ఎల్లలు లేని కవి – శివారెడ్డి

శివారెడ్డి. ఈ పేరు వింటేనే మనసు లోతుల్లోంచి పెల్లుబికే ఒక ఉత్సాహం మనల్ని కమ్మేస్తుంది. పల్లె నుంచి నగరం దాకా విస్తరించిన ఒక స్వచ్ఛమైన కవితా కంఠం మన చెవుల్లో మారుమోగుతుంది. కాలాన్ని కలంలో పోసుకొని సంచరిస్తున్న ఓ బక్కపల్చటి నిలువెత్తు సాహితి మూర్తిమత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. నగరానికి దూరంగా వున్న ప్రతి కవి ఒక్కసారైనా నగరానికి వెళ్ళాలని, ద్వారకా మిత్రుల మధ్య తన కవిత వినిపించాలని, వారితో కలిసి ఓ కప్పు కాఫీ సేవించాలని ఉవ్విళ్ళూరిన కాలం, ఒకనాడు. “బాగుందమ్మా, ఇంకా బాగా రాయాలి, రాయాలంటే ముందు మనం అధ్యయనం చెయ్యలి. అధ్యయనంతో పాటు అభ్యాసం వుండాలి’ అంటూ భుజంమీద చెయ్యేసి మాట్లాడితే, ఎంతో ఉప్పొంగిపోయి మనమూ కవుల జాబితాలో చోటు సంపాదించుకున్నామని సంతోషపడ్డ యువకవు లెందరో. అటువంటి కవి శివారెడ్డిని ‘సరస్వతి సమ్మాన్’ అవార్డు వరించింది. ‘ఈ అవార్డు తెలుగు వారిలో మొట్టమొదటిసారిగా శివారెడ్డికి దక్కటం గొప్ప విషయం. ఈ సందర్భంగా శివారెడ్డి గారికి 64కళలు.కాం అభినందనలు తెలియజేస్తూ…శివారెడ్డి కవిత్వం పరిచయం మీ కోసం.
ఆధునిక సాహిత్యంలో కవిత్వకాంతి శివారెడ్డిగారు. కవిత్వాన్ని, ఆయనను విడివిడిగా చూడలేం. కవిత్వమే ఆయన. ఆయనే కవిత్వం. కవిత్వపరమళమే మాటలనిండా కవులంటే అపారమైన ప్రేమ అధ్యయనమే మరింత ఎత్తుకు ఎదిగేట్లు చేస్తుందని పదేపదే చెబుతారు. విస్తృతమైన అధ్యయనమే ఏ కవికైనా అత్యవసరం అని ఆయన సూత్రం.
శివారెడ్డి గారికి 75ఏళ్ళు దరిచేరినా, ఆయనలోని పసితనం వాడలేదు. అందుకే పిల్లల్లో పిల్లవాడిగా యువకుల్లో యువకుడిగా, వృద్దుల్లో వృద్దుడిగా జీవిస్తారు.
పి.జి. చదివే రోజుల్లో శ్రీశ్రీని, శ్రీరంగం నారాయణబాబునీ, ఆరుద్రనీ, జాషువానీ, తిలకినీ, అజంతానీ, దిగంబర కవులనీ చదువుతూ గొప్ప ఆరాధన వుండేది. వాళ్ళ నెప్పటికైనా కలవగలనా అనిపించేది కానీ, కాలం చిత్రమైంది. శ్రీశ్రీని జాషువానీ, నారాయణబాబునీ, ఆరుద్రనీ తప్ప మిగతా అందరినీ కలవగలిగాను.
‘ఆసుపత్రిగీతం’ – దీర్ఘకావ్యం బాగా నచ్చేది. కవిత్వంలో అత్యంత సరళమైన రీతిలో మనసుకు హత్తుకునేట్లుగా రాయడం ఆయన ప్రత్యేకత. ఎక్కడా వస్తువు విషయంలో పునరావృతులుండవు. ఒక కవితకూ మరో కవితకూ పోలికుండదు. ఎప్పటికప్పుడు వినూత్నంగా, విశిష్టంగా, విస్మయపరిచేట్లుగా వుంటుంది. సగటున ప్రతిరెండేళ్ళకూ ఒకటి చొప్పున కవితా సంపుటులు తెస్తూనే వున్నారు. సూర్యచంద్రుల రాక ఎంత సహజమో, గాలి వీచడం, వాన కురవడం, కవిత్వ సృష్టి జరగడమూ అంతే సహజం అదే ధోరణీ ఆయనది. విస్తృతంగా పర్యటించడం, కొత్త కవుల్ని కలవడం, వారితో చెలిమి ఎప్పటికప్పుడు కొత్త కవిత్వపోకడలను ఒడిసిపట్టుకోవడం, ఇవన్నీ ఆయన కవిత్వజీవితంలోని భాగాలు.
చుట్టూవున్న వాతావరణం నుంచీ, వ్యక్తిగత అనుభూతుల నుంచీ, ప్రాపంచిక పోకడలను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకోవాలంటారు. వైయుక్తిక అనుభవాల నుంచి సామాజిక దిశగా పయనించడమే కవి ఎన్నుకోవాల్సిన మార్గమంటారు.
ఒక సముద్రం ఎదురుగా కూర్చుంటే, మనతో అలలభాషతో ఎన్నెన్ని మాట్లాడుతుందో, ఎంత ఉత్తేజితులుగా తయారుచేస్తుందో – బతుకు గుట్టులను ఎలా విప్పి చెబుతుందో, తానే ఒక కవిత్వమై మనల్ని ఎలా పలకరిస్తుందో, అలానే – శివారెడ్డిగారు కూడా మన కళ్ళెదుటున్న మహాసముద్రంలా అనిపిస్తారు. ఈత నేర్చిన వాళ్ళే కవులు. దూకండి. ఏదో ఒక తీరంలో తేళ్తారు. అని కవుల్ని రాయడానికి సమాయత్తం చేసే గుణం ఆయనది. ‘కవిత్వం విలసిల్లే నేల ఎప్పటికీ మరణించదు అని ‘కీట్స్’ భావించినట్టు శివారెడ్డిగారు కూడా కవులనేలగా, తెలుగు నేలను రూపొందించే క్రమంలో, ఆయన రాసే ప్రతి ఒక్కరిని వెన్నుతడతారు. ముందు రాయడం వైపుకు మళ్ళితే తర్వాతి క్రమంలో కవిత్వంలో మెళకువలు నేర్చుకొని ఉత్తమమైన సృజనకారులుగా రూపొందుతారని ఆయన విశ్వాసం. ఆ క్రమంలోనే విస్తృతమైన
పర్యటనలు, సభల్లో ఎక్కువగా పాల్గొనడం తన నిత్య కార్యక్రమంగా పెట్టుకున్నారు. ద్వారకా హోటల్ – కూడలిని, ఎన్నో ఏళ్ళపాటు కవిత్వకూడలిగా మార్చి కవిత్వ పాఠశాలలా దానిని కవుల సంగమస్థలిగా మార్చి తెలుగు కవిత్వాన్ని ఒక తరం నుంచి మరో తరానికి వారధిగా నిలబడ్డారు.
ఆయన సహజ కవి. గొప్ప వక్త. సమకాలీన కవిత్వాన్ని ప్రభావితం చేసిన నిత్య నూతన కవి. కవిత్వం ఊసులేని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో! తను పనిచేసిన కాలేజీలో కూడా కవుల సందర్శనస్థలంగా మార్చిన ఘనత ఆయనది. కవిత్వంలోనూ తనదైన ప్రత్యేకమైన, గాఢమైన శైలిని రూపొందించుకున్నారు. సంభాషణా శైలిలాగా సాగే ఆయన కవిత్వం, వస్తువును అనేక పోలికలతో, భావచిత్రాలతో రూపొందించే ఆ పద్దతి అనేకమంది యువకవులను ప్రభావితం చేసి దానిని అనుసరించేట్లుగా చేసింది. ఆ శైలివల్ల పాఠకుడికి దగ్గరగా చేరగలిగాడు. ఆ కవితాశైలిని అనేకమంది విమర్శకులు పలువిధాలుగా విశ్లేషించడానికి పూనుకున్నారు, విశ్లేషించారు. వచన కవిత్వం అనే ప్రక్రియ రూపొందాక, అది వేళ్ళూనుకునే క్రమంలో శివారెడ్డిగారు ఆ ప్రక్రియకు ఒక స్థిరరూపాన్ని స్థిరీకరించడంలో తన కవిత్వాన్ని ఒక వాహికగా ఉపయోగించుకున్నారని అనిపిస్తుంది. కవితలోనే నేరుగా పాఠకుడిని సంబోధిస్తూ సాగే ఆయనశైలి వచనకవిత్వంలో ప్రత్యేకంగా చెప్పదగినది.

-డా. శిలాలోహిత (కవిత పత్రిక నుండి)

SA: