నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత
నేటి ఆధునిక ప్రపంచంలో అంతర్జాతీయంగా “స్త్రీ” అన్ని రంగాల్లోనూ తన అభినివేశాన్ని, ఉనికిని, ప్రాముఖ్యతని చాటి చెబుతోంది. అందునా నాట్యకళల్లో మరింత ముఖ్యపాత్రను పోషిస్తున్నారని చెప్పవచ్చు. నాడు మనువు “న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అన్నాడని చెప్పి స్త్రీలను అణగదొక్కడానికి ప్రయత్నించినా నాటి వేదకాలం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీ తన ప్రతిభను చాటుకుంటూనే ఉంది. నాట్యం దైవదత్తమైన కళ. చాలా వ్యయప్రయా సలతో కూడినది. ఈ కళలో స్త్రీలు కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించినవారూ ఉన్నారు. అందునా పూర్వం నాట్యకళ దేవదాసీలకు పరిమితమై ఉండేది. కూచిపూడి సాంప్రదాయంలో స్త్రీ పాత్రలను మగవారే పోషించేవారు. ఆనాటి ఆడపిల్లలకు నాట్యంపై ఆసక్తి, అనురక్తి ఉన్నా ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఈ కళను అభ్యసించటం సాధ్యమయ్యేదికాదు. అలాగే వివాహానంతరం వీరు నాట్యకళను కొనసాగించడమంటే కత్తిమీద సాములాంటిదే. భర్త, కుటుంబ సభ్యులు, పిల్లల సహాయసహకారాలతో ఇటు భార్యగా, తల్లిగా తన పాత్రలను పోషిస్తూనే నాట్యకళను అభ్యసించి ముందడుగు వెయ్యడం అనేది అంత సులువైన పనికాకపోవటంతో ఓర్పు చేర్పులతో, కృషితో తన ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతోంది.
నిజం చెప్పాలంటే నాట్యకళలో నవరసాలను పోషించడానికి  స్త్రీ కన్నా గొప్పగా ఎవరు చెయ్యగలరు? నిత్యజీవితంలో తన బాధ్యతలలో ఆమె అన్ని రసాలను పోషించక తప్పదు. ప్రేమ బిడ్డను లాలించడానికి, శృంగారం భర్త కోసం. తన వారిని కాపాడుకుందుకు రౌద్రం, ఇలా అన్ని రసాలను అవలీలగా అభినయించ గలదు. అలాగే కొన్ని సందర్భాలలో మరియు నృత్యాంశాలలో – ఉదా. కృష్ణ శబ్దంలో స్వామి రారా నువు రారా ఇటు రారా? అని తన స్వామిని పిలవడంలో భావప్రకటను నీ పోషించినంత అద్భుతంగా పురుషుడు ఆ పాత్ర వేసినా దానికి జీవం ఉండదు. ఏ కళకైనా ఒక మార్దవం, సున్నితత్వం అవసరం. అది స్త్రీ మాత్రమే ప్రదర్శించ కలదు.
శ్రమతో కూడుకున్నదైనప్పటికీ స్త్రీలు నాట్యకళను అభ్యసించడమే కాక ప్రదర్శనలు ఇవ్వడం, కొత్త విద్యార్థులను తయారు చెయ్యడంలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు. ప్రతిభతో పాటు పరపతి కూడా ఉంటేకాని తను నాట్యకళను ప్రదర్శించే అవకాశాలురాని నేపథ్యంలో తమ తపనను తీర్చుకునే అవకాశం ఏ కొద్దిమంది మహిళలతో సాధ్యమవుతోంది. అలాంటివారిలో రుక్మిని దేవి, బాల సరస్వతి, యామిని కృష్ణమూర్తి, అనిత రత్నం, కోసూరి ఉమాభారతి, అలేఖ్య పుంజుల, రాధా రెద్ది, శోభా నాయుడు, భానుప్రియ, శోభన, హేమ మాలిని లాంటి ఎందరో  నాట్య కళాకారులున్నారు.
మొత్తానికి స్త్రీ కళాకారిణిగా ఈ రంగంలో రాణించాలంటే తల్లితండ్రుల సహకారం, వివాహానంతరం భర్త సహకారం ఎంతో అవసరం. ఏ చిన్న అవకాశం దొరికినా తమకు తాము ముందు వుండడానికి స్త్రీ ఏనాటికీ వెనుకాడదు. స్త్రీని పూజిస్తున్నామన్న వాక్కుల కన్నా ఆమెకు పురుషుడితో సమాన హెూదా ఇచ్చి ఆమె కొక విలువ, గౌరవం ఇచ్చిననాడు తన సామర్థ్యాన్ని నిరూపించగలదు. తనతో బాటు తన కుటుంబానికి, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలను ఆర్జించిపెట్టగలదు.
-ఇందుమతి గంటి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap