“ఇంటి పేరు ఇంద్రగంటి”

తెలుగు సాహితీ ప్రపంచానికి ఇంద్రగంటి శ్రీకాంత్శర్మగారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కవిత్వం, లలితగీతం, చలనచిత్రగీతం, యక్షగానం, కథ, నవల, నాటకం, నాటిక, వ్యాసం – ఇలా అనేక ప్రక్రియల్లో శ్రీకాంత్శర్మగారి కలం తన పదును చూపెట్టింది. శ్రీకాంతశర్మగారికి సాహితీ వారసత్వం తమ నాన్నగారి నుంచి వస్తే, అదే వారసత్వం మరోరూపంలో వాళ్ళ అబ్బాయికి సంక్రమించింది. 20 వశతాబ్దపు ప్రముఖరచయితల్లో ఒకరైన ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు శర్మగారి తండ్రి ఐతే, ఈ తరం సినిమాల విజయవంతమైన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శర్మగారి అబ్బాయి. శర్మగారు ఊహతెలిసిన వద్దనుంచే, వాళ్ళ నాన్నగారిని కలుసుకోడానికి వచ్చే, హేమాహేమీలైన పండితులమధ్య పెరిగారు. అందుకే ఆయన జీవితపు దారి పొడవునా సాహిత్యపరిమళాలు విరజిమ్ముతూనే ఉన్నాయి, ఉంటాయి. వాస్తవం కల్పనకంటే చిత్రమైనది ఒక నానుడి. మామూలాగే ఎవరి జీవితాన్ని తీసుకున్నా, బాల్యం నుంచి జరిగిన సంఘటనలని వరుసగా కూర్చగలిగితే ఏ కాల్పనిక నవలకన్నా కూడా ఆసక్తికరంగ ఉంటుంది. మామూలు జీవితాల సంఘటనలే అంత ఆసక్తికరమనిపిస్తే శ్రీకాంత్ శర్మగారి లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుల జీవితంలోని మలుపులు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. వాళ్ళ నాన్నగారి జీవితం నుంచే ప్రారంభించి, తన బాల్యం, మొదట్లోని పాత్రికేయ ఉద్యోగం, తరువాత ఆకాశవాణి ఉద్యోగం, మళ్ళీ పాత్రికేయ జీవితం – ఈ సుదీర్ఘ పయనంలో తారసపడిన రచయితలు, కవులు, కళాకారులు, హేమాహేమీలు, ఉద్దండులు, ప్రముఖవ్యక్తులు, హూ ఈజ్ హూలు… వెరసి ఈ పుస్తకం లోని ప్రతి పేజీలోనూ, ప్రతి సంఘటనలోనూ దశాబ్దాల తెలుగు సాహితీచరిత్ర, ఆకాశవాణి చరిత్ర కనిపిస్తుంది.

 ఆత్మీయంగా పలకరిస్తుంది. శర్మగారు ఐతే -” నేను ఏ ఉద్యమాలలోనూ పనిచేసినవాడిని కాను. నేనెరిగినది, తెలుగు సాహిత్యం గురించి, అందునిమిత్తంగా నడిచిన ఘటనలగురించి, ధునిక సాహిత్యంతో మాకుటుంబానికున్న సంబంధం గురించి నేనెరిగిన ఘటనలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది” అని చెప్పుకున్నారు, కానీ శర్మగారి జీవితంలోని సంఘటనలు ఏ ఉద్యమకారుడి జీవితానికీ తీసిపోనంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ప్రసిద్ధరచయిత ఆత్మకథ ఎంత ప్రామాణికంగా, ఎంత విశదంగా, ఎంత ప్రణాళికా బద్దంగా ఉండాలో అన్నింటినీ సంతరించుకుంది. ఈ పుస్తకం. వాళ్ళనాన్నగారు చనిపోయాక అమ్మగారిపోషణ గురించి కుటుంబసభ్యులంతా చర్చించుకోవడం లాంటి అనేక సంఘటనలు చదువుతుంటే ఇవే కదా కథలుగా వచ్చే సన్నివేశాలు ” అనిపిస్తుంది. ఆపకుండా చదివించే శైలి, అడుగడుగునా ఆసక్తి కలిగించే సంఘటనలూ – మొత్తానికి పుస్తకం మొదటినుంచీ శర్మగారు పాఠకుడు చేయిపట్టుకుని నడిపిస్తూ తన జీవితాన్నేకాదు, తనతో పెనవేసుకున్న అనేక జీవితాలని కళ్ళకు కట్టినట్లు చూపించారు. అందరూ తప్పక చదవాల్సిన ఆత్మకథ ఈ “ఇంటి పేరు ఇంద్రగంటి’.

-పాండురంగ

SA: