ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

జీవితాన్ని మించిన సినిమా ఏముంది? 24క్రాఫ్ట్స్ తో ఒక జీవితం సినిమా అయితే అంతకు మించిన కళానందం ఎక్కడ దొరుకుతుంది? మన పొరుగు భాషల్లో అట్టడుగు బడుగు జీవితాలు వెండితెర ద్వారా వెలుగు చూస్తున్నాయి. మనకిక్కడ ఇంకా పెద్ద తెరను చీకటి కమ్మే వుంది. పెద్ద నిర్మాతలు..పెద్ద దర్శకులు..పెద్ద హీరోలు..పెద్ద బడ్జెట్లు..అంతా పెద్దపెద్దోళ్ళ చేతుల్లో తెలుగు సినిమా ఊపిరాడక కొట్టుకుంటూనే వుంది. సమాజం ఒక వెలుగు వెలగడంలో కీలక పాత్ర పోషించి తాము మాత్రం చీకటిలో మగ్గిపోయిన బతుకులెన్నో అవేంటో మనకు బాగా తెలుసు. జీవితం సినిమాహాల్లో వాళ్ళింకా నేల టిక్కెట్టుగాళ్ళుగానే మిగిలిపోయారు. ఆ నేల టిక్కెట్టు గాళ్ళే ఈ నేల మీద అసలు మొనగాళ్ళన్న స్పృహ వచ్చిందంటే ఆ సీనే వేరు. మల్లేశం సినిమా మొన్న ప్రివ్యూ చూశాక అలాగే అనిపించింది. ఆ సినిమాకు ఆర్ట్ డిజైన్ చేసిన ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ మల్లేశం సినిమా ఇల్లస్ట్రేషన్లతో 19 జూన్, 2019 న హైదరాబాద్, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గేలరి లో సోలో షో నిర్వహించాడు. చూసి తన్మయం చెందాను. అతని ఆర్ట్ కి పాదాభివందనాలు. హృదయం ఎన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళీ వెళ్ళీ ఏ మగ్గం గుంటలో కూర్చుందో గానీ చాలా సేపు నా లోకంలోకి రాలేకపోయాను.

అక్కడ మృత్యుంజయ్ అనే కార్టూనిస్టు కనిపించాడు. అన్నా ఈయన మా నాయన అని ఒక బొమ్మ చూపించాడు. అతని పేరు రామలింగం. అతని పేరు ప్రపంచమంతా పాకింది. లచ్చిందేవి మాత్రం అతని ఇంటి గడప తొక్కలేదు. పోచంపల్లి బోనాల పండగప్పుడు ఉదయమే బండి కట్టి దాని మీద మగ్గం పెట్టి చీర నేస్తూ సాయంత్రం వరకూ ఊరంతా తిరిగి అమ్మవారి గుడి దగ్గరికి చేరేవాడు. బండి ముందు పోతరాజుల నృత్యాలతో ఊరు ఊగిపోయేదట. సాయంత్రానికి చీర నేయడం పూర్తయ్యేది. రామలింగం బండి దిగి అమ్మవారికి చీర సమర్పించేవాడు. చుక్కల ఆకాశం అందినంత ఆనందంగా అమ్మవారు చీర చుట్టుకునేది.అనేక సంవత్సరాల పాటు సాగిన అద్భుత కళోత్సవం ఇది. ఆయన పోవడంతో అమ్మవారికి నరాలతో నేసిన వరాల చీర లేకుండా పోయింది. రామలింగం స్టయిలే వేరు. ఆయన టెక్నిక్స్ వేరు. గాంధి, నెహ్రూ, ఇందిర, రాజీవ్ వంటి ప్రముఖ నాయకుల పోర్ట్రేట్స్ నేసే వాడు. నాయకులు రామలింగానికి ఫిదా అయిపోయేవారు. మూడు కొంగుల చీర నేసిన నేర్పరి. కుట్లు, కత్తిరింపులు,అతికింపులు లేకుండా కుర్తా పైజామా, టోపీ, గొడుగు నేసిన అద్భుత కళాకారుడు. ఇలాంటివారిని ఆదుకోడానికి కాలం మాత్రం ఒక అద్భుతమైనా చేయలేదు. దేశదేశాల వారొచ్చి రామలింగం మగ్గం ముందు మోకరిల్లే వారు. రామలింగం జీవితంలో కొన్ని ఘట్టాలను ప్రఖ్యాత దర్శకుడు శ్యాంబెనగల్ తన సినిమాలో పొందుపరచాడు. సినిమా పేరు సుష్మాన్. ఇలాంటి రామలింగంలు మన తెలుగు ప్రాంతాల్లో చాలా చోట్ల ఉన్నారు. ఇందులో లక్ష్మణ్ గీసిన రామలింగం బొమ్మను పెట్టాను చూడండి.
నాకు మా నాయనమ్మ తమ్ముడు శ్రీరాపు అప్పారావు గుర్తుకొచ్చాడు. నా చిన్నప్పుడు అతని మగ్గంతో ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొచ్చాయి. అతను చనిపోయినప్పుడు నేను తాతకో నూలుపోగు అని కవిత రాశాను. ఆంధ్రజ్యోతిలో అచ్చయినప్పుడు ఎందరో నన్ను ప్రేమగా హత్తుకున్నారు. అతను చాలా బక్కగా పొడవుగా వుండేవాడు. ఒంటి మీద సన్నని బనీను గుడ్డ తప్ప మరో మంచి వస్త్రం ఎప్పడూ చూడలేదు. ఎక్కువగా గోచితోనే వుండేవారు. ఊళ్ళో ఆసాములకు ఆయన నేసి ఇచ్చే పంచల సాపులు చూస్తే భలే ముచ్చటేసేది. ఇదేమిటి? అందరికీ ఇంత మంచి బట్టలు బహూకరిస్తూ ఈయనేంటి ఇంత బోసి వొంటితో అని అనుకునే వాడిని. కానీ కారణాలు తెలిసే వయసు కాదు. మామ్మ కూడా అంతే ఎప్పుడూ జాకెట్టు వేసుకోవడం చూడలేదు. చినుగుల నేత చీర కప్పుకునేది. అతను మగ్గం ఆడించడం..మామ్మ రాట్నం తిప్పడం పగలూ రాత్రీ అదే పని. ఇదే సీను గుర్తుంది. చివరికి పోయేటప్పుడు ఎవరైనా వొంటి మీద గుడ్డలన్నీ ఊడదీసుకునే పోతారు. కానీ తాతా, మామ్మ మాత్రం బతుకులోనూ చావులోనూ పెద్ద తేడా చూడలేదు. తాతా తాతా ఆత్మహత్యల పాలైన ఎందరో చేనేత కార్మికుల చివరి కేకలా వుండేవాడివి అని నేను కవితలో రాశాను. నేతవారి బతుకులన్నీ ఇంతే. ఆసు యంత్రం కనిపెట్టిన మల్లేశం అమ్మ బొక్కలరిగిపోకుండా కాపాడగలిగాడేమో గానీ నేతగాళ్ళ బతుకులరిగిపోకుండా కాపాడిన వాళ్ళెవరూ పుట్ట లేదు. యంత్రాలన్నీ భూతాలై చేనేత కార్మికుల బతుకు బొక్కలన్నీ నమిలి మింగేశాయి.
ఇలాంటి జీవితాలను తెరకెక్కించే సాహసికులు రావాలి. బడుగు బలహీన బతుకుల నేపథ్యాల నుంచి వారి జీవన విధ్వంసాల నుంచే వారి సాంస్కృతిక విషాద వినోద సంగీతాలను వినిపించే మొనగాళ్ళు రావాలి. మనకు తెలుసు చలామణిలో ఉన్న సినిమా సాంకేతిక పటాటోపాల ముందు, చెల్లుబాటులో ఉన్న సినిమాటిక్ విలువల ముందు, మనం నమ్ముతున్న దర్శక నిర్మాణ ఫోటోగ్రఫీ బాణీల కళా వైభవాల సంరంభాల ముందు ఇలాంటివి ప్రస్తుతానికి వీగిపోయినట్టు కనపడవచ్చు. కాని ఇవి దేశంలో ప్రత్యామ్నాయ కళా విలువల పునాదులై పైకి లేచి అథోజగత్ జనావళికి ఊపిరి పోసే చైతన్య దీపాలుగా నిలిచిపోతాయి. మల్లేశం సినిమా తీయడానికి విదేశాల నుంచి వచ్చిన రాజు గారికి, సినిమా టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు.

-ప్రసాదమూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap