అరుదైన చిత్రకారిణి అంజలి ఇలా మీనన్

భారతీయ చిత్రకళని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లిన మన మహిళా చిత్రకారిణిలలో మొదటగా చెప్పుకునే గొప్ప కళాకారిణి అమృతా షెర్గిల్ అయితే ఆ తర్వాత చిత్రకళలో విశేషంగా కృషి చేస్తూ అలాంటి గుర్తింపు తెచ్చుకునేందుకు ముందువరుసలో వున్న మరో నలుగురు భారతీయ మహిళా చిత్రకారిణులలో ఒకరు అంజలి ఇలా మీనన్. 1940 జూలై 17న పశ్చిమ బెంగాల్ నందు జన్మించిన అంజలి పదిహేనేళ్ళ వయసులో సెకండరీ విద్య ముగిసిన పిదప చిత్రకళ పై ఆసక్తితో బొంబాయి నందలి సర్ జే జే స్కూల్ అఫ్ ఆర్ట్ లో అప్లైడ్ ఆర్ట్ లో చేరి తన కళకు మెళకువలు నేర్చుకున్నారు. ఆపై డెల్లి యూనివర్సిటీ పరిదిలో గల మిరిండా కళాశాలనుండి ఆంగ్లంలో డిగ్రీ చదివారు. పద్దెనిమిదవ ఏటనే 53 చిత్రాలతో తన తొలి వ్యక్తి గత ప్రదర్శనచేయడం జరిగింది. ఆపై ఫ్రెంచ్ ప్రభుత్వము అందించిన స్కాలర్ షిప్ సహాయంతో ఆమె 1959 నుండి 1961 వరకు రెండేళ్ళ పాటు పారిస్ లో కూడా చిత్రకళ ని అభ్యసించారు. ఈ కాలంలోనే యురఫ్ నందలి చిత్రకళ పై జరిగిన వివిధ ధోరణులను ఆకళింపు చేసుకున్నారు. ఆ కాలంలో వీరు ముఖ్యంగా విన్సెంట్ వేంగో యొక్క భావవ్యక్తీకర చిత్రణా (ఎక్ష్ప్రెస్సిఒనిస్మ్) రీతికి బాగా ఆకర్షితురాలయ్యారు. ఆపై ఇండియా తిరిగి వొచ్చిన పిదప అమృత షెర్గిల్, ఎం. ఎఫ్. హుస్సేన్ తదితరుల కళారీతికి బాగా ప్రభావితులయ్యారు.

సుధీర్గమైన ఈమె యొక్క 70 ఏళ్ళ చిత్రకళా పయనంలో ఎన్నో రీతుల లో వీరు చిత్రాలను వేయడం జరిగింది అవన్ని అప్పటికి తన మనసుపై చూపిన ప్రభావం మేరకు రూపుదిద్దుకున్నవే అని చెప్తారు. యురఫ్ లో వున్న కాలంలో బైబిల్ చిత్రాలపై ద్రుష్టి సారించిన వీరు తర్వాత మహిళల న్యూడ్ చిత్రాలు కూడా అదే స్థాయిలో వేసారు. ఆపై ఇండియా వొచ్చిన తర్వాతా అమృత షెర్గిల్, హుసేన్ తదితరుల ప్రభావంతో భారతీయ రూప చిత్రాలు తనదైన కోణంలో చిత్రించారు. ముఖ్యంగా “టూ ఫేసెస్ స్ అఫ్ ఆయేషా” లాంటి చిత్రాల ద్వారా భాదిత మహిళల పోర్ట్రైట్ లను తనదైన రీతిలో చిత్రించారు. ఈమె యొక్క చిత్రాలలో బాగా ప్రసిద్ధిగాంచిన చిత్రం బైబిల్ నందలి క్రీస్తు జీవితం పై వేసిన చిత్రం. అది మరణించిన క్రీస్తును తల్లి మరియ తన వొడిలోకి తీసుకుని విలపిస్తున్నట్లుగా 1499 లో ప్రఖ్యాత శిల్పి చిత్రకారుడు మైకలాంజిలో రూపొందించిన శిల్పాన్ని ఆధారంగా వేసిన చిత్రం. ఇదే చిత్రాన్ని1774,లో మరో యరోపియన్ చిత్రకారుడు గోయా, 1889లో విన్సెంట్ వేంగో, 1982 మరలా మరో ప్రముఖ సర్రియలిస్ట్ చిత్రకారుడు సాల్విడార్ డాలి తమదైన శైలిలో వేయడం జరిగింది. 15వ శతాబ్ధం నుండి వస్తున్న ఆ చిత్రాన్ని 20వ శతాబ్దంలో మరలా అంజలి ఇలా మీనన్ మన భారతీయ దృష్టికోణంతో చిత్రించడం జరిగింది. ఇందులో మరియ స్థానంలో మదర్ తేరీసా ను ఎంచుకోవడం ఆమె యొక్క ప్రత్యేకత.

అంజోలీ ఎలా మీనన్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తిగతంగాను సామూహికంగా కూడా ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది ఆమె ప్రదర్శనలలో 2008 లో న్యూ డెల్లి నందలి లోని ధూమిమల్ గ్యాలరీలో ‘మెనోంగైటిస్-త్రీ జనరేషన్స్ పేరుతోను, 2000 లో న్యూయార్క్‌లోని అడ్మిట్ వన్ గ్యాలరీలో అప్పారావ్ గ్యాలరీస్ సమర్పించిన ‘గాడ్స్ అండ్ అదర్స్, 1998 లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జెహంగీర్ ఆర్ట్ గ్యాలరీలోను. 2009 లో లండన్ లోని ఐకాన్ గ్యాలరీలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) సమర్పించిన ‘కల్పనా: ఫిగ్యురేటివ్ ఆర్ట్ ఇన్ ఇండియా’ లాంటి సిరీస్ తో సహా అనేక సమూహ ప్రదర్శనలలో అంజలి ఇలా మీనన్ చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. 2008 లో న్యూ డిల్లీలోని గ్యాలరీ థ్రెషోల్డ్‌లో ‘మ్యాపింగ్ మెమోరీస్-2, పెయింటెడ్ ట్రావెలాగ్స్ ఆఫ్ బాలి అండ్ బర్మా, మరియు 2001 లో న్యూ డిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లోనూ ‘కకుచ్ కుచ్ హోతాహై పేరుతో వీరి చిత్రాలు ప్రదర్శింపబడినాయి. ఇంకా ముంబై, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాలలోనే గాక 2006 లో శాన్ఫ్రాన్సిస్కోలోని ఆసియన్ ఆర్ట్ మ్యూజియంలో ‘యాత్రా’ పేరుతో ఏకంగా ఆరు నెలల పాటు తన సోలో ప్రదర్శన జరగడం మరింత గొప్ప విశేషం .

సుధీర్గమైన తన కళాకృషి తో ఆమె లిమ్క బుక్ అఫ్ రికార్డ్స్ లోకేక్కడమే గాక, యెన్ సి టి ఇండియా 2013 లో జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2018 లో కాళిదాస్ సమ్మాన్ అవార్డ్ తో సత్కరించింది. అంజలి ఇలా మీనన్ కు ఇంకా భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని 2000 లో భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. చిత్ర కళారంగంలో పరిమితంగా వుండే మహిళా చిత్రకారులలో తన అపరిమితమైన కృషి ద్వారా అంజలి ఇలా మీనన్ ఇలా జాతీయ అంతర్జాతీయంగా రాణించడం ఎంతో గొప్ప విషయం.

– వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap