చిత్రకళకి జీవితాన్నిఅంకితం చేసిన ‘కాశీబట్ల’

“కన్ను తెరిస్తే జననం , కన్ను మూస్తే మరణం,తెరచి మూసిన మధ్య కాలం మనిషి జీవితం అన్నాడుఒక గొప్ప కవి ఎన్నోఏళ్ళక్రితం. లిప్త పాటైన ఈ మధ్య కాలాన్ని ఏ ప్రత్యేకత లేకుండానే సాధారణ జీవితాన్ని సాగించేవాళ్ళు కొందరైతే , తనదైన ప్రత్యేకత మరియు ఒక లక్ష్యంతో సాధారణ జీవనానికి భిన్నంగా కొనసాగే వాళ్ళు ఇంకొందరు . ప్రతిభా పరమైన తమ పనిలో కృషికి తగిన గుర్తింపును కోరుకునే వాళ్ళు కొందరైతే ,ఆ గుర్తింపుల కతీతంగా తన కృషిని నిస్స్వార్ధంగా చివరిదాకా కొనసాగించే వాళ్ళు మరి కొందరు . మొదటి వర్గం వారు సాధారణ వ్యక్తులు .రెండవ వర్గం వాళ్ళు అసాధారణ మైన వ్యక్తులు , మొదటి వర్గం వాళ్ళలో తాను తన కుటుంభం తప్ప ఏ లక్ష్యం వుండదు , రెండవ రకానికి చెందినవాల్లలో ఒక ప్రత్యేక లక్ష్యం వుంటుంది .ఎదో సాధించాలనే తపన వుంటుంది , ఆ తపన లో సమాజానికి ఏదో ప్రయోజనం చేకూరాలనే భావన వుంటుంది. అది తన వృత్తికి పూర్తి బిన్నమైన దైనప్పటికి అచంచలమైన విశ్వాసంతో దానిని సార్ధకం చేసుకునెందుకు నిరంతరం తపిస్తుంటారు ఇలాంటి వ్యక్తులు . అలాంటి వర్గానికి చెందిన నిజమైన గొప్ప కళాకారుడే డాక్టర్ కాశీభట్ల విశ్వనాధం గారు. అంతటి మహనీయుడైన వ్యక్తి ది 17-10-2018 నాడు ఈ ఇల నుండి శాశ్వతంగా దూరమయ్యరనే వార్త నిజంగా ఎంతో భాద కలిగించింది.

కాశీభట్ల విశ్వనాధం గారు వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ డాక్టర్ , ప్రవృత్తి రీత్యా మాత్రం ఒక చిత్రకారుడు అంతే కాదు ఒక గొప్ప చిత్రకళా రచయిత ,చిత్రకళను శాస్త్రీయంగా కళాశాలలో నేర్చిన విద్యార్ధులుకు సైతం తెలియని ఎన్నో విషయాలను తన చిత్రకళా గ్రంధాల ద్వారా తెలియజేసిన గొప్ప రచయిత .అందుచేతనే ఆయన రచియించిన “చిత్ర కళ “ శిల్పకళ “ అనేడి రెండు పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయం వారు ఒక ప్రామాణిక గ్రంధాలుగా ప్రచురించడం జరిగింది . నిజంగా చిత్రకళను గూర్చి తెలుసుకోగోరే మాలాంటి వాళ్లకే కాదు చిత్రకళ ను కళాశాలల్లో అభ్యసించిన వారికి కూడా ఎంతో ఉపయుక్తమైనవి ఈ రెండు గ్రంధాలు. అంతే కాదు కాకతీయ శిల్పం గురించి అద్భుతమైన పరిశోధన చేసి రాసిన మరో గ్రంధం “శిలా రాగం “చిత్ర కళపై ఆంగ్లం లో సైతం రాసిన మరో పుస్తకం “ది ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్” . సాధారణంగా చిత్రకళను కళాశాలలో నేర్చిన వారిలోనే చాలా మంది వేరే వారి చిత్రాలను అనుసరిస్తూ తమదైన శైలిని అలవర్చుకోలేని వాళ్ళు ఎందరో వుంటారు. కానీ చిత్రకళలో ఎక్కడా ఓనమాలు కూడా దిద్దని ఈ డాక్టర్ ఏ చిత్రకారుడి చిత్రాలను అనుసరించకుండా తనదైన శైలిలో ౩౦౦ చిత్రాలు చిత్రించారు అంటే వినడానికి వింతగానూ విచిత్రంగాను కనిపిస్తున్నప్పటికి ఇది మాత్రం వాస్తవం , యదార్ధం . ఇది నేను ఎవరో చెప్పిన మాటలు బట్టి రాస్తున్న విషయం కాదు స్వయంగా హనుమకొండలోని వారిని కలిసి చిత్రాలను చూసిన తర్వాత నేను అంటున్న మాటలు.

2008 లో తొలిసారిగా నేను ఆయన్ను చూడడం జరిగింది కాకతీయ విశ్వవిద్యాలయం వారు గిరిజన సంస్కృతిపై నిర్వహించిన చిత్రకళా కార్యశాలలో పాల్గొన్న యాబై మంది చిత్రకారులలో నా మిత్రుడు రాజా రాంబాబు తో పాటు నేను కూడా ఆ కార్యశాలకు వెళ్ళడం, అక్కడ పాల్గొన్న యువ కళాకారులతో పాటు అప్పటికే ఎనబైయేళ్ళు పైబడిన ఒక చిత్రకారుడు పోటీ పడి తైల వర్ణాల్లో ఒక గిరిజన చిత్రాన్ని వేస్తుండడం నేను చూసాను . కాని చాల వయసు పైబడి , చిత్ర రచనలో పూర్తిగా నిమగ్నమై వున్న ఆయనను ఎందుకో ఆరోజు పలుకరించే సాహసం చేయలేక పోయాను. మిగిలినవారితోనే నా సమయాన్ని గడపడం జరిగింది . ఆ తర్వాత కొన్నాళ్ళకు నా కంట పడిన తెలుగువిశ్వవిద్యాలయం వారు ప్రచురించిన “చిత్రకళ “ శిల్పకళ” అన్న పుస్తకాలు రచించింది ఆయనే అన్న విషయం తెలిసిన నాకు ఒక్కసారిగా ఆ గొప్ప కళాకారున్ని కలవాలని అనిపించి ఫోన్ లో వారిని సంప్రదించినప్పటికీ ఆయనకు గల పెద్ద వినికిడి లోపం వలన వారి కోడలు మాత్రమే ఫోన్ రిసీవ్ చేసుకుని ఆ విషయాన్ని వారికి వివరించడం తర్వాత వెంటనే ఆయన నాకు ఉత్తరాలలో విషయాన్నితెలియజేయడం చేస్తూ వుండడం జరిగేది . ఆ తర్వాత 2014 లో హనుమకొండలోని వారిఇంటివద్ద మొట్టమొదటిసారిగా వారిని కలవడం వారి చిత్రకళా కృషిని,కళా సేవను స్వయంగా వీక్షించడం జరిగింది .

కాశీభట్ల విశ్వనాధం గారు చిత్రకళను గురుముఖంగా నేర్వకున్నను దానియందు గల అమితాసక్తి తో ఎన్నో చిత్రకళా గ్రంధాలను ఆయన అధ్యయనం చేయడం జరిగింది .తద్వారా చిత్రకళ యొక్క అంతరార్ధాన్ని ఆయన తెలుసుకున్నారు గనుకనే ఎన్ని చిత్రకళా గ్రంధాలు చదివినా ఎందరు గొప్ప చిత్రకారుల చిత్రాలను చూసినా వాటిలో వేటిని అనుకరించకుండా ఎలా వున్నప్పటికినీ తనదైన సొంత శైలిలోనే చిత్రాలను వేయడం ప్రారంభించారు .

వృతి రీత్యా ఒక ప్రభుత్వ డాక్టరైన వీరు ఆంధ్రప్రదేశ్ నందలి క్రష్ణా జిల్లా దివిసీమలోని పెదకళ్ళేపల్లి అనే గ్రామంలో జన్మించారు బందర్, అవనిగడ్డలలో చదువు ముగిసిన తర్వాత 1948లో విశాఖపట్నంలో M.B.B.S పూర్తి చేసి 1950లో ఉస్మానియా హాస్పిటల్ , నరసన్నపేట తదితర చోట్ల ప్రభుత్వ డాక్టర్ గా ప్రజలకు మంచి సేవలు చేసి బాగా గుర్తింప బడ్డారు. 1954 లో స్వచంద పదవీ విరమణ చేసి వరంగల్ జిల్లా హనుమకొండలో స్థిరపడి చివరివరకు అక్కడే వున్నారు

విశ్వనాధం గారిని హనుమకొండలో స్థిర నివాశి గ మార్చినవి అక్కడ ప్రఖ్యాత చారిత్రక కట్టడాలయిన కాకతీయుల కోటలు వేయిస్తంభాల గుడి రామప్ప దేవాలయం అందలి శిల్ప సంపద తదితరమైనవని చెప్పవచ్చు .సహజముగా చిత్రకళాభిలాషులైన వీరు విస్త్రుత కళాశాస్త గ్రందాల అధ్యయనంతో బాటు అమితమైన ఆసక్తితో చిత్ర కళను సాధన చేయడం వలన తనదైన రీతిలో విభిన్న సిరీస్ లలో సుమారు ౩౦౦ చిత్రాలు చిత్రించారు అంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. వీటిలో భారత, భాగవత , రామాయణ అంశాలతో బాటు బౌద్ధ జాతకతలు, ఇంకా తానుండే ఏరియాలో ఎక్కువగా కనిపించే లంబాడి స్త్రీలపైన, గిరిజన జీవనంపైన మరియు రామప్పదేవాలయ శిల్ప సంపధపైన వేసినవే గాక , తాంత్రిక చిత్రకళపై కూడా విరివిగా చిత్రాలు వేయడం జరిగింది.
కళ అనునది అనుకరణతో ప్రారంభం కావొచ్చు కాని అనుకరణతోనే ముగిసిపోకూడదు . అలా చేసినట్లయితే ఆ కళాకారుడు పరిణతి సాధించనట్టే లెక్క.హృదయాంతరాలలో నుండి ప్రేరణ జనించినప్పుడు దానిని ఏదో విదంగా వ్యక్తం చేయాలి . ఆ వ్యక్తీకరణ కళా మర్మాలు తెలియని వారిలో కంటే కళా మర్మాలు తెలిసి చేసినవారిలో ఒక ప్రత్యేకత వుంటుంది . అలాంటి వాళ్ళు గుడ్డిగా అనుకరించరు. అది ఎలాగున్నప్పటికి తనదైన శైలిలో వ్యక్తీకరణ చేస్తారు. అప్పుడు అందులో ఒక స్వచ్చత వుంటుంది .నిజాయితీ వుంటుంది . విశ్వనాధం గారి చిత్రాలలో గల ఆ ప్రత్యేకత అదే .వీరు కళా నియమాలు మర్మాలు స్వయంసిద్ధమైన అధ్యయనం ద్వారా బాగా తెలుసుకున్న వ్యక్తి. అందుకే వీరి చిత్రాల్లో తనదే అయిన శైలి వుంది .నిజాయితీ వుంది , స్వచ్చత వుంది .ఒక ప్రయోగం కనిపిస్తుంది. అయితే చిత్రాలలోని రంగు మరియు రేఖలలో అంత సాధికారత ఉండకపోవచ్చు. కారణం వీరి వృత్తి అదికాదు ప్రవృత్తి మాత్రమే, అందుకే వీరి చిత్రాలను బాగా చేయి తిరిగిన చిత్రకారుల చిత్రాలతో పోల్చగూడదు.అయితే అనుకరణతోకూడిన స్వచ్చతలేని ఎంతో మంది చేయి తిరిగిన చిత్రకారుల చిత్రాలకంటే వీరి చిత్రాలు వేయిరెట్లు గొప్పవని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ప్రచారానికి ఇష్టపడని వీరు ఇన్ని చిత్రాలను వేసినప్పటికీ ఒక్క వరంగల్లోస్థాపించబడ్డ ఏక శిలా చిత్ర కళాపరిషత్ నందు తప్ప వేరే చోట ప్రదర్శన లు చేయలేదు. బహుసా తనకు అందివచ్చిన ఇద్దరు పిల్లలు తన ముందే భగవంతుడు తీసుకు పోవడం ఆయనలోని నిర్లప్తతకు, నిరాసక్తతకు దారి తీసిందని చెప్పవచ్చు. అందుకే వీరి యొక్క కృషికి తగ్గ స్థాయిలో గుర్తింపు రాలేదనిపిస్తుంది . తాను లోకాన్ని వీడినప్పటికీ తన శరీరం సమాజానికి ఉపయోగ పడాలని భావించి తన పార్దీవ దేహాన్ని వైద్య విద్యార్దుల కోసం కాకతీయ వైధ్యకళాశాలకు అప్పగించమని కోరడం ఆయనలోని గొప్పతనానికి నిదర్శనం.ఆయన కోరిక మేరకు వారి దేహాన్ని వైధ్యకళాశాలకి వారి బందువులు అప్పగించడం జరిగింది. నేడు ఆయన మన ముందు లేరు. కాని ఆయన సృష్టించిన అజరామమైన కళ వుంది .ఆయన కృషి తాలుకు ఆనవాళ్ళు వున్నాయి . ఆ కృషిని స్మరించుకోవడం మాత్రమే కాదు అజరామమైన వారి కళా సంపదను కూడా కాపాడి భావి తరాలకు స్పూర్తి నివ్వవల్సిన భాద్యత మనమీద వుంది అప్పుడే వారికి తగిన గుర్తింపు ఇచ్చిన వాళ్ళమౌతాము. అదే విశ్వనాధం గారికి మనం ఇచ్చే సరైన నివాళి .

–వెంటపల్లి సత్యనారాయణ

SA:

View Comments (28)