కళాసాక్షి లేపాక్షి

‘లేపాక్షి’ అనగానే ముందు గుర్తువచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నమైన ‘నంది’, దీనితో పాటు అడవిబాపిరాజు నందిపై వ్రాసిన ‘లేపాక్షి బసవయ్య-లేచిరావయ్య’ అనే గీతం. అంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే ఆ నంది పేరుతోనే మన రాష్ట్రభుత్వం అవార్డులను ప్రతిభావంతులైన కళాకారులకు ప్రతియేటా అందజేస్తోంది. నందిలేని శివాలయం లేదు. బసవన్నలేని వ్యవసాయం లేదు. ఎద్దు రంకెవేస్తే రైతు హృదయం పొంగిపోతుంది. బలానికీ, ప్రతిభకీ, స్థిరత్వానికీ, కళలకీ నంది ప్రతీక. వృషభ జాతకులు గొప్ప అదృష్ట వంతులు. కవిలో ప్రతిభ ఉంటే కవివృషభులని పిలవటం మన రివాజు. అలాంటి సకల సంకేతపరమైన నంది లేపాక్షిలో ఉంది. కళాసంపన్నతకు సాక్షి లేపాక్షి. ఇక్కడ ఆలయం శిధిలమైనా, సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. వెళ్లే దారి అంతా చిన్నచిన్న కొండలు, గుట్టలతో ఉంటుంది. లేపాక్షి ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉంది. ఇది తప్ప దగ్గర ఎక్కడా కొండ కన్పించదు. ఆలయం 100×100 అడుగులు చతురస్రపు స్థలంలో నిర్మితమైంది.

ఆలయ విశేషాలు:
సాధారణంగా ప్రతి ఆలయంలోనూ ధ్వజస్తంభం దగ్గర్నుంచి గర్భగుడి వరకు ఏ అడ్డూలేకుండా కన్పిస్తుంది. కానీ ఇక్కడ మూర్తి తీష్ణ స్వభావం గల వీరభద్రేశ్వరుడు. అందుకని ఆయన తీవ్రదృష్టి పడకుండా ప్రవేశం దగ్గర అడ్డుగోడ కట్టారు. మొదట్లో ఆలయానికి 7 ప్రాకారాలుండేవట. చివరి ప్రాకారం పొలిమేరలో ఉన్న ‘నంది విగ్రహం’ చుట్టూ వరకు ఉండేదట. బయటభూమి నివాసభూమిగా మారిపోవటం వల్ల గుట్టపైనున్న 3 ప్రాకారాలే మిగిలాయి. వీరభద్ర విగ్రహం ఆకర్షణీయంగా, అందంగా, చిన్నకళ్లతో ఉంటుంది. ముఖమండపానికి రెండు వైపులా ఉన్న గదుల్లో చాల విగ్రహమూర్తులున్నాయి. కుడిచివర పీఠంపై నవగ్రహాలు, మధ్యలో శ్రీరాముడు, శివలింగం ఉన్నాయి. ఎడమవైపు ఆంజనేయప్రతిష్టితమైన శివలింగం ఉంది. అలాగే ప్రక్కన కృష్ణ విగ్రహం కన్పిస్తుంది. అమ్మవారు దుర్గాదేవి విగ్రహం విచిత్రంగా ఒక మూలగా ముఖం పెట్టినట్లు కన్పిస్తుంది. గాలిలో తేలుతున్నట్లు చాల ఆశ్చర్యంగా ఉంటుంది.

లేపాక్షి ఆలయం కూడ భిన్నంగా ఉత్తర ముఖంగా ఉంటుంది.

లయపక్షి-లేపాక్షి
రావణునిచేత అపహరింపబడిన సీతను చూసిన జటాయువు, రావణునితో తీవ్రంగా పోరాడీ, ఎదిరించాడు. రావణుడు కత్తితో జటాయువు రెక్కలను నరికాడు. అక్కడ లేవలేకపడిపోయాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో అక్కడికి వచ్చారు. సీతవృత్తాంతం రామునికి చెప్పిన జటాయువుకి స్వర్గలోక ప్రాప్తినందించాడు రాముడు.

“పక్షిస్వరంతో లయం” అయిన ప్రదేశం కనుక “లయపక్షి” అనే పేరు వచ్చింది. అదే లేపాక్షి అని సాగింది. రాముడు పడి ఉన్న జటాయువును “లే-పక్షీ” అని పిలిచాడు కనుక లేపాక్షి అయిందని అంటారు కొందరు.

నిర్మాణ విశేషాలు
ముఖమండపానికి ముందు, రెండు భాగాలుగా ఉన్న పెద్ద మండపం ఉంటుంది. పైకప్పు రెండిటికీ కలిపే ఉండటం ఆశ్చర్యంగా ఉంటుంది. మూడేసి స్తంభాలు ఒక ఉమ్మడిగా ఉంటాయి. నేలపై ఇది ఒకదానికొకటి గజం దూరంలో ఉంటాయి. పైభాగాన వీటి మూడు చివరలు ఆనుకొని ఉంటాయి. అంటే ప్రతిది ఏటవాలుగా ఉంటుంది. అదీ ఆశ్చర్యకరమైన విషయం.
వందలాది సంవత్సరాలుగా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉందంటే, ఆనాటి తంత్ర నిర్మాణ కళా రహస్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. దీన్నే నాట్యమండపం అంటారు. నాట్యమండపానికి తూర్పున అంటే వ్రేలాడే రాతి స్తంభం ఉంది. ఆశ్చర్యంగా- ఈ స్తంభం పైభాగం కప్పును అంటుకునే ఉంటుంది. అడుగుభాగం నేలను అంటదు. నేలకు, అడుగుభాగానికి మధ్య కనీసం అంగుళం ఖాళీ కన్పిస్తూ, అబ్బురపరుస్తుంది.

స్తంభం మొత్తం గాలిలో తేలుతున్నట్లుగా ఉండటంతో, ఆనాటి శిల్ప వైదుష్యానికి ముక్కున వేలేసుకుంటాం. దీని విచిత్రం తెలుసుకోవటానికి ఒక బ్రిటిష్ ఇంజనీరు వచ్చి, ఆ స్తంభాన్ని కదిల్చే ప్రయత్నం చేస్తే ఒక్క అంగుళం మాత్రమే కదిలిందట. నాలుగు మూలల్లో ఒక మూల మాత్రమే కదిలిందట. నాలుగు మూలల్లో ఒక మూల మాత్రం సుమారు 3 అంగుళాల మేర నేలను తాకుతోంది. మిగతా ఖాళీ అంతా ఇంకా అలాగే ఉండి, స్తంభం ఇంకా గాలిలో వ్రేలాడుతున్నట్లేఅనిపించటం వింత. ఆనాటి స్థపతుల నిర్మాణ చాతురిని కళ్లకు కట్టినట్లు చూపే వింత ఈ వ్రేలాడే స్తంభం’. ఆశ్చర్యంతో తలమునకలవుతాం.

పైకప్పు మీద పౌరాణిక గాథలన్నీ వివిధ రంగులతో చిత్రీకరించారు. శతాబ్దాలు గడిచినా వాటి వర్ణ వైభోగం తగ్గలేదు. ఆ వర్ల రహస్యమేమిటో ఈ నాటికీ అర్ధంకాలేదు. ఎంత శాస్త్రజ్ఞానం ఆ చిత్రకళాకారులకు ఉందో, ఆ రంగులను శాశ్వతంగా ఉంచటానికి యేయే పద్దతులవలంబించారో ఆలోచిస్తే చాల ఆశ్చర్యమన్పించి, జోహారులర్పిస్తాం. అదీ లేపాక్షి రంగుల విచిత్రం. మిగిలిన మండపాల పై కప్పులన్నీ కూలిపోయి, ఇదొక శిదిల శివాలయంగా కన్పిస్తూ మనసుకి బాధని మిగులుస్తుంది. ఆలయం తూర్పు చివర ఉన్న నాగేంద్ర విగ్రహం అమితాశ్చర్యం కలిగిస్తుంది. ఆరడుగుల ఎత్తున్న ఈ విగ్రహం చూస్తే నాగేంద్ర దర్శనం ప్రత్యేక్షంగా అయినట్లుంటుంది. చుట్లమధ్య శివలింగం ఉంటుంది. ఆ ఆలయం తెల్లపాలరాతితో చేశారు.

శివలింగం నల్లరాయి. మొత్తం అంతా ఒకే రాతి తొలుపు అని తెలిస్తే మహదానందం కలుగుతుంది. పడగవెనక పది అడుగుల ఎత్తైన గోడ ఉంది. దానిపై గోళీకాయ సైజులో చిన్న రెండు గుంటలూ, రక్తం మరకలుకనిపిస్తాయి. దీనికో చరిత్ర ఉ ంది.

విరుపణ్ణవృత్తాంతం
విజయనగర సామ్రాజ్యంలో పెనుగొండ ఉంది. పెనుగొండ సంస్థానంలోనిది లేపాక్షి. విరుపణ్ణ పెనుగొండకు ప్రభువు. ఆయనే లేపాక్షి ఆలయ నిర్మాత. గిట్టని కొందరు విజయనగర రాజు రామరాయలకు చాడీలు చెప్పారు. విజయనగరంలోని ఆలయాలకంటే అద్భుతమైన ఆలయం విరుపణ్ణ ఇక్కడ నిర్మించి, ఖజానా అంతా ఖాళీ చేస్తున్నాడని చాడీలు చెప్పారు. అది విని విరుపణ్ణను బంధించి తెమ్మని రాయలు ఆజ్ఞాపించాడు. నిర్దోషియైన తనపై అభాండాలు వచ్చినందుకూ అవమానించినందుకూ బాధపడిన విరుపణ్ణ తన కళ్లను తానే కత్తితో బయటికి లాగి, ఆ గోడపై విసిరికొట్టాడట. ఇందాక మనం చెప్పుకున్న ఆ గుంటలు, మరకలు విరుపణ్ణవి. కండ్లు, కండ్ల నుంచి కారిన రక్తము ఆయనవే. ఆ గోడకు అలాగే ఆనుకుని అతుక్కుపోయాయట. విరుపణ్ణ మరణంతో ఆలయనిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.

గోడపై ఉన్న ద్రవాన్ని శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో పరీక్ష చేస్తే అది నిజమైన రక్తమేనని తేలింది. ఇది మరీ వింతగా లేదా! రంగులే కాదు, అక్కడి రక్తమూ శాశ్వతం. శిల్పకళావైభవం
పడమర భాగంలో అసంపూర్ణ ఆలయం కనిపిస్తుంది. స్తంభాలు నిలబెట్టి ఉంటాయి. కప్పులేదు. ప్రతిస్తంభంపైన అద్భుతమైన చెక్కుడు పని కనిపిస్తుంది. పార్వతీపరిణయం, దానికి వచ్చిన సకల దేవతాగణం చాల సున్నితంగా చెక్కబడ్డాయి. అనేక భంగిమల్లో పక్షులు, జంతువులు కనువిందు చేస్తాయి. శిల్పకళా చమత్కృతికి ఆనందబాష్పాలు రాలుస్తాం. మిగిలిన చోట్ల స్తంభాలపై అతి నాజుకుగా చెక్కిన లతలు, డిజైన్లు మనల్ని కదలనివ్వవు.
మన అక్షులు లేపాక్షి శిల్పసంవపదకు సాక్షులవుతాయి. ఏ డిజైనూ ఇంకో దాన్ని పోలి ఉండదు. ఈ డిజైన్లనే నేతపనివారు, తాము నేసే వస్త్రాలపై వేసి లేపాక్షి చీరలు అన్నపేర చెలామణిచేస్తారు. అయితే లేపాక్షిలో చేనేత పరిశ్రమే లేదంటే ఆశ్యర్యం. 18 స్తంభాల వేదిక పునాదికి ఉత్తరాన రెండు గజాల దూరంలో, నేలపై 18 అడుగుల పొడవు, అంగుళం లోతు ఉన్న కుడికాలి పాదముద్ర దుర్గాదేవిదని కొందరు, సీతమ్మవారిదని కొందరు అంటారు.

ఈ ముద్ర గుడి బయట కొండ రాతినేలమీద ఉంది. పాదముద్రలో బొటన వ్రేలున్నచోట నుంచి, అన్ని కాలాల్లోనూ, నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. ఇది మరీ విచిత్రం.

లేపాక్షి నంది
ఆలయం నుంచి ఊరిలోకి వచ్చి, సుమారు ఒక ఫర్లాంగు దూరం వెడితే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నంది విగ్రహం జీవంతో కళకళలాడుతూ ఆహ్వానిస్తూ కనిపిస్తుంది. .
ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద నందిలేదు. ఇరవై ఏడడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ నందీశుణ్ణి చూసి పులకించిపోతాం. ఎర్రజీర ఉన్న తెల్లరాతితో నిర్మించిన నంది ఇది. విగ్రహం, దానిక్రింది పీఠం, దానిక్రింది నేల అంతా కలిపి అఖండ శిల. ఆ శిల్పి చాతుర్యానికి, చెక్కడానికి చేతులెత్తి నమస్కరించాలి.
29 గంటలున్న మెడపట్టి, దానిపై 18 మువ్వల పట్టి, దానిపై 27 రుద్రాక్షలు మాలగా ఉన్న పట్టిక చూస్తే సాక్షాత్తు బసవేశ్వర దర్శనం చేసినట్లుంది. కాళ్ళు, తోక పొట్టక్రింద లోపలికి మడిచిపెట్టు కొన్నట్లుంటాయి. ప్రశాంతంగా నందీశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తాడు.

లేకదూడ ముఖంగా ఉండి, కోడెదూడను గుర్తుకు తెస్తుంది. చిరునవ్వు ముఖం, కొంచెం ప్రక్కకు త్రిప్పుకుని ఉంటుంది. నంది దృష్టి, ఆలయంలో నాగేంద్రుని చుట్టలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తున్నట్లుగా అన్పిస్తుంది. కుడివైపు మెడ దగ్గర నుంచుని చూస్తే ఆలయంలో నాగేంద్రుని పడగ కన్పిస్తుంది. పశువులకు జబ్బుచేస్తే నంది వద్ద దీపారాధన చేస్తే, జబ్బు నయమవుతుందనేది ఇక్కడ ఆచారంలో ఉంది. జీవనందీశ్వరుడు కదా!
లేపాక్షి నందిని, ఆలయశిల్ప కళావైభవాన్ని తనివితీర చూసి పరవశించి, ఆనందపులకితులవుతాం. కనువిందు చేసే లేపాక్షి శిల్పచాతుర్యం, అలనాటి వైభవాన్ని గుర్తుచేస్తూ నాటి రాజవైభవానికి వారు హిందూ మత ధర్మాన్ని ప్రోత్సహించిన తీరు మనకు కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నట్లు కళాసాక్షి లేపాక్షే ఒక చక్కటి నిదర్శనం.

మార్గము: అనంతపురం జిల్లా- హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలో చిక్కబల్లాపూర్ వెళ్లే దారిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధప్రాంతాల నుండి కర్ణాటక నుండి హిందూపురానికి బస్సు మరియు రైలు సౌకర్యం కలదు.

-గబ్బిట దుర్గాప్రసాద్

2 thoughts on “కళాసాక్షి లేపాక్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap