‘జన రంజక కవి’ ప్రతిభా పురస్కారాలు

“రావి రంగారావు సాహిత్య పీఠం” పురస్కారాల సభలో డా. జి.వి. పూర్ణచందు

ఏక వ్యక్తికి పురస్కారం కాకుండా బహు వ్యక్తి పురస్కార విధానం చాలా మంది కవులకు మంచి ప్రోత్సాహం కల్పిస్తుందని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డా. జి.వి. పూర్ణచందు తెలియజేసారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద శనివారం సాయంత్రం “రావి రంగారావు సాహిత్య పీఠం” నిర్వహించిన “జన రంజక కవి ప్రతిభా పురస్కారాల సభ”లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒక న్యాయ నిర్ణేతకు నచ్చిన ఒక పుస్తకానికి ఒక కవికి పురస్కారం ఇవ్వటం వల్ల ప్రతిభ ఉన్న మరి కొందరు కవులు నిరుత్సాహపడే ప్రమాదం ఉందన్నారు. రావి రంగారావు పీఠం ఎనిమిదేళ్లుగా పురస్కారాలు అందిస్తున్నదని, ఏటా అయిదారుగురు కవుల గ్రంథాలు ఎంపిక చేసి అనేక కవుల్ని సత్కరించటం అపురూప విధానం అని పీఠం కృషిని ప్రశంసించారు. జన సామాన్యానికి బాగా ఉపయోగపడే కవిత్వ గ్రంథాలకు ప్రత్యేకించి పురస్కారా లివ్వటం కూడా చాల గొప్ప విశేషం అన్నారు. జన రంజక కవిత్వమే చరిత్రలో నిలిచిపోతుందని ఆయన భావించారు. ప్రముఖ సాహితీవేత్త డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి అధ్యక్షత వహించిన సభలో ఉన్నం జ్యోతివాసు (ఒంగోలు), వురిమళ్ళ సునంద (ఖమ్మం), నల్లి ధర్మారావు (శ్రీకాకుళం), దేశరాజు (హైదరాబాద్), కిలపర్తి దాలినాయుడు (విజయనగరం), అమూల్య చందు (విజయవాడ)… ఒక్కొక్క కవిని పూల మాలతో, శాలువాతో, జ్ఞాపికతో, రెండు వేల నగదుతో “రావి రంగారావు సాహిత్య పీఠం” పక్షాన డా. జి. వి. పూర్ణచందు, డా. నాగరాజ్యలక్ష్మి, సిహెచ్. మస్తానయ్య, పీఠం సంస్థాపకులు డా. రావి రంగారావు, పీఠం కన్వీనర్ నర్రా ప్రభావతి మొదలైనవారు ఘనంగా సత్కరించారు. తొలుత దేవాలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. పింగళి భాగ్యలక్ష్మి స్వాగతం చెప్పిన సభలో రావి అరుణ వందన సమర్పణ చేసారు. సన్మాన కార్యక్రమాన్ని డా. మైలవరపు లలితకుమారి నిర్వహించారు. ఇంకా సభలో మారెళ్ళ శ్రీనివాస్, మన్నం వెంకట గురువు, వూటుకూరి నాగేశ్వరరావు మొదలైనవారు పాల్గొన్నారు.

SA: