‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి ?

‘దొరసాని’ సినిమా చూశాక, అదొక ప్రేమకథే అయితే, అది ప్రేక్షకుడిని ఉద్దేశించిందే గానీ, నివేదించింది కాదు అనిపించింది. సులభంగా అమ్ముడుబోయే (కథా) వస్తువుని ఎంచుకొని, దానికి తగ్గ విక్రయం చేసే సాదాసీదా సూత్రాల మీద వ్యవహారం నడిచే సగటు సినిమాల కోవలో కాకుండా, తన సినిమా ఒక మంచి సినిమా కావాలని కథక- దర్శకుడు (మహేంద్ర) సీరియస్ ప్రయత్నం చేసినట్టు కనబడుతోంది కాబట్టే – ఆ ప్రయత్నానికి ఈ acid test!
ప్రేక్షకుడ్ని ఉద్దేశించడానికి- అతనికి నివేదించడానికి ఏమిటి తేడా?
హాస్యమో.. రౌద్రమో… కరుణో… ఏది చొప్పిస్తే చూసేవాడు కనెక్ట్ అవుతాడని ఆలోచించడం – ఒక పథకం, పన్నాగం – అదీ ‘ఉద్దేశించడం’ (మామూలుగా జరిగేదిదే)!
ఒక అమూర్త ప్రేక్షకుడి, అంతకంటే అమూర్తమైన అతని ఇష్టాఇష్టాల గురించి మల్లగుల్లాలు పడకుండా, తాను వెళ్లగక్కాలనుకున్న దాన్ని పరిణామాలకు బెదరకుండా బైటపెట్టడం – అది ‘నివేదించడం’. ప్రేక్షకుడిని నవరసాల మేళనతో pamper చేయడం కాదు, అలాగని ‘నా ఇచ్ఛయే గాక, నాకేటి వెరపు’ అనే ధోరణిలో ప్రేక్షకుడిని నిర్లక్ష్యం చేయడమూ కాదు. అభిరుచుల భిన్నత్వంతో అనేకానేకులుగా విస్తరించిన ప్రేక్షకులని తన ఏకతాటి పైకి తెచ్చేందుకు చేసే అప్పీల్ – ‘నివేదించడం’ అంటే.
హీరో రాజు గడిలో దొరసాని దేవకి గదిలోకి వెళ్తాడు. అతను తాగడానికి లోటాలో ఏదో ఇస్తుంది దొరసాని.
“మేము తాగొచ్చా…” అంటాడు రాజు, అమాయకంగా…బెరుకుగా… నగీషీలతో డాబుగా కనిపిస్తున్న ఆ లోటా వంక చూస్తూ.
కదిలిపోయిన దొరసాని ఒక్క ఉదుటున అతన్ని చుట్టేసి, పెదాలను ముద్దాడుతుంది.
– ఈ సన్నివేశం – ప్రేక్షకుడిని ఉద్దేశించిందే గానీ, ఇందులో నిజాయితీ లేదన్నది నా ఆరోపణ. ఈ సన్నివేశాన్ని దాని నిడివి వరకే తుంచి చూడకుండా, కథనమనే గొలుసుకట్టులో భాగంగా, దాని పూర్వాపరాలను బట్టి చూస్తేనే నా ఆరోపణ నిలబడుతుంది.
పెత్తనం, దౌర్జన్యం దొర హక్కుగా, దాస్యం, తాబేదారీతనం ప్రజల వంతుగా, ప్రశ్నించడానికి వీల్లేని సహజ సామాజిక ధర్మంగా కొనసాగుతున్న 1987 ప్రాంతాల్లోని ఒక తెలంగాణా పల్లెలో ఇంటికి సున్నాలేసే దిగువ కులం (చాకలి?)కి చెందిన కుర్రాడు. పట్నంలో చదవడం వల్ల తన తోటివారి కంటే మెరుగుగా ఆలోచించగలుగుతున్నాడే గాని, Status-quo ని తనకి తానుగా గుర్తించి, వ్యతిరేకించేంత, లేదా యథాతథ స్థితిని ధిక్కరిస్తున్న, మార్పు కోసం ఆరాటపడుతున్న ‘పీపుల్స్ వార్’ ప్రభావాన్ని గ్రహించగలిగేంత చైతన్యమైతే ఉన్నవాడు మాత్రం కాదు. పల్లెకి పరిమితమైన ఐదారు తరగతులను మీరి, (తన లాగా) ఎక్కువ చదువులకి ఎగబాకితే ‘బతుకులు బాగుపడతాయ’న్నంత మేరకే అతని అవగాహన. గడీ వైపు తేరిపారా చూడకూడదని భయపడే అతని సావాసగాడి కంటే రాజుని ఒకడుగు ‘ధైర్యం’ గా ముందుకేయించగలిగింది అతని పట్నం చదువో, అది ప్రత్యక్షంగానో… పరోక్షంగానో అర్థం చేయించే సామాజిక చలనసూత్రాలో కావు.
దొరసానిని ఇష్టపడటం…. పడకపోవడానికి ముందు, ఆమె తరుగు… మెరుగు తరిచే దశ ఒకటుంటుంది కదా. దాని వరకూ అతని నేస్తులు వెళ్ళగలిగారు; ‘పెద్దమనిషి కావడం, రోజూ నిండుగా పాలు.. గడ్డ పెరుగు… కోడికూర తిండి దండిగా ఉండడం’- దొరసాని మిసమిసకి కారణంగా రహస్యంగా అంచనాలు వేసుకునేంత దాకా వెళ్ళడానికి వాళ్ళకి అదనంగా ఏ కొత్త అర్హతలూ అవసరపడలేదు. ఆ పల్లె పొలిమేర్లు దాటి, (అంతకంటే) విశాలమైన పట్నంలో అబ్బిన చదువు, అదనంగా అందివచ్చిన కవిత్వం- అనే అదనపు యోగ్యతల వల్ల ‘దొరసానిని ఇష్టపడటం’ అనే మరుసటి దశకి రాజు ఎగబాకి ఉంటాడని అనుకోవచ్చా? అంటే, ‘తారతమ్యాలు… హెచ్చుతగ్గులు… కలిమిలేములు… ప్రేమకు ఉండవు, ఉండకూడదు’ – అన్న ఎరుకతో, అంతరాలు లెక్కజేయని దిటవుతో దొరసానిని ఇష్టపడటం మొదలెట్టాడా? కానే కాదు.
‘కదిలించావు నన్నే గుండెను మీటి
కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి…’
– అని రాస్తాడు రాజు. అంటే, ‘సరిహద్దుల’ స్పృహ కచ్చితంగా ఉంది. కాటేసే కాలనాగుల… నిచ్చెనమెట్ల వైకుంఠపాళిలో తాను కింద, ఆమె పైన ఉందన్న సంగతి అతనికి బాగానే తెలుసు. నిజానికి అతను చదువుతున్న చదువు- తమ ఇద్దరి మధ్య ఉన్న అంతరాన్ని మరింత తేటతెల్లం చేసి, మరికొంత అదనంగా బెదిరించేందుకు ఉపయోగపడుతుందే గానీ, ఆ వ్యత్యాసాన్ని దాటడానికి పనికిరానిది. చొరరాని రాతిగోడల ఇరుకుగదుల్లో టెలిఫోనిక్ కవిత్వాలు నింపేలా ఎగదోసింది, ఆ గడీల ఆవరణలోకి ఎండనక వాననక, రేయనక పగలనక తనని అడుగు పెట్టేలా నెట్టింది, ఉద్యమం నినాదాలు రాసే ఎర్రెర్రని సుద్ద ముక్కతో ‘ప్రేమ అనే తన ఉద్యమం’ తాలూకూ నినాదాల్ని రాసేలా రేపింది, దొరసానిని ప్రహరీలు దాటించి, చించిలిక చెరువుల్లో నిలువెల్లా ముంచేలా రెచ్చగొట్టిందీ- బరితెగింపు వంటి అతని ప్రేమే. మొలలోతు కొలనులో అమాంతం ఆమెకి ముద్దు పెట్టేసిన పోకిరి, దాని వల్ల చావుదెబ్బలు తిని కూడా తగ్గని తెగువరి, ఉన్నట్టుండి హఠాత్తుగా అమాయకుడైపోయి, గొడ్డకాడి బుడ్డోడైపోయి… ఆమె ఇచ్చిన ‘నీళ్ల చెంబు తాకొచ్చా, అందులో తాగొచ్చా’ అని నంగిరి పింగిరి గాడిలా అడగడం; ఆ దొరసాని కదిలిపోయి లిప్ లాక్ చేయడం- కథాగమనంలో అసహజం… కథనంలో అపశ్రుతి!
ఈ ఒక్క సన్నివేశాన్ని పట్టుకొని, కథక- దర్శకుడి శ్రమని, చిత్తశుద్ధిని మొత్తంగా రద్దు చేయడం నా ఉద్దేశం కాదు. మహేంద్ర అనే ఆ దర్శకుడు ఈ కథ కోసం కష్టపడి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, తెరకెక్కించడానికి ఎంతో ప్రయాస పడికూడా ఉండొచ్చు, కానీ, అనుభవించలేదన్నదే నా ఆరోపణ. సామాజిక చిత్రణ, పరిస్థితుల పరికల్పన, సరికొత్త, సమాంతర వ్యవస్థల దృశ్యీకరణ వంటి కాన్వాస్ మీద పెట్టినంత శ్రద్ధ, కాన్వాస్ మీద పెయింటింగ్- అంటే సినిమాకి కీలకాంశమైన ‘ప్రేమ’ మీద పెట్టలేదు. ప్రేమ- ఈ దర్శకుడికి ఒకానొక అంశం, చివర్లో సందేశానికి పనికొచ్చే ప్రతిపాదన తప్ప, సొంతదో… సొంతమైనదో అయిన అనుభవం కాదు. అందుకే ప్రేక్షకులు లీనమయ్యేంత, తమ తమ కతలు… వెతలతో పోల్చుకునేంత… గాఢంగా ఈ ‘దొరసాని’ ప్రేమ కథ లేదు.
– నరేష్ నున్న

SA: