తెలుగు జాతి కీర్తి శిఖరం…ఎన్.టి.ఆర్.

తెలుగు లెజెండ్… నందమూరి తారక రామారావు జయంతి నేడు

తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరనీయులు.
తేలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు ఆయన. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మైలురాళ్ళకు యన్టీఆరే ఆద్యుడు. ఇక ఆయన నటజీవితంలో మైలురాళ్ళుగా నిలచిన చిత్రాలు ఈ నాటికీ జనం మదిని గెలుస్తూనే ఉన్నాయి… సాంఘికమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, జానపదమైనా- ఏదైనా సరే నందమూరి బాణీ వాటికే వన్నె తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని, పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా చేస్తోన్న ఎన్‌టిఆర్‌ చెన్నై ట్రైన్‌ ఎక్కేశారు. తొలి అవకాశం ‘పల్లెటూరి పిల్ల’ సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం ‘మనదేశం’ చిత్రం. షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నై థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతానికి మార్చుకున్నారు. విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి.
మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. కన్యాశుల్కం, గుండమ్మకథ, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్‌ రాముడు, సర్ధార్‌ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఎన్‌టిఆర్‌ నటించిన చివరి చిత్రం మేజర్‌ చంద్రకాంత్‌. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు.
చిత్ర సీమలో నెంబర్‌ వన్‌గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం అనే రాజకీయపార్టీ 1982 మార్చి 29న స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేశారు. అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడే కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమారంగంలో ‘స్లాబ్ విధానాన్ని అమలు పరిచారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని 1985 జూన్‌1న రద్దు చేసారు. హైదరాబాదు లోని హుస్సేన్‌ సాగర్ కట్టపై (ట్యాంకు బండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు.
ప్రజలే దేవుళ్ళు – సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు. స్త్రీలకు ఆస్తి హక్కునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకొని తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. తెలుగుజాతికి – తెలుగుభాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. గ్రామీణ జీవితాన్ని ఫ్యూడల్‌ శక్తుల కబంద హస్తాలనుంచి విడిపించేందుకు మునసబు – కరణం వ్యవస్థలను రద్దుపరచి బడుగు – బలహీనవర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గరకు చేర్చారు. తెలుగుదేశంపార్టీని కేవలం ఒక రాజకీయపార్టీగా కాక ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా ఆయన చెప్పేవారు.
పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని “అన్న”ఎన్‌టిఆర్‌ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నాదేండ్ల బాస్కర రావు నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్న ఎన్‌టిఆర్‌ మరోసారి ప్రజా తీర్పు కోరి తిరుగులేని మెజార్టీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 1985 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన 1989 ఎన్నికల్లో ఓటమి చెందారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన ఎన్‌టిఆర్‌ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యపథంలో నడిపించి నేషనల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేశారు. కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయించారు. ఒక ప్రాంతీయ పార్టీని దేశ రాజకీయాలకు దిక్సూచిగా మార్చారు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టకుండా హుందా రాజకీయాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు. తెలుగు దేశం పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఎన్‌టిఆర్‌ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. 1996 జనవరి 18న ఎన్‌టిఆర్‌ గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనా ప్రజలు, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap