ఘంటసాల అభిమానిగా…మద్దాలి రఘురామ్

ఒక నిబద్ధత, ఒక నిలకడ, ఒక నాణ్యతల సమ్మేళనం కిన్నెర ఆర్ట్ థియేటర్స్. స్థిత ప్రజ్ఞత కలిగిన నిర్వహణా దిగ్గజం కిన్నెర వ్యవస్థాపకులు రచయిత, కవి మద్దాలి రఘురామ్. అందుకే ఆ సంస్థ దిగ్విజయంగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. కిన్నెర వారు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తుంటారు. కిన్నెర రఘురామ్ గారికి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే చాలా ఇష్టం. అందుకే 1995 నుంచి ప్రతి యేటా ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ వేదికలపై ఈ ఉత్సవాలు జరిగాయి. నేను కూడా హైదరాబాద్, రాజమండ్రి, విజయనగరం లలో జరిగిన ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నాను. ఈ మూడు వేదికల్లో స్వయంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్, ఘంటసాల రత్నకుమార్ పాల్గొనడం విశేషం. ఇప్పుడు ఆ ముగ్గురూ లేరు. వివిధ జిల్లాల నుంచి గాయకులు పాల్గొని 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ఘంటసాల పాటలు పాడి ఈ ఉత్సవాలను దిగ్విజయం చేసేవారు.

గత 28 ఏళ్ళుగా నిర్వహించిన ఘంటసాల ఆరాధనోత్సవాల విశేషాల సమహారంతో ఘంటసాల అభిమానిగా… మకుటంతో కిన్నెర రఘురామ్ పుస్తక రూపం కల్పించారు. అందులో డా. కె వి రమణాచారి, రొద్దం ప్రభాకరరావు, ఎస్. వి. రామారావు, డా. చెన్నయ్య, డా. మహ్మద్ రఫీ, శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ, డి.ఎ. మిత్ర, బాల కామేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి సురేఖ తదితరులు రాసిన వారి అనుభవాలు కూడా ఇందులో పొందుపరిచారు.
కిన్నెర పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి రోజున సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆరోజు హాజరు కాలేని మిత్రులకు నిన్న ప్రెస్ క్లబ్ లో పుస్తకాలు అందించారు. అభినందనలు రఘురామ్ గారు.

డా. మహ్మద్ రఫీ

SA: