సాహితీ సవ్యసాచి-ద్వానా శాస్త్రి

తెలుగులో విమర్శనాత్మక సాహిత్యం కొరవడిన సమయంలో ఆయన తన కళాన్ని ఝళిపించినవాడు. నాలుగున్నర దశాబ్దాలుగా ఎత్తిన కలం దించకుండా విమర్శనారంగంలో నిరంతర కృషి చేస్తున్నవా డు. ఆయన వ్యాసాలు రచయిత హృదయావిష్కరణకు అద్దంపడుతాయి. ప్రాచ్యలక్షణ పరిజ్ఞానాన్ని, పాశ్చాత్య వివేచనాన్ని సమన్వయిస్తూ ఆధునిక పాఠకులకు అవలీలగా అర్థమయ్యే రీతిలో వివరించడంలో ఆయనది అనుభవమున్న కలం. వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ, స్పష్టత నిండిన కవిత్వాన్ని అం దించడంలో ఆయనకు ఆయనే సాటి. శతాధిక రచనలు, అంతకుమించిన పురస్కారాలు అందుకున్న సాహితీ సవ్యసాచి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. నాలుగున్నర దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ విమర్శలో అలుపెరగని కృషి చేసిన ప్రతిభామూర్తి ద్వానా శాస్త్రి, ఆయన పూర్తి పేరు ద్వాదశి నాగేశ్వర శాస్త్రీ.
సాహితీ సవ్యసాచిగా పేరుపొందిన ఆయన కృష్ణాజిల్లా లింగాల గ్రామంలో 1948 జూన్ 15న జన్మించారు. ఏలూరు సర్ సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఫీల్ (తెలుగు) పూర్తి చేశారు. సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన) ఆంశం మీద తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దాదాపు ముప్పై ఏళ్లపాటు అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డారు. సివిల్స్, గ్రూప్స్ డీఎస్సీ తదితర పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలుగు బోధించారు.
1970లో రచనా వ్యాసంగం ప్రారంభించిన ద్వానా శాస్త్రి సాహితీ విమర్శకు పెద్ద పీట వేస్తూ లెక్కకు మిక్కిలిగా వ్యాసాలు, ఆయా పత్రికల్లో రెండు వేల వరకు పుస్తక సమీక్షలు, కవితలు, కథలూ కూడా రాశారు. మొత్తంగా ఆయన 80కి పైగా పొత్తాలు వెలువరించారు. ద్వానా శాస్త్రి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ‘తెలుగు సాహిత్య చరిత్ర’. తెలుగు నాట ఈ గ్రంథం విశేష ప్రాచుర్యం పొంది, సుమారు పది సార్లు పునర్ముద్రితమైంది. తెలుగు సాహిత్యంలో ఉద్యమాలు…వాదాలు ధోరణులు, నేనెరిగిన సాహితీవేత్తలు, తెలంగాణ సాహిత్య రత్నాల వీణ, మన తెలుగు తెలుసుకుందాం, వాజ్మయ లహరి, సాహిత్య సాహిత్యం, వ్యాస ద్వాదశి, విమర్శ ప్రస్థానం, తొలి దళిత కవి సుకుమ ధర్మన్న, సమీక్షా చక్షువు, మహాప్రస్థానంలో ధగధగలు-నిగనిగలు, తెలుగు విమర్శ – పరిణామం, నానీలలో సినారె, సాహీత్య నానీలు, మనిషిలోకి ప్రవహించాలి, ద్వానా కవితలు, ద్రవిడ సాహిత్య సేతువు, ఆంధ్ర సాహిత్యం’ లాంటి గ్రంథాలు ఆయన కలం నుంచి జాలువారాయి. తన సహ అధ్యాపకుడు బి.వి. రమణమూర్తి (మార్గశీర్ష)తో కలిసి సమాధిలో స్వగతాలు’ కవితా గ్రంథం తెచ్చారు. ఇరాక్ మీద అమెరికా దాడిని నిరసిస్తూ ‘బషీకాకి’ పేరుతో సుదీర్ఘ కవిత రాశారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, గుర్రం జాషువా, అడవి బాపిరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, జంధ్యాల పాపయ్యశాస్త్రి లాంటి 62 మంది సాహితీ ప్రముఖుల జీవిత విశేషాలు, జీవన విధానాలను వాళ్ల పిల్లలతో రాయించి ‘మా నాన్నగారు’ పేరిట గ్రంథంగా తెచ్చారు. వివిధ పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ‘తెలంగాణ సాహితీ సంపద, తెలుగు వెలుగు, వ్యాసలహరి, సమగ్ర తెలుగు సాహిత్యం’ లాంటి గ్రంథాలు వెలువరించారు. ‘సాహిత్యమే శ్వాసగా’ పేరుతో తన ఆత్మకథను గ్రంథంగా కూర్చారు. 2018లో తెలుగు భాషా సాహిత్యాల మీద 12 గంటల పాటు నిర్విరామంగా ప్రసంగించి ద్వానా రికార్డు సృష్టించారు. ఇంకా శతాబ్దం కిందటి ఛాయా చిత్రాలు, ఒకప్పటి విశేష కవితలు, అరుదైన పుస్తకాలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. ద్వానా శాస్త్రి సాహితీ సేవను గుర్తించి 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురజాడ సాహితీ పురస్కారంతో సత్కరించింది. తుది శ్వాస వరకు తెలుగు సాహితీ సౌరభాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడానికి విశేష కృషి చేసిన ద్వానా శాస్త్రి 2019, ఫిబ్రవరి 25 న కన్నుమూశారు. ఆయనకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఆయన లేని లోటు తీరనిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap