నటుడు హరనాథ్ పతనానికి కారణం ?

తెలుగు సినీరంగంలో పౌరాణిక పాత్రలు అందునా రామ, శ్రీకృష్ణ పాత్రలంటే ఎన్టీఆర్ ని తప్పించి మరొకరిని ఊహించుకోలేరు ప్రేక్షకులు. అంత గొప్పరూపం, నటన సొంతంచేసుకున్న నటుడు ఎన్టీఆర్. అటువంటి మహానటుడు సొంతంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థను చేపట్టి “సీతారామకళ్యాణం’ సినిమా తీయాలనుకున్నప్పుడు రావణాసురుడి పాత్రను ఎంపికచేసుకోవటం ఆనాడు ఒక విచిత్రం. ఆయనదే దర్శకత్వం కూడా.
అంతటి గొప్పసినిమాలో ఎన్టీఆర్ రాముడిపాత్రను ఎవరికి ఇస్తారు! అని చాలామంది సినీరంగం ప్రముఖులు అనుకుంటున్నప్పుడు ఎన్టీఆర్ దృష్టిలో తన తర్వాత రాముడి పాత్ర వేసి మెప్పించగలిగినవాడిగా హరనాథ్ కి గుర్తింపు రావటం ఆ యువనటుడి అదృష్టం. అంతేకాదు మరో పౌరాణిక సినిమా ‘భీష్మ’లో ఎన్టీఆర్ భీష్మ పాత్రను పోషిస్తే మరి కృష్ణుడు ఎవరు వేస్తారనుకున్నప్పుడు తిరిగి ఆయనకు గుర్తుకు వచ్చింది హరనాథ్ రూపమే. ” తెలుగు సినిమాలలో ఇతర నటులు రామ, కృష్ణ పాత్రలు పోషించి వుండవచ్చు. కాని వారెవరూ ఎన్టీఆర్ ని మెప్పించిన నటులు కాదు. ఆ గొప్పతనం, అదృష్టం దక్కించుకున్నవాడు హరనాథ్.. అంత గొప్ప ఓపెనింగ్స్ లభించినప్పుడు ఎంతగా ముందుకు వెళ్ళాలి ఒక నటుడు? అందునా అందా నికి అందం, విశాలమైన కళ్ళు,చక్కని శరీరం, ఒడ్డు, పొడుగు, తాకితే మరకపడుతుందేమోనన్నంత రంగు వంటివన్నీ వరాలుగా పొందినవాడు హరనాథ్. ఎన్టీఆర్, ఎఎన్నార్ల తర్వాత సినీరంగానికి దొరికిన గొప్ప హీరో. కాని ఆ ఇద్దరు మహానటుల్లా ఎందుకు చిరస్థాయిగా పేరు నిలుపుకోలేకపోయాడు?
సినీరంగం గ్లామర్ రంగం. సినీరంగంలో సక్సెస్ ఉన్నంతకాలమే గుర్తింపు. ఈ సూత్రం అర్థం చేసుకున్నందునే ఎన్టీఆర్, ఎఎన్నార్లు సినీరంగంలో నిలిచినంతకాలం హీరోలుగానే నిలిచారు. కాని “అన్నీ అంగట్లో వున్నా..” అన్న సామెతలాగా హరినాథ్ సినీకెరీర్ ముగిసింది. ‘సక్సెస్’ని సరిగా ‘హ్యాండిల్ చెయ్యలేకపోతే జీవతం ఎలా అంతమవుతుందనే దానికి ఉదాహరణ హరనాథ్ జీవితం. హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు. తూర్పుగోదావరిజిల్లాలోని రాపర్తిలో సంపన్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆరడు గుల అందగాడు. ప్రీ యూనివర్సిటీ వరకు మద్రాసులో చదివించారు తల్లిదండ్రులు. .

బి.ఎ. చదివే రోజుల్లో కల్చరల్ కార్యదర్శిగా కాకినాడలో ఒక వెలుగు వెలిగాడు. నాటకాలు ఆడుతూ మద్రాసు చేరిన హరనాథ్ నాటి నటుడు ముక్కామల కంటపడటంతో ‘ఋష్యశృంగ’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్లో తీసిన తొలిసినిమా ‘మా ఇంటి మహాలక్ష్మిలో హరనాథ్ హీరో. అది 1958, 59 నాటి ముచ్చట. అంటే పాతికేళ్ళు నిండకుండానే ఒక గుర్తింపు వచ్చింది.
‘సీతారామకళ్యాణం’ సినిమాలోని ‘శ్రీ సీతా రాముల కళ్యాణం చూతమురారండి’ పాటను, అందులో రాముడిగా హరనాథ్ హావభావాలను నేటికీ మరవ లేము. 1961లో రాముడు, 1962లో ‘భీష్మ’లో శ్రీకృష్ణుడి పాత్ర. ఎన్టీఆర్ కితాబు. ఒక కొత్త హీరోకి కావాల్సిందేముంది? అయితే హరనాథ్ ఎన్టీఆర్ భుజంతట్టటం మాత్రమే గుర్తు పెట్టు కున్నాడు కాని, భుజం తడుతూ చెప్పిన సూచ నలు, హెచ్చరికలు చెవికి ఎక్కించుకోలేదు.
సినీరంగంలో చెడు అలవాట్లు చాలా ప్రమాదం. పతనానికి తీసుకువెళతాయి. మందు, సిగరెట్ అలవాటు మానెయ్. అమ్మాయిల వలలో పడకు అంటూ సొంత కొడుక్కి చెప్పినట్టు చెప్పాడు. కాని హరనాథ్ ఆ చెడు అలవాట్లను పెంచుకుని క్రమంగా వాటికి బానిసగా మారాడు.
అతని అందాన్ని, రొమాన్స్ పలికించే తీరును చూసి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. జమున-హరనాథ్ హిట్ పెయిర్ అయ్యారు. 1960ల్లో హరనాథ్ అందాల హీరో.అయితే ఆయన తాగుడు అలవాటు, షూటింగ్ లకు సమయానికి రాకపోవటం, తాగితేగాని నటించ లేని పరిస్థితి, అమ్మాయిలను వెంట వేసుకుని వారితో కాలం గడుపుతూ వుండటం వంటివన్నీ నిర్మాతలకు, దర్శకులకు తలనొప్పిగా మారింది.
సినిమా అనేది వ్యాపారం. పెట్టుబడులకు తగిన ఆదాయం రావాలి. హరనాథ్ సంపన్నుడు. ఆయనకు డబ్బు అవసరం లేకపోవచ్చు. కాని ప్రొడ్యూసర్లకు అలా కాదు. అందుకు వారు హరనాథ్ ని ఆయన అలవాట్లకు వదిలి, కొత్తగా పరి శ్రమలో హీరోలుగా నిలదొక్కుకుంటున్న కృష్ణ శోభన్ బాబులను ఎంపిక చేసుకున్నారు. సినీరంగంలో కిందపడితే చేయి అందించేవారుం డరు. పడినవాడిమీద నుండి నడుచుకుపోతారు. 1970ల ప్రారంభంలోనే సినిమాలు తగ్గాయి. హీరో పాత్రలు ఆగిపోయాయి. ఆదాయం లేదు. అలవాట్లు మార్చుకోలేదు. ఒకనాటి పెద్దకార్లు వరసగా మాయ మయ్యాయి. మంచి డ్రస్లు లేవు.

పాండీబజార్లో రోడ్డు పక్కన అమ్మే షాపులో హవాయి చెప్పులు కొనుక్కుంటున్న హరనాథ్ చూసి మీరు హరనాథ్ గారేనా అని అభిమానులు అడిగేంతగా రూపం మారిపోయింది.
తెలిసిన వారిని సహాయం అర్థించటంలో తప్పు లేదు. కాని ఆ సహాయం మందు బాటిల్ కొనుక్కో టానికి అయితే ఎవరైనా ఎంతమాత్రం, ఎన్ని రోజులు సహాయం చెయ్యగలరు. ఆయన మేలు కోరిన హీరోయిన్ జమున చేసిన హెచ్చరికలు, మార్చాలన్న ప్రయత్నాలు అన్నీ వృథా అయ్యాయి.
ఇక హరనాథ్ మారడు అతని జీవితం అతనిది. అని అందరూ వదిలివేసిన పరిస్థితి. చివరిలో సొంతగా సినిమాచేసి తిరిగి నిలదొక్కు కుందామని ఒక ప్రయత్నం సినీఫ్రెండ్స్ తో చేసినా ఆ ప్రయత్నం విఫలమైంది.
పదేళ్ళ తర్వాత తిరిగి నాలుగు సినిమాలలో కనిపించినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. 1984లో వచ్చిన ‘నాగు’ సినిమాలో చిరంజీవికి తండ్రిగా డైలాగ్ లేని పాత్రలో చివరిగా కనిపించాడు హరనాథ్.
తాగుడు అలవాటు హరనాథ్ శరీరాన్ని గుల్ల చేసింది. రూపం మారిపోయింది.కళ్ళలో వెలుగులేదు. రంగు నల్లబడింది.ఇక ఏమిచేసినా కోలుకోలేని స్థితి. మత్తుపానీయ వ్యసనం ఒక మనిషి జీవితాన్ని పతనం చేస్తుందని ఎన్టీఆర్ చెప్పినది నిజమైంది. 53 ఏళ్ళ వయసులోనే 1989 నవంబర్ 1న ఆ అందాల హీరో కళాకాంతి లేని రూపంలో ఈలోకం వదిలి వెళ్ళాడు. ఆ పైన వచ్చిన హీరోలందరికీ ‘జీవితంలో హరనాథ్లా కాకూడదు’ అనే హెచ్చరిక వదిలి పోవటం సినీరంగం ఇప్పటికీ చెప్పుకుంటుంది..

-స్వాతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap