గురువును మించిన శిష్యుడు-కోడి రామకృష్ణ

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ(69) ఫిబ్రవరి 22 న అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూసారు. కుటుంబ కథా చిత్రాలు, ఆధ్యాత్మిక, సామాజిక, వాణిజ్య ఇలా విభిన్న జోనర్ చిత్రాలను ప్రేక్షకులను అందించి మెప్పించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అన్ని రకాల జోనర్స్ చిత్రాలని టచ్ చేసిన ఘనత కోడి రామకృష్ణదే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా నవతరం దర్శకులతో పోటీ పడుతూ వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమని శోకసంద్రంతో ముంచెత్తారు. లెజెండరీ దర్శకుడిగా నిలిచిన కోడి రామకృష్ణ జులై 23, 1949లో ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ, ఉన్నత విద్య వరకు పాలకొల్లులోనే సాగింది. కాలేజ్ రోజుల్లో చిత్రకళపై ఆసక్తి ఏర్పడింది. పగలు చదువుకోవడం, రాత్రి సమయంలో అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపుని నడిపించేవారు. చిన్నప్పట్నుంచే నాటకాల్లో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకి చెందిన నటులని కూడా రప్పించి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. “సుడిగుండాలు’ సినిమాలోని కోర్ట్ సీన్ సన్నివేశాలని తీసుకుని ఏకపాత్రాభినయం చేశారు. నటనపై ఆసక్తితో పలు సినీ ప్రయత్నాలు చేశారు. తండ్రికోరిక మేరకు డిగ్రీ పూర్తి చేశారు. చిత్ర రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. ఎన్నో ప్రయాసల అనంతరం ఎట్టకేలకు దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. దాసరి ఒకేసారి రెండు, మూడు సినిమాలకి దర్శకత్వం వహిస్తుండేవారు. ఈ క్రమంలో ఎవరికి వారే యమనా తీరే’, “స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలకి అసిస్టెంట్గా చేశారు. డైరెక్షన్ పై అవగాహన రావడంతో దర్శకత్వం వహించాలని భావించారు.

‘తూర్పు పడమర’ సినిమా టైమ్లో నిర్మాత రాఘవతో ఏర్పడిన పరిచయంతో దర్శకుడిగా మారి 1982లో చిరంజీవి, మాధవి జంటగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రాన్ని రూపొందించారు. కోడి రామకృష్ణ పట్టుబట్టి మరీ చిరంజీవిని తీసుకున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతోపాలు 525 రోజులు ఆడింది. ఆ తర్వాత వరుసగా అనేక విజయవంతమైన సినిమాలు తీసి తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గర్శకుడిగా ఎదిగారు.’శత్రువు’, శ్రీనివాస కళ్యాణం’, ‘లేడీ బాస్’, ‘లాఠీఛార్జ్’, ‘రిక్షావోడు’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’, “మావూరి మహారాజు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మనిషికో చరిత్ర’, ‘మంగమ్మగారి మనవడు’, ‘భారత్ బంద్’, ‘భారతరత్న’, ‘బాల గోపాలుడు’, ‘పోలీస్ లాకప్’, ‘పుట్టింటికి రా చెలి’, ‘పెళ్ళి పందిరి’, ‘పెళ్ళి’, ‘పెళ్ళాం చెబితే వినాలి’, ‘పంజరం’, ‘పంచదార చిలక’, ‘అంకుశం’, ‘ఆహుతి’, “దొంగాట’, ‘దేవుళ్ళు’, ‘దేవీపుత్రుడు’, ‘దేవి’, ‘తలంబ్రాలు’, “తరంగిణి’, ‘డాడీ డాడీ’, ‘చుట్టాలబ్బాయి’, ‘గూఢచారి నెం.1’, ‘గాడ్ ఫాదర్’, ‘కీలుగుర్రం’, ‘ఆదర్శవంతుడు’, ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’ వంటి చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునకలు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి అరుదైన ఘనత సాధించారు.

ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘నాగభరణం’. కన్నడలో తెరకెక్కిన చిత్రాకిది తెలుగు అనువాదం. ఇందులో కన్నడ నటుడు విష్ణువర్ధన్ ని గ్రాఫిక్స్ ద్వారా పునఃసృష్టించడం విశేషం. దీంతోపాటు వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ ‘ప్రపంచ బంద్’ అనే సినిమాని ప్రారంభించారు. అలాగే ‘అంకుల్ ఆంజనేయ స్వామి’ పేరుతో మరో సినిమా తీయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. తమిళం, హిందీ, మలయాళంలో పలు సినిమాలని రూపొందించారు. దాదాపు అన్ని రకాల జోనర్ చిత్రాలను తెరకెక్కించారు. కోడి రామకృష్ణకు మొదట నటుడి కావాలనే కోరిక ఉండేది. నాటకల్లో నుంచి ఆ ఆసక్తి ఏర్పడింది. నటుడిగా ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశా బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘స్వర్గం నరకం’, ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘చదువు సంస్కారం’, ‘మా ఇంటికి రండి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువగా సినిమాలు చేశారు. చిరంజీవి హీరోగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘ఆలయశిఖరం’, ‘గూఢచారి నెం.1’, ‘రిక్షావోడు’, ‘అంజి’ చిత్రాలు చేశారు. బాలకృష్ణతో ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘బాలగోపాలుడు’ చిత్రాలు తీశారు. భార్గవ్ ఆర్ట్స్లో ఎక్కువగా సినిమాలు చేశారు. అలాగే సుమన్, బానుచందర్, అర్జున్లని చిత్ర రంగానికి పరిచయం చేశారు. టెక్నాలజీ అంతగా లేని సమయంలో గ్రాఫిక్స్తో ప్రయోగాలు చేశారు. ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘దేవుళ్ళు’, ‘అంజి’, ‘అరుంధతి’తోపాటు ‘నాగభరణం’ వంటి చిత్రాలను రూపొందించి విజయాలని అందుకున్నారు. ఓ రకంగా విజువల్ ఎఫెక్ట్స్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. అంతేకాదు కోడి రామకృష్ణ సినిమాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. పై పేర్కొన్న చిత్రాల్లో ఎక్కువగా మహిళా ప్రధాన సినిమాలే కావడం విశేషం. తెలుగు చిత్ర సీమకి ఆయన చేసిన సేవలకుగానూ 2012లో రాఘుపతి వెంకయ్య అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. 10 నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు.

తాను రూపొందించిన ప్రతి సినిమాకు సమాజమే కథావస్తువు. జనంలోకి వెళ్ళి, తాను చూసిన సంఘటన నుంచి కథలు రాసుకోవడం ఆయన ప్రత్యేకత. ఇమేజ్లు, కాంబినేషన్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా కథకే మొదటి ప్రయారిటీ ఇచ్చేవారు. అందుకే ఆయన సినిమాలు ఎక్కువగా విజయం సాధించాయి. ఆయన సినిమాలు ఫెయిల్ అయినప్పుడు కూడా నిర్మాతలు క్యూ కట్టే వారంటే కోడి రామకృష్ణ దర్శకత్వంపై వారికున్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు.

కోడి రామకృష్ణ పేరు వినగానే ఆయన నుదుటి పై కట్టుకునే క్లాత్ గుర్తుకొస్తుంది. అది ఆయన సెంటిమెంట్. ఆయన రూపొందిస్తున్న రెండో సినిమా టైమ్లో కాస్ట్యూమర్ మోకా రామారావు సెట్లోకి వచ్చి ‘మీ నుదురు విశాలంగా ఉంది. ఎండకి ఎక్స్ప్లోజ్ అవుతుంది’ అని తన రూమాలు తీసి కట్టుకోమ్మన్నారు. నెక్స్ట్ డే దాన్ని బ్యాండ్ లా తయారు చేసి తీసుకొచ్చారు. ఈ బ్యాండ్ కి మీకు ఏదో అనుబంధం ఉంది. దీన్ని కట్టుకోకుండా ఉండొద్దు’ అని చెప్పారట. అప్పట్నుంచి దాన్ని ఓ సెంటిమెంట్గా ఫాలో అవుతున్నారు. ‘సక్సెస్ వచ్చినంత మాత్రాన అవకాశాలు రావు, ప్రతి సినిమాతో నిరూపించుకోవాల్సిందే. నా సక్సెస్ కి కారణం నిర్మాతలు, హీరోల సహకారమే  అనేవారు. ఆయనకు భార్య కోడి పద్మ, ఇద్దరు కూతుళ్ళు దీప్తి, ప్రవళిక ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap