తమిళ సాహస నాయకి జయలలిత

(నేడు జయలలిత వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం)

ఆమె తమిళ ప్రజలకు అమ్మ. శత్రువుల పాలిట విప్లవ నాయకి. ఆమెను పెణ్ణిన్ పెరుమై గా ఎం.జి. రామచంద్రన్ ప్రజలకు పరిచయం చేసేవారు. అలా మహిళలకే గర్వకారణమైన ‘పురచ్చి తలైవి’ జయలలిత ఒక పడిలేచిన కడలి తరంగం. తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను ఎమ్జీఆర్ రాజకీయాలలోకి తీసుకొస్తే, అతని ఆదర్శాలను అనుసరిస్తూ ఒక ముఖ్యమంత్రిగా అద్భుత ఆదరణను, కీర్తిని సముపార్జించిన జయలలిత అనారోగ్యంతో, మృత్యువుతో 74 రోజులు పోరాడి, కోట్లాది మంది గుండెల్లో బాధను నింపుతూ డిసెంబరు 5 అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గురువును మించిన శిష్యురాలుగా భాసిల్లుతూ తమిళనాడు రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జయలలిత గొప్ప సినిమా నాయిక. ఆ సాహస నాయకి ప్రస్థానాన్ని ఒకసారి స్మరించుకుంటే…

బాల లలిత
జయలలిత పుట్టింది నాటి మైసూరు రాష్ట్రంలోని మాండ్య జిల్లా, పాండవపుర తాలూకా మెల్కోటే లోని సంప్రదాయ తమిళ అయ్యంగార్ కుటుంబంలో. తల్లి వేదవల్లి, తండ్రి జయరాం. జయరాం లాయరు వృత్తిలో వుండేవారు. నాయనమ్మ లేదా తాతమ్మ పేరు తోబాటు వ్యావహారిక నామధేయాన్ని కూడా కలుపుకొని రెండుపేర్లు పెట్టడం అయ్యంగార్ల సంప్రదాయం. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. ఆమె తాత నరసింహన్ రంగాచార్యులు మైసూరు మహారాజా వారి సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా వుండేవారు. దురదృష్టవశాత్తు జయలలిత పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోవడంతో ఆమె కుటుంబం బెంగుళూరులోని మాతమహుల ఇంటికి చేరింది. ఉదరపోషణ నిమిత్తం తల్లి వేదవల్లి బెంగుళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది. ఆ తరవాత వేదవల్లి మద్రాసు వెళ్లి, రంగస్థలి నటిగా స్థిరపడిన సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ సినిమా నటిగా ప్రయత్నాలు సాగించింది. ‘సంధ్య’ అనే పేరుతో తన ప్రస్థానాన్ని తొలుత నాటకాలతో ప్రారంభించి, డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ, క్రమంగా సినీ నటి స్థాయికి ఎదిగింది. అలా జయలలిత బాల్యం మద్రాసుతో ముడివడింది. ప్రాధమిక విద్యను బెంగుళూరు బిషప్ కాటల్ బాలికల పాఠశాలలోను, హైస్కూలు చదువు మద్రాసు చర్చ్ పార్క్ కాన్వెంట్ లోను కొనసాగించిన జయలలిత మెట్రిక్యులేషన్ పరీక్షలో రాష్ట్రం మొత్తం మీద ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై మంచి తెలివిగల విద్యార్థినిగా నిలిచింది. స్టెల్లా మేరిస్ కళాశాలలో చేరినా ఆమె చదువు కొనసాగలేదు. అలా న్యాయశాస్త్రం చదవాలనే అభిలాషకు అడ్డుకట్ట పడింది. చదువుకుంటూనే జయలలిత సంప్రదాయ భరతనాట్యం తోబాటు మోహినీయాట్టం, మణిపురి, కథక్ వంటి నృత్యరీతులు నేర్చుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం కూడా అభ్యసించడంతో జయలలితకు బాలనటిగా సినిమా అవకాశాలు రాసాగాయి. తొలిసారి ఆమె 1961లో ‘శ్రీశైల మాహాత్మే’ అనే కన్నడ సినిమాలో బాలనటిగా, ‘మన్ మౌజీ’ అనే హిందీ సినిమాలో కుమారి నాజ్ తో చిన్నారి కృష్ణుడుగా నటించారు. అంతేకాదు ‘ఎపిస్టిల్’ అనే ఇంగ్లీషు చిత్రంలో కూడా నటించడం జరిగింది. ఆ తరవాత జయలలిత నటించిన పూర్తిస్థాయి చిత్రం బి.ఆర్. పంతులు నిర్మించిన ‘కర్ణన్’. ఇదే సినిమా తెలుగులో కర్ణ గా డబ్ చేశారు. ఆ చిత్ర విజయం చదువుకు స్వస్తి చెప్పే పరిస్థితులను కల్పించింది. 1964లో తన పదహారవ ఏటనే ‘చిన్నద గొంబే’ అనే కన్నడ చిత్రంలో జయలలిత తొలిసారి కథానాయకిగా నటించింది. ఆ సినిమాలో నటనకు జయలలితకు ముట్టిన పాతితోషికం మూడు వేలు. బి.ఆర్. పంతులు నిర్మించిన ఈ సినిమాలో ఎం.వి.రాజమ్మ, సంధ్య, కల్పన, కల్యాణ్ కుమార్ నటించారు. ‘చిన్నద గొంబే’ను తమిళంలో ‘మురదన్ ముత్తు’ అనేపేరుతో పునర్నిర్మించగా అందులో జయలలిత పాత్రను దేవిక పోషించింది.

Jayalalitha

సినిమా రంగంలోకి అడుగిడి..
1965లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఎ.వి. సుబ్బారావు నిర్మించిన ‘మనుషులు మమతలు’ చిత్రంలో జయలలిత తొలిసారి నటించింది. అదికూడా అక్కినేని నాగేశ్వరరావుకు జంటగా. స్విమ్మింగ్ పూల్ దుస్తుల్లో ముద్దుముద్దు తెలుగు మాట్లాడుతూ ప్రేక్షక హృదయాను ఆకట్టుకుంది. చిత్రాలయ అధిపతి, దర్శకుడు శ్రీధర్ నిర్మించిన ‘వెన్నీరాడై’ ఆమెకు హీరోయిన్ గా తొలి తమిళ చిత్రం. అదే సంవత్సరం శాండో చిన్నప్ప దేవర్ నిర్మించిన ‘కణ్ణిత్తాయ్’ లో ఎం.జి.రామచంద్రన్ సరసన, కన్నడ సినిమా ‘నాన్ కర్తవ్య’ లో కల్యాణ్ కుమార్ సరసన, తమిళ చిత్రం ‘గౌరీ కల్యాణం’లో జయశంకర్ సరసన జయలలిత నటించింది. 1966లో జగపతి సంస్థ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ‘ఆస్తిపరులు’ తెలుగులో ఆమెకు రెండవ చిత్రం. ఇందులోనూ ఆమె అక్కినేనికి జంటగా నటించటం విశేషం. అదే సంవత్సరం ‘ఇట్ హ్యపెండ్ వన్ నైట్’ అనే అమెరికన్ సినిమా ఆధారంగా తమిళంలో నిర్మించిన ‘’చంద్రోదయం’ చిత్రంలో ఎమ్జీఆర్ సరసన నటించిన జయలలితకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. తరవాత బాలచందర్ దర్శకత్వంలో ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో ముత్తురామన్ సరసన నటించింది. తమిళ సినిమా ‘యార్ నీ’ సస్పెన్స్ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసింది. అందులో నటనకు మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ వారి ఉత్తమ నటి బహుమతి గెలుచుకుంది. అదే సినిమాను తెలుగులో ‘ఆమె ఎవరు’ గా నిర్మించగా అందులో నటించిన జయలలితకు అది మూడవ చిత్రంగా రికార్డయింది. ప్రసాద్ ఆర్ట్స్ వారి నవరాత్రి సినిమాలో మానసిక రోగి పాత్రలో అతిథి పాత్ర పోషించిన జయలలిత సుందర్లాల్ నహతా, డూండీ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ‘గూఢచారి 116’ లో కృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. తమిళంలో మోటార్ సుందరం, నాన్, మాడి వీట్టు మాప్పిళ్లై, కావల్ కారన్, రాజా వీట్టు పిళ్ళై, పనక్కార పిళ్ళై, ఎంగవూర్ రాజా, పుదియ భూమి, ముత్తు చ్చిప్పి, గలాటా కల్యాణం, ఒలివిళక్కు వరసగా వచ్చిన తొలితరం సినిమాలు. ఈ సినిమాలన్నీ విజయవంతం కావడం జయలిత అదృష్టం కూడా. అలాగే తెలుగులో గూఢచారి 116 తరవాత వచ్చిన చిక్కడు దొరకడు, గోపాలుడు భూపాలుడు, నిలువుదోపిడి, బాగ్దాద్ గజదొంగ, తిక్కశంకరయ్య, కథానాయకుడు, గండికోట రహస్యం, ఆలీబాబా నలభై దొంగలు, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలలో ఎన్.టి.రామారావు సరసన; బ్రహ్మచారి, ఆదర్శకుటుంబం, అక్క-చెల్లెళ్ళు, భార్యాబిడ్డలు, ప్రేమలు-పెళ్ళిళ్ళు, నాయకుడు-వినాయకుడు వంటి సినిమాలలో అక్కినేని సరసన, డాక్టరు బాబు సినిమాలో శోభన్ బాబు సరసన జయలలిత నటించింది. ముత్తురామన్ తో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘తిరుమంగళం’ జయలలితకు నూరవ చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు జయలలిత ‘నడిప్పుకు ఇలక్కియుం వహుత్తువర్’ అనే బిరుదును స్వీకరించింది. హిందీలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘ఇజ్జత్’ సినిమాలో ధర్మేంద్ర కు జంటగా జయలలిత నటించడం విశేషం. 1969లో వచ్చిన ఎమ్జీఆర్ సొంత సినిమా ‘అడిమైపెణ్ణ్’ లో జయలలిత నాలుగవసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో నటనకు ఆమెకు ఫిలింఫేర్ ప్రత్యేక బహుమతి లభించింది. అలాగే శివాజి గణేశన్ సరసన నటించిన ‘ఎంగిరిందో వందాళ్’ సినిమాకు కూడా జయలలితకు ఫిలింఫేర్ ప్రత్యేక బహుమతి లభించింది. 1971లో ‘తంగ గోపురం’ సినిమాలో ఆమె ఐదవసారి ద్విపాత్రాభినయం చేసింది. 1973లో ‘వందళే మగరాసి’ (కె.ఎస్. గోపాలకృష్ణన్)లో ఏడవసారి, ‘గంగాగౌరి’ (బి.ఆర్. పంతులు)లో ఎనిమిదవసారి ద్విపాత్రాభినయం చేయడం జయలలితకే సాధ్యమైంది. ఇక గాయనిగా కూడా జయలలిత రాణించిన సందర్భాలున్నాయి. ‘అడిమైపెణ్ణ్’ లో “అమ్మ ఎందాల్ అన్బు”, ‘సూర్యకాంతి’లో “ఓ మేరి దిల్ రుబా”, ‘అన్బై తేడి’ లో “చిత్తిర మండపతిల్”, ‘తిరుమాంగల్యం’ లో “తిరుమాంగల్యం కొల్లుం మురై”, ‘ఉణ్నై సుత్రుం ఉళగం’ లో “మద్రాస్ మెయిల్” పాటలు కొన్ని మచ్చుకు మాత్రమే. తెలుగులో ఆలీబాబా ‘నలభైదొంగలు’ సినిమాలో” “చల్లచల్లని వెన్నెలాయె…మల్లెపూల పానుపాయే” అనే పాటను ఘంటసాల సంగీతదర్శకత్వంలో జయలలిత పాడటం కూడా ఒక విశేషమే! జయలలిత 140 సినిమాలలో నటించారు. సినిమాలలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటి కూడా జయలలితే!! ఆమె నటించిన ఆఖరి చిత్రం ‘నీంగానల్లాఇరుక్కుం’ అనే తమిళ సినిమా(1992).

Jaya with Shobhanbabu

రాజకీయ రంగంలో రాణిస్తూ
జయలలిత జీవితమంతా ఆటుపోట్లమయమే. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వివాదాలు, కేసులు మరే ఇతర రాజకీయ నేతలు ఎదుర్కోనలేదు. ఆమె సమస్యలతో సహవాసం చేసింది. సాహసమే వూపిరిగా పోరాడింది. ఆ పోరాడే గుణమే ఆమెను విప్లవ నాయకిగా మార్చివేసింది. 1982లో జయలలిత రాజకీయ రంగప్రవేశం చేశారు. 1984లో రాజ్యసభకు ఎన్నికైనారు. ఆమెకు ఎమ్జీఆర్ రాజకీయ గురువు. ఒకానొక సందర్భంలో ఎమ్జీఆర్ నే ఎదిరించి బహిష్కరణకు కూడా గురైన సందర్భం లేకపోలేదు. ఎమ్జీఆర్ అనారోగ్యం బారిన పాడినప్పుడు ఆమె రాజీవ్ గాంధికి చేరువై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నించారనే అపప్రద ఆమెమీద ఉన్నమాట వాస్తవం. అది పసిగట్టిన ఎమ్జీఆర్ ఆమె ప్రాధాన్యం తగ్గించారని కూడా చెప్పుకుంటారు. ఎమ్జీఆర్ మరణానంతరం అన్నాడి.ఎం.కె రెండుగా చీలిపోవడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని జయలలిత 1991లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. రాజకీయాలలో ఆమెకు కరుణానిధి బద్ధశత్రువు. ఆమె ముఖ్యమంత్రిగా వుండగా కరుణానిధి ఒక్కసారి కూడా శాసనసభలో అడుగు పెట్టలేదు. అలాగే కరుణానిధి అధికారంలో వున్నప్పుడు జయలలిత కూడా అంతే! జయలలిత 1991-96, 2002-06, 2011-14, 2015 నుండి మరణించే దాకా ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె జైలుకెళ్లారు కూడా. అభిమానులకు అమ్మగా కీర్తినందుకొని తమిళ రాజ్యాన్ని పాలించిన మహాసామ్రాజ్ఞి జయలలిత.

