దాసరి మెమోరియల్‌ సిని అవార్డ్స్‌

దాసరి నారాయణరావు. ఆ పేరే ఓ సంచలనం. దర్శకుడిగా కానే కాకుండా నిర్మాతగా, కథా రచయితగా, మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే రచయితగా, నటుడిగా ఇలా వెండితెరపై ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ అసామాన్యం, అనితర సాధ్యం. ఎందరెందరో కొత్తనటీనటులు, దర్శకులను వెండితెరకు పరిచయం చేసి, వారిని అగ్రపథాన నిలిపిన క్రెడిట్ ఆయనదే. ఆయన పరిచయం చేసిన నటులు, దర్శకులను వేళ్లమీద లెక్కించడం సాధ్యం కాదు. దాసరి దగ్గర పనిచేయడం అంటే ఓ యజ్ఞంలా భావించి, ఆ తర్వాత కాలంలో ఆయన ఆశీస్సులతో దర్శకులుగా తిరుగులేని విధంగా రాణించిన వారెందరెందరో. తెలుగు పరిశ్రమ యావత్తూ ఆయనను ఆప్యాయంగా ‘గురువుగారూ…అని పిలుచుకుని మురిసిపోయేది. ఏ కష్టం వచ్చినా నేను ముందున్నానంటూ తెలుగు పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌ల వెన్నంటి ఉండి నడిపారాయన. నాలుగైదు తరాల హీరోలతో సినిమాలు చేయడమే కాదు…ఆయా హీరోలతో సూపర్ డూపర్ హిట్లతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాశారు. ఎన్నో రికార్డులు బద్దలుకొట్టారు. అసలు పోస్టర్లపై మేఘం ఆకారంలో కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-పాటలు-దర్శకత్వం దాసరి నారాయణరావు అంటూ పోస్టర్లు చూసి జనం థియేటర్ల వైపు క్యూలు కట్టేశారు. అసలు ఆ తరహా ట్రెండ్ పోస్టర్లు దాసరి నుంచే మొదలైందని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు.

దర్శకుడిగా 150 సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. అందుకే అత్యధిక సినిమాలు తీసినందుకు (దర్శకుడిగా) గిన్నెస్ రికార్డులోకి ఎక్కారాయన. 53 సినిమాలు నిర్మించారు. మాటల రచయితగా, పాటల రచయితగా 250కి పైగా చిత్రాలకు పనిచేశారు. రెండు జాతీయ అవార్డులు, తొమ్మిది సార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు (సౌత్) ఆయన్ని వరించాయి.

మే 4 న దాసరి జన్మదినం సందర్భంగా దాసరి మెమోరియల్‌ సిని అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అంబికాకృష్ణతో పాటు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి.రామ్‌మోహన్‌రావు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేష్‌ ముఖ్య అతిథులుగా హాజరై గ్రహీతలకు అవార్డులను అందజేశారు.

దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆర్‌ నారాయణమూర్తి, దాసరి ఎక్స్‌లెన్స్‌ అవార్డును పూరి జగన్నాథ్‌ తరపున ఆయన తనయుడు ఆకాష్‌ స్వీకరించారు. అలాగే దాసరి నారాయణరావు-దాసరి పద్మ మెమోరియల్‌ అవార్డును రాజశేఖర్‌-జీవిత అందుకున్నారు. ఉత్తమ తొలి చిత్ర దర్శకులుగా గౌతమ్‌ తిన్ననూరి (మళ్లీ రావా), వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ), వెంకటేష్‌ మహా (కేరాఫ్‌ కంచరపాలెం), శశికిరణ్‌ (గూఢాచారి) దాసరి అవార్డులను స్వీకరించారు. ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరి స్ఫూర్తితో నవతరం హీరోలు, దర్శకులు ఎక్కువ సినిమాలు చేయాలని అన్నారు. సినీ పరిశ్రమలో కొత్తవాళ్లకు, పేద కళాకారులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినప్పుడే దాసరికి అసలైన నివాళి అని నారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

SA: