స్వాతి, విజయ్ ఇద్దరూచిత్రకారులే… వయసురీత్యా జస్ట్ ఇప్పుడే మూడవ పడిలోకి ప్రవేశించిన యువ చిత్రకారులు, అందరిలాగానే విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయంగా చిత్రకళను అభ్యసించారు. అంతే కాదు తమ ప్రతిభ ద్వారా ఫ్రెంచ్ ఎంబసీ ఫెల్లో షిప్ కూడా పొంది తొమ్మిది నెలలుపాటు విశ్వకళల కేంద్రమైన ఫ్రాన్స్ లో కూడా చిత్రకళను అభ్యసించారు. అందరిలాగే రంగులు బ్రషులు వాడతారు, కానీ ఆ వాడే విధానంలోనే కొట్టొచ్చినట్టు కనబడే తేడా వీరికి మిగిలిన చిత్రకారులకీ, సాధారణంగా చిత్ర కళ అనగానే కాన్వాస్ పై అందమైన చిత్రాలు, గాలరీలలో ప్రదర్శనలు చేయడాలు, అమ్మకాలు, పేరు ప్రఖ్యాతులు పొందేందుకు చేసే ప్రయత్నాలు ఇలావుంటుంది చిత్రకళా లోకం. చిత్ర కళాజగత్తులో నేడు కొన సాగుతున్న ఇలాంటి ధోరణికి పూర్తి భిన్నమైన మార్గం ఈ యువ జంటది.
కారణం వారు ఎంచుకున్న మార్గంలో వుంది, వారి ఆలోచన విధానంలోవుంది. వీరి చిత్రాలు మిగిలిన చిత్రకారుల చిత్రాల్లా గేలరీలకే పరిమితం కావు. సంపాదన కంటే సామాజిక మార్పే వీరి ప్రస్తుత చిత్ర కళకు పరమావధి. అందుకే వీరి చిత్రాలకు సమాజాన్నే కాన్వాస్గా ఎంచుకుంటారు. నలుగురు నడిచే రోడ్లు, నలుగురు నడయాడే కూడళ్ళు పదిమదికి కనిపించే పబ్లిక్ ప్లేస్లు వీరి చిత్రాలకు కేన్వాస్లుగా మారతాయి. రాత్రి అందరు నిద్రించిన తరవాత వీరి కళాయాణం మొదలౌతుంది. నగరంలో ఎదో ఒక రద్దీగా వున్న ప్రదేశాన్ని ముందుగ ఎంచుకుంటారు, నిచ్చెన,స్టూల్స్, రంగులు, స్పేయర్ లు లాంటి సరంజామాతో వీరిద్దరూ సిద్దమౌతారు తెల్లవారేలోపు వారు చెప్పదలుచుకున్న భావం తాలుకు చిత్రాన్ని పూర్తి చేసి మెల్లగా ఇంటికి వొస్తారు. అంతే ప్రతి రోజూ ఆ బాట వెంబడి వెళ్ళే వాళ్ళందరూ ఇక రోజులాగే నిర్లక్ష్యంగా వెళ్లి పోలేరు, కాసేపు ఆగుతారు, ఆలోచిస్తారు, మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఈ జంట కోరుకునేది ఇటువంటు మార్పునే. కళ అంటే కేవలం అందం, అలంకరణల కోసం మాత్రమే కాదు ఆలోచనకోసం, సామాజిక మార్పు కోసం కూడా అంటూ గ్రాఫిటీ కళతో నూతన వొరవడికి నాంది పలికి ముందుకు సాగుతున్న ఆ యువ చిత్రకళా జంట స్వాతి విజయ్ లు
వీరి కళను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు,
అవి 1) స్ట్రీట్ ఆర్ట్, 2) పెయింటింగ్స్ 3) ఇనలేషన్స్ ఈ ముడింటా ఏ మాధ్యమం లో చేసినా అందులో ప్రధానంగా ఎదో ఒక భావం ఒక సామాజిక సందేశం వుండడం వీరి చిత్రాల ప్రత్యేకత.
అది జూన్ ఒకటవ తేది రాత్రి తెల్లవారితే తెలంగాణా రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవాలు ప్రారంభం కాబోతున్న సందర్భం. హైదరాబాద్ ఫిలింనగర్ టెంపుల్ దగ్గర ఒక పెద్ద భవనపు గోడపై అందరికి కనిపించే అల్లంత ఎత్తులో ఒక చిత్రం దర్శనమిచ్చింది, ప్రఖ్యాత యురోపియన్ చిత్రకారుడి “క్రియేషన్ ఆఫ్ ఆడం “చిత్రంలోని భగవంతుడి చేతిని తలపించే ఆ చేతిలో దేనినో కట్ చేసేందుకు సిద్దంగా వున్న చాకు ఒక ప్రక్క రెండో వైపు ఆదాము చేతిని తలపించే చేతిలో ఒక కేకు ఆ రెండు చేతుల మధ్య లీలగా ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల విభజన రేఖ ఆ దిగువలో ఒక స్లోగన్ ఇలా వుంది “ఎవ్విర్ కట్ డస్ నాట్ మీన్ టు సెపరేట్ “అంతే ఉదయం ఆ మార్గం వెంబడి వెళ్ళే ప్రతి ఒక్కరి మదిలో ఒక ఆలోచన. అలాగే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఎం.ఎం.టి.ఎస్. స్టేషన్ దగ్గర నిర్మాణంలోగల బిల్డింగ్ గోడపై వీరు వేసిన బొమ్మ అపరిమితంగా అందుబాటులోకొచ్చిన అంతర్జాలం నేడు పిల్లల నుండి పెద్దల వరకు ఇంటర్నెట్ చక్రంలో ఇరుక్కుపోయేళా చేసి నేడు మానవ భందాలు ముగ్యమవడానికి కారణమైన వైనాన్ని కళ్ళకు కడుతుంది. “స్వచ్చభారత్” చేపట్టాల్సింది ముందు చట్టాలు చేసే పార్లమెంట్ లో అని పార్లమెంట్ ముందు చీపురుతో వున్న వ్యక్తిని మరో కూడలి దగ్గర వేసిన “ది రియల్ ప్లేస్ టు డు” అనే వీరి గ్రాఫిటీ చిత్రం ఇంకెంతో మందిని ఆలోచింప జేస్తుంది. ఉస్మానియాలో హిసాత్మకంగా మారుతున్ననాటి తెలంగాణా రాష్ట్ర ఉద్యమం అలా ఎన్నటికి కాకూడదనే భావంతో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వొద్ద “వైలను నీడ్ నాట్ బి వయలెంట్” అన్న గ్రాఫిటీ తో గాంధీజీ రాళ్లుకు బదులుగా పువ్వులు విసురుతున్నట్టుగావేసిన చిత్రం నిజంగా ఇంకెంతో మందిలో గాంధీ యిజాన్ని గుర్తుకు తెచ్చింది. అలాగే ప్రేమకు హద్దులు లేవంటూ బౌతిక మైన విభజన మానసికప్రేమకు హద్దులు కారాదని “నో లైన్ ఈస్ లిమిట్ ఫర్ లవ్” అని వేసిన మరో గ్రాఫిటీ చిత్రం, ఇంకా కాశ్మీర్ సమశ్యపై “లవ్ కెన్ బ్రేక్ ది బారియర్స్” పేరుతో వేసిన వేరొక చిత్రం, అలాగే “సేవ్ ఫార్మర్స్” అన్న స్లోగన్ తో ఒక పెద్ద వ్యవసాయక్షేత్రాన్నే ఆర్ట్ పీస్మార్చిన సందర్భం లోను మరియు ప్రభుత్వ పాట శాలలు మూత పడనున్నాయి” అన్న వార్త వొచ్చినప్పుడు న్సూల్స్ మూయడం పరిష్కారం కాదు వసతులు కల్పించడం ముఖ్యం అని భావించి వరంగల్ జిల్లా మహబూబాబాద్ దగ్గర రంగ సాయి పేట పాటశాల భవనానికి సొంత ఖర్చులతో రంగులు వేసి పాటసాశాలను ఆహ్లాదకరంగా మార్చినవీరి కృషిలో ఎంతో కళాసేవ, నైపుణ్యం, సామాజిక భాద్యతలు కనిపిస్థాయి. అలాగే విస్మరణకు గురౌతున్న వారసత్వ భవనాల సంరక్షణ గురించి “ఫీలింగ్ లోన్లీ” మరియు “అయాం ఆర్ఫన్, అడాప్ట్ మీ” లాంటి వీరి గ్రాఫిటీ చిత్రాలు అందరిని ఆలోచింప జేస్తాయి.
కేవలం వీధి చిత్రాలకే పరిమితం కాదు వీరి కళ, అందరిలా కాన్వాసుల పైనా. వివిధ గెలరీలలోలో కూడావీరి చిత్రాలు దర్శనమిస్తాయి, చైల్డ్ లేబర్, బ్లాక్ మనీ, మిడ్ నైట్ న్యూస్ లాంటి చిత్రాలు హైదరాబాద్ లో ప్రదర్శితం కాగా బ్రేకింగ్ న్యూస్, చిత్రం బెంగుళురు లోను, జర్నీఅఫ్ మై ఆర్ట్ అన్న చిత్రం చెన్నై లోను వాయిస్ అఫ్ విమెన్, షో, స్వీట్ హార్ట్, మాస్టర్, ఇంఫెడిలిటి లాంటి వీరి చిత్రాలు కెనడా దేశంలో ప్రదర్శించబడడం గొప్ప విషయం. వీటన్నింటా ఒక ఆలోచన, భావం నవ్యత్వంతో కూడిన స్వీయ శైలి మనకు కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్, పేకింగ్ న్యూస్ అంటూ వేసిన వీరి చిత్రాలునేడు విశ్రుంఖలంగా పుట్టుకొస్తున్న వార్తా చానల్లు తమ తమ రేటింగ్ కోసం చేసే పదే పదే ఉదర గొట్టే వార్తల తీరును మనకు కళ్ళకు కడతాయి.
స్వాతి పుట్టింది ఖమ్మంలో, విజయ్ పుట్టింది హైదరాబాదులో, ఇరువురి నీ కలిసేలా చేసింది మాత్రం జె.యెన్.టి.యు. హైదరాబాద్, 2003 నుండి 2007 మధ్యకాలంలో ఇరువురు అక్కడ చిత్ర కళలో బి.ఎఫ్.ఏ. చేసారు ఆ పై పెయింటింగ్ లో స్వాతి, అప్లైడ్ ఆర్ట్స్ లో విజయ్ ఇద్దరూ అక్కడ స్నాతకోత్తర విద్యకూడా అభ్యసించారు. కళ కేవలం తన కోసమే కాదు సమాజంకోసం కుడా అనుకునే వీరి ఇరువురి భావాల కలయిక వివాహానికి దారితీసింది. నాటి నుండి ఇద్దరూ వేర్వేరు సంతకాలతో కాకుండా స్వాతి విజయ్ అనే సంయుక్త సంతకంతోనే తమ కళాయానాన్ని ముందుకు కొనసాగించడం మరింత గొప్ప విషయం.
ఇటీవలనే ఖమ్మం వచ్చిన వీరు మా యింటికి వచ్చినప్పుడు నిజంగానే నాకు ఆశ్చర్యం కలిగింది కారణం ఇరువురు మరీ పెద్దవాళ్ళు కాదు కాని పెద్దగా ఆలోచిస్తూ కళను సామాజిక ప్రయోజనానికి ఉపయోగిస్తున్న తీరు నన్ను ఆకట్టుకుంది. చాల సేపు మా ఇంట్లో నే మాట్లాడుకున్నాం. అంతర్జాతీయంగా జపాన్ లో జరిగే భివాకో బినాలేఇన్నలేషణ్ ప్రదర్శనలో పాల్గొని తమ ఎక్షిబిట్ ను ప్రదర్శించి ప్రసంశలు పొందారు, వావ్ అనే ఆంగ్ల పత్రిక నిర్వహించిన టాప్ ట్వంటీ అచీవర్స్ లో కూడా ఈ జంట కు స్థానం దక్కడం మరో విశేషం. జాతీయంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, బరోడా, జైపూర్ల తో పాటు అంతర్జాతీయంగా లండన్, జపాన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలలో వీరి చిత్రాలు ప్రదర్శనకు నోచుకోవడం గొప్ప విషయం.
ఒక నిర్దిష్ట లక్ష్యంతో సామాజిక ప్రయోజనంతో కళను ముందుకు తీసుకు వెళ్తున్న ఈ చిత్రకార జంట కళాపరంగా మరిన్ని ప్రయోగాలు చేయాలనీ తద్వారా మరింత సామాజిక ప్రయోజం కలగాలని ఆశిద్దాం.
— వెంటపల్లి సత్యనారాయణ