మరిన్ని విశేషాలు:

o– జయలలిత, శోభన్ బాబు మధ్య గాఢమైన స్నేహబంధం వుండేదనే వార్త సత్యం. తల్లి మరణంతో దిగాలుగా ఉంటున్న జయలలితను చలోక్తులతో నవ్విస్తూ శోభన్ ఆమెకు దగ్గరయ్యారు. బ్రతుకు చాలించాలనే విషాదంలో వున్న జయలలిత శోభన్ బాబు స్నేహంలో ఆత్మీయతను చూడగలిగింది.

o– జయలలిత, ఎమ్జీఆర్ ను తిరుగులేని జోడీగా తమిళ ప్రేక్షకులు ఆదరించారు. వారిద్దరూ కలిసి ఏకంగా 28 సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు.

o– జయలలిత తనను తమిళ మహిళగా పేర్కొనేవారు. కన్నడ యువతిని కాదని అన్నందుకు ఆమెను కన్నడ అభిమానులు బహిష్కరించారు. మైసూరు ప్రిమియర్ స్టూడియోలో ఒకసారి గంగా గౌరీ సినిమా షూటింగు జరుగుతుండగా కొంతమంది స్టూడియోలోకి ప్రవేశించి ఆమెను కన్నడ దేశానికి చెందిన దాన్ని కాదనే మాటను ఉపసంహరించుకోమని, కన్నడ యువతినేనని బహిరంగంగా ఒప్పుకోమని గొడవ చేశారు. ఆ వాతావరణాన్ని గమనించిన జెమిని గణేశన్, అశోకన్ “వాళ్ళు చెప్పినట్లు అంటే గొడవ చెయ్యకుండా వెళ్లిపోతార”ని సర్ది చెప్పినా జయలలిత ససేమిరా అంది. అంతేకాదు “ఏంచేస్తారో చూస్తాను” అంటూ వారి ముందుకెళ్ళి నిల్చుంది.అంతటి వీర నారి జయలలిత.

o– ఒకసారి ఆమె తన ఆరాధ్య ప్రేమికుడు నవాబ్ ఆఫ్ పటౌడీ అని చెప్పినందుకు కొన్ని పత్రికలు జయలలిత పటౌడీని పెళ్లాడబోతోంది అని రాశారు. ఆవిషయాన్ని జయలలిత తేలిగ్గా తీసున్నారు.

o– జయలలిత సినిమా షూటింగ్ గ్యాప్ లో ఇంగ్లీష్ నవలల్ని చదువుతూ కాలం గడిపేవారు. ఆమెది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే తత్త్వం కాదు. ఒక సీనియర్ నటి షూటింగు స్పాట్లోకి వచ్చినప్పుడు జయలలిత లేచి ఆమెను గౌరవించలేదని గారాలు పోయింది. జయలలిత ఆమెను ఖాతరు కూడా చెయ్యలేదు. మీ సినిమానైనా వదలుకుంటాను గానీ, వ్యక్తిత్వాన్ని పణం పెట్టలేను అంటూ నిర్మాతతో తెగేసి చెప్పిన ధీర వనిత జయలలిత.

o– తెలుగులో జయలలిత 30కి పైగా సినిమాలలో నటించారు. తల్లి మరణంతో ఆమె మూడేళ్ళు సినిమాలకు దూరమయ్యారు. అభిమానులు మాత్రం ఆమెనే హీరోయిన్ గా ఆరాధించడంతో నదియ తేడివంద కడత్తిల్ సినిమాతో ఆమె తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

o– అద్వితీయ మైత్రికి జయలలిత-శశికళ ప్రత్యక్ష ఉదాహరణ. వారి స్నేహానికి నీరుపోసిన వ్యక్తి నాటి కడలూర్ కలెక్టర్ చంద్రలేఖ. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ ను దత్తత తీసుకొని స్నేహానికి నిర్వచనం తెలియజేసిన స్నేహశీలి జయలలిత.

-ఆచారం షణ్ముఖాచారి
(9492 5426)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap