతిక శాఖ కార్యాలయం సందడిగా వుండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ కార్యాలయం పూలూ, ఆకులూ రాలిన చెట్టులా బోసిపోతూ వుంది. తారకలూ చంద్రుడూ లేని రాత్రి ఆకాశంలో చీకటిలో మౌనరాగం ఆలపిస్తోంది.
నవరసాల్ని పంచాల్సిన రెండు ఉగాదుల్ని ఏమాత్రం సందడి చేయకుండానే ప్రభుత్వం వెళ్ళమార్చింది. ఒక ఉగాదిని వాలంటీర్లకు పురస్కార కానుకగా అందించింది. కవులు కళాకారుల్ని మాత్రం ఆ సందడికి దూరంగానే నిలబెట్టింది. కరోనా వ్యాప్తి బూచితో వారి జీవితంలో రెండు ఉగాదుల్ని కొత్త పాలకులు కొల్లగొట్టినా నోరెత్తలేదు..మౌనంగానే విలపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాలంటీర్లకు గతేడాది పురస్కారాల ప్రసాదాన్ని పంచిపెట్టింది. మళ్ళీ ఇప్పుడు సియం నోటి నుండి వచ్చే ఉగాదికి వారి పురస్కారాల ప్రస్తావన రావడం యాదృచ్చికమేనా? కవులు కళాకారులకు ఈ ఉగాదికైనా తీపి పచ్చడి రుచి చూపిస్తారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
అయితే కొత్త పాలకులకు కవులు, రచయితలు, కళాకారులపై ప్రేమ లేదన్న కొంతమంది వాదనకు ఫుల్ స్టాప్ పెడుతూ-వుందని నిరూపించే కొన్ని సంఘటనలు మన కళ్ళముందే జరిగాయి. గ్రంథాలయాలకు రచయితల పుస్తకాల కొనుగోలు విషయంలో గత పాలకుల ఐదేళ్ళ నిర్లక్ష్యాన్ని గమనించిన కొత్త సర్కారు ఆ ఐదేళ్ళతో పాటు మరో సంవత్సరం కలిపి ఆరు సంవత్సరాల పుస్తకాల్ని ఒకేసారి కొనుగోలు చేసింది. మళ్ళీ ఇప్పుడు 21-22 సంవత్సరానికి కూడా పుస్తకాలు కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. గతేడాది వైయస్సార్ అచీవ్మెంట్ & లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల పేరుతో వివిధ రంగాలకు చెందిన 59 మందిని ఎంపిక చేసి గతంలో ఏ ప్రభుత్వమూ, ఏ రాష్ట్రమూ ఇవ్వనంత అధిక నగదు పురస్కారాల్ని అందజేసింది. ఆ వేడుకల్ని కూడా నభూతోగా జరిపింది.
ఇక్కడే కొన్ని అనుమానాలు కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని తొలిచేస్తున్నై. ఈ ప్రభుత్వం ఇదే తరహాలో వైయస్సార్ అవార్డుల్నే కొనసాగిస్తుందా? ఇక ఉగాదికి ఇచ్చే ఉగాది పురస్కారాలు, హంస అవార్డుల సంగతేంటి? ముఖ్యమంత్రి కేవలం వాలంటీర్ల అవార్డుల గురించే ప్రస్తావించారు కదా! ఈ అనుమానాలన్నీ సాంస్కృతిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి సమాచారమూ మా దగ్గర లేదన్నారు. ఉగాది పురస్కారాల కోసం ఎలాంటి జీవో మాకింకా అందలేదన్నారు. వస్తే రావచ్చేమో అన్న ఆశల పువ్వుల్నీ పూయించారు.
పక్కనే వున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో కవులు కళాకారులకు ఉన్నత పదవులు దక్కుతున్నాయి. పద్మశ్రీ వచ్చిన కళాకారుడు మొగిలయ్యకు కోటి రూపాయల నగదుతోపాటు ఓ ఇల్లు కూడా కానుకగా ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు. సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖలు కూడా సమర్థులైన ఛైర్మన్లతో ముందుకు సాగుతూ సాంస్కృతిక చైతన్యాన్ని పంచుతున్నాయి. ఏపీలో కూడా ఆ రెండు శాఖలతో పాటు తెలుగు అకాడమీని కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. ఆయా శాఖలకు వెంటనే నిధులు విడుదల చేసి సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించాలని కవులు, రచయితలు, కళాకారులు కోరుతున్నారు.
ఎందుకంటే సాంస్కృతిక చైతన్యం లేని ఏ సమాజమైనా, రాష్ట్రమైనా, దేశమైనా జీవంలేని దేహమే. ఫలపుష్పాలు కా ( పూ )యని వృక్షమే.
–కలిమిశ్రీ (ఎడిటర్: నవమల్లెతీగ)