మ‌న‌లోకి మ‌నం c/o కంచ‌ర‌పాలెం

కొన్ని సందర్భాలను మనకు మనమే సృష్టించుకోవాలి. ఎప్పుడో.. ఎక్కడో.. పాత ఇనుప బీరువాలో అటకమీద దాచిపెట్టిన జ్ఞాపకాలను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే కదా.. మనల్ని మనం తడుముకోగలం. అప్పుడే కదా.. గతకాలంలో వదిలేసిన, ఆ.. అమలిన కన్నీటిపొరలు చెప్పే కథల్ని, ఇంకా సజీవంగా ఇప్పటికీ గుండెల్లో నిక్షిప్తమై.. గుబాళిస్తున్న మనలోని మనిషిని, అసలు మనిషిని చూసుకోగలం. వర్తమానంలో మన గమనం ఏదైనా.. ఎక్కడో మనకొక కేరాఫ్‌ అడ్రస్‌ మిగిలే ఉంటుంది. అలా మనల్ని ఉన్నపళంగా మనలోకి మనల్ని తీసుకుపోయే అతిసామాన్యమైన దృశ్యరూపమే కేరాఫ్‌ కంచరపాలెం.

ఈ రోజుల్లో సినిమాను క్వాలిటీగా తీయడం పెద్ద విశేషమేమీ కాదు. అందుకు సాంకేతికపరమైన సౌకర్యాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన సెల్‌ఫోన్‌తో తీసినా.. హెచ్‌డీ క్వాలిటీతో బ్రహ్మాండంగా తీయొచ్చు. అసలు నవీన సినిమా అంటేనే హెచ్‌డీ, డీటీఎస్‌, సీజి, సెపియాటోన్‌ కలర్‌ కరెక్షన్‌.. ఇలా అనేక సినిమా ట్రిక్కుల, వ్యాపార లెక్కల, జిమ్మిక్కుల కలబోత. కేరాఫ్‌ కంచరపాలెం దర్శకుడు, రచయిత వెంకటేష్‌ మహా కూడా.. తక్కువ బడ్జెట్‌తో అలాంటి ఆధునిక టెక్నాలజీ సాయంతో కలర్‌ఫుల్‌ సినిమా తీయెచ్చు. కానీ, ఈ పిల్లాడు ఎక్కడో.. కనెక్ట్‌ అయ్యాడు. పల్లెటూరు వీధుల్లోని జీవితాల్ని ఎక్కడ ఎలా పెనవేసుకున్నాడోగానీ ఈ బెజవాడ కుర్రాడైనా.. ఆ మూలనున్న కంచరపాలెం సొబగును.. అక్కడి కట్టూబొట్టు, యాసను, మనుషుల్ని రంగుపూసి రంగేళీలా చేయకుండా.. ఉన్నదున్నట్టుగానే చూపించగలిగాడు. ఇక్కడే.. వందకు వంద మార్కులు కొట్టేశాడు. అలా తీశాడు కనుకనే.. బడిపిల్లోడు స్కూల్‌కెళ్ళడానికి నెత్తి తడవకుండా వాడిన తాటాకు గొడుగుపై పడ్డ చినుకుల సవ్వడి, పల్లెటూరి బడిలోని మాసిన గోడల అందాలు, ఊళ్ళో జనాల వెటకారాలు, వెక్కిరింతలు, కంచరపాలెం ఇరుకు సందుల్లో పొగలూదే మట్టిపొయ్యలు, ఆ పొయ్యిలపై ఇత్తడిబానల్లో కాగే వేడినీళ్ళ సెగలు.. ఇలా మనుషులే కాదు; చెట్టూపుట్ట, పిడకా పొయ్యి … అన్నీ మనకు ఎంతో దగ్గరవుతాయి. మొన్నటిరోజుల్ని కొత్తగా తడుముకునేలా చేస్తాయి.

ఒక దృశ్యం.. కేరాఫ్‌ మన ఊరే!
కేరాఫ్‌ కంచరపాలెం.. ఓ అందమైన దృశ్యకావ్యం. కాదు, కాదు… కావ్యం అంటే కొన్ని లెక్కలుంటాయి. కొలతలు ఉంటాయి. అందుకే కావ్యం అని కాకుండా ఓ అందమైన ‘దృశ్యం’ మాత్రమే అనుకుందాం. ఇక్కడ దృశ్యమంటే.. ఏదో ఒక ఫ్రేమ్‌లో అమరిపోయే.. అందమైన చిత్రణి కాదు. ఇక్కడ దృశ్యమంటే.. సాంకేతికంగా.. అబ్బో బ్రహ్మాండం అని నోరెళ్ళబెట్టేలా చేసే సన్నివేశాలూ కాదు. ఇక్కడ దృశ్యమంటే.. మీరూ, నేను.. మనం.. ఇంకా ఊరంతా. సినిమా చూసొచ్చిన తర్వాత.. మనమూ మన ఊరిని తలచుకుంటూ కేరాఫ్‌ రాజమండ్రి, కేరాఫ్‌ అవనిగడ్డ, కేరాఫ్‌ మండపేట, కేరాఫ్‌ శ్రీకాకుళం అనుకుంటాం. అదే.. ఈ కేరాఫ్‌ కంచరపాలెం.

సినిమాకూ ఒక కథ ఉంటుంది. అసలు సినిమా అంటేనే ప్రేమకథల స్వర్గసీమ. ఈ సినిమా కూడా ప్రేమకథనే. కానీ, మనం సినిమా తెరపై ఎప్పుడూ చూడని ప్రేమకథ. అదీ మనం ఎరిగిన, చూసిన, అనుభవించిన, పంచిన, పెంచిన, పోషించిన కథ. మన ఊరి కథ.. మనం కలిసి తిరిగిన మనుషుల కథ.
ఎక్కడ కంచరపాలెం..! ఎక్కడ మనం. వైజాగ్‌ నగరంలో ఓ భాగమైన ఈ ఊరు గురించి చాలామందికి తెలియకపోవొచ్చు. కానీ, కేరాఫ్‌ కంచరపాలెం..ని.. ఒక తెల్లటి తెర (బిగ్‌స్క్రీన్‌)పై చూడటం మొదలవ్వగానే.. ఆ ఊరితో మనకూ ఏదో సంబంధం ఉందనే.. స్థితిలోకి వెళ్ళిపోతాం. సినిమా చూస్తున్నామనే సంగతే మరచిపోతాం. కావాలంటే.. మీరూ చూడండి.

మూలాలు వెదికే.. ప్రేమకథ
చెప్పగలిగే దమ్ము ఉండాలిగానీ.. మన పక్కనే ఉన్న ఓ సుబ్బారావునో.. ఓ అప్పారావునో హీరోగా పెట్టి సినిమా తీసేయొచ్చు. నిజంగానే దమ్మిడీ.. నటనానుభవం లేని ఓ సుబ్బారావు (అటెండర్‌ రాజు పాత్రధారి)ని హీరోగా పెట్టే ఈ సినిమా తీశారు. ఆమాట కొస్తే.. ఈ సినిమాలో చేసిన అందరూ ఇసుమంతైనా.. నటనలో అనుభవంలో లేనివాళ్ళే. కనీసం ఎప్పుడైనా.. కెమెరా ముందు నిలబడాలనే ఆలోచన చేయనివారే. అందుకే.. ఇందులోని పాత్రలన్నీ మనపక్కనే కూర్చుని మాట్లాడతాయి. పలకరిస్తాయి. గుండెను తడిచేస్తాయి. ఇప్పుడు అసలు సినిమా కథలోకి వెళదాం.

కథ + కథ + కథ + ఓ అటెండర్‌ ప్రేమకథ
ఓ సాదాసీదా గవర్నమెంట్‌ ఆఫీసులో అటెండర్‌గా పని చేసే రాజు (సుబ్బారావు), అక్కడికి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన ఒరియా ఆఫీసర్‌ రాధ (రాధా బెస్సీ) వారి మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు వేరైనాగానీ ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. క్రమేణా.. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగి.. నలభై దాటిన వయసులోనూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. అందుకు ఏర్పడ్డ ప్రతికూల అంశాలు, ప్రతిఘటనలే వీరిద్దరి ప్రేమకథ. ఎనిమిదో తరగతి చదువుతోన్న సుందరానికి (కేశవ) సునీత (నిత్యశ్రీ)ల మధ్య ఉండే ఓ పసితనపు ఆరాధన మరో కథ. సునీత సినిమా పాటలు పాడటం వాళ్ళ నాన్నకు ఇష్టం ఉండదు. తన క్లాస్‌మేట్‌ అయిన ఆ అమ్మాయి కోసం.. స్కూల్‌ గోడదూకి, బజారుకెళ్ళి మరీ ‘మరోచరిత్ర’ సినిమా పాటల పుస్తకం కొనితెచ్చిస్తాడు సుందరం. ఆ అమ్మాయికి దగ్గరుండి పాట సాధన చేయించి, జెండా పండగనాడు పాడేలా చేస్తాడు. అది గిట్టని అమ్మాయి తండ్రి ఆ పిల్లను బడి మాన్పించేసి.. ఎక్కడికో పంపేయడం.. చివరికి అది తట్టుకోలేని సుందరం.. తల్లడిల్లిపోవడం, కుటుంబాన్ని పోగొట్టుకోవడం ఇంకో కథ. ఇక అదే ఊరిలో.. వైన్‌షాపులో పని చేసే గడ్డం (మోహన్‌ భగత్‌) రోజూ తమ షాప్‌ దగ్గరకి వచ్చి ‘క్వార్టర్‌’ బ్రాందీ కొనుక్కు వెళ్లే సలీమా (డా.విజయ ప్రవీణ) కళ్లు చూసే ప్రేమించేస్తాడు. ఆమె వేసుకొచ్చే ముసుగు చాటు ముఖం వెనుక ఓ వేశ్య దాగి ఉందని తెలిశాక కూడా ఆమెను ప్రేమించడం, ఆరాధించడం మరో ప్రేమకథగా సాగుతుంది. ఇదే కంచరపాలెంలో ‘అమ్మోరు వ్యాయామశాల’ నడిపే ఓ దాదా దగ్గర పని చేసే జోసెఫ్‌ (కార్తీక్‌) తనను ఒకప్పుడు కొట్టించిన భార్గవి (ప్రణీత) అనే బ్రాహ్మణ అమ్మాయి ప్రేమలో పడతాడు. చివరికి మతాంతర కారణంగా ఎలా ఇద్దరూ వేరుపడాల్సి వచ్చిందో అనేది మరోకథ.

స్థూలంగా, సూక్ష్మంగా ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. స్వచ్ఛమైన, కల్మషం లేని నిజాయతీ గల ప్రేమ గురించి చెప్పడానికి హీరో పాత్రధారి అమెరికా నుంచే రానక్కర్లేదు.. మన ఇంటి ఎదురుగా ఉన్న బార్‌షాపులో పనిచేసే.. కుర్రాడి లోనూ అలాంటి ప్రేమే ఉంటుంది.. అంటూ చాలా సింపుల్‌గా, అంతే గొప్పగా చెప్పాడు దర్శకుడు మహా.

ఇక సలీమ పాత్రలో.. నటించింది స్వయానా ఈ సినిమా నిర్మాత డాక్టర్‌ పరుచూరి ప్రవీణ గురించి ఏం చెప్పాలి? ఆ వృత్తిలో ఉన్నవారినే ఆ పాత్రకు ఎంపిక చేసి ఉంటారనేంతగా ప్రవీణ నటించడం, చివరికి ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించడం చూస్తే.. నిజంగానే.. ఆమెకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ‘ఇన్నాళ్ళూ నన్ను చూసినోళ్ళంతా వస్తావా.. అని అడిగారు గానీ.. నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లిచేసుకుంటా.. అడిగినవాళ్ళను చూడలే’ అనే ఆ ఒక్క సన్నివేశం చాలు.. పాత్రలోని తీవ్రతను అర్థం చేసుకోడానికి. అందుకేనేమో! అమెరికాలో ప్రముఖ డాక్టర్‌గా ఎంతో పేరున్నా.. సినిమా పిచ్చితో ఇండియా వచ్చేశానంటారామె.

దాదాపు రెండున్నర గంటల నిడివిగల ఈ సినిమాలో.. కొన్ని బరువైన సన్నివేశాలే కాదు; బొమ్మ పడిన దగ్గర నుంచీ.. శుభం కార్డు పడేదాకా.. పాత్రల మాటున కడుపుబ్బ నవ్వించే మాటలూ చాలానే ఉన్నాయి. ఇక్కడ దర్శకుడి గురించి మరోసారి చెప్పుకోవాలి. ఇందులో నటించిన వారంతా దాదాపుగా కొత్తవాళ్ళే. రోడ్డుపై ఎవరు కనపడితే.. వాళ్లను లాక్కొచ్చి.. వాళ్ళతో నటింపజేయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇందులో నటించినవాళ్ళూ అంతే.. ఎక్కడా నటిస్తున్నట్టుగా కనపడరు. సహజంగా మాట్లాడతారు. అతి సామాన్యంగా, అంతే సహజంగా కనిపిస్తారు. ప్రేక్షకులతో ఇట్టే కలిసిపోతారు. ఆ ‘మహా’ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌దే!

ప్రేమ కథలు సినిమాలుగా చాలానే వచ్చాయి. కులం, మతం అనే కంటెంట్‌తో ‘సీతాకోకచిలుక, దేవాలయం, ఆరాధన, రుద్రవీణ’ వంటి సినిమాలు ఇంతకుముందు చూసినవే. కథావస్తువు కొత్తేం కాదు. కానీ, కేరాఫ్‌ కంచరపాలెం ప్రేమకథ మాత్రం కొత్తగానే ఉంటుంది. ముగింపూ అంతే కొత్తగా ఉంటుంది!
కొన్ని సినిమాలను.. సారీ.. కొన్ని దృశ్యాలను పనిగట్టుకుని చూడాలి. పనులు మానుకుని చూడాలి. చూస్తేనే ఆ అనుభవం దక్కుతుంది. ఎందుకంటే కేరాఫ్‌ కంచరపాలెం.. మన కథ. కేరాఫ్‌ మనలోకి మనల్ని తొంగి చూసుకునే కథ.

– గంగాధర్‌ వీర్ల

1 thought on “మ‌న‌లోకి మ‌నం c/o కంచ‌ర‌పాలెం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

18 − eight =