చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’

చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’ పుస్తకంలో గల ఆటల గురించి చదివితే ప్రతి ఒక్కరినీ తమ బాల్యంలోకి పయనింపజేస్తాయి. “బ్రతుకంతా బాల్యమైతే జగమంతా ఆనందం’ అని ఒక ప్రసిద్ధ రచయిత అన్నాడు. ప్రకృతి, పల్లె, కొండలు కోనలు, వాగులు వంకలు, చెట్టు పుట్ట, పాడే గాలి, కురిసే వాన, వెలిగే సూర్యుడి కాంతి.. ఎలా ప్రకృతిలోని ప్రతి అంశం పులకిస్తుందో అలాగే బాల్యదశలోని క్రీడలు కూడా పిల్లలని పులకరింపజేస్తాయి. వేకువ విరిసినా, వెన్నెల కాసినా, ఎగిసి పయనించే నింగిమేఘం కురిసినా, పూతీవలు నవ్వినా.. వీక్షించినప్పుడు.. మహాయోగులు, సిద్ధులు పొందే పరమానందం, అలౌకిక స్థితి మనం ఎలా అనుభవిస్తామో అలాంటి ఆనందాన్ని బాల్యపు క్రీడల్లో భగవంతునికిష్టులైన పిల్లలు అనుభవిస్తారు.

జాస్తి శివరామకృష్ణ గారు, కందుకూరి రాము గారు కలిసి సేకరించిన ఈ ఆటలన్నీ పైసా ఖర్చు లేకుండా వినిమయాల సంస్కృతికి దూరంగా ఏ అంతరాలు లేక తల్లి ఒడిని ఒడిసి పట్టుకున్న కోతి పిల్లలా బాల్యం ఒడిని అదుముకొని, అల్లుకుని, పులకింతలతో, కేరింతలతో, పారవశ్యంతో విశ్వంలో ఇతర జీవరాశులతో భేదంగాక అభేదమైన ఐక్యతా భావంలో ప్రకృతి సహజీవనం ఎలా చేయాలో నేర్పిన అనాది ఆటపాటలు. తల్లి చనుబాల స్వచ్ఛత, హిమాలయాలలో ఉద్భవించిన గంగా జలం పవిత్రత ఎప్పుడూ మాసిపోనట్లు బాల్యంలో చెట్టు పుట్ట, కొండా, గట్టు, లేడి, లేగలతో ఈ ఆటలు ఎప్పటికీ మాసిపోవు. మానవుడు ఆధునికత పేరుతో కృతక అనుకరణల వల్ల భంగపడ్డ అనేక అంశాలవలే బాల్యపు ఆటలు కూడా మాయమవు తున్నాయి. నేడు సెల్ ఫోనుల్లో, కంప్యూటర్లలో ఆడుతున్న ఆటల వల్ల పిల్లలు పెడధోరణులకు గురవుతున్నారు. ఈ స్థితికి ప్రత్యామ్నాయంగా నాటి క్రీడలను సేకరించి, వాటికి చిత్రకారుడు దుండ్రపల్లె బాబు చే అందమైన బొమ్మలు గీయించి పుస్తకంగా ప్రచురించడం మంచి ప్రయత్నం. 2016 లో మొదటి ముద్రణ పొందిన ఈ పుస్తకం 2018 లో రెండవ ముద్రణ పొందింది. ఈ పుస్తకం ప్రతి పిల్లవాడికి అందజేయాల్సిన అవసరం పెద్దలకు ఉంది.
– గోరటి వెంకన్న

SA